ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

-సునీత పావులూరి

భావకవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చింది అబ్యుదయ కవిత్వం. వీరు అభ్యుదయ కవులమని చెప్పుకున్నా తిరుగుబాటే వీరి ప్రధాన ఆశయం. తరువాతి కాలంలో ఈ కవులే విప్లవ రచయితల సంఘంగా ఏర్పడటం గమనిస్తే, సమాజంలో వీరికి కావలసింది తిరుగుబాటు. వర్గపోరాటం వీరి ప్రధాన ధ్యేయం. రచనల్లో వీరు కోరుకునేది రెచ్చగొట్టే లక్షణం,
“హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా! “ అని కదలండి!
అని చెప్పే రాచనలే వీరికి ప్రధానం. పోల్చి చూస్తే ఇదే కవి చెప్పిన
“నిజంగానే నిఖిలలోకం
నిండు హర్షం వహిస్తుందా?

నడుమ తడబడి నడలిముడుగక
పడవతీరం క్రమిస్తుందా?”
అని చెప్పిన రచన ఈ వర్గపోరాటం ఆశించేవారికి చాలదు. రచన చదివిన తర్వాత తెలియని ఆనందంతో ఎక్కడికో వెళ్ళే సహృదయుడు ఈ గేయాన్ని పదికాలాలపాటు గుర్తుంచుకోగలడు. కానీ మార్క్సిస్తులకది చాలదు. వారికి కావలసింది,
“బాటలు నడచే.
పేటలు కడచే.
కోటలన్నిటిని దాటండి!
నదీనదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మనకడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే
సైనికులారా! రారండి!”
అని చెప్పే గేయం వీరికి కావాలి. అంటే కవి పొందిన అనుభూతి సామాజికుడు అనుభవించటమే కాకుండా ఆచరిచటం కావాలి, ఇంతచేసినా వీరు చెప్పే ఈ కవిత్వం సంఘంలో ఉండే అన్ని వర్గాలవారికీ సంబంధించిన కవిత్వం కాదని మనం సులభంగానే గ్రహిస్తాం. ఇలా వర్గ పోరాటాలకు అనుకూలంగా రాసిన రచనలు సమాజావసరాలు తీరుస్తున్నాయనీ, సామాజిక వాస్తవాన్ని చిత్రిస్తున్నాయనీ వారు చెప్పుకోవటం ఆశ్చర్యంగానే ఉంటుంది.
“ఇది ప్రధానంగా ఆత్మాశ్రయ కవిత్వం చదివి లోకం అనుభూతి చెందే విధానంగా భావించవచ్చు. చలం అన్నట్లు లోకం బాధ కవి తనదిగా వ్యక్తం చేసినా, తన బాధ లోకందిగా వ్యక్తం చేసినా ఆత్మాశ్రయ స్వభావం మాత్రం తప్పదు. సాధారణీకరణం కంటే దీన్ని వేరుగా చెప్పడంలోగల తాత్పర్య మేమిటంటే, కవి తన స్వీయానుభూతిని ఆత్మానాయకంగా ఈ ప్రక్రియలో వ్యక్తీకరిస్తాడు. అది కవి వ్యక్తిగత అనుభవం అనడానికి వీలుంది. కానీ, నిజానికి లోకంలో వ్యక్తిగతమైన అనుభవాలకు ఆత్మాశ్రయ కవితలో వ్యక్తమయ్యే అనుభవాలకు ఎంతో ఖేదం ఉంది. వ్యక్తిగత అనుభవాలన్నీ లోకంలో పంచుకునేవికావు. ఆత్మాశ్రయ కవితలోని భావాలన్నీ లోకంతో కవి పంచుకోగలిగినవిగానే ఉంటాయి; లోకం కూడా అవి తనవిగా తాదాత్మ్యభావంతో అనుభవింపగలిగేవిగా ఉంటాయి. ఒకవిధంగా పరులచేత అనుభవింపచేయటానికి వీలున్న స్వీయానుభవాలనే కవి ఆత్మాశ్రయ కవితలో ఉదాత్తీకరించి కళామయం చేసి ఆనందిస్తాడు. ఐతే ఆధునికాంధ్ర సాహిత్యంలో ఆత్మాశ్రయ కవిత ఖండకావ్య ప్రక్రియ నాశ్రయించి మాత్రమే వెలువడింది. ఆ ప్రక్రియ స్వభావాన్ని అనుసరించి కవులు సామాన్యంగా ఒక మానసిక అవస్థను కల్పింపగలిగే శక్తివంతమైన భావాన్నో లేదా సజాతీయమైన భావసంపుటినో లేదా వితర్కాని కలిగించగలిగిన భావ సంకలనాన్నో సంపుటీకరించే శిల్పాన్ని వెలారుస్తారు. ఖండకావ్యంలో లాగా సంచారుల చేత పైపుష్టం చెందేస్థాయిభావస్ఫూర్తి ఉండదు. శక్తివంతమైన భావాలచేత ప్రజ్వలింపబడే ఒక మానసిక అవస్థాచైతన్యం మాత్రమే స్ఫుటంగా పఠిత చేత అనుభవింపబడుతుంది. సామాజికునికి అనుభవ యోగ్యమైన స్వీయానుభవాన్ని కవితలో కవి వ్యక్తీకరించడం, దాన్ని సామాజికుడు ఆత్మీకరించుకొని తాదాత్మ్యంతో అనుభవించడం అనే ప్రక్రియ ఇందులో గాఢంగా కనబడుతుంది. ఆబట్టి దీన్నే స్వాత్మీకరణం అని పేర్కొనడం జరిగింది. ఈ ప్రక్తియ అనుభూతి కవిత్వానికి కూడా వర్తిస్తుంది.
పై విషయాన్ని పరిశీలిస్తే ఆత్మాశ్రమ కవిత్వమని పిలవబడేది భావకవితా యుగానికి సంబంధించిన, ఆధునిక కాలానికి సంబంధించిన రచనను బట్టి అనుబూతి భేధం ద్యోతకమౌతుంది. అంటే భావం వ్యక్తి నిష్టమా? సమాజనిష్టమా? అనేది రచనా ధోరణిని అనుసరించి ఉంటుంది. ఆధునికయుగంలో వస్తున్న రచనలలో కవి తానూ సామాజిక అనుభూతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked