ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

-సునీత పావులూరి

తిలక్ కవిత్వంలో భావ, అభ్యుదయ కవిత్వాలతో పాటుగా, రాబోయే అనుభూతివాద కవితా పరిణామం కన్పిస్తుందనీ, దానికి తిలక్ కవిత్వమే ఆరంభ సూచకమనీ టి.ఎల్. కాంతారావుగారు పేర్కొన్నారు.
1981లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు ఆలోచన అనే గ్రంథంలో ప్రత్యేకంగా ‘అనుభూతివాదం’ అనే వ్యాసాన్ని రాశారు. ఈ వాదం ‘ఏ ఇజానికీ కట్టుబడి ఉందనీ’. ‘ఆత్మాశ్రయ కవిత్వానికి ప్రాణప్రదమైనదనీ’, అంతేకాక ‘అనుభూతికి అగ్రప్రాదాన్యం ఇస్తుంద’నీ వీరు చెప్పి సాహిత్యంలో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.
కడియాల రామమోహనరాయ్ గారు 1982లో “తెలుగు కవితా వికాసం” అనే గ్రంథంలో ‘అనుభూతివాదం’, ‘అనుభూతి కవిత్వం’ అని పేర్లు పెట్టి ప్రత్యేకంగా రాయటం జరగలేదు. కానీ నూతన కవితారీతులను పరిచయం చేసేటప్పుడు మాత్రం ‘అనుభూతివాదం’, ‘అనుభూతి కవిత్వం’, అనుభూతి కవుల’ గురించి వీరు పేర్కోవటం జరిగింది. వీరు అనుభూతివాదాన్ని ‘భావ కవితా సంబంధి’గానే చూసినా, ఈ కవిత్వానికి మున్ముందు మంచి భవిష్యత్తు ఉందని ఆశించారు.
రాచమల్లుగారి బాటలోనే సాగినట్లు కన్పించే మరో సాహితీ వ్యాసకర్త నందిని సిధారెడ్డిగారు. రాచమల్లుగారి తర్వాత, ఆ అర్థంలోనే 1982లో నందిని సిధారెడ్డిగారు ‘అనుభూతివాదం’ అనే పదాన్ని వాడినట్లుగా కన్పిస్తోంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు అనే గ్రంథంలోని ఒక వ్యాసం నందిని సిధారెడ్డిగారి ‘అనుభూతివాదం’. వీరు ‘కళ కళ కోసమే అనే నినాదం తోటీ, సమాజానికి సంబంధించని ధోరణిగానూ అనుభూతి వాదాన్ని వీరు వెలకట్టినట్లుగా తెలుస్తున్న విషయం.

‘మధ్యతరగతి మనస్తత్వం, వ్యక్తివాదం, శుద్ధకళావాదం, ఆనందలక్ష్యం, ఉనికి లేదా మేథావి వాసనలు, ఆత్యాధునికుల మనిపించుకోవటం, పరిస్థితుల సానుకూలం, పత్రికల ప్రోత్సాహం, శిల్పదృష్టి’ – ఇవన్నీ అనుభూతివాద దోహదకారకులుగా సిధారెడ్డిగారు నిరూపించే ప్రయత్నం చేశారు. అంతేకాక, అనుభూతి కవులు ‘కేవలం ఆత్మానందం కోసమే’ కవిత్వమని తలుస్తున్నారనీ, ‘పలాయనవాదం, వ్యక్తివాదం వీరికి ప్రాణాధారం’

అనీ, ‘అనుభూతిని తప్ప కవి వస్తువుని చూడలేద’నీ – సిధారెడ్డిగారు తమ వ్యాసంలో ఆరోపించారు.
నందిని సిధారెడ్డిగారు రాసిన అనుభూతివాదం వ్యాసాన్ని పరిచయం చేసినవారు డా.కె.కె. రంగనాథాచార్యులుగారు. వీరు ‘భావకవిత్వం తర్వాత వచ్చిన వ్యక్తివాద ధోరణి’గా అనుభూతివాదాన్ని భావించటం జరిగింది. అంతేకాక, ఈ అనుభూతివాదం ‘భావకవిత్వానికి అంతగా భేదం లేకుండా వచ్చింద’నీ, అనుభూతి కవుల రచనలకు ‘సమాన ప్రాతిపదిక’ కానీ, ‘దృక్పథం’ కానీ లేవని ఈయన భావించారు. అంటే, వీరి మాటల ప్రకారం, రచన ఏదైనా సిద్ధాంతానికి లోబడి రావాలేమో అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అనుభూతివాద ధోరణి కవిత్వంలో కన్పిస్తోందని వీరు భావించారు. అంటే ఈ రకమైన కవిత్వం తెలుగు సాహిత్యంలో వస్తోందని వీరికి తెలుసు. కానీ, వీరు తమ సిద్ధాంతాలకనుగుణంగా రానందున మాత్రమే ఈ వాదం పట్ల వ్యక్తిరిక్తతను కలిగి ఉన్నట్లుగా అర్థమవుతుంది.
పైన పేర్కొన్నటువంటి కందుకుర్తి ఆంజనేయులుగారు, రాచమల్లు రామచంద్రారెడ్డిగారు, నందిని సిధారెడ్డిగారు, డా.కె.కె. రంగనాథాచార్యులుగారు ముఖ్యంగా వారంతట వారే ‘మేము మార్క్సిస్టులము’ అని చెప్పుకునే ఒక సిద్ధాంత పరిధిలోని వారు. మార్క్సిస్టుల సిద్ధాంతాలని అనుసరించకుండా, రాజకీయాల నుంచీ స్వేచ్ఛ కావాలనుకునే కవితా దృక్పథానికి వీరు సహజంగానే వ్యతిరేకులు కాబట్టి, వీరికి ఈ వాదం ‘పలాయన వాదం’గానో, ‘వ్యక్తివాదం’గానో లేక మరో రూపంగానో కన్పించి ఉండటం మరింత సహజం.
1983లో ముదిగొండ వీరభద్రయ్యగారు, కడియాల వారి వలె పేరులోనే తేడాని చూశారు. అనుభూతి కవిత్వాన్ని ‘భావకవిత్వం మీది పరిణామం’గా వీరు భావించటం జరిగింది. వీరు కవిత్వాన్నంతటినీ అనుభూతి కవిత్వంగా భావించి, విభజన చేశారు. ఇతరులు అనుభూతి కవిత్వం అని పిలుస్తున్న దాన్ని వీరు కేవలం ‘అనుభూతి కవిత్వం’ అని విభజించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked