ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

-సునీత పావులూరి

కవిత ఎంత హృదయాన్ని కదిలించింది అన్నది కాదు ప్రధానం; సామాజికునికి మానసిక చైతన్యం కార్యరూపంగా ఎంత ప్రవహించింది అన్నదే ప్రమాణం. ఆచరణ వెనుక అనుభూతి లేదని చెప్పడం అసంబద్ధం. మానసికంగా ఉత్తేజం పొందనివాడు శారీరికంగా కార్యశీలి కాలేడు. కవి ఉత్తేజితుడై కలమాడితే చాలు. కాని మార్క్సిస్టు కవిత కలంతో సంతృప్తి పడేదికాదు. హలంగానో, గన్ గానో మారాలి. వాటిని పట్టినవాడే విప్లవ కవిత్వానుభూతిని కార్యరూపంగా సాధిస్తున్నవాడు. ఒకవిధంగా మార్క్సిస్టు సాహిత్యంలో కలానికున్న ఈ గౌణమైన గౌరవాన్ని బట్టి కవి ప్రచారకుడనీ, కవిత్వం నినాదమని, అనుభవం కవిత్వం వ్రాసే కవిది కాదు, దాన్ని కార్యరూపంలో పెట్టే సమాజానిదేనని సాధారణంగా భావింపబడుతోంది. అందువలన ఈ పద్ధతిలో- కవితా సామాగ్రికి కనీస గౌరవం – కార్యాచరణ సూత్రాలకు కనకాభిషేకం.”

“ఈ మాట అనుశీలన కోసం ఏర్పరచుకుంటున్నదే. అభ్యుదయ కవులు, విప్లవకవులు సమాజ వాస్తవికతను కవిత్వంలో ప్రతిఫలింపజేస్తుంటే, వాస్తవకథనాల పట్ల సానుభూతిని, ఉద్యమ కర్తవ్యాల పట్ల ఉత్తేజాన్ని, ఉద్రేకాన్ని సాహిత్యంలో అనుభవించటం ఈ ప్రక్రియలో ముఖ్యం. ఇందులోనూ సృజన వ్యాపారంలో కవి ప్రకటించే ఉద్రేకానికి, ఉత్తేజానికి ఇచ్చిన ప్రాముఖ్యం కంటే సామాజికులు రచన వలన పొందే ఉద్రేకానికి, ఉత్సాహానికి ప్రాముఖ్యం ఉంటుంది. అంటే మార్క్సిస్టు ఉద్యమంలో వివాదమో, నినాదమో కవిత్వంలో కవి చేస్తే దాన్ని చదివి ఉత్తేజితుడైన సామాజికులు ఆ కవిత్వం విని, లేదా చదివి మానసికంగా ఉత్తేజం పొంది సహృదయులుగా మాత్రమే మిగిలిపోతే అది సామాజికీకరణం కాదు. వారు కార్మోన్ముఖులై విప్లవరంగంలో దూకితే లేదా మార్క్సిస్టు దృక్పథంతో సమాజ పునర్నిర్మాణానికి భౌతికంగా పూనుకుంటే అది సామాజికీకరణం అవుతుంది. సాధారణీకరణంలో కావ్యాలు పఠిత అంతరంగాన్ని రసీకరించి ఊరుకుంటాయి. అతడు ఆ తరువాత చైతన్యోన్ముఖుడు కావచ్చు. కాని, ఆ వ్యాపారాన్ని సాహిత్య పరధిలోకి తీసుకోరు. కాని, సామాజికీకరణంలో మాత్రం కవిత్వం కారణం, ఉద్యమం కార్యం. అంటే కార్యకారణ రూపాలైన కవిత్వమూ, కార్యాచరణమూ- ఈ రెండూ కలిస్తే తప్ప మార్క్సిస్టు కవిత్వానికి అస్థిత్వం లేదు. అందువలన ఎంత విప్లవం దేశంలో వచ్చింది? అన్నదాని మీదే విప్లవకవిత్వం ఆధారపడి ఉంటుంది. సామాజికీకరణంలో మరొక విశేషం కూడా గుర్తుంచుకోవాలి. ఇది ప్రధానంగా వామపక్ష ధోరణికి సంభంధించింది కాబట్టి వర్గ దృక్పథం ప్రాధాన్యం వహిస్తుంది. మార్క్సిస్టు కవిత నిబద్ద సామజికునికా? సామాన్య హృదయానికా? అన్న ప్రశ్న ఇందులో ఉదయిస్తుంది. సామాజిక సమగ్రానుభవ చైతన్యంలో మార్క్సిస్టు దృక్పథం భాగం కాదని చెప్పడానికి వీల్లేదు. అయితే అది సమగ్రానుభవ స్ఫూర్తిని సంతరించుకోలేదని మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు. అంటే, వాస్తవ వైజ్ఞానికానుభవాల చోదనం మార్క్సిస్టు సాహిత్యచైతన్యంలో విశేషంగా గోచరమౌతున్నప్పుడు అభ్యుదయకవిత్వం కానీ, విప్లవకవిత్వం కానీ ఆయా అనుభవాల అభివ్యక్తికి, ఆస్వాదనకు తోడ్పడవచ్చు. దీన్నే మరో మాటలో చెప్పాలంటే మార్క్సిస్టు చైతన్యాన్ని సమాజంలో జాగృతం చేసేది రాజకీయపార్టీ. ఆ సమాజ సంస్కారానికి ఉత్తేజం కల్గించడానికి కవి తన కవితతో తోడ్పడతాడు. ఇటువంటి కార్యం నిర్వహిస్తున్నప్పుడు పార్టీ చెప్పిన దానిని ప్రజలకు ఉత్తేజం కలిగేటట్లు చెప్పే పద్ధతిని మాత్రమే అనుసరిస్తే ఆ కవితకు నినాదకవిత్వమని, ప్రచారకవిత్వమని పేర్లు పెట్టడం అప్పుడప్పుడు తటస్థ పడుతుంటుంది. ఏమైనా కవి ప్రజలలో పార్టీకి అనుకూలమైన చైతన్యాన్ని సృష్టింప కల్గితేనే మార్క్సిస్టు దృక్పథంలో కవిత్వం సార్థకమైనట్లు. దీన్నే సామాజికీకరణం అని అంటున్నాం. మార్క్సిస్టు సాహిత్యాన్నంతా ఈ దృష్టితోనే అనుశీలింపవలసి వస్తోంది. ఇందులో అనుభవం ప్రమాణంకాదు; ప్రతిక్రియ ప్రమాణం. సహానుభూతి ప్రమాణం కాదు; కొంతవరకు సానుభూతి ప్రధానం. సద్యఃపరనిర్వృతి కాదు ఇందులో ముఖ్యం; సత్వర కార్యాచరణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked