ధారావాహికలు

ఆత్మవిశ్వాసం

అమరనాథ్. జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257

ఆత్మన్యూనత వద్దు ఆత్మవిశ్వాసమే ముద్దు
(Inferiority to Self Confidence)

మానవ జీవన అభివృద్ధి సోపానాలకు ఆత్మవిశ్వాసమే పునాది. ఆత్మవిశ్వాసం కొరవడిన జీవితం సంక్లిష్టంగా, బరువుగా నడుస్తుంది. ఇది కేవలం విద్యార్థులకో యువతకో పరిమితమైనది కాదు సమస్త మానవాళికి ఇది ఆవశ్యకమైనది.మనపై మనకున్న నమ్మకమే మనల్ని జీవిత వైకుంఠపాళి లో పరమపద సోఫానాన్ని అధిరోహింప చేస్తోంది. వైకుంఠపాళి లో క్రిందకు లాగే పాములే కాదు పైకి చేర్చే నిచ్చెనలు కూడా వుంటాయని అవగాహన మనలో ఉన్నంత వరకు ఆత్మన్యూనతా (Inferiority) తో కాదు ఆత్మవిశ్వాసం (Self Confidence) తో మన అభివృద్ధికి విఘాతం కలిగించే ఏ విషయాన్నైనా ధైర్యంతో ఎదుర్కోగలం!

జీవన గమనంలో సామాజికంగా,సాంఘికంగా,సాంకేతికంగా జరిగే మార్పులు అనుక్షణం మన ముందు అనేకానేక కొత్త కొత్త సవాళ్ళను తెస్తుంటాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగుతున్న సాంకేతిక పెను తుఫాన్లు మనిషికి మనిషికి మధ్య భౌతికంగా దూరాన్ని పెంచివేస్తోంది. నిజంగానే ఈ పరిణామాలు మానవ సంబంధాలపై తీవ్రమైన ప్రభావాలు చూపటమే కాక విషయాన్ని కొంత పరిణితితో అర్ధం చేసుకునే సరికే జరగవలసిన నష్టం జరిగిపోతోంది. దీనికి ప్రధానంగా కొరవడింది మానసిక భరోసా! దీని పర్యవసానమే ఆత్మన్యూనతా (Inferiority Complexities) భావనలు. మనిషికి దగ్గరగా వున్నా మాటకు దూరమై మనిషికి మనిషే అండ అనేది ఎండమావిగా మారి, మనిషి మానసిక పరిస్థితులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఒక చిన్న కుటుంబంలో భౌతికంగా నలుగురి మధ్య నాలుగు ప్రపంచాలు (పెను దూరాలు) ఇక సామాజిక సంఘ జీవనంలో ఇవే పరిస్థితులు కొనసాగుతూ మనిషిపై మనిషికి భరోసా కొరవడి నేను చేయగలనా? నేను సాధించగలనా ?నేను అనుకున్న ఫలితాలు పొందగలనా? లాంటి ఆత్మన్యూనతా భావనలు పెరుగుతూ ఆత్మావిశ్వాసం స్థానంలో పిరికితనం ప్రవేశిస్తోంది. దీని పర్యవసానమే ఆత్మహత్యల సంఖ్యలు దిన దినం పెరిగిపోవటం మన కళ్ళ ముందరున్న సజీవ సాక్ష్యాలు.
సమాజంలో మనకు మనం ఎదిగే అవకాశాలు ఎప్పుడు సజీవంగానే ఉంటాయి వాటిని ఉపయోగించుకొనే మేధస్సు(Intellegency) (సంయనం,(Patiency) ప్రతిభ (Skill) మనం పెంచుకోవాల్సి ఉంటుంది.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కచ్చితంగా ఎల్లప్పుడూ మనసులో మననం చేసికోవాలి. మనలోని అనుకూలతలు (Positivies) మనలోని ప్రతికూలతలు (Negetivies) మనకే బాగా తెలుసు. అందుకే ప్రధానంగా మనల్ని మనం అర్ధం చేసుకుంటే ప్రతి అవరోధంలో (Failure) ఆత్మన్యూనతకు లోను కాకుండా సమస్యను ఆత్మావిశ్వాసంతో ఎదుర్కొంటూ పడిన ప్రతిసారి పట్టుదలతో పైకి లేచి అడుగు ముందుకు కదపవచ్చు. అందుకే జీవితంలో ఓటమి అనేది పుస్తకంలో చివరి పేజీ కాదు విజయం అనేది మొదటి పేజీ కాదు. మధ్యలో ఇంకా చాలా పేజీలుంటాయి మనల్ని మనం నిరూపించుకోవటానికి.

ఆత్మన్యూనత భావన (Inferiority Complexity) అనేది అజ్ఞానం కాదు ,నగుబాటు అంతకంటే కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో జీవితంలో ఎదుర్కొన్నచిన్న చిన్న అపజయాలే మానసికంగా మనల్ని భయాందోళనలకు గురిచేస్తుంది. ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించే ఒక ఉదాహరణ “ జెస్సికా కాక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్స్ పొందిన విమాన పైలట్ అలాగే అమెరికన్ టైక్వాండో అసోసియేషన్లో తొలిసారిగా బ్లాక్ బెల్ట్ పొందిన మహిళ. అమెరికాలో జన్మించిన ఈమె అరుదైన జన్మ లోపం వలన చేతులు లేకుండా జన్మించింది. ఆత్మన్యూనతతో కాకుండా ఆత్మావిశ్వాసం తో అంగ వైకల్యాన్ని సైతం జయించి ప్రపంచంలోనే ఎందరికో ఆదర్శంగా నిలబడింది.మనలోని సామర్ధ్యాలు మనం గుర్తిస్తూ నిరంతర సాధనతో ప్రయత్నిస్తే ఆత్మన్యూనతే బెదిరి ఆమ్మో అనాల్సిందే!” ఎందుకంటె ఆత్మన్యూనతా భావనలను చాలా సులువుగా ఎదుర్కోవచ్చు దానికి కల్లా కావలసింది మనం పట్టుదలతో కొనసాగించే మన ప్రయత్నాలే మన భవిష్యత్ విజయాలకు గీటురాయిగా నిలుస్తాయనటంలో ఏమీ సందేహంలేదు! సామాజిక,సాంకేతిక మార్పులు సర్వసాధారణమైన విషయం. కాలానుగుణంగా జరిగే ఈ మార్పులను సహేతుకంగా అర్ధం చేసుకుంటూ విచక్షణతో వాటిలోని ప్రతికూలతలను (Negativies) ప్రక్కన పెట్టి వాటిలోని అనుకూలతలను (Positivies) పట్టుకొని ఫలితాలను సాధించాలి.

ఈ విషయంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం దేనికి పనికిరావు అని అనిపించుకున్నవారు ప్రపంచంలో చరిత్ర సృష్టించిన సందర్భాలు అనేకానేకం! ఏవీ లేవనుకున్నవారు విద్యాపరంగా, సంపదల పరంగా, అధికారాల పరంగా పేరుప్రఖ్యాతులు సాధించిన సందర్భాలు చరిత్రలో కోకోల్లలు. అంగవైకల్యంతో వున్న మహిళా ఒక అద్భుత నాట్యకళాకారిణి కావచ్చు, అంధుడైన ఓ వ్యక్తి ఒక అద్భుత గాయకుడు కావచ్చు, ఒక ఆటో రిక్షా డ్రైవర్ కూతురు C.A లో ఆల్ ఇండియా ఫస్ట్ రావచ్చు,ఒక సాధారణ రైతు కూలి కుటుంబంలోని కరీంనగర్ మహిళ ఒక అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో CEO కావచ్చు,ఒక బస్సు కండక్టర్ కొడుకు IPS కావచ్చు, ప్రజలకు చేరువుగా ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజా శ్రేయస్సే పరమావధి గా అత్యున్నత స్థానాల్ని అధిరోహించిన మహిళా IAS లు కావచ్చు, కేవలం 9 నెలల కాలం లో రాజకీయ పార్టీ స్థాపన ముఖ్యమంత్రి అయినా N.T.R.కావచ్చు, అకుంఠిత దీక్ష,పట్టువదల, శ్రమ, వీడని ప్రయత్నంతో కొత్త రాష్ట్రం సాధించి ముఖ్య మంత్రి అయినా K.C.R లాంటి వారు కావచ్చు అందుకే ఈ విజయాల వెనుక వున్నది ఒకే ఒక మహిమాన్విత శక్తి కృషి, శ్రమ,పట్టుదల,వీడని ప్రయత్నాలు.అందుకే శాశ్వత విజయాలకు, శాశ్వత అపజయాలకు మానవ నిఘంటువులో స్థానమే లేదు! మన కళ్ళ ముందరున్న ఈ ఉదాహరణలే మన ఆత్మవిశ్వాసానికి పునాదులుగా మారాలి.
విషయం చదవటానికి, వినటానికి బాగానే ఉంటుంది మరి దీని కోసం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇతరత్రా ఎవరి సహకారాలతో ఎమేమి జరగాలి అనేది కూడా అత్యవసరమైనవే ! అందుకే వాటిని కూడా ఒకసారి పరిశీలిద్దాం!

ఆత్మనూన్యతను (Inferiority)ఎలా ఎదుర్కొందాం?

మొట్టమొదటగా ఇతరులతో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసికోవద్దు! ఎందుకంటె మీకున్న మేధస్సుతోనే మీరు అనుకున్న గమ్యాన్ని అవలీలగా చేరగలరు’
విజయానికి కారణాలెన్నో అపజయానికి కారణాలన్ని ఉంటాయి. ఆత్మపరిశీలన ద్వారా తప్పొప్పులను సమీక్షించుకుంటే విజయం మన వెనకే నిలబడుతుంది
ఎట్టి పరిస్థితులలో కూడా ఊహల్లో అంచనాలు వేయద్దు. ఆచరణలోనే చేసే పనిని పరిశీలించుకుంటూ అడుగు ముందుకు కదపాలి
చేయగలనా? లేదా? అనే ఊగిసలాటతో పనిని ప్రారంభం చేయవద్దు ఇటువంటి అనుమానాలతో చేసే పనిలో సహజంగానే తప్పులు దొర్లే అవకాశముంటుంది. ఇక్కడ చేసే పని పట్ల మన అవగాహనే మనల్ని ముందుకు నడిపిస్తుందనేది బలంగా నమ్మండి!
ఏదైనా పనిలో సమస్యలు ఎదురైనప్పుడు కంగారుతో కుంగకుండా పనికి సంబంధించి అవగాహన ఉన్న అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా అవసరమైన విషయం.

మన అని అనుకునే వారితో మనం చేస్తున్న పనికి సంబంధించిన భావాలు పంచటం ద్వారా ఒక్కోసారి క్లిష్టమైన సమస్యలకు కూడా పరిష్కారాలు దొరుకుతాయి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని(సెల్ ఫోన్స్ ,ఇంటెర్నేట్స్) అవసరమైన మేరకే వాడండి. మితిమీరిన వాడకం మానసిక దౌర్బల్యానికి దారి తీస్తుంది.
మనతో ఉన్నవారి విజయాలను చూసి మనం అలా సాంధించగలమా! అనే కంగారు ,భయాలకు లోను కావద్దు ఆ విజయాల వెనక వున్న కృషిని ఆదర్శంగా తీసుకొని మన ప్రయత్నాలను ఆచరణలో పెట్టాలి.
ఎప్పుడైనా అపజయం ఎదురైనప్పుడు ఆమ్మో ఇంకేముంది అంతా అయిపోయిందనే కుంగుబాటు అవసరం లేదుమనం తిరిగి సాధించే విజయానికి మరో తలుపు తెరిచే ఉంటుందని తెలిసికోండి.

గతంలో ఏమైనా అపజయాలను ఎదుర్కొని ఉంటే అనుక్షణం వాటినే తలుచుకుంటూ సమయాన్ని,శక్తిని వృధా చేయకండి. మనలో వున్నా సానుకూల (Positivities) అంశాల ద్వారా అనుకున్న గమ్యాన్ని ఏ విధంగా చేరగలమో ఆలోచించండి.
సమాజంలో పేరు గాంచిన వ్యక్తులు,సంఘటనలు అధ్యయనం చేయటం ద్వారా మనలో కలిగే స్ఫూర్తి మనలో ఆత్మవిశ్వాసపు ఛాయల ను మెరుగుపరుస్తాయి.
మనలో ఆత్మస్థయిర్యం పెంచే అంశాలు ఇలా జరగాలి!
కుటుంబసభ్యుల పాత్ర:- కుటుంబ వాతావరణంలో కచ్చితమైన మార్పులు రావాలి. ప్రతిరోజూ కొంత సమయం పిల్లలతో గడిపే పరిస్థితులు మెరుగవాలి. వారి మనోభావాలు అర్ధం చేసుకుంటూ వారితో గడిపే సమయంలో వారికి బతుకు భరోసా కలిగించే విషయాలను చెప్పటం చాలా అవసరం. భవిష్యత్ లో ఎదుర్కొనే ఏ విషయం పట్లనైనా వారికిది ఆలంబనగా ఉంటుంది.

విద్యాసంస్థల పాత్ర:-

విద్యార్థులను మార్కుల మరబొమ్మలుగా, మనీ విలువలకు ప్రతిరూపాలుగా కాకుండా పాఠ్యాంశాలుతో పాటుగా మానసిక పరిణితిని పెంచే జీవితాలనే పాఠాలుగా బోధించాలి. దీనివలన మంచి చెడుల పట్ల విచక్షణ కచ్చితంగా విద్యార్థులలో పెరుగుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు నేటి విద్యావ్యవస్థలో దీనికై కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది .

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాగ్రత్తలు:-

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ( Social net works- వాట్స్ ఆప్ ,పేస్ బుక్, యూ ట్యూబ్,చాట్టింగ్స్ మెసేజస్ వగైరా) వినియోగించే ప్రతి ఒక్కరూ సంచలనాలను సృష్టించాలనుకోకుండా సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో సంయనంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక భయాందోళనలకు మరియు అనుమానాలకు దారితీసే ఏ విషయాల నైనా ఇతరులతో షేర్ చేయవద్దు. దీనివలన ఒక్కొక్కసారి వినోదమనేది విషాదంతో ముగుస్తుంది.
ప్రభుత్వ బాధ్యతలు:- ప్రభుత్వరంగంలో మరియు ప్రవేటురంగాలలో ఒత్తిడికి గురిచేస్తూ మార్కులే పరమావధిగా సాగే విద్యావిధానాలపై ఖచ్చితమైన పర్యవేక్షన అత్యంత అవసరం.అదేవిధంగా మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారుతున్న సామాజిక,సాంఘిక అంశాలపైన కనీసం వారానికి ఒక రోజైనా కొన్ని గంటల సమయం వీటికోసం కేటాయించే చట్టాన్ని అమలుచేయాలి. అవసరమైతే ఉపాధ్యాయులకే వీటిపైనా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. నిజంగా ఇది మంచి పరిణామాలకు దారితీస్తుంది!
సామాజిక మాధ్యమాల బాధ్యత:- అనవసర పోటీ తత్వాలు,అసూయ ద్వేషాలు మరియు మానసిక స్థితిగతులను ఆవేశాలకు,భయాలకు,ఆందోళనలకు గురి చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా పత్రికారంగాలు మరియు టి.వి మాధ్యమాలు శ్రద్ద తీసుకోవాలి.
సైకాలజిస్టుల బాధ్యత:-

వేగంగా మారుతున్న సామాజిక ,సాంఘీక అంశాలను హేతుబద్దంగా అర్ధంచేసుకుని ఆత్మనూన్యతా భావాల నుండి ఆత్మవిశ్వాసాల వైపు అడుగులు వేయించాల్సిన బాధ్యత సైకాలజిస్టులపైనా ఎంతైనా వుంది. విద్యావ్యవస్థల యాజమాన్యాల సహకారంతో ఈ విషయాలపై అవగాహనా సదస్సులు నిర్వహించటం ఎంతైనా అవసరం.
ఇక మనకు స్ఫూర్తిగా ఒక మంచి మాట “మనిషి సామాన్యుడైనా తన అసమాన ప్రతిభ, కృషి,పట్టుదలతో ఎదగగలడనేది అక్షర సత్యం. అందుకే ఆత్మనూన్యతలనే చీకట్ల నుంచి ఆత్మవిశ్వాసమనే వెలుగు రేఖలలోకి అడుగుపెట్టి మానవుడే మహనీయుడనేది నిరూపణ చేయగలగటమే మన ముందున్న తక్షణ కర్తవ్యమ్”!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked