ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

అనుభూతి కవిత్వం ఒక వాదంగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో టి.యల్. కాంతారావుగారు ఎంతో ఆనందంగా ఈ వాదాన్ని గురించి చర్చించారు. వారి వారి భావాల్లో “భావ అభ్యుదయ కవితా ప్రక్రియల అనంతరం తిలక్ భావనా స్రవంతిలో వచ్చిన ఒకానొక విశిష్టపరిణామం అనుభూతి వాదం” అని చెప్పారు. ఇదే విషయాన్ని కొనసాగిస్తూ, “అనుభూతివాదం యొక్క పారమార్థిక లక్షణమేమిటంటే – కవి తన గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న అనేకానేక స్వచ్ఛమైన భావతరంగాలకి ఏ ఆర్భాటం లేకుండా స్పష్టమైన ఆకృతినివ్వటం.” ఈ వ్యాఖ్య సమగ్రమైన వ్యాఖ్యగా గమనింపగలం. స్వచ్ఛమైన భావతరంగాలు అనటంలో కవి హృదయంలోంచి కెరటాల వలే ఉవ్వెత్తుగా లేచే భావపరంపరకు ఏ నిబద్ధతా, ఏ నియమాలూ లేవు

అని చెప్పటం గమనింపవచ్చు. ఆ భావాలు ఏ ఆర్భాటం లేకుండా ఉంటాయి అంటే భావకవిత్వంలో ఉండే స్వాప్నిక డోలికావిహారం ఇందులో లేదు అనుకోవచ్చు. స్పష్టమైన ఆకృతి ఇవ్వటం అనటంలో సమకాలీనంగా సాగిస్తున్న అభ్యుదయ కవులమని చెప్పుకునేవారు రాస్తున్న పోకడలను కాదనటం.
జీబ్రాకి, Algebra చిహ్నాల
లాంకోటూ, పాంకోళ్ళూ తొడిగి
సాహిత్య పౌరోహిత్యం యిస్తే
వెర్రికాదు, Sur-realism రాసోదరా”

కవి చెప్పదలుచున్నదేమిటో అర్థంకాని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే అనుభూతికవిత్వం మళ్ళా నలుగురికీ అర్థమయ్యే అనుభూతిని పొందే కవిత్వం సారస్వతరంగం మీద విరిసిల్లిందని టి.యల్. కాంతారావుగారు భావించారు.
అనుభూతి కవిత్వమన్న మాట వింటానికే మండిపడ్డారు నిబద్దకవులు. రాజకీయ పార్టీకి కట్టుబడి, ఆ పార్టీ భావాలకు అనుగుణంగా రాయకపోతే అది కవిత్వం కాదని ఆ సంఘాలవారు ధ్వజమెత్తారు. ఇది భావకవిత్వానికి మరో రూపేకానీ మరేమీ కాదని వారు ఈసడించుకున్నారు. “రసానందవాదంలో రూపుదిద్దుకున్న, భావ కవిత్వంతో ప్రాణం పోసుకొని కళకళ కోసమే అని బయల్దేరింది” ఈ కవిత్వం అని సిధారెడ్డిగారు అంటారు. దీన్ని ఆకవిత్వమని అనేవారు అంటుండగా, సిధారెడ్డిగారు మాత్రం అనుభూతి కవిత్వం రసవాదంలో రూపుదిద్దుకొందని చెప్పారు. భావ కవిత్వానంతర ధోరణుల్లో ప్రధానమైన వర్గాలు రెండే రెండు. ఒకటి రసానుకూల కవిత్వధోరణి. రెండోది రసవిరోధ కవిత్వధోరణి. ఈ రసవిరోధులు రసవాద కవిత్వానికి పెట్టిన పేరే అకవిత్వం. సిధారెడ్డిగారు ఈ అనుభూతి కవిత్వాన్ని గురించి చెప్తూ, ‘అసామాజికత ధోరణి’యే అనుభూతివాదం అని అంటారు. వారి ఉద్దేశ్యంలో అనుభూతి కవిత సామాజికావసరాలను తీర్చేదిగా భావించలేదు. ఇక్కడ పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే వీరి ధోరణిలో సమాజం అంటే వర్గపోరాటానికి సమాయత్తమైన సమాజం అని చెప్పుకోవాలి. దూరంగా ఆలోచిస్తే అనుభూతి కవిత్వం ఒక వర్గ పోరాటంలో పాల్గొనే వారికే కాక సమాజానికంతటికీ అంటే సమాజానుభూతుల స్పందనే కవిలో అనుభూతిగా ఆవిష్కరింపబడుతుందని గ్రహించాలి.

అనుభూతి కవిత్వం విషయమై ఆర్. ఎస్. సుదర్శనంగారు అనుభూతి కవితగా గుర్తుపట్టటానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తర్వాత మిగిలేది ఒక్క అనుభూతే కావాలి. అంటే ఆ కవిత ఒక సందేశాన్ని ఇవ్వాలని కానీ, ఏదో ఒక దృక్పథాన్ని కలిగి ఉండాలనికానీ, ఒక భావనకు తావివ్వాలని కానీ ప్రయత్నించేదిగా ఉండకూడదు. అనిర్థిష్టమైన అనుభూతి మాత్రమే ఉండాలి అని స్పష్టం చేశారు. సరిగ్గా ఇది మర్స్కిస్ట్ దృక్పథానికి అతకని రీతిగా తోస్తున్నది. అనుభూతి కవిత్వం అందించే అనుభూతి పోలికల ద్వారా కానీ ఊహల అల్లికల ద్వారా కానీ ఇంద్రియ సంవేదనలు రేకెత్తించే వర్ణనల ద్వారా కానీ కావచ్చు. దానివల్ల నవ్యత హృదయానికి హత్తుకొనే అనిర్వచనీయమైన, అనిర్థిష్టమైన అనుభూతిగా మిగలాలి. అనుభూతి కవితావాదానికి ఉన్న లక్షణాలను గమనిస్తే ఇట్టిది అను
భూతి కవితా వాదమని సుదర్శనంగారు వివరించారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు, ఆర్.ఎస్, సుదర్శనంగారు అనుభూతి వాదకవితా లక్షణాలను వివరించిన తీరు చూస్తే, ఆ వాదంలోని లక్షణాలను గ్రహించి చెప్పటమే కాక, ఆ కవిత్వాన్ని ఎంతగా గ్రహించి, వివేచించగలిగారో కూడా పరిశీలించవచ్చు.

ఈ విషయాన్నే చెప్తూ, ముదిగొండ వీరభద్రయ్యగారు “ఒక నిబద్ధతకు ప్రాధాన్యం లేకుండా సర్వరాగాలనూ మోగించే వీణ అనుభూతి కవిత” అని అన్నారు. అల్పాక్షరాల్లో అనల్పార్థ రచననలాగా, సూక్ష్మంలో మోక్షంలాగా వీరి అనుభూతి కవితావాద నిర్వచనం మనోజ్ఞంగా ఉంది. ఒక నిబద్ధతకు అని చెప్పి ఏ పార్టీ సిద్ధాంతానికీ కట్టుబడనట్టి అన్న అర్థానికి పట్టాభిషేకం చేసినా, అనుభూతినిచ్చే కవిత చెప్పటానికి ఏ నియమాలూ అవసరం లేవని పరోక్షంగా చెప్పారు. ఒకే వీణ ఎలా వివిధ రాగాలను ఆలపించటానికి తోడ్పడుతుందో అలాగే అనుభూతి కవిత పాఠకుడికి అనుభూతిని అందించటమే పరమప్రయోజనంగా పెట్టుకుంటుందని వీరు చెప్పారని గ్రహించవచ్చు. ఇది అత్యంత ఆధునిక స్పృహతో చేస్తున్న ప్రయత్నమని వారు చెప్పారు. భావకవితా యుగం ఎలా అన్వర్థమో, అనుభూతి కవిత అనేది కూడా అలానే అన్వర్థమూ, అధునాతనమూ అని వీరి భావన. ఈ విషయం మరింత ప్రశస్తంగా, ప్రస్ఫుటంగా తెలియటం కోసమే ఖండకావ్య ప్రక్రియ నాశ్రయించిన అనుభవమార్గాన్ని నేడు అనుభూతి కవిత్వం అని పిలుస్తున్నాం అంటారు. అంతే కాకుండా కవిత్వంలో సమగ్ర సామాజికానుభవాన్ని పండించాలన్న అత్యంత ఆధునిక సాహిత్య స్పృహతో చేస్తున్న ప్రయత్నమే అనుభూతి వాదమని వీరు వివరిస్తారు. సాహిత్య స్పృహలేని కవిత్వం అనుభూతి కవిత్వం కన్నా వేరైనదని వారి నిర్ణయం. ‘అర్థాన్ని అధ్వాన్నపుటడవి’ లో వదిలిపెట్టే రచనలకన్నా అనుభూతి కవిత భిన్నమైనదని వీరి భావన. అంతేకాదు అనుభూతి కవిత సామాజికానుభావాన్ని పండించుకొంది, సామాజికావసర కారణంగానే పుట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked