సారస్వతం

అహంకారం

-శారదాప్రసాద్

నిఘంటువు అర్థం ప్రకారం “అహం” అంటే “నేను”, “నా” అనే స్వంత సామర్థ్యానికి సంబంధించిన భావన. “నేను”, “నా”, అని సూచించేంతవరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే. ఆత్మగౌరవానికి, అహంకారాకి తేడా ఏమిటంటే, “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మగౌరవం. “ఈ సామర్థ్యం నాకొక్కడికే ఉంది” అనడం అహంకారం . విద్య, ఐశ్వర్యం, అందం, అన్నిటిలో ఉన్నతులైన వారు రాణించాలంటే ముఖ్యంగా వారిలో ఉండవలసినది తగినంత అణకువ, వినయం . అహంకారానికి వయస్సు, ధన, కుల, మత ప్రాంత, భాష- ఇవేమీ సంబంధం లేదు. కొంతమంది (అతి)తెలివిగా తమ అహంకారాన్ని ఆత్మాభిమానం అని చెప్పుకుంటారు. అదే ఇతరుల గురించి చెప్పేటప్పుడు వారిది (అహంకారానికి) ‘గర్వం’ అని అంటారు. అహంకారం పెరిగితే ఈర్ష్య,అసూయ లాంటి మిగిలిన దుర్లక్షణాలు దాన్ని అనుసరిస్తాయి!పాండవుల కన్నా అన్నిటా నేనే గొప్పవాడిగా ఉండాలనే సుయోధనుడు దురాలోచనే కౌరవ వంశాన్ని నాశనం చేసింది. “మనోబుధ్ధి రహంకార చిత్తం ’’ మనస్సు, బుద్ధి , అహంకారం, చిత్తం అనే నాలుగు అంతఃకరణంగా యోగశాస్త్రం నిర్వచించింది. అన్నింటిలో మనిషిని మూర్ఖునిగా చేసేది అహంకారం. సర్వం పరమాత్మకే సమర్పితం.అన్నీ ఆయన కటాక్షంతోనే జరుగుతుంది అనే భావనలో ఉండాలి. ఈ ప్రపంచంలో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవలసింది అనంతం అనే భావనలో ఉండాలి.ఈ భావన అహంకారాన్ని జయిస్తుంది. మనిషిలోని అహంకారమే అన్ని అనర్థాలకూ కారణం . దైవ సంకల్పం మన విజయానికి కారణమనీ, అహంకారాన్ని వదిలేస్తే కనిపించేదంతా శుద్ధ చైతన్యమే!అహంకారం తొలగితేనే అజ్ఞానం నశిస్తుంది!అజ్ఞానం నశించటమే జ్ఞానానికి సోపానం! ఈ అహం దేవతలకు కూడా ఉంది. ‘అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ’ అన్న గీతాచార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మ తన ప్రకృతి ఎనిమిది విధాలు (పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం) అన్నాడు. ఆయనే ‘అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ’ అని, ‘తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌’ అని తనను నమ్ముకున్న వారిని అన్ని పాపములనుండి రక్షిస్తానని, వారి యోగక్షేమాలను తానే స్వయంగా చూస్తాను అని చెప్పాడు.అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ కూడా చెప్పాడు. ఈ అహంకారాన్ని కొంతమంది ముద్దుగా స్వాతిశయం అని కూడా అంటుంటారు.పురాణ పాత్రల్లో సత్యభామకు స్వాతిశయం ఎక్కువ!శ్రీ కృష్ణ పరమాత్మను తూచగల ధనం తనవద్ద ఉందని మూర్ఖంతో భ్రమించి ,పరమాత్మ తత్వాన్ని అర్ధం చేసుకోలేక పోయింది.గోవర్ధన గిరి పర్వతాన్ని ఒంటి వేలు మీద నిలిపిన పరమాత్మ శక్తి కనుక్కోవటానికి ఆమె అహంకారం అడ్డొచ్చింది.ఆ అహంకారం అణగిన తర్వాత సపత్నులను తనతో సమానంగా చూసింది.శ్రీ కృష్ణ భక్తురాలైంది. ఈ మధ్య కాలంలో స్వాతిశయం గురించి చెప్పుకునేటప్పుడు ప్రఖ్యాత సినీ నటి భానుమతి గారి విషయం చెప్పాలి!అవి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు ఆంధ్రపత్రికలో సినీ విలేకరిగా పనిచేస్తున్న రోజులు!భానుమతిని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఆయనకు వచ్చింది.ఆయన ఆవిడను సూటిగా,”మీకు గర్వం ఎక్కువటగా?”అని ప్రశ్నించాడు.దానికి ఆమె టక్కున ,”నాకు గర్వమని నేరుగా అడగటానికి నీకెంత గర్వం?” అని టపీమని సమాధానం చెప్పింది.తెలివిగల అహంకారులు ఒకరి అహంకారాన్ని మరొకరు గౌరవించుకుంటారు. అవతలి వాడి ఇగోను తృప్తి పరచటం కూడా సంస్కారమే!మన కింద పనిచేసే ఉద్యోగుల విషయాల్లో దీన్ని మనం పాటిస్తే , వారు మనల్ని అమితంగా ప్రేమిస్తారు. గుడిలోకి వెళ్లి కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు మన అహంకారాన్ని బద్దలుకొట్టినట్లు అనుకోవాలి. దేవుడు కొబ్బరి ఆరగిస్తాడని కాదు. వివేకమనే ఒకే ఒక దెబ్బతో అహంకారాన్ని రెండు ముక్కలు చేయడానికి అది సంకేతం.అన్నిటికన్నా అనర్ధదాయకమయింది అహంకారం. అహంకారం ఆనందాన్ని కూడా దూరం చేస్తుంది.అహంకారం ఉన్నచోట ఆందోళన ఉంటుంది. అహంకారానికి కారణాల్లో విజయం కూడా ఒకటి.నాలుగుసార్లు అన్నింటా విజయం సాధించినవాడు తన్ను మించిన వాడు లేదనే అహంకాపు చీకటి నూతిలో పడుతాడు. అహంకారం ఉంటే ఇతరులను చిన్నచూపు చూడటం కూడా వస్తుంది. శత్రువు బలం చూడకుండా ఎదిరించటం కూడా అహంకారమే. “దేవుడు అహంకారం కలవాళ్ళను ద్వేషిస్తాడు. వినయం కలవాళ్ళను కనికరిస్తాడు” అని బైబిల్ కూడా చెబుతుంది. గంభీరా, గగానాంతస్తా, గర్వితా, గానలోలుపాయైనమః — ఇది లలితా సహస్రనామంలోని మంత్రం. గర్వం, గంభీరం మొదలైనవి కూడా
అమ్మ వారి స్వరూపాలే! అమ్మవారు ఎత్తైన గగనానికి చేరి గర్వించి పరవశిస్తుంది. పరవశమంటే పరమశివుని చేరి వివశమవటం . వివశత్వంలో గంభీరత, గర్వం అతిశయమౌతాయి. ఆ గర్వానికి, గంభీరతకు అందరూ తలవంచవలసిందే!గాంభీర్యాన్ని, గర్వాన్ని ప్రదర్శిద్దాం, అహంకారాన్ని మాత్రం వద్దు.

శుభం భూయాత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked