సారస్వతం

కఠోపనిషత్ 

-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి)

‘ఉపనిషత్’ అనగా, దగ్గరగా అందించునది అని అర్ధం చెప్పుకోవచ్చును. (ఎవరి దగ్గర జ్ఞానం పొందవలనో, దానిని వారి సమీపమునుండి పొందటమే!) ఇట్టి ఉపనిషత్ లు ప్రధానంగా పది ఉన్నాయని చెప్పవచ్చు.కొందరు 108 అని అంటారు. ఇలాంటి దశోపనిషత్లలో చాలా ప్రధానమైనది,కఠోపనిషత్. ఈ ఉపనిషత్ కృష్ణయజుర్వేదమునకు చెందినది.ఈ ఉపనిషత్ లో విచిత్రమేమంటే, ఇది ఉపదేసించేవాడు,సాక్షాత్తు యముడు.’యమము’ అనగా సద్గుణమునకు అధిదేవత. ఈ ‘యమము’ నకు సంబంధించిన శిక్షణ శరీరంలో జీవుడువుండగానే జరుగ వలెను.(బండి నడుచు చున్నప్పుడే, repair చేయించు కొనవలెను– Master CVV ) జీవుడు దేహమున ప్రవేశించి భూమిపై పడిన తర్వాత జరుగునదే యమమునకు తగు శిక్షణ. కనుక,జననమే యమ దర్శనమనవచ్చును!ఈ ఉపనిషత్ లో వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు, ఋషి పుంగవుడు—విశ్వజిద్యాగం చేస్తూ ఉంటాడు.తనది అనేది అంతా  ఇచ్చేయాలని, పరబ్రహ్మం అంతర్యామియై తనయందు సృష్టిని కావించుచూ,జీవులుగా మారుతూ వారికి తన వెలుగును సమర్పించుకొనుట అనేదానికి ఇది  ఒక సంకేత(symbolic)కథ. ప్రతి వారి జీవితంలో సంఘటించు –తండ్రీ కొడుకుల–సంభాషణ ఇది. జీవుడైన కుమారుడు తండ్రి యగు పరబ్రహ్మముగా అవటమే  ఈ విద్యకు పరిసమాప్తి. వాజశ్రవసుడు–ఎంత చక్కటి/గొప్పపేరు. ఆ పేరులో ప్రధాన మైనది’వాజి’, అనే మాట. వాజి అనగా గుర్రం. గుర్రంలో ఏమి గొప్పతనం ఉందని అనుకోవచ్చు!నాకు తెలిసిన, గుర్రం లోని కొన్ని గొప్ప గుణములను, విశేషణములను మీకు చెబుతాను. గుర్రం ఎప్పుడూ పడుకొని ఉండదు, నిలబడే  ఉంటుంది. మరీ బద్ధకం ఎక్కువైతే ఒక్కసారి వెల్లకిలా పడుకొని సకిలింపులు చేసి వెంటనే లేచి నిలబడుతుంది. సంగీతమంటే గుర్రానికి అమిత మైన ఇష్టం. అందుకే సామవేదానికి సంకేతంగా గుర్రం బొమ్మను చూపెడతారు. తుంబురుడు కూడా గుర్రం ముఖము తోనే ఉండే వాడు. గుర్రం ఎంత వేగంగా పరుగెత్తుతున్నా సరే,మలుపులను కూడా అదే వేగంతో తిరగగలదు. అదే మనం నడిపే ఏ వాహనం అయినా, తప్పక skid అవుతుంది. మనకు హయగ్రీవుడనే ఒక దేవుడు ఉన్నాడు.ఆయన ముఖం గుర్రం ముఖం లాగే  ఉంటుంది. ఇంకోముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, గుర్రం ఎంత బరువునైనా అవలీలగా లాగేస్తుంది. అందుకే యాంత్రిక శక్తిని Horse Power లో చెబుతారు. మన చేతి మీద ఈగ వాలితే, దాన్ని తరిమేయాలంటే మనం చేయి మొత్తం కదపాలి లేదా ఇంకో చేతి సహాయం తీసుకోవాలి. గుర్రం, అలా కాదు–ఆ ప్రత్యేక శరీర భాగాన్ని చలింపచేసి, ఈగను తోలుకొనగలదు. అంటే, గుర్రంయొక్క శరీరంలోని ప్రతి అణువు చైతన్యవంతమైనది. అలా అర్ధవంతంగా ఉండేవి, పూర్వం ఋషుల పేర్లు. ఆయన యాగం చేస్తూ–వచ్చిన ఋత్వికులకు, బ్రాహ్మణులకు గోదానాలు చేసేవాడు, తనకున్న అన్నిటితో పాటుగా! ఆ ఋషి శ్రేష్టుని కుమారుడే నచికేతుడు. తన తండ్రి చేసే ప్రతి పనిని శ్రద్ధగా గమనిస్తుంటాడు.నాన్నగారు అందరికీ,గోవులు దానమిస్తున్నారు కదా–అందులో, వట్టిపోయిన గోవులు ఉంటే, దానగ్రహీతలకు ఇబ్బంది కదా అని అనుకుంటాడు. మనకు పనికి వచ్చేవే ఇతరులకు దానం చేయాలి. అంతేగాని చెల్లని రూపాయి దానం చెయ్య కూడదు. సరే, అన్నీ నాన్నగారే చూసుకుంటారు, తెలిసిన వారు కనుక అని సరి పెట్టుకుంటాడు.

ఆ సందర్భంలో, తండ్రిని ఇలాగా అడుగుతాడు– అన్నిటినీ అందరికీ దానం చేస్తున్నారు కదా! మరి, నన్ను ఎవరికి దానం చేస్తారు? అని—తండ్రి ఈ మాటలేమీ పట్టించు కోకుండా తన పని తాను చేసుకొని పోతుంటాడు. ఇలా మూడు సార్లు, నచికేతుడు తండ్రిని అడిగేటప్పటికి, తండ్రికి చికాగు కలిగి–నిన్ను మృత్యువికి దానం ఇస్తాను, అని అంటాడు. ఆయన మాటలు నిజమై, యమదూతలు వచ్చి, నచికేతుని నరకలోకానికి తీసుకొని వెళ్లుతారు. ఆ సమయంలో యమధర్మరాజు, దిక్పాలకుల సభకు వెళ్ళుతాడు. నచికేతుడు నిరాహారుడై, అలానే మూడు దినాలు ఉంటాడు.యమధర్మరాజు రాగానే, అతిధి నిరాహారుడై ఉన్నాడని తెలిసి బాధపడి, ఇలా చెబుతాడు –మన ఇంటికి ఎవరైనా అతిధి వస్తే,అతను భోజనం చేయకుండా మనం భోజనం చేస్తే, మన ఇంట్లో అగ్ని పుడుతుంది. దానినే అప్పటినుండి’ నచికేతాగ్ని’ అని అంటున్నారు. యమధర్మరాజు, అతనిని బుజ్జగించి, ఆహారం తీసుకొన మంటాడు. నచికేతుడు ససేమిరా అంటాడు. యముడు నచికేతునికి మూడు వరాలిస్తానంటాడు.నరకానికి వెళ్ళితే తిరిగి భూలోకానికి వెళ్ళే అవకాశం లేదని తెలిసి కూడా, నచికేతుడు యమునితో—తన మీద తండ్రికి కలిగిన కోపం పోయి వారి ప్రేమ పొందాలని మొదటి వరంగా కోరుకుంటాడు. అందుకు యముడు అంగీకరించాడు.రెండవ వరంగా అగ్నివిద్యను నేర్పమని అడిగి నేర్చుకుంటాడు. అతనికి నేర్పిన అగ్నివిద్యకు, యముడు, ‘నచికేతవిద్య’ అని పేరు పెట్టాడు. మొదటి వరం ఇహానికి చెందినది. రెండవ వరం స్వర్గానికి చేర్చే అగ్నిఉపాసన.  ఇక మూడవ వరంగా నచికేతుడు అడిగిన దానికి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.—మనిషి శరీరాన్ని వీడి కూడా ఉంటాడని కొందరూ, కాదని కొందరూ అంటున్నారు. అసలు ఏది నిజమో తెలియ చేయమంటాడు. ఆ రహస్యమేమిటో  తెలియ చేయమంటాడు.

ఆ రహస్యాన్ని వేదాంత శాస్త్రంలో ఆత్మవిద్య అంటారు.”దేవతలకు కూడా తెలియని ఈ విషయం నీకెందుకయ్యా? నీకు దీర్ఘ ఆయుర్దాయం, సంపదలు, సౌఖ్యము, బంగారాన్ని, సామ్రాజ్యాన్ని…… మొదలైన వాటినన్నిటినీ  ఇస్తాను” అని యముడు నచికేతునితో అంటాడు. ఎన్ని ప్రలోభాలు చూపినా, నచికేతుడు లొంగక, ఆత్మవిద్యనే తెలియ చేయమంటాడు. అప్పుడు యముడు నచికేతునికి ఆత్మవిద్యను ఉపదేశించాడు. నచికేతా! ఆత్మతత్వం అందరూ తెలుసుకోవటం కష్టం. ఎవరైనా చెప్పినా  విన్నవారు సమగ్రంగా గ్రహించలేరు. అంత గొప్పదైన  ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువు దొరకటం కష్టమే! గురువు చెప్పిన దానిని గ్రహించగల శిష్యుడు దొరకటమూ కష్టమే! పరిపూర్ణ జ్ఞానవంతులు బోధిస్తే కానీ  ఆత్మతత్త్వం బోధపడదు. నచికేతా!  వేదాలన్నీ ఏమి చెబుతున్నాయో సంగ్రహంగా చెబుతాను విను. ఓంకారమే పరబ్రహ్మం. దాన్ని నిష్టగా ఉపాసన చేసినవారి  ఇహ, పర కోరికలు సిద్ధిస్తాయి. ఇది  తెలుసుకున్నవాడికి  బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది. ఆత్మకు జనన,మరణాలు లేవు.  శరీరం  పంచభూతాల్లో కలిసినా   ఆత్మ  మాత్రం నశించదు. ఆత్మ సకల జీవరాసుల్లో ఉంది. “ఆత్మను రధములోని మనిషిగా, శరీరమును రధముగా, బుద్ధిని రధసారధిగా, మనస్సును కళ్ళెంగా, ఇంద్రియాలను గుర్రాలుగా, వాటి మార్గాలు ఇంద్రియాలచే అనుభవించబడే విషయములు” అని, దీమంతులకే ఆత్మజ్ఞానం, కలుగునని–మనసుతో కూడిన పరమాత్మే భోక్త అని ఉపదేశించాడు. కఠోపనిషత్ నందలి అనేక మంత్రములు., శ్లోకములు, భగవద్గీతలో కూడా ఉదహరించ పడ్డాయని చెప్పవచ్చు. దానిని బట్టి, కఠోపనిషత్  ఎంత ప్రాధాన్యమైనదో ఊహించు కొనవచ్చు.

దీనిని గురించి స్వామీ వివేకానంద మరియు కులపతి శ్రీ ఎక్కిరాల శ్రీకృష్ణమాచార్యులుగారు, చక్కని వ్యాఖ్యానంతో గ్రంధాలు వ్రాశారు. పూర్తిగా తెలుసుకొని ఆనందించాలంటే,ఆ గ్రంధాలను చదివి తీరవలసినదే! (చాలామంది వ్రాశారు, నేను చదివి ఆనందించిన గ్రంధాలను గురించి మాత్రమే మీకు తెలియ చేశాను.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked