ధారావాహికలు

అనర్ధాలకు మూలం! అసూయలే శాపం!

-అమరనాథ్ జగర్లపూడి

అసూయ (Jeously) ఇది మనం తరచుగా వినే పదమే తనకున్నదేదో పోతుందనో, తనకు రానిది ఇతరులకు దక్కుతుందనే, తానూ పొందలేంది ఇతరులు పొందుతారనో అని మనస్సు అనేకానేక భావోద్వేగాలకు గురౌతూ మనసును అనేక చికాకులకు గురిచేస్తుంటుంటుంది ఇదే అసూయ అనే మూలాలకు బీజాలు. ఇది బుద్ధిజీవి యైన మనిషి లో సర్వసాధారణమైన విషయం. ఈ సాధారణం అసాధారణమైతేనే అసలు సమస్యలు ప్రారంభమయి మనసు అల్లకల్లోలంలోకి ముంచి అభద్రతా భావాలకు గురి చేస్తుంది.
సహజంగా వ్యక్తి తన ఉనికికి భంగం కలుగుతుందను కునేటప్పుడు,దాని వలన సమాజంలో తన సంబంధాలలో పరువు, ప్రతిష్టల లలో సమతూల్యతలకు భంగం కలుగుతుందనుకొనేటప్పుడు ఈ’అసూయ అనేది పొడసూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే ఒక్కొక్కసారి ద్వేషం రూపంలో అనేక అఘాయిత్యాలకు కారణమయి జీవితాలను నాశనం చేస్తుంది కూడా ప్రేమలు, చదువులు, ఆర్ధిక కారణాలు ఆటలు, పాటలు, రాజకీయాలు, సామాజిక వివక్షతలు, ఉద్యోగాల్లో, పిల్లల పెంపకాలలో తల్లితండ్రులు చూపే వ్యత్యాసాల్లో చివరకు తమ కంటే ఎదుటి వారే బాగున్నారనే ఆలోచనలు ఇలా అనేకానేక భావనలు అసూయ ద్వేషాలకు మొలకలై చివరికి అవే వృక్షాలుగా మనస్సులో తిష్ట వేస్తాయి!
అసూయనేది సహజంగానే ప్రతి మనిషి లో ఒక సర్వసాధారణమైన ఒక మానసిక బలహీనత. మనిషి తన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడుతూనే ఉంటాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రధానంగా తెలుసుకోవాలసింది వ్యక్తిగత పరిశీలన, తమ పట్ల తాము విచక్షణతో మెలగటం ఈ విధమైన నిబద్దతతో వ్యవహరించక పోతే ఈ అసూయా దానితోపాటు పెరిగే ద్వేషాలు మనకు మనల్నే అణగదొక్కి మన భవిష్యత్ అభివృద్ధికి ఆటంకంగా మారుస్తుంది.
అందుకే ఈ అసూయా ద్వేషాలను విచక్షణతో కూడిన ఆత్మపరిశీలన ద్వారా నిరంతరం అధికమించే ప్రయత్నంచేయాలి దానికి మానసిక ప్రక్షాళన అనేది నిరంతర సాధనగా జరగాలి. ముఖ్యంగా జీవితంలో అభద్రతకు గురై మనసును చికాకు పరచే అంశాలెన్నో ఉంటాయి. మన స్థాయికి తగ్గట్టుగా జీవితం నడిచే దశలో మనకు లేదనే బాధ వుండకూడదు అదే సందర్భంలో ఇతరులకు తమకంటే ఎక్కువగా ఉందనే అసూయా పనికిరాదు. ఎదగాలనుకోవటం తప్పు కాదు దానికి ప్రయత్నించటం లో తప్పు లేదు దానికి కృషి పట్టుదలతో ఎదిగే ప్రయత్నాలు జరగాలి కానీ అసూయ ద్వేషాలతో కాదు. అసూయ మనసులో ప్రవేశించిందంటేనే మన మానసిక స్థితిగతులలో సమతూల్యం దెబ్బతింటోదన్న మాటే! మనకు మనంగా ఎదిగే ప్రతి ప్రయత్నంలో ఈ అసూయలు మన దారికి చేరకుండా ఉండాలంటే కొన్ని ఫలవంతమైన అంశాలను మనం సాధన చేయాల్సి ఉంటుంది. అవేవో ఒకసారి పరిశీలిద్దాం!
1. మనల్ని ఇతరులతో పోల్చుకోవటమే అసూయకు మొదటి మెట్టు అందుకే ఈ విషయంలో మన స్థితిగతులకు తగ్గ జాగ్రత్తలు అవసరం.
2.మనలో ఉన్న మన సామర్ధ్యాలు నిరంతరం గురుతుంచుకోవాలి దీనివలన మనపై మనకున్న నమ్మకం సడలకుండా ఉంటుంది . దీనివలన అనుకున్న పనిని అసూయతో కాకుండా ఆత్మవిశ్వాసం తో సాధించే అవకాశముంటుంది.
3. ఇతరులతో తమ పిల్లలను పోల్చేటప్పుడు ఇంటి పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పోలిక అనుకూలమైతే పరవాలేదు అదే ప్రతికూలమైతే ఇంటిపెద్దల పట్ల, తమను పోల్చిన వారి పట్ల పిల్లల్లో అసూయా ద్వేషాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి అనుకున్న రీతిలో మార్కుల స్కోరింగ్ లేకపోతె కృషితో మరో ప్రయత్నంలో సాధించవచ్చనే ఆత్మా స్టైర్యాన్ని పిల్లల్లో కలుగ చేయాలి కానీ ఎదురింటి వాడికో పక్కింటి వాడికో అన్ని మార్కులొచ్చాయి ఇన్నిమార్కులొచ్చాయి అనే పోలికలు పిల్లల్లో అసూయే కాదు ఆత్మన్యూనతకు దారితీసి భవిష్యత్లో ఏదయినా సాధించాలన్నా సాధించలేని స్థితిలోకి నెట్టబడతారు. ఇలా ఏవిషయం లో నైనా ఇతరులతో పోల్చే విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం
4.స్థాయికి తగ్గ పోలికల లో సాధించే అవకాశాలు ఎక్కువగా అవకాశాలుంటాయి. నేలవిడిచి చేసే ప్రయత్నాలు ఎప్పటికీ చేటే ఉదాహరణకి మన స్నేహితుడు కారు కొన్నాడనుకుందాం కానీ మన స్థాయి స్కూటరే భవిష్యత్ ప్రయత్నాలలో కారు కొనే ప్రయత్నం చేయటంలో తప్పు లేదు కానీ కారుకొన్న వాడి మీద అసూయ కలిగేతే ఆ కారు మనదౌతుందా?
5.జీవితంలో ఏ వయస్సు వారైనా నూతన విషయాలు తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అదే సందర్భంలో నేర్చుకున్న విషయాలకు సంబంధించి సాధన జరగాలి. దీనివలన ఇతరులతో ఏ సందర్భంలోనైనా పోల్చుకొనే సందర్భాలలో మనం కూడా ఇది సాధించగలమనే భరోసా ఉంటుంది.
6.ఇతరులపట్ల ఏ సందర్భంలోనైనా అసూయా ద్వేషాలు పెరిగినపుడు మనకి పరిష్కారం దొరకకపోతే మన అనుకొనే వారితో పరిష్కారం కోసం ప్రయత్నించటంలో ఏ మాత్రం తప్పలేదు. నిజంగా ఇది మన సంస్కారానికి మరియు ఒక మంచి మార్పు కు గుర్తనేది మరవద్దు.
7. జీవితంలో సమస్య లేకపోవటం అనేది సమస్య కాదు ఆ సమస్యను ఎదుర్కోలేకపోవటమే అసలైన సమస్య అందుకే అసూయ ద్వేషాల వలన పెరిగే భయాలు అభద్రతా భావాలను విచక్షణతో అదుపులో వుంచుకోవటానికి అవసరమనుకుంటే మనసు భాష తెలియచెప్పే సైకాలజిస్టులను కలవటం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
జీవితంలో ఏ వ్యక్తి కూడా తనకు తానూ తక్కువగా అంచనా వేసుకోవటమనేది ఒక ప్రతికూలం (నెగటివ్) ఇది ప్రతిఒక్కరూ గుర్తుంచుకొవాలి. విజయం అనేది ఏ ఒక్కరి సొత్తుకాదు ప్రయత్నిస్తే మనం కూడా కొండలను పిండి చేయవచ్చు. అసూయతో కాదు సుమా కృషి, పట్టుదల సాధనతో! ఈ నియమం,నిబద్ధత ,నిజాయితీ,పారదర్శకత మరియు నైతికత అసూయలను మన నుండి పారదోలటమే కాదు పది మందిలో మనల్ని ఆదర్శంగా నిలపెడుతుంది దానికై మన ప్రయత్నాలను ప్రారంభిద్దాం!

అమరనాథ్ జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257

Leave a Reply

Your email address will not be published. Required fields are marked