కథా భారతి

ఆకాశంలో ఆశల ‘హరివిల్లు’

-డా.పి.కె. జయలక్ష్మి
విశాఖపట్టణం

“హేయ్ హరీ వాటే సర్ప్రైజ్ ?” ఆప్యాయంగా పలకరిస్తున్న చిరకాల మిత్రురాల్ని ప్రేమతో వాటేసుకుంటూ “ఓ మై గాడ్! ఎన్నాళ్ళకి కలిసామే” అంది హరిణి సంతోషంగా. “అవునా ఇంకో సర్ప్రైజ్ చూడు ఇక్కడ” అంటూ అంతసేపూ తన వెనకలే నించున్న విరి ని ముందుకు లాగింది చెయ్యి పట్టి.
“వావ్ విరీ ఎలా ఉన్నావే?” అంటూ దగ్గరికి తీసుకుంది హరిణి ఇద్దర్ని ఆత్మీయంగా. “చికాగో యూనివర్సిటీ లో చదువులయ్యాక మళ్ళీ ఇప్పుడేగా కలవడం. గ్రాడ్యుయేషన్ కి కూడా కలవలేకపోయాం కదే!” అంది సిరి బాధగా. “ఇంతకీ ఎలా ఉందే లైఫ్ ?” కాఫ్టేరియా లో వేడి కాఫీ సిప్ చేస్తూ అడిగింది హరి. “ఎదోలేవే చల్తా హై”. అంది సిరి.
“అదేంటే అంత నీరసం?మనం చదువుకొనే రోజుల్లో ఎంత చురుగ్గా ఉండేదానివి?ఎంత బాగా డాన్స్ చేసేదానివి?అన్నట్టు ఇప్పుడూ డాన్స్ చేస్తున్నావా?” అడిగింది కుతూహలంగా హరి. “దాని వొళ్ళు చూస్తూ కూడా డాన్స్ చేస్తున్నావా అని అడుగుతా వేంటే హరీ? ఎప్పుడో అటకెక్కించేసింది డాన్స్ ని” అంది నవ్వుతూ విరి. “అవునా? నీకు డాన్స్ అంటే ప్రాణం కదే ! ఎలా వదిలేశావ్? మీ ఆయన గాని వద్ద న్నారా?” ఆతృత గా అడిగింది హరిణి. “కాదే , మా అత్తగారు….” చిన్నబోయింది సిరి. “ఏంటీ అత్తగారా? ఆవిడ బాగా చదువుకున్నారని, కాలేజ్ ప్రిన్సిపాల్ గా చేస్తున్నారని అన్నావ్. అలాటిది డాన్స్ వచ్చిన కోడల్ని ప్రోత్సహించడం పోయి ఇలా అడ్డుకొట్టడ మేంటి?” విస్తుపోయింది హరిణి.
“అదేనే అసలు విషయం. చెప్పుకోడానికే పెద్ద చదువులు, ఉద్యోగాలు. ఆలోచనల్లో మాత్రం పెద్దతనం ఉండదు. అంతా పాత కాలం. కోడలు అమెరికా లో జాబ్ చేయడం వరకు ఓకే గాని డాన్సులు, పాటలు అంటే మాత్రం కుదరదు అని తెగేసి చెప్పేశార్టే.” సిరి వైపు జాలిగా చూస్తూ చెప్పింది విరి.
“అవునే హరీ. నా డాన్స్ చూసి ఇష్టపడి సంబంధం కుదుర్చుకున్న అత్తామామలు పెళ్లయ్యాక డాన్స్ పేరెత్తితే ఒప్పుకోమని కండిషన్ పెట్టారే. ముందంతా సపోర్ట్ చేసిన మా ఆయన వాళ్ళ ముందు ఏమీ మాట్లాడలేదు. కుటుంబం కావాలనుకుంటే మన ఇష్టాలు వదులుకోక తప్పదు. అందుకే నా డాన్స్ ని పుట్టింటి గడప దగ్గరే వదిలేసానే”. కన్నీళ్లు ఆగలేదు సిరికి.. చాలా బాధేసింది హరికి. ఎంత చదువుకున్నా, దేశాలు దాటి ఉద్యోగాలు వెలగబెడుతున్నా , మహిళా సాధికారిత, విమెన్స్ రైట్స్ అని ఉపన్యాసాలు దంచుతున్నా ఈ తరం లో కూడా ఆడపిల్లలకి తమకి నచ్చినట్టు జీవించడానికి అంతెందుకు తమకి నచ్చిన కళ ని నేర్చుకోవడానికి కూడా స్వాతంత్ర్యం లేదా?
పైకి మాత్రం “”పోన్లేవే సిరీ. జీవితం లో కొంత కాలమయినా నీకు నచ్చిన డాన్స్ ని సాధన చేసి దాన్లోని ఆనందాన్ని ఆస్వాదించావు కదా. నాలా దొంగచాటుగా ఇబ్బంది పడకుండా. ఆ మూమెంట్స్ ని పదిలంగా మనసు పొరల్లో దాచుకో. అంది అనునయంగా.
అయినా అంత బాగా చదువుకుని అభ్యుదయ భావాలున్న సిరి అత్తగారే అంత సంకుచితంగా ఆలోచిస్తే అతి సామాన్యం గా ఉండే మా అత్తగారెలా స్పందిస్తారో తన డాన్స్ ఇష్టం తెలిస్తే ? అసలు ముందు మా అమ్మ కే ఇష్టం లేదు.” అంది డాన్స్ ని విపరీతంగా ప్రేమించే హరిణి ఎదురుగా ఉన్న గ్లాస్ విండో లోంచి దూరంగా కొండల పై నించి జాలువారుతున్న మంచు ని చూస్తూ .
“చస్ నోర్ముయెండే ఇద్దరూ. అమెరికా లో చదువుకొని అక్కడే మంచి జాబ్స్ చేస్తూ ఇంకా అత్తగారు , అమ్మగారు అంటూ బెదిరిపోతా రేంటే? మీకు నచ్చినట్టు మీరుండండి. ఇదేమంత పెద్ద మ్యాటర్ అసలు? జస్ట్ ఏ హాబీ.” అంది తేలిగ్గా విరి.
“అబ్బా నీకు అర్ధం కావట్లేదే. నేను చాలా ఇండిపెండెంట్ . ఐ నో వాట్ ఐ వాంట్. అండ్ వాట్ ఐ యామ్ డూయింగ్. కానీ నావాళ్ళు కూడా నేను చేస్తున్నది సరైనదే , తప్పేం కాదు అని ఆమోదించాలి. అప్పుడే నాకు సంతృప్తి. ఎవరు వద్దన్నా నాకు నచ్చినట్టు చేయడం పెద్ద విషయమైతే కాదు. కానీ నావాళ్ళకి కూడా అది మంచిదే అన్పిస్తే ఇంకా హ్యాపీ గా ఆ పని చేయగల్గుతాను. అందుకే నా వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళు నన్ను ఆక్షేపించకుండా నాకు నచ్చినవి నేను చేయాలి అనుకుంటున్నా.. తప్పేం కాదు కదా”. అంది హరిణి కాఫీ తాగుతూ.
“ఒక పని చెయ్ సిరీ. మీ అత్తగారికి అభ్యంతరం లేని ఆర్ట్ ఏదో కనుక్కొని దాని మీద ఇష్టం పెంచుకొని ప్రాక్టీస్ చేస్కో. అప్పుడే గొడవా ఉండదు“అంది అల్లరిగా నవ్వుతూ విరి.
ఏం చెప్పావే బాబూ? ఇష్టాలనేవి పర్సనల్. ఇతరుల ఛాయిస్ ప్రకారం మనమెలా మౌల్డ్ అవుతామే? అసలు అవతలి వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలెలా అవుతాయే? మనకి నచ్చినట్టు మనం బతకలేకపోతే ఎలా?” వేదనగా అంటున్న సిరి వైపు జాలిగా చూసారిద్దరు.
ఇంటికి వచ్చినా హరిణి చెవిలో సిరి మాటలే మారుమోగుతూ ఉన్నాయి. “ఏయ్ హరీ డాలింగ్ వాట్ స్పెషల్ టుడే?”అడిగాడు విశాల్ అపుడే జిమ్ నించి వచ్చి ప్రోటీన్ షేక్ తాగుతూ ..
“చికెన్ ఫ్రై, కోకోనట్ రైస్ డియర్” అంది నవ్వుతూ.
“దట్స్ ఫైన్ . ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఆల్ హ్యాపీస్?” అంటూ స్నానానికి వెళ్లిపోయాడు టవల్ తీస్కోని. వంట పూర్తిచేసి అన్నీ టేబిల్ పైన అందంగా గాజు డిషుల్లో అమర్చి భర్త తోకల్సి ముచ్చట్లాడుకుంటూ భోజనం ముగించింది. రాత్రి పడుకోబోయేముందు విశాల్ కి కార్టూన్స్ , హరిణి కి యూ ట్యూబ్ లో పాత సినిమాలు సరదా. వారం లో ఒకరోజు ఆఫీస్ హడావిడికి దూరంగా వాళ్ళకి నచ్చినట్టు గడపాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. కొన్నిసార్లు ఔటింగ్, లాంగ్ డ్రైవ్,ట్రెక్కింగ్,ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్స్.. ఇలా !చాలా రోజుల తర్వాత హరిణి తనకిష్టమైన స్వర్ణ కమలం సినిమా పెట్టుకుంది. ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా తనకి తనివి తీరదు . డాన్స్ అంటే తనకి చాలా ఇష్టం. ఇంజనీరింగ్ కంటే డాన్స్ నేర్చుకుని, ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఆ డబ్బుని బీద పిల్లలికి ఖర్చు పెట్టాలనేది తన యాంబిషన్. తనకో బ్లాగ్ కూడా ఉంది. తనకి నచ్చిన, తను స్పందించిన సంఘటనల్ని బ్లాగ్ లో రాస్తూ ఉండడం తన హాబీ.
“హరీ కమాన్. ఇంకా ఎంతసేపు. నాకు నిద్రోస్తోందిరా. రా పడుకుందాం.” టైమ్ చూసుకుంటూ మత్తుగా పిలిచాడు విశాల్. “వెయిట్ విల్. చివర్లో ఉన్నా.ఇదిగో లాస్ట్ లైన్. జస్ట్ 2 మినిట్స్” అంది గబగబా టైప్ చేస్తూ హరిణి.
“ఏంటో నువ్వు. సినిమాలు చూడనే చూడవు. ఎంతసేపూ ఆ డాన్సులు ఉంటే చాలు. డాన్స్ సినిమాలైతే ఎంతసేపైనా ఎంజాయ్ చేస్తావ్. తర్వాత బ్లాగ్ లో పోస్ట్ చేసేస్తావ్. నీ పిచ్చీ నువ్వూనూ.” నవ్వేశాడు.
“పోన్లే విల్..ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. స్వర్ణకమలం నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఆకాశం లో ఆశల హరివిల్లు పాట లో భానుప్రియ ఎంత బాగా డాన్స్ చేసిందో?ఎంత చక్కని ఎక్స్ ప్రెషన్స్ ఆ అమ్మాయివి?డాన్స్ లో ఎంత ఈజ్? ఒకపక్క అంత అద్భుతంగా డాన్స్ చేస్తూ మరోపక్క అదే డాన్స్ ని ఏవగించుకోవడం – ఓ మై గాడ్ ఎలా సంభవం అసలు? వెంకటేష్ కూడా ఎంత నేచురల్ గా, సహనంగా నటించాడు? కాదు కాదు చంద్రశేఖర్ పాత్రలో జీవించేశాడు. అసలు నన్నడిగితే నిజ జీవితం లో కూడా అలా వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉంటే కళాకారులకి ఎంత మోటివేషన్ అవుతుందో కదా!”అంది హరిణి తాదాత్మ్యంగా .
“అమ్మో హరీ, మొదలెట్టావా ని రివ్యూ! డాన్స్ అంటే ఎంత ఇష్టం డియర్ నీకు? అన్నట్టు ఈ మధ్య కథక్ నేర్చుకుంటున్నట్టున్నావ్ .. హ్యాపీ నా?” ఆమె ముంగురులు సవరిస్తూ అడిగాడు ప్రేమగా విశాల్.
“యస్! చిన్నప్పట్నించీ డాన్స్ నా డ్రీమ్ విల్లూ. ఆఫ్ కోర్స్ నీ తర్వాతే అనుకో”. చిలిపిగా కళ్ళు చికిలించింది. “కానీ అమ్మ కెప్పుడూ ఇష్టం లేదు. ఎంతసేపూ చదువు- చదువు ఎప్పుడూ అదే. అందుకే నేర్చుకోలేక పోయాను”. జాలిగా చెప్తున్నహరిణి ని దగ్గరికి తీసుకుంటూ “పోన్లే ఇప్పుడు నీ కోరిక తీరుతోందిగా” అన్నాడు చిరునవ్వుతో.
“అవును గాని విల్, నీకు పాటలు ఇష్టం కదా! నేర్చుకున్నావా ఏమైనా ? నీ గొంతు బాగుంటుంది కూడా.” అడిగింది హరిణి దిండు సరిచేస్తూ. “ ఇష్టం అంటే అంత ఇష్టం కాదు. ఏదో చిన్నప్పుడు స్కూల్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడల్లా మా టీచర్ నేర్పించేవాళ్లు మా క్లాస్ లో కొంతమందిని సెలక్ట్ చేసి. అలా అందరితో కలిసి పాడడమే తప్ప పాడాలనే కోరిక, నేర్చుకోవాలనే ఇంట్రస్ట్ అయితే ఏమీ ఉండేది కాదు. మీ బాబు బాగా పాడతాడు , సంగీతం నేర్పించమని మా టీచర్ నాన్నకి చెప్పారు కూడా. కానీ నాన్న ఒప్పుకోలేదు, చదువుమీద దృష్టి పెట్టమన్నారు. అమ్మ మాత్రం మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేసింది, కానీ కొన్నాళ్లు వెళ్ళి మానేసా. అంతే!” సరదాగా నవ్వేశాడు విశాల్. అలా నిద్రలోకి జారిపోయాడు
హరిణి కి చాలాసేపు నిద్ర పట్టలేదు. తనకి చిన్నప్పట్నించీ డాన్స్ అంటే ప్రాణం. ఆ రోజు-స్కూల్లో డాన్స్ పోటీలు జరిగాయి. తన సీనియర్ మంజు కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంటికి రాగానే తల్లిని “అమ్మా . హాఫ్ ఇయర్లీ లో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా. నాకు ఎప్పుడు ఫస్ట్ వచ్చినా ఏదో గిఫ్ట్ ఇస్తావుగా ఈసారి నేను అడిగింది ఇస్తావా?” అని అడిగింది ఆశగా.” ఏం కావాలి తల్లీ?” అంది నవ్వుతూ అమ్మ. “మరి.. మరేమో ..నాకు డాన్స్ నేర్పించవా మమ్మీ. నేర్చుకొని చక్కగా స్టేజ్ మీద డాన్స్ చేసి బోలెడు ప్రైజులు తెచ్చుకోవాలని ఉంది. ప్లీజ్ అమ్మా , మంజు అక్క తో పాటు నేనూ నేర్చుకుంటా!” అని బతిమాలింది.
అంతే కయ్యిమంది వినతి “ఏంటి డాన్సా? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఒక పక్క స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు తడిసి మోపెడు. బుద్ధిగా చదువు కొని ప్రయోజకురాలివి అవుతావనుకుంటే ఇదెక్కడి పిదప బుద్ధులే నీకు? నోర్మూసుకుని హోమ్ వర్క్ చేస్కో ఫో” అని కసిరేసింది. తను నిరాశగా తల దించుకుంది. అయినా సరే తీరిక దొరికినపుడల్లా టి. వి లో డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఏకలవ్యుడిలా సాధన చేస్తూ ఉండేది. స్కూల్లో ఫ్రెండ్స్ ముందు తన విద్య ప్రదర్శిస్తూ ఉండేది తల్లికి తెలియకుండా.
చదువులో ఎప్పుడూ టాపర్ కావడం తో ఇంజనీరింగ్ అవుతూనే అమెరికా లో మంచి పేరున్న యూనివర్సిటీ లో అవలీలగా ఎమ్. ఎస్ లో సీట్ సంపాదించింది. దానికీ తల్లిదండ్రుల నించి నిరసన రాగాలు వినిపించాయి. హాయిగా ఏ సివిల్సో , బాంక్ టెస్టులో, రాసుకోకోకుండా అమెరికాలు, ఆస్ట్రేలియాలు ఎందుకే? అన్నయ్య చక్కగా ఇక్కడే సాఫ్ట్ వేర్ జాబ్ చేయట్లా? నీకు అంత సరదా ఏంటి? మనలో ఆడపిల్లలు ఇలా విదేశాల్లో వెళ్ళి చదువుకున్నది లేదు. అయినా నువ్వు పట్టుబడుతున్నావని పంపుతున్నాం. మాకయితే బెంగగానే ఉంది. మాట ప్రకారం రెండేళ్ళల్లో చదువు పూర్తిచేసి మేం ఖాయం చేసిన సంబంధం చేసుకుంటానంటేనే వెళ్ళు. మళ్ళా కొత్త పేచీ పెడితే ఊర్కోనేది లేదు. అని కండిషన్స్ పెట్టి పంపించారు. అక్కడ కూడా తన డాన్స్ ని వదల్లేదు హరిణి. ఒక పక్క చదువులో రాణిస్తూనే యూట్యూబ్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ చూసి కొత్త కొత్త స్టెప్స్ కంపోజ్ చేసుకుని తన స్నేహితులతో కలిసి యూనివర్సిటీ లో ప్రదర్శనలిస్తూ అందరి మన్ననలు అందుకుంది. డాన్స్ అంటే అంత క్రేజ్ తనకి. ఇంస్టా గ్రామ్ లో వీడియోలు చూసి వినతి ఆశ్చర్యపోయింది ఈ పిల్ల ఎప్పుడు ఇంతలా నేర్చేసుకుందా అని?
చదువు పూర్తయి ఉద్యోగం లో ఇలా జేరిందో లేదో పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలెట్టారు తల్లిదండ్రులు. విశాల్ సంబంధం బాగా నచ్చడంతో హరిణికి ముందే చెప్పేసింది వినతి ఫేస్ బుక్ లో డాన్స్ ఫోటోలు తీసేయమని. విశాల్ తల్లి దండ్రులు మధ్యతరగతి వాళ్ళు, సంస్కారవంతులు. అమెరికా లో జాబ్ చేస్తున్న విశాల్ అక్కడ చదువుకుని, ఉద్యోగం చేస్తున్న అమ్మాయే కావాలనుకోవడంతో హరిణిని చూడగానే ఒప్పేసుకున్నాడు. హరిణి కూడా విశాల్ తో మాట్లాడి కాస్త గడువు అడిగి అన్నీ విధాలా ఆలోచించుకొని తనకి కూడా నచ్చినట్టు చెప్పేసింది. విశాల్ తో పెళ్లి మాటలు అవుతుంటే మళ్ళీ గుర్తు చేసింది తల్లి డాన్స్ వీడియోలు అవి ఏమి లేవు కదా అని. హరిణికి నచ్చకపోయినా తల్లికి ఎదురు చెప్పడం ఇష్టం లేక ఫోటోలు అవీ తీసేసింది. కానీ డాన్స్ మీద మమకారం మాత్రం చంపుకోలేకపోయింది. భర్త ఏమంటాడో తెలీదు.
విశాల్ మంచివాడు.. జిమ్ అంటే చాలా ఇష్టం తనకి. రెండేసి గంటలు అక్కడే గడిపేస్తాడు. ఫిట్ నెస్ కి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఇంట్లో ఉన్నంతసేపు తన వెంటే తిరుగుతూ, ఏవో అందిస్తూ, సరదాగా జోక్స్ చెప్తూ సందడిగా ఉంటాడు. దేనికీ విసిగించడు. ఇల్లు, వండుకోవడం, తినడం, ఆఫీస్ కి పరుగులు, పని..పని.. వీకెండ్స్ లో ఫ్రెండ్స్ ని కలవడం, షాపింగ్, ఇంట్లో వాళ్ళతో ఫోన్ లో కబుర్లు – ఇలా కాలం గడిచిపోతోంది. అయినా ఏదో వెలితి గా అన్పిస్తోంది హరిణి కి. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్.
ఒకరోజు ఇంటి పని అంతా అయ్యాక విశాల్ తో నెమ్మదిగా “విల్, నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉంది. వీకెండ్స్ లో వెళ్లనా?” అంటూ గోముగా అడిగేసరికి విశాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. “ష్యూర్ బేబీ!ఎవరికి నచ్చినట్టు వాళ్ళుండాలనేది నా పాలసీ. నాకు జిమ్ అంటే ఇష్టం. అది నా లైఫ్ లో ఒక భాగం. అలాగే నీకు డాన్స్ అంటే ఇష్టం అయితే నేర్చుకో. నన్ను మాత్రం చెయ్యమనకేం?” హాస్యమాడాడు విశాల్.
భర్త సహృదయతకి ముగ్ధురాలవుతూ అతన్ని ఆరాధనగా చూసింది హరిణి. చటుక్కున పొద్దున్న తల్లి తనతో ఈ విషయమ్మీద స్కైప్ లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి హరిణి కి.
“ఏంటి హరీ.. బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా?అమెరికా లో ఉంటున్నంత మాత్రాన అక్కడిదానివి అయిపోయాననుకుంటున్నావా?ఇన్నాళ్ల దారి వేరు. పెళ్లి కాని పిల్లవి. నువ్వు డాన్సులు చేస్తున్నట్టు తెలిసినా చూసీ చూడనట్టు వదిలేశాము.పెళ్లయ్యాక ఎంత బాధ్యతగా, పెద్ద తరహాగా ఉండాలి?హవ్వ డాన్స్ నేర్చుకుంటుందట డాన్స్? మీ అత్త, మామ ఏమనుకుంటారే? అందాకా ఎందుకు మీ ఆయన ఒప్పుకుంటాడా ఇలా తైతక్కలాడతానంటే? మీ కుటుంబం పరువేం కావాలి? డాన్సూ లేదు గీన్సూ లేదు. ఇంక ఆ ఊసెత్తకు అది ఎవరికీ మంచిది కాదు.” అంటూ క్లాసు పీకింది. మనసు చివుక్కుమంది హరిణికి.ఎందుకో అమ్మకి డాన్స్ అంటే అంత ద్వేషం? ఎప్పటికప్పుడే ఏదో చెప్పేసి తన మనసు విరిచేస్తోంది. తల్లి వద్దన్న కొద్దీ తనకి ఇంకా ఇష్టం పెరిగిపోతోంది డాన్స్ మీద. రాత్రి చాలాసేపు తన డాన్స్ వీడియోలు చూసుకుంటూ ఈ మధ్య ఎదురైన అనుభవాలు, సంఘటనలు జోడిస్తూ తన మనోగతాన్ని బ్లాగ్ లో భావ గర్భితంగా పోస్ట్ చేసుకుంది.
తెల్లవారి ఎప్పటిలాగే విశాల్ సాయంతో వంట ముగించి బ్రేక్ ఫాస్ట్ చేసి లంచ్ ప్యాక్ చేసుకుని ఎవరి ఆఫీసులకి వాళ్ళు వెళ్ళిపోయారు. సిస్టమ్ ముందు కూచుందంటే పనిలో మునిగిపోతుంది హరిణి బాహ్య ప్రపంచంతో ఇంకేమాత్రం సంబంధం లేనట్టే. వర్క్ హాలిక్ అంటాడు విశాల్. మధ్యాహ్నం లంచవర్లో కాసేపు ఫ్రెండ్స్ తో పిచ్చాపాటీ అయ్యాక తన మెయిల్ ఓపెన్ చేసింది. ఇన్ బాక్స్ లోఎవరి నించో మెయిల్ –అదీ తెలుగులో కనిపించడంతో ఆశ్చర్య పోతూ ఆసక్తిగా చదవసాగింది.
“ప్రియమైన హరిణీ, నీ బ్లాగ్ చదివాక ఈ లెటర్ వ్రాయకుండా ఉండలేకపోతున్నాను. కొన్నేళ్ళ క్రితం ఎలా ఉండాలని కలలు కన్నానో సరిగ్గా అవే భావాలు, ఆలోచనలు. కోకిలతో గొంతు కలిపి పాటలు పాడాలని, ఆకాశం లో మేఘాల్ని చూస్తూ పురి విప్పిన నెమలి లా నృత్యం చేయాలని, సన్నజాజుల సువాసనల్ని ఆఘ్రాణిస్తూ దేవులపల్లి లా కవిత్వం వ్రాయాలని, ఇంద్ర ధనస్సు రంగులని నా కుంచె లో నింపి అందమైన చిత్రాల్ని ఆవిష్కరించాలని, పక్షులతో పందెం వేసుకుని గగనం లో విహరించాలని, సెలయేటి గలగలల్ని నా మాటల్లో మేళవించి అందంగా కథలల్లాలని, పెద్ద చదువులు చదివేస్కొని చక్కగా మంచి ఉద్యోగం చేయాలని —అంతెందుకు నాకు నచ్చినట్టుగా జీవించాలని, నాకంటూ పర్సనల్ స్పేస్ ఉండాలని ఇలా ఎన్నో ఎన్నో..ఎన్నెన్నో కలలు కన్నా. కానీ అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. చదువులో ఫస్ట్ ర్యాంకర్ నే అయినా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా డిగ్రీ పూర్తి కాకుండానే మేనత్త కొడుకు తో పెళ్లి చేసేశారు. పెళ్లయ్యాక చదువుకోనిస్తారేమో అని ఎంతో ఆశ పడ్డా. కానీ పెద్ద కోడల్ని కావడంతో ఇంటి బాధ్యతలు, వచ్చేపోయే చుట్టాలు, ఈలోగా పిల్లలు పుట్టేయడం…..అన్నీ మర్చిపోయా. నాకు వీణ వాయించడం వచ్చన్న సంగతి కూడా మర్చిపోయేంత బిజీ అయిపోయాను. ఏ రకంగానూ ఏ ఆర్ట్ మీదా హార్ట్ పెట్టలేకపోయాను. నా ప్రయారిటీస్ మారిపోయాయి…కాదు కాదు.. మార్చబడ్డాయి. నా సరదాలు ఏవీ తీరకుండానే ఎంతో దూరం ప్రయాణం చేసేశాను. కనీసం పిల్లల ద్వారా అయినా నా ఆశలు తీరతాయనుకుంటే ధన్య నాలుగు రోజులు డాన్స్ క్లాస్ కి వెళ్ళి నాకు నచ్చలేదమ్మా అని మానేసింది. బాబు ని మ్యూజిక్ లో జేర్పిస్తే వాడు అంతే! అటు ఆయన కూడా పిల్లల్ని బాగా చదివించు..ఇలాటివన్నీ దేనికి? టైమ్ వేస్ట్ కాకపోతే అని డిస్కరేజ్ చేశారు. ఫైనార్ట్స్ లో ఏదో ఒకటి నేర్చుకుంటే చదువు మీద ఏకాగ్రత మరింత పెరుగుతుందని వాళ్ళకెందుకు తెలియలేదో నాకెప్పుడూ అర్ధం కాదు.
ఇలా నా కోర్కెలు, ఆశలు అసంపూర్ణంగానే ఉండిపోయాయ్. ఇవాళ నీ బ్లాగ్ చదువుతుంటే ఎంత ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యానో నీకుతెలీదు. సరిగ్గా ముప్పయ్ఏళ్ళ క్రితం నన్ను నేను చూసుకున్నట్టే అన్పించింది. నేను ఎలా ఉండాలనుకున్నానో, ఏంసాధించాలానుకున్నానో అన్నీకళ్ళకి కట్టినట్టు రాసావు. ఒకటి హరీ ఏది సాధించాలన్నా మనిషికి పాషన్ అంటే తీవ్రమైన కోరిక అనేది ఉండాలి. దాంతోపాటు అవకాశం కూడా కలిసి రావాలి. నాకు పాషన్ ఉంది కానీ అవకాశం లేదు. నా పిల్లలికి అవకాశాలున్నా అసలైనది లేదు ..అదే పాషన్.! ఇక్కడ నీకు రెండూ ఉన్నాయి. స్వర్ణకమలం లో భానుప్రియ లా అలవోకగా నర్తించ గలవు. తేడాఏంటంటే ఆ సినిమా లో అమ్మాయికి డాన్స్ పట్ల తపన, గౌరవం ఏ మాత్రం లేవు. నీకు కావలిసినంత ఉన్నాయి. నీ కళా పిపాస అభినందనీయం. నృత్య ప్రదర్శనలిస్తూ అనాధ పిల్లల చదువు కోసం ధన సహాయం చేయడం నీ లక్ష్యమని కిందటి వారం బ్లాగ్ లో ఎంత బాగా రాసుకున్నావు! గుర్తుందా? అది చదివి నేనెంతో పొంగిపోయాను. నువ్వు బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నవన్నీ ఎప్పటికప్పుడు చదువుతూ నిన్ను, నీ మనసుని అర్ధం చేసుకుంటూనే ఉన్నా తల్లీ. నేను చెప్పేది ఒక్కటే. ఎవరో ఏదో అంటారని నీ ఇష్టాలు వదులుకోకు. నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నాట్యం అనేది దేవుడిచ్చిన వరం. అందరి వల్ల అవదు. నువ్వు నిరభ్యంతరంగా చక్కగా డాన్స్ నేర్చుకో. ముఖ్యంగా మా వైపు నించి ఎవరూ ఆక్షేపించరు. ఈ జీవితం చాలా చిన్నది. నీకంటూ స్పేస్ ఉండాలి. అది తెలియకే నా ఇష్టాలకి, కళలకి తిలోదకాలిచ్చేసి తీరిగ్గా ఇప్పుడు బాధపడుతున్నాను.
ఇలాటి మధుర క్షణాలే మనల్ని జీవించేలా చేస్తాయి. జీవితం మీద ఆశ కల్పిస్తాయి. కొన్నేళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడూ రిగ్రెట్ అవకూడదు- అయ్యో నేను అనుకున్నవి చెయ్యలేకపోయానే? ఇలా చేసి ఉండాల్సిందే!అంటూ. నా విషయం లో జరిగిన తప్పులు నీ జీవితం లో పునరావృతం కాకూడదు. పాత కాలపు చాదస్తాలతో నిన్ను ఇబ్బంది పెడతామని ఎప్పుడూ అనుకోవద్దు. నేను పెద్దగా చదువుకోకపోయినా కోడలి మనసుని, ఇష్టాల్ని గౌరవించగలననే నమ్మకం ఉంది. కూతురిగా, కోడలిగా, తల్లిగా నేను కావాలనుకున్నవి పొందలేకపోయినా అత్తగా నా కోడలి ద్వారా పొందగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా, ఒకింత గర్వంగా ఫీల్ అవుతున్నా తెలుసా?నువ్వు ఆకాశం లో అందమైన ఆశల హరివిల్లుని అవలీలగా అందుకుంటూ, నీతో పాటు నాకు కూడా అందించే ప్రయత్నం చేస్తావని , ఇందులో నువ్వు తప్పక విజయం సాధిస్తావని నమ్ముతూ ప్రేమతో, శుభాశీస్సులతో
అత్తయ్య
మెయిల్ చదవడం పూర్తి చేసిన హరిత కళ్ళలోంచి ఆనంద బాష్పాలు. కోడలి ఇష్టాలకి,అభిరుచులకి విలువిచ్చి గౌరవించే అత్తగార్లు కూడా ఉంటారా? పెద్ద చదువులు చదవక పోయినా కోడలి మనసు చదివిన అత్తగారి పెద్ద మనసుకి తన మనసులోనే చేతులు జోడించింది హరిణి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked