సారస్వతం

అన్నమయ్యకు ఆరాధనా నివాళి 

– దీప్తి కోడూరు 

భగవంతుని గుణకీర్తనం చేసి తరించిన భక్తులు ఎందరో మన దేశంలో ఉద్భవించారు. వీరినే భక్త కవులంటారు. భక్త కవుల గురించి సుదీర్ఘ వివరణలు చెప్పుకునేకంటే ఒక్క సంఘటనను స్మరిస్తే వారి అంతరంగం స్పష్టమవుతుంది.
ఒకనాడు ఒక భక్తురాలు భగవాన్ శ్రీ రమణ మహర్షి వద్ద ఇలా అడిగింది,”నాయనా త్యాగయ్య అన్నమయ్య రామదాసు వీరంతా గానం చేసి తరించారు కదా! అది అందరికీ సాధ్యమవుతుందా?” అని. దానికి మహర్షి చిన్న చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు, “అమ్మా వారంతా గానంతో తరించలేదే, తరించాకే ఆ అనుభవాన్ని గానం చేశారు. ”
ఒక మహాత్ముని అంతరంగాన్ని ఇంకొక మహాత్ముడు తప్ప సామాన్యులు ఎలా అర్ధం చేసుకోగలరు?!!
మీరాబాయి, గోదాదేవి, అక్కమహాదేవి, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు, తులసీదాసు, కబీరుదాసు, నామదేవుడు, రామానందుడు, సూరదాసు, బసవన్న, అల్లమప్రభువు, రవి దాసు, తుకారాం , చైతన్య ప్రభు చెప్పుకుంటూ పోతే మన దేశంలో మహానుభావులు ఉదయించని కాలం లేదు, ప్రాంతం లేదు.
అన్ని భక్తిరీతులలోకి కీర్తనానికి ఒక ప్రత్యేకత ఉంది. అది కీర్తించేవారికే కాక వారి కీర్తనలు స్మరించేవారికి కూడా తరింపునివ్వగలదు. శ్రవణం, వందనం స్మరణం,పాదసేవనం, అర్చనం, దాస్యం, ఆత్మనివేదనం, సఖ్యం వంటి అన్ని సాధనా విధానాల్లో అందులో నిమగ్నమైన ఆ ఒక్క భక్తునికి లేక సాధకునికే ఆ సాధన పరిమితమై ఉంటుంది. కాని కీర్తనం విషయం లో మాత్రం అలా కాదు.

భక్తి పారవశ్యం లో వారు ఆలపించిన కీర్తనలు పదాలు చిరంజీవమై, తరతరాలు స్మరించిన వారినెల్లా ఆ పారవశ్యం లో ముంచి వేస్తాయి. స్వయంగా గొప్ప భావాలు మనలో రాకపోయినా అత్యద్భుతమైన వారి అంతరంగాన్ని మనదిగా చేసుకొని, భక్తి, వైరాగ్యాలను వృద్ధి చేసుకోవచ్చు.
ఆరువందల సంవత్సరాల కింద అన్నమయ్య గానం చేసిన” బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము” అని నేడు వినగానే మన గురు పాదాలను స్మరించుకొని ప్రణతులర్పించుకోగలుగుతాము.
అలాగే ఎక్కడో రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో, ” మేరే తో గిరిధర గోపాలా, దూసర న కోయి” అని స్మరించగానే, ఆ మీరాబాయి మది మందిరంలో ప్రవేశించి, ఆమె కృష్ణ ప్రేమను మనము రుచి చూడగలము. ఆమెతో పాటు మనము ఒక గోపికగా మారి, ఆ గిరిధర గోపాలుని ఆరాధించగలము.
పదకొండు వందల సంవత్సరాల క్రితం టిబెట్టులో నివసించిన మిలారెపాను వారి కవితల ద్వారా సజీవులను చేసుకోగలము.
అందమైన పదాలతో వివేకానందుడు కవితలల్లి గానం చేస్తుంటే, రామకృష్ణ పరమహంస ఆనంద పారవశ్యం లో నాట్యం చేసేవారు. గుండెంతా ఎర్రబారుంతుడగా, శరీరమంతా సన్నగా వణుకుతుండగా, కళ్ళలో నీళ్ళు నిండగా నరేంద్రుని దగ్గర తీసుకొని ప్రేమగా విలపించేవారు. అలాగే సమాధి స్థితిలోకి జారిపోయేవారు.
సంగీతానికి సాహిత్యానికి ఉన్న శక్తి అలాంటిది.
శ్లో|| సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్థన ద్వయం|
ఏకమాపాత మధురం అన్యమాలోచనామృతం||
`అని అందుకే చెప్పబడింది.
ఇక ఇవి రెండూ కలగలిసి ఒక భక్తవరుడి గుండెల్లో నుండి జాలువారితే అది అమృతానికి తీపి నేర్పినట్లవదూ!

అటువంటి భక్తకవులలో అత్యంత ప్రముఖుడు, తెలుగు తల్లి కన్నబిడ్డ మన అన్నమయ్య.

పదిహేనవ శతాబ్దానికి చెందిన అన్నమయ్య ఆంధ్రకవితాపితామహుడు. తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే తానే కవితలల్లి, రాగం కూర్చి, గానం చేసేవాడని అర్ధం. తెలుగులో సంకీర్తనా పధానికి తొలి అడుగు వేసినవాడు. పన్నెండు శతాబ్దాలకు పైగా అవిరామంగా పూజలందుకొంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ, స్మరిస్తూ 32 వేల సంకీర్తనలు సమర్పించుకున్నాడు.
వేంకటేశ్వరస్వామి స్వప్నాదేశంతో తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని, తన పదహారవ సంవత్సరం నుండి రోజుకొక సంకీర్తనతో స్వామిని అర్చించి సంకీర్తనా యఙ్ఞం నిర్వహించాడు అన్నమయ్య. వీటితో పాటు పన్నెండు శతకాలు, ద్విపదరామాయణము, సంకీర్తనా లక్షణము, శృంగార మంజరి, వేంకటాచల మాహాత్మ్యము రచించారు.
దురదృష్టం, వీట్లో చాలా భాగం మరుగైపోయాయి.
అన్నమయ్య సంకీర్తనలన్నీ తాటి ఆకులపైనే రాసుకొన్నాడు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు పెదతిరుమలాచార్యుడు వాటిని రాగి రేకులపై చెక్కించాడు. ఇవన్నీ సుమారు నాలుగు వందల సంవత్సరాల పాటు ఎవరూ గుర్తించకుండా తిరుమల ఆలయంలో హుండీ ఎదుట ఒక రాతి గృహంలో గుప్తంగా ఉండిపోయాయి.
1922 లో మొదటిసారి 14 వేల సంకీర్తనలతో కూడిన 2500 రాగి రేకులు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెలికి తీశారు. ఆ రాతి గృహాన్ని ఇప్పుడు సంకీర్తనా భాండాగారం అని పిలుస్తారు.
అంతవరకు నిత్యం పవళింపు సేవలో అర్చకులు స్వామికి పాడే, జో అచ్యుతానంద జోజో ముకుందా” అనే జోలపాట అన్నమయ్యగారిదని వారికి తెలియదు.
అంతెందుకు ? “చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ” అంటూ ముద్దు ముద్దు మాటలతో నోరు తిరగకుండా మాటలు నేర్చే ప్రతి తెలుగుబిడ్డ పలుకుతాడు. అది అన్నమయ్య వ్రాసిన చిన్ని కృష్ణ శతకంలోనిదని ఎంతమందికి తెలుసు?

మన తెలుగువారు మేల్కొనడానికి అలెగ్జాండర్ డంకన్ కాంప్బెల్ అనే ఆంగ్లేయాధికారి నిమిత్తకారణమయ్యాడు. 1816 లో ఆయన రచించిన “ఏ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్” అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా అన్నమయ్య సంకీర్తనా రచనల గురించిన అధికారిక ప్రస్తావ కనిపిస్తుంది. వ్యాకరణానికి సంబంధించిన ఒక శాస్త్రము, ఇంకా దేవుని స్తుతిస్తూ అనేక వేల పాటలు తిరుమల ఆలయంలో భద్రపరచబడి ఉన్నట్టు, వ్యాకరణ శాస్త్రము యొక్క ప్రతిని తాను పరిశీలించినట్టు, మిగిలిన వాటిని పరిశీలించడానికి ఒక భారతీయుని నియమించినట్టు కూడా ఆయన ఆ గ్రంథంలో వ్రాశారు.
ఆ తర్వాత వంద సంవత్సరాలకు గాని తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీటిని వెలికి తీయలేదు. ఆ పై పాతిక సంవత్సరాలు కృషి చేసి అప్పటికి లభ్యమౌతున్న అన్ని రాగిరేకులను ఒక చోట చేర్చగలిగారు. తిరుమలలోనే కాక అహోబిలం, శ్రీరంగం ఆలయాలలో కూడా కొన్ని రాగి పత్రాలు దొరికాయి.
అక్కడి నుండి సుమారు యాభై సంవత్సరాలు ఎందరో పెద్దలు ఎంతో కృషి చేసి 1998లో “తాళ్ళ పాక పద సాహిత్యము” అను పేర 29 భాగాలతో అన్నమయ్య సాహిత్యమంతటిని ఒక చోట చేర్చగలిగారు.
అన్నమయ్య జీవిత కథని ఆయన మనవడు తాళ్ళపాక చిన్నన్న ద్విపద రూపంలో విలేఖించారు. ఆయన జీవిత విశేషాలు అధిక భాగం ఈ కావ్యం ద్వారానే తెలియవచ్చాయి. తాళ్ళపాక వంశంలోని తరువాతి తరాలలో తాళ్ళపాక సూర్యనారాయణ గారు తామ్రపత్రాలలోని ఈ ద్విపద కావ్యాన్ని కాగితాల మీద వ్రాసి పెట్టారు. ఆ తర్వాత వేటూరి ప్రభాకరశాస్త్రి గారు దీనికి ఒక గ్రంథాకృతిచ్చారు.
సర్వధారి సంవత్సరం వైశాఖ పూర్ణిమ నాడు(మే 9, 1408) లో జన్మించి 95 సంవత్సరాల భక్తిమయ జీవితం సాగించి, దుంధుభి నామ సంవత్సరం ఫాల్గుణా బహుళ ద్వాదశి నాడు(ఫిబ్రవరి 23, 1503) ఏడుకొండల స్వామి లో ఐక్యమైపోయాడు అన్నమయ్య. ఆంధ్రప్రధేశ్లో కడప జిల్లాలో, తాళ్ళ పాక అనే చిన్న గ్రామంలో జన్మించాడు.
చిన్ననాటి నుండే అన్నమయ్యలో కవితాస్ఫూర్తి, మధుర గాత్రం అందరినీ ఆకర్షించేవి. ఆవుల మేతకు గడ్డి తీసుకురమ్మని అడవికి పంపగా, వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని అని హరి నామాలు పాడుకుంటూ వెళ్ళే ఒక భక్తుల బృందం ఎదురు వచ్చింది. అంతే అటునుండి అటే ఆ భక్తుల బృందంతో కలిసి తిరుమల వెళ్ళిపోయాడు అన్నమయ్య.

ఆనాడు ఆరంభమైన సంకీర్తనా మహాయఙ్ఞం తన చివరి శ్వాస విడిచే వరకు కొనసాగింది. తిరుమలలో నివసించే ఘన విష్ణువనే సాధువు వద్ద వైష్ణవ సంప్రదాయంలో ముద్రాంకితాలు తీసుకొని అన్నమాచార్యుడయ్యాడు.
అడవికి వెళ్ళిన కొడుకు ఏమైపోయాడో తెలియక తల్లిడండ్రులు తల్లడిల్లిపోయారు. కొన్నేళ్ళ తరువాత అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని తెలిసి, అతడిని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చి, తిమ్మక్క , అకలమ్మలనిచ్చి వివాహం చేస్తారు. సంసార జీవిత సాగిస్తూనే సంగీతయఙ్ఞాన్ని కొనసాగించాడు. కొన్నాళ్ళు తాళ్ళపాకలో సంసార జీవితం కొనసాగించాడు. తన ఇంట్లొ జరిగే ప్రతి చిన్న కార్యాన్ని వేంకటేశ్వర స్వామికి అనుసంధానం చేసుకొని పాడేవాడు. తన బిడ్డలలో చిన్ని కృష్ణుని చూసుకొని అనేక జోల పాటలు పాడుకొన్నాడు. అన్నీ పరంధామునికే అంకితం చేశాడు.
తన ఆశలు, ఆలోచనలు, ఆశయాలు, అహినివేశాలు అన్నీ తన పదాల్లో పొందుపరచేవాడు. ఒక్కొక్క సంకీర్తన శ్రవణం చేస్తుంటే, ఆనాడు అన్నమయ్య అంతరంగం,

బాహ్య పరిస్థితులు, స్వామి పట్ల పెల్లుబికే ప్రేమ, నేటికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి.
ఒకనాడు కుటుంబ సభ్యులు, సంసార జీవితంలో కాలమంతా వృధా అయిపోతున్నట్లు అనిపించిందేమో! తన బాధంతా ఇలా వెళ్ళ్గక్కుకొన్నాడు.

అయ్యో !పోయ ప్రాయము, కాలము
ముయ్యంచు మనసున నే మోహ మతినైతి
చుట్టంబులా తనకు సుతులు, కాంతలు చెలులు
వట్టియాశలబెట్టువారెకాక
నెట్టుకొని వీరు గడునిజమనుచు హరినాత్మ
బెట్టనేరక వృధా పిరివీకులైతి
తగు బంధులా తనకు తల్లులును తండ్రులు
వగలు బెట్టుచు తిరుగువారే కాక
మిగులవీరల పొందు మేలనుచు హరినాత్మ
తగిలించలేక చింతాపరుడైతి
అంత హితులా తనకు అన్నలును తమ్ములును
వంతువాసికి బెనుగువారే కాక
అంతరాత్ముడు శ్రీ వేంకటాద్రీశు గొలువకిటు
సంతకూటముల యలజడికి లోనైతి

తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, అన్నదమ్ములు ఇవేవీ శాశ్వతము కావు. కేవలం భగవంతుని సాన్నిధ్యమే సాధించుకోవలసింది అనే భావాన్ని ఇందులో చెప్పాడు అన్నమయ్య. వైరాగ్య సాధనకు ఈ పదం ఎంతో సరిపోతుంది.
అలాగే మరోసారి అన్నమయ్య తిరుమల గిరుల సౌందర్యం తిలకిస్తూ శ్రీనివాసుని స్మరించుకొంటున్నాడు. ఉన్నట్టుండి తనలో భావావేశం పెల్లుబికి, పరమ పవిత్రమైన శ్రీ వారి పాదపద్మాలు తన మనో మందిరంలో ప్రతిష్టితమయ్యాయి. ఆ పాదాలు ఎన్ని యుగాలలో ఎందరిని తరింపచేశాయో ఆ పరంధాముని దివ్యలీలలు ఒకటొకటిగా మెరవసాగాయి. వామనుడై బలిదేవుని శిరస్సున నిలిపిన రాముడై శిలాసదృశమైన అహల్యను కాచిన పాదము,చిన్ని కృష్ణుడై కాళింది మర్దనం చేసిన పాదము, పన్నగశయనుడై లక్స్మీ దేవి సేవలందుకొనే పాదము, ఆశ్రయించిన అందరినీ కాచే పాదము అట్టి దివ్య పాదపద్మములను తాను ఆశ్రయించి ఉన్నాడు అంతే ఒక అద్భుతమైన ఒక పద కవిత ఆయన గళం నుండి జాలువారింది.

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చెలగి వసుధ గొలిచెడి పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పరమ యోగులకు పరిపరి విధముల
వరమొసగెడి నీ పాదము
తిరువెంకట గిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము

జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాడని తల్లి ఉండదంటే అతిశయోక్తి కాదేమో!

అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా శ్రీనివాసునితో సహజీవనం చేశాడు.
మేలుకొలుపు సేవ మొదలు పవ్వళింపు సేవ వరకు అనుదినం అనుక్షణం స్వామి ఆలయం వద్ద జరిగే ప్రతి విహవాన్ని తన సంకీర్తనలలో పాడుకొన్నాడు. ఆధ్యాత్మికత, వైరాగ్యజనిత, భక్తిపూరిత కీర్తనలతో పాటు శృంగార కీర్తనలు అనేకం పాడేవాడు. అలాగే తత్వము నీతి అభినయము, మధుర భావన వంటి నలభై విభాగాలలో అన్నమయ్య పదకవితలు వ్రాసినట్లు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గుర్తించారు. మాములుగా మూడు చరణాలతో కీర్తనలు కూర్చే అన్నమయ్య భక్త్యావేశంతో ఉన్నపుడు 25 చరణాలతో కూడిన కీర్తనలు కూడా ఆలపించాడు.

“జో అచ్యుతానంద జో జో ముకుంద” అని ఆయన స్వామికి మేలుకొలుపు పాడాడు.
“ముద్దు గారే యశోద ముంగిటి ముత్యము వీడు” అని చిన్ని కృష్ణుని ఆట పాటలు స్మరించాడు. డోలాయం చల డోలాయం హరే డోలాయం” అనే జోల పాటలో దశావతారాలను వర్ణించాడు. “విన్నపాలు వినవలె వింతవింతలు” అని సుప్రభాత సేవలోనూ,
“పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు” అని కళ్యానోత్సవంలోనూ,
“కంటి శుక్రవారము ఘడియలేడింట” అని తిరుమంజనంలోనూ(ప్రతి శుక్రవారము జరిగే అభిషేకము) స్తుతులు చేసాడు.
ఇలా ప్రతి సేవనూ తన సంకీర్తనలతో సంపూర్ణం చేసేవాడు. రఘురాముని వైభవాలు గానం చేశాడు.
రామాయణంలోని అన్ని ఘట్టాలు ఆయన పదాల్లో చోటు చేసుకున్నాయి. రఘు రాముని వైభవాలు అద్భుతంగా గానం చేశాడు.

“ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను” అంటూ శ్రీనివాసుడు అలిమేలు మంగల సరాగాలు గానం చేశాడు.
“చక్కని తల్లికి చాంగుభళా” అని అలిమేలు మంగమ్మ చల్లని చూపుని ప్రేమని పదాల్లో కూర్చాడు.
“దీనుడ నేను దేవుడు నీవు” ,”పురుషోత్తముడవు నీవు పురుషాధముఢను నేను” వంటి సంకీర్తనలలొ సంపూర్ణ శరణాగతిని ప్రకటించాడు అన్నమయ్య.
“నానాటి బ్రతుకు నాటకము”, “అయ్యో పోయెను ప్రాయము కాలము” వంటి పదాల్లో వైరాగ్యము, ఈ ప్రపంచం యొక్క అనిశ్చితత్వము, సంసరము, కోరిక ,తాపత్రయాలలో మునిగి అతి విలువైన మనుష్య జన్మను ఎలా వృధా పరచుకంటున్నామో బోధించాడు.
“బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే” అని పాడినపుడు ఆయన సర్వ మానవాళి పరమాత్ముని ఎదుట సమానులే అని ప్రబోధించాడు.

అలాగే అన్నమయ్యను గురువుగా సేవించి, కొన్నాళ్ళకు అహంకారంతో తన మీద కవితలల్లి, పాటలు పాడమని ఒత్తిడి చేసి హింసించచూసిన సాళ్వ నరసింగ రాయలుతో హరిని కీర్తించే నాలుక నరుని కీర్తించదని ఖండితముగా చెప్పాడు అన్నమయ్య. అదే నిశ్చయాన్ని, “మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేల” అనే పదకవితలో పాడుకొన్నాడు.

32 వేల సంకీర్తనలలో ఏ కీర్తనని స్మరించను?! దేనికదే పరమ పావనము, అమృత రసమయము.

ఙ్ఞానిని ఙ్ఞాని మాత్రమే గుర్తించగలడు అని భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లుగా, ఒక భక్తుని అంతరంగం మరొక భక్త వరునికి మాత్రమే తెలుస్తుందనడానికి ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను.

కన్నడ భక్త కవి పురందరదాసు అన్నమయ్యకు మూడవ తరం వాడని చెప్పవచ్చు. అన్నమయ్య కంటే డెబ్బై సంవత్సరాలు చిన్నవాడు. అన్నమయ్య సంకీర్తనలు విని ఆయనను దర్శించాడు పురందరదాసు. కొద్ది సమయం అన్నమాచార్యుని సాన్నిధ్యంలో గడిపాక, కంట నీరు కారుస్తూ, అన్నమయ్య సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి అవతారమని, ఆయన కీర్తనలు వేద మంత్రాల వలె మహిమాన్వితమైనవనీ స్తుతించాడు. అన్నమాచార్యుని పట్ల గౌరవ సూచకంగా ఆయన గానం చేసిన,

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా
శరణు రాక్షసగర్వసమ్హార శరణు వేంకట నాయకా

అనే పదకవితను స్మరించుకుంటూ తాను కూడా

శరణు శరణు సురేంద్ర వందిత శరణుశ్రీ పతి సేవిత
శరణు పార్వతి తనయ మారుతి శరణు సిద్ధి వినాయక

అని గానం చేశాడు పురందరదాసు.

మే 10, 2017 వ తేదీన జరిగిన ఆంద్ర పాదకవితాపితామహుడు అన్నమయ్య జయంత్యుత్సవాలను సంస్మరిస్తూ ప్రతివారూ ఆయన పదకవితా డోలికల్లో ఆనందంగా తేలియాడుతూ, తమ లక్ష్య సాధన దిశగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ సెలవు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked