సారస్వతం

అనుభూతి – ప్రాచీన దృక్పథం (5వ- భాగం)

– సునీల పావులూరు

.క్ర.

ప్రవృత్తి

కోశం

అనుభూతి

1

ఇంద్రియచైతన్య ప్రవృత్తి

అన్నమయకోశం

వాస్తవికానుభూతి

2

భావచైతన్య ప్రవృత్తి

మనోమయకోశం

కాల్పనికానుభూతి

3

జ్ఞానచైతన్య ప్రవృత్తి

విజ్ఞానమయకోశం

జ్ఞానానుభూతి

4

జీవచైతన్య ప్రవృత్తి

ప్రాణమయకోశం

పూర్ణచైతన్యాంశం

5

ఆధ్యాత్మికచైతన్య ప్రవృత్తి

ఆనందమయకోశం

తాత్త్వికానుభూతి

“ఈ అయిదు కోశాలద్వారా పొందే అనుభవం సమాజంలో ఉంది. దానితో సహజీవనం చేయటం సామాజిక జీవితం; ఆ సహజీవనంలో వ్యక్తి సహజ ప్రవృత్తికి శక్తిగా వ్యక్తమౌతాడు. సామాజికానుభూతిని రికార్డుచేసే సాత్త్వికసాధనం మనిషి. రికార్డుచేసి ఊరుకుంటే సామాజికుడు. దాన్నే ఉద్దీపనం చ్బెసి సాహిత్యరూపంగా అభివ్యక్తీకరిస్తే రచయిత. సమాజంలో భుక్తమౌతున్న అనుభూతులను సాహిత్యంద్వారా నెమరుకు (గుర్తుకు) తెచ్చి అనుభోక్తవ్యాలుగా చేసేవాడు రచయిత. అనుభోగమే అనుభూతి. అనిభూతికి ప్రేరణం కవిత; అభివ్యక్తి ప్రక్రియ, అభివ్యక్తమైన కవితా ప్రక్రియ కవికెంత అనుభవ సిద్ధమో సహృదయ సమాజానికంత అనుభవసాధ్యం”

ఈ ఆనందమయానుభూతిని వ్యతిరేకించేవారిని రెండవవర్గంగా పేర్కొనవచ్చు. వీరు కమ్యూనిస్ట్ భావాలతో కూడుకున్న అభ్యుదయ, విప్లవ కవిత్వ సంబంధులు. వీరు రసవాద వ్యతిరేకులు. అలంకారశాస్త మర్యాదతో ప్రవర్తిల్లిన కావ్య సంచయమంతా వర్గవిరోధమైన రచనలుగా భావించిన వీరు తద్విరుద్దమైన రచన సాగించాలని నిర్ణయించుకున్నావారు. అందువల్ల అలంకారశాస్త్ర మర్యాదానుసరణమైన విధానాన్ని వ్యతిరేకించి రచనలో విప్లవం తేవాలని అభిలషించారు. వీరికి రసంతో పనిలేదు. అలంకారాలతో పనిలేదు. శబ్దశక్తులతో పనిలేదు. ఒకరకంగా చెప్పాలంటే పూర్వమున్న సంప్రదాయ ధ్వంస రచనే తమ కవితాధ్యేయంగా చెప్పుకున్నవారు. వీరి కవితాదర్శాలు చూస్తే ఈ విషయాలు స్పష్టంగా బోధపడతాయి.

‘అర్థాన్ని అధ్వాన్నపు అడవిలో వదులుట

గద్యాన్ని పద్యానికి పెళ్ళి చేయటం

న…న…న…న…న… నత్తిమాటలు కూడా

మ…మ…మ… మాటలలో ఉండవచ్చును’

అని నిర్ణయించుకున్న వీరు కవిత్వంలో విప్లవం కోసం అర్రులుసాచి నేలవిడిచిన సాము చేశారు. ఈ మార్గాన్ని అనుసరించిన సాహిత్య విమర్శకులు కూడా తమ రసవిరోధాన్ని కవిత్వంలో అనుభూతిరాహిత్యాన్ని ప్రసిద్ధంగానే ప్రవచించారు. నందిని సిద్ధారెడ్డిగారు అనుభూతివాదాన్ని గురించి చెప్తూ, “లోకానుభూతులకి తట్టుకోలేక ఆత్మానుభూతులని ఏర్పరచుకున్నారు, శుద్ధంగా, శుభ్రంగా జీవించాలనుకున్నారు’’ అని అనటం జరిగింది. లోకానుభూతులే, ఆత్మానుభూతులు పరస్పర విరుద్ధాలుగా వీరు ప్రవచిస్తారు. కానీ నిజం ఆలోచిస్తే లోకానుభూతులే సాదారణీకారణాలై ఆత్మానుభూతులు అవుతాయనేది రససిద్ధాంతవాదం. లోకానుభూతులు, ఆత్మానుభూతులు వంకాయలు, బెండకాయలవలే పరస్పర సంబంధం లేనివి కావు. రససిద్ధాంతంలో లోకానుభూతులు మలినమైన బంగారమైతే, ఆత్మానుభూతులు శుద్ధమైన బంగారం. అనుభూతివాదులు శుద్ధంగా, శుభ్రంగా జీవించాలనుకుంటున్నారు అని కూడా వీరు చెప్తారు. అసలు శుద్దంగా, శుభ్రంగా జీవించాలని చెప్పనివారు ఎవరూ ఉండరు. అసలు విషయం ఏంటంటే అనుభూతివాదులు శుద్ధంగా, శుభ్రంగా రసానుభూతిని పొందాలని కోరుకుంటారు. అనుభూతికవి అనుభూతి తప్ప మరిదేన్నీ తన వస్తువులా కడగంటనైన చూడని తత్త్వం కలవారు అని సిద్ధారెడ్డిగారే మరోచోట పేర్కొన్నారు. అనుభూతి హృదయానికి సంబంధించింది. అనుభూతి లేని వస్తువేదీ ఉండదు. అయితే ఏ వస్తువూ అనుభూతి కాదు. వస్తువు ఇచ్చే చైతన్యం అనుభూతి. అనుభూతి కవులు అనుభూతిని తప్ప మరి దేన్నీ తన వస్తువులా చూడరని చెప్పటం సాహసంగానే ఉంది. అలాగే వారు మరోచోట అనుభూతి కవులు కవిత్వం కేవలం ఆత్మానందం కోసమని విశ్వసిస్తారు అని అనటం జరిగింది. ‘విశ్వఃశ్రేయః కావ్యం’ అనీ, ‘హితేన సాహిత్యం’ అనీ నమ్మిన రససిద్ధాంత అనుయాయులైన కవులు అనుభవించిన, ప్రవచించిన అనుభూతి కవిత్వం సమాజానికి చెందినది కాదని భావించటం ప్రమాదభూయిష్టమైన ఆలోచన. అనుభూతి వైయక్తికం కావచ్చుకానీ అనుభూతి కవిత్వం వైయక్తికం కాదు. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించేదే. కవి సమాజంలోని వాడే. సామాజికానుభూతుల్ని కవి తాను అనుభవించి, ఆ అనుభూతిని కవితగా వెలారుస్తాడు. ఒక్కొక్కసారి కవి తన అనుభూతిని వైయక్తికంగా చెప్పుకోవచ్చు. అది అంతమాత్రానే ఆత్మానందం కోసం రాశాడనీ, తన కోసమే రాసుకున్నాడనీ భావించటానికి వీల్లేదు. శ్రీశ్రీ

“నేను సైతం

ప్రపంచాగ్నికి

సమిధ నొక్కటి ఆహుతిచ్చాను’’

అని అంటాడు. ఇందులో ఉన్న ‘నేను’ వైయక్తికం కాదు. సమాజానికి శ్రీశ్రీ ఇచ్చిన పిలుపు అది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఎలుగెత్తి వేసిన కేక అది. కాబట్టి అనుభూతి కవి తన కోసమే కవిత్వం రాసుకుంటాడనటం తగనిమాట. ఏ కవీ, ఏ రచననీ తనకోసమే రాసుకోడు. కవి రాయడం సగభాగం అయితే, పాఠకుడు దాన్ని గ్రహించటం మరో సగభాగం. రచన పాఠకునికి అందటంతో సంపూర్ణం అవుతుంది. అందువల్ల తన ఆత్మానందం కోసం కవి రచన చేసుకుంటాడనుకోవటం అనుభవ దూరమైన విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked