ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

-సునీత పావులూరి

నాటకాన్ని చూస్తున్నా, కవిత్వాన్ని పఠిస్తున్నా సహృదయుడు ఆనందాన్ని పొందుతాడు. ఈ అనుభవం కవికీ, పాఠకుడికీ ఇద్దరికీ ఉంటుంది. “నాయకస్య కవేః శ్రోతుః సమానో నుభావస్తతః” అంటే కవి అనుభూతిని పొంది రాస్తే, దాన్ని పాఠకుడు అనుభవిస్తున్నాడు. అలాగే రంగస్థలం మీద నాయకాదులు అనుభవించి ప్రదర్శిస్తున్న అనుభూతిని ప్రేక్షకుడు అనుభవిస్తున్నాడు. అంటే ఈ అనుభూతికి కారణం కవి పొందిన అనుభూతే. దాన్నే సహృదయుడూ పొందుతున్నాడన్న మాట. అంటే ఈ రెండు అనుభూతులు సమానాలైపోతున్నాయి.
ఏ యుగంలోనో రాముడు పొందిన బాధను కవి వర్ణిస్తే, రామాది పాత్రధారులు నటిస్తుంటే, సహృదయుడు అదే అనుభూతిని పొందుతున్నాడన్నమాట. దీన్ని అలంకారశాస్త్రంలో సాధరణీకరణమంటారు. “భారతదేశ రణసిద్ధాంతం”లో సాధారణీకరణం ప్రసిద్ధం. ఈ మార్గం కథనాశ్రయించిన కావ్యాలకే ఎక్కువగా వర్తిస్తుంది. సామాజికానుభవ చైతన్యాన్ని గమనించిన కవి, సామాజికుల సహానుభూతి పొంద కలిగిన పాత్రలను సన్నివేశాలను భావాలను సంపుటీకరించి సాహితీ ప్రక్రియలను వెలువరుస్తాడు. కావ్యం, ఇతిహాసం ఈ ప్రక్రియలలో ఉదాత్తమైనవి. పఠిత కావ్యపాత్రల ద్వారా వ్యక్తమయ్యే అనుభవాలను సాధారణీకరణం ద్వారా స్వీయానుభవాలుగా మార్చుకొని రమిస్తాడు. ఆ రమణంలోని హృదయ ద్రవస్థితియే రసానుభవం. రసానుభవం సమాజంలోనే ఉంది. దాన్ని కోరేది సమాజమే. అందించే కవి ఆ అనుభూతికి కారకుడు. కారకుడైన కవి కూడా సమాజంలో భాగమే. కానీ సమాజానుభవాసక్తిని గుర్తించి స్వీయ ప్రతిభాశక్తితో తనదైన దర్శనంతో ఒక ప్రక్రియను సృష్టింపగల్గిన వ్యక్తి కూడా. వ్యక్తి చైతన్యాన్ని, విశ్వచైతన్యంతో సంప్రదింప చేసే సాహిత్య సాధన సాధారణీకరణం. ఆధునిక సాహిత్యంలో నవ్య సంప్రదాయ ధోరణిని పోషించిన కవులందరూ ఈ మార్గాన్ని ప్రవర్తింప చేయడానికి ప్రయత్నం చేసిన వారే. ఒక్క విషయః ఇది పాతబడ్డ పద్ధతని భావించడం పొరపాటు. ఇది విశ్వజనీనం కాబట్టి ప్రతి యుగంలోనూ బ్రతికే ఉంటుంది. తద్విరుద్ధమైన ప్రయోగాలకు ప్రాబల్యం వచ్చినప్పుడు స్వీయశక్తి ప్రదర్శన కోసం అభినవ శక్తితో విజృంభిస్తుంది. అంతే తప్ప దానికి చావులేదు, విచ్చిత్తి లేదు. పైన పేర్కొన్న మూడు విధాలైన ప్రక్రియలలో అత్యంత సరళమైనది, శక్తిమంతమైనది ఈ సాధారణీకరణ పధ్ధతి”
ఈ సాధారణీకరణం విషయంలో అలంకారశాస్త్రాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో “వ్యాపారోస్థి విభావాదేర్నామ్నా సాధారణీకృతిః” అంటే విభావాదుల విభావనమన్న వ్యాపారాన్ని సాధారణీకరణం అంటారు. మమ్ముటుడు తన ‘కావ్యప్రకాశిక’లో “భావకత్వం సాధారణీకరణమ్, తే నహి వ్యాపారేణ విభావాదయః స్థాయీ చ సాధారణీ క్రియంతే సాధారణీకరణం చేతదైవ యత్సీతాది విశేషాణాం కామినీత్వాది సామాన్యోపస్థితిః స్థాయ్యనుభవాదీనాం చ సంబంది విషేషానవచ్చిన్నత్వేన” భావకత్వం అంటే సాధారణీకరణం. ఈ వ్యాపారం ద్వారా విభావాదుల స్థాయిభావం యొక్క సాధారణీకరణం జరుగుతుంది. సాధారణీకరణమంటే అభిప్రాయం సీతాది విశేష పాత్రలు సాధారణ స్త్రీ రూపంలో సాక్షాత్కరించటం. స్థాయిభావ అనుభవాల సాధారణీకరణమంటే విశిష్ట సంబంధాల నుంచి విముక్తి. కాబట్టి మనం కావ్యం చదువుతున్నా, నాటకం చూస్తున్నా అందలి రామాది పాత్రల అనుభూతులు సాధారణీకరణం చెందుతాయి. అంటే అలౌకికాలవుతున్నాయన్న మాట. దాని వల్ల ఆ రామాదుల అనుభూతులనే మనం పొందుతాము.
ఈ విధంగా అన్ని కాలాలకూ, అన్ని దేశాలకూ మానవజాతి కంతటికీ వర్తించే ఈ సాధారణీకరణ సిద్ధాంతాన్ని మన ప్రాచీనులు వివరించి చెప్పియున్నారు. మన ప్రాచీన కావ్యాలన్నీ ఈ అనుభూతిని పాఠకుల కందించటానికే సమగ్ర ప్రయత్నం కావించాయి. నడుమ కాలంలో కవుల రచనల్లో కవుల రచనల్లో ఈ అనుభూతి చిక్కిపోవటాన్ని గమనించే నవ్యసారస్వత యుగంలో అనుభూతి నుద్ధరించి రచనలు సాగించే ప్రయత్నం వర్ధిల్లింది. ఈ అనుభూతి సమగ్ర స్వరూపమే రామాయణ కల్పవృక్షంలో ఆవిష్కరింపబడింది. తర్వాతి కాలంలో ఈ అనుభూతి ఖండకావ్యాలలో నిలిచింది. ఈ విషయాన్ని ముందు మనం విశదంగా చర్చించబోతున్నాం.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked