కథా భారతి

కలియుగ అజామిళ

-ఆర్. శర్మ దంతుర్తి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారద్దేశం.
అప్పల్నాయుడు పుట్టినప్పుడు జాతకం చూసిన పంతులు చెప్పడం ప్రకారం నాయుడిది సింహ లగ్నం. ఎలాగైనా సరే పెద్దయ్యాక నాయకుడై తీరుతాడు. అయితే ఎందులో నాయకుడౌతాడనేది పెంపకాన్ని బట్టి ఉంటుందనీ అందుకోసం నాయుడి తండ్రి కొంచెం కష్టపడాలనీ పంతులు చెప్పాక అప్పల్నాయుడి తండ్రి ఆలోచించాడు – ఏ లైన్లో కుర్రాణ్ణి సులభంగా నాయకుణ్ణి చేయచ్చో, ఏ వృత్తిలో అయితే పెద్ద చదువు, సంధ్యా అక్కర్లేదో, ఏదైతే లక్ష్మీ కటాక్షం కురిపిస్తుందో. దీని కోసం నాయిడి తండ్రికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. నాయుడికి సరిపోయేవి రాజకీయాలు. ఓ సారి ఊళ్ళో సర్పంచో ఏదో ఒకటి అయితే అక్కణ్ణుంచి జిల్లాకి, తర్వాత ఎమ్మెల్యే అలా పైకి పాకడం తారాజువ్వ ఆకాశంలోకి ఎగిరినట్టూ జరిగిపోతుంది.
సింహ లగ్న ప్రభావమో మరోటో కానీ మూడో క్లాసులోంచే అప్పల్నాయిడు నాయకుడి లక్షణాలు చూపించడం మొదలుపెట్టేడు – పక్కింటి అమ్మాయి లక్ష్మి స్కూలుకెళ్తూంటే వెనకే కాపలాగా వెళ్ళడం దగ్గిర్నుంచి, లక్ష్మిని రౌడీల నుంచి రక్షించే హీరోగా, ఉత్తరోత్తరా పదో తరగతిలో స్కూల్ పీపుల్స్ లీడర్ అయ్యేవరకూను. పదో తరగతి గట్టెక్కగానే బుర్రమీసం, రోజూ తినే చికెన్ ముక్కల వల్ల మాంఛి ఒడుపైన శరీరం అన్నీ వాటికవే వచ్చి చేరాయి అప్పల్నాయిడికి.

డిగ్రీ లో చేరాక ఈజీగా రెండేళ్ళలో కాలేజీ ప్రెసిడెంట్ అయిపోయేడు అప్పల్నాయిడు, చదువుసంగతెలా ఉన్నా. రెండేళ్ళు డిగ్రీలో కోచింగ్ అయ్యేక మూడో ఏడాదిలో అప్పల్నాయిడు పాస్ అయిన సబ్జక్ట్ లు ఎన్నో అని చూస్తే – పాలిటిక్స్ ఒక్కటే కనబడింది. మిగతా సబ్జక్ట్ లు పాసై, డిగ్రీ సంపాదించడానికి ఇంక బండి నడవదని తెలిసొచ్చిన అప్పల్నాయిడు ఊళ్ళో సర్పంచ్ గా పోటీ చేసి నెగ్గాడు. ఈ నెగ్గడానికి కారణాలలో ఒకటి మరోసారి సంభావన తీసుకుని పంతులు చెప్పిన నాయుడి సింహ లగ్నం. రెండోది నాయుడి నోటివాటం. మూడోది నోట్లు ఖర్చుపెట్టగలిగే చేతివాటం అని కొంతమంది గుసగుసలు పోతారు కానీ అటువంటి పెద్ద విషయాలు మనం మనం పట్టించుకోరాదు.

సింహ లగ్నం లో గురు మహాదశ ఉఛ్ఛ స్థితికి వచ్చేసరికి అప్పల్నాయుడు ఎమ్మెల్యే అయిపోయేడు. ఈ లోపున ఒక మామూలు అంబాసిడర్ కారూ, జీపు వచ్చి జేరాయి ఇంట్లోకి, లక్ష్మి తో పాటు. నాయుడు ఆవిడతో బిజీ అయే సరికి ఠక ఠకా ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. ఇంత పైకి రావడానికి అప్పల్నాయుడు రెండు మూడు హత్యలు చేయించాడనీ, తనని ఎదిరించినవాళ్ల ఎముకలు విరగ్గొంటిచాడనీ గిట్టనివాళ్ళంటారు. కానీ రాజకీయాల్లో ఆ మాత్రం చిన్న విషయాలు సాధారణం కనకా, మంత్రి పదవి కోసం పైకి రావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు కనకా అటువంటి గూట్లే విషయాలు ఎవరూ మాట్లాడరాదు. అప్పల్నాయుడి వ్యవహార దక్షత ముఖ్యమంత్రిగారికి ఎప్పటికప్పుడు తెలియడం వల్ల ఆయన ముందు నాయుణ్ణి పిలిచి ఓ పనికిరాని పదవిలో కూర్చోబెట్టాడు – పనికిరాని పదవి అంటే సంక్షేమ హాస్టల్లు చూడ్డం అందులో కుర్రాళ్లకి భోజనాలకీ దానికీ ఖాతాలు చూట్టం లాంటివి.
సంక్షేమ ఖాతాల్లో ఏదో చిల్లర మిగిల్నా అప్పల్నాయుడికి వాటిమీద దృష్టిలేదు. నాయుడి ఊహ ప్రకారం ఈ పదవిలో బాగా పని చేస్తే తర్వాత ముఖ్యమంత్రిగారు ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లోనో ఫైనాన్స్ మినిస్ట్రీ లాంటి గంగిగోవుని చూడ్డానికో పిలుస్తాడు కదా? ఇక్కడ దొరికే చిల్లర కంటే రాబోయే నోట్ల కట్టలు అందం. ఏదైతేనేం మొత్తానికి మొదటినుండీ పంతులు చెపుతునట్టూ అప్పల్నాయుడు తొందరగానే మంచి శాఖలో మంత్రి అయిపోయేడు. దానితో అంబాసిడర్ ఈజీ వీజీగా మెర్సిడెస్ అయిపోయింది. మరో రెండు కార్లు ఇంట్లో అమ్మగారికోసం అమర్చబడ్డాయి.
ఇక్కడే ఆసలు కష్టం ప్రారంభమైంది అప్పల్నాయుడికి.

ఓ రోజు రాత్రి అల్పాచమానానికి లేచిన నాయుడికి వాంతి అయి నోట్లోంచి రక్తం పడింది. మర్నాడు మరోనాడు చూసి మళ్ళీ మళ్ళీ రక్తం పడుతుంటే హుటాహుటిన డాక్టర్ దగ్గిరకెళ్ళేడు. పరీక్షలన్నీ అయ్యేక డాక్టర్ చెప్పిన విషయం, అప్పల్నాయుడికి పెద్ద ప్రేగుల్లో కేన్సర్ వచ్చింది. డాక్టర్ మొహం మీద చెప్పని విషయం మాత్రం – నాయుడు మహా అయితే మరో రెండేళ్ళు బతుకుతాడు.

ఈ వార్త పట్టుకుని – ఇండియా వైద్యం మామూలు జనాలకి కానీ పెద్ద పెద్ద నేతలకి కాదు కాబట్టి – అప్పలాయుడు అమెరికా వచ్చేడు వైద్యం కోసం. అవును గవర్నమెంట్ ఖర్చుమీదే. మంత్రిగారా, మజాకా?
అనుయూయులూ, ఇండియాలో డాక్టర్లూ సరిగ్గా చెప్పని విషయం అప్పల్నాయుడికి మొహం మీదే చెప్పేశాడు అమెరికా డాక్టర్. ఏవో మందులేసుకోవచ్చుకానీ రాచపుండు ముదిరిపోయి అన్ని చోట్లకీ పాకింది. ఇంటికెళ్ళిపోయి ఈయన ఇచ్చిన మందులూ, కీమోథెరపీ వాడుతూ రామా, కృష్ణా అనుకోవడం బెటర్.

ఠారెత్తుకొచ్చిన అప్పల్నాయుడు కి మనసులో చింత. తాను పోతే పిల్లలనీ లక్ష్మినీ ఎవరు ఎలా చూస్తారో? తన మెర్సిడెస్ కారూ, జీపూ అవీ ఎవరు ఎలా పట్టుకుపోతారో, ఇన్నేళ్ళూ తాను కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులు ఎలా అనే ఆలోచనల్తో నిద్ర కరువైంది. కష్టాల్లోనే కదా దేవుడు గుర్తొచ్చేది? అందువల్ల తాను సింహలగ్నంలో పుడితే నాయకుడౌతాడని చెప్పిన పంతుల్నే పిలిచి ఏం చేయాలో అడిగేడు.
పంతులి ఐడియాలు వేరు. ఏదో చిన్నపూజ చేయిస్తే చిన్న సంభావన ముట్టచెప్పినా రాచకురుపు కనక ఇప్పట్లో ఎలాగా తగ్గదు. దాన్ని చూపించి వరసగా ఒక పూజ మీద మరోటి చేస్తే బాగా రాబట్టవచ్చు. దీక్షలు ఎలాగా ఉన్నై. వెంకటేశ్వర మహత్యం, బాబా పుస్తకం వారం వారం పారాయణ, అయ్యప్ప దీక్ష, అలా కావాల్సినన్ని ఉన్నై కదా? అదీగాక పరీక్షిత్తంతటివాడు పోయే ముందు భాగవతం చదివించుకు విన్నాడు మోక్షం కోసం. ఇవన్నీ చేస్తే వచ్చే సంభావనతో పంతులు దర్జాగా మరో స్కూటర్ కొనుక్కోవచ్చు. అయినా ఈ డబ్బులన్నీ నాయుడు జేబులోంచి తీసి ఇచ్చేవా? గవర్నమెంట్ వారివే కదా? ఇంకెందుకు సందేహించడం?
అలా పంతులు రోజు పొద్దుటే వచ్చి భాగవతం పారాయణ, నాయుడు దీక్షలు అవీ చేయలేడు కనక వాళ్ళావిడ లక్ష్మి చేత అమ్మవారి దీక్షా, సాయంత్రం మరోసారి ఇంట్లో దీపారాధన అన్ని అమర్చేడు. మందుల వాడకం ఉండనే ఉంది.
పంతులు భాగవతం చదువుతున్నంత సేపూ ఏదో విధంగా భగవంతుడు గుర్తొచ్చినా పంతులు వెళ్ళగానే నాయుడికి మళ్ళీ చింత – తాను పోయాక ఎలా అంటూ. పరీక్షిత్తు లాగా నిరంతరం నారాయణుడిని గుర్తుపెట్టుకుంటేనే కదా మోక్షం. మరి తనకున్న ఇన్ని చింతల్తో దేవుణ్ణి ఎలా గుర్తుపెట్టుకోవడం?

దీనికి పంతులే చెప్పాడు చిట్కా, “మీకు నారాయణుడి మీద నోటికి కంఠతా వచ్చిన పద్యం ఏదైనా ఉంటే అదే జపించండి రోజూ. విష్ణు సహస్రనామం లాంటివి వచ్చినా బాగుంటుంది.”
“ఏదీ రాదే? విష్ణు సహస్రనామం పెద్దది కదా, నేనెప్పుడూ రాజకీయాల్లో బిజీ గా ఉండి ఏదీ నేర్చుకోలేదు, ఇప్పుడెలా?”
“మరోసారి గుర్తు తెచ్చుకోండి. ఏదో చిన్నప్పటి పద్యమేనా రాదా?
కాసేపు ఆలోచించిన నాయుడు చెప్పేడు నీరసంగా నవ్వుతూ, “స్కూల్లో చదువుకోలేదని ఇంటికి పంపేసారు చిన్నప్పుడు, అప్పు మా బామ్మ నేర్పిన పద్యం గుర్తుంది.”
“ఏమిటండీ ఆ పద్యం?”

“నారాయణ నారాయణ నక్క తోకా, నా మొగుడూ తెచ్చాడు కొత్త కోక అని ఇంకా ఏదో ఉంది.”
పంతులు చిరునవ్వు మొహం మీద కనబడకుండా దాచుకుని చెప్పేడు, ” నారాయణ నారాయణ అని ఎలా అన్నా పుణ్యమే. అజామీళుడు కూడా భగవంతుడు గుర్తుకు రాక తన స్వంత కొడుకు గురించి నారాయణ నారాయణ అని కలవరిస్తూ మోక్షం సంపాదించేడు కదా?”
“అలా అయితే అదే నేను రోజూ చేయొచ్చా?”
“తప్పకుండా; అయితే ఆ నక్కతోక అనేది వదిలేయండి,” పంతులు ఆ రోజు సంభావన పుచ్చుకుని వెళ్ళిపోయాడు.
మర్నాటినుండీ అప్పల్నాయుడు నారాయణ నారాయణ నక్కతోక అనడం మొదలుపెట్టాడు. ఒరే ఆ జీపుకి టాపు తీసేసి కడిగించమని చెప్పానా, నారాయణ నారాయణ నక్కతోక; ఛీ, ఛీ, నక్కతోక అనకూడదు. లక్ష్మీ ఆ మందు సీసా ఇలాతే, నారాయణ నారా… నక్కతోక, లేదు లేదు నారాయణ నారాయణ, లేదు నక్కతోక, నక్కతోక నారాయణ, ఛీ, ఛీ నారాయణ నారాయణ అని కదూ అనమన్నాడు పంతులు. ఇలా సాగుతోంది నాయుడికి రోజంతా. ఒక్కోసారి నక్కతోక మర్చిపోయి నోట్లో నారాయణ నారాయణ; మరోసారి నారాయణ మర్చిపోయి నక్కతోక, నక్కతోక.
(2)

వైకుంఠం
నారదుడు లోపలకి రాబోతూ ఎందుకైనా మంచిదని ద్వారం దగ్గిర కాపలా ఉన్న జయవిజయులని అడిగేడు, “స్వామి ఖాళీగా ఉన్నారా, లోపలకి వెళ్లొచ్చా?”
అంతకు ముందు సనకసనందనాదులిచ్చిన శాపం, దానివల్ల విష్ణువుకి శతృవులుగా పుట్టిన మూడు జన్మలూ గుర్తొచ్చి వినయంగా చెప్పేరు ద్వారపాలకులు, “ఉన్నారండి. మీరు ఎప్పుడు వచ్చినా అడ్డుకోవద్దని చెప్పారు. అయినా ఇప్పుడు కలియుగం మొదలే కదా ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు అయితే గాని కల్కి అవతారం రాదు. అప్పటివరకూ అయ్యగారికి శెలవే. అమ్మవారితో సహా ఇక్కడే ఉన్నారు, వెళ్ళండి.`
లోపలకి వచ్చిన నారదుడి నమస్కారం అయ్యాక పద్మనాభుడు అడిగేడు, “ఏమి విశేషాలు నరదా, ఈ మధ్య నల్లపూసవైపోయేవు సుమా?”
“భూలోకంనుండి వస్తున్నాను. అప్పల్నాయుడు అనే రాజకీయనాయకుడు మంత్రి అయ్యాక రాచపుండు వచ్చి కర్మ అనుభవిస్తూ చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపుల ఆయన దగ్గిర ఉన్న పంతులు నాయుడికి భాగవతం వినిపించి నారాయణ నారాయణ అని మీ పేరు నాయుడి నోట్లో ఆడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ….”
“మంచిదే కదా, కనీసం ఇప్పుడైనా పరీక్షిత్తులాగా నా పేరు నోట్లో నాని, మనసులో మెదిల్తే?”
“… అలా అంటావేమిటి స్వామీ, జనాల్ని చంపుకు తింటూ హత్యలూ అవీ చేసే వాళ్లంతా ఇలా నారాయణా అనేసి వైకుంఠానికి వచ్చేయడమే? జీవితాంతం త్యాగరాజులాగ రామనామం చేస్తేనే కదా వైకుంఠంలోకి రావడం కుదిరేది?”
“అలా ఎలా కుదురుతుంది నారదా? అందరికీ అటువంటి పవిత్రమైన మనసు ఉండొద్దూ? ‘అంత్య కాలేచ మామేవ స్మరణ్ముక్తా కళేబరం’ అని నేనే భగవద్గీతలో చెప్పాను కదా? ఒకసారి నేను మాట ఇచ్చేసాక కాదనడం ఎలా కుదురుతుంది? అప్పల్నాయుడు చచ్చిపోయేటప్పుడు నారాయణ నారాయణ అన్నాడంటే అదృష్టవంతుడై తప్పకుండా వైకుంఠంలోకి అర్హత సంపాదించి రావాల్సినవాడే.”
“అవును స్వామీ, కాని నాయుడిప్పుడు మీ పేరు గుర్తుంచుకోలేక చిన్నప్పుడు నేర్పిన నక్కతోక నక్కతోక నారాయణ, నారాయణ అంటున్నాడు.”

“అజామీళుడిలాగా నారాయణా అని ఎలా అన్నా సరే ఒప్పుకోవాల్సిందే మరి. లేకపోతే అజామీళుడుకో రూలూ నాకో రూలూనా అని రాజకీయం లేవదీస్తాడు.”
ఇంక ఏం చేయాలో తెలియని నారదుడు లక్ష్మీ దేవితో చెప్పాడు, “అమ్మా మీరైనా చెప్పండి స్వామికి. ఇలా పాపులందరూ నారాయణా అనేసి వైకుంఠంలోకి వచ్చి పడితే ఎలా?”
“నేనా? భలేవాడివే నారదా, అలనాడు గజేంద్రుడు పాహిమాం పాహిమాం అనగానే ఈయన నాతో ఒక ముక్కైనా చెప్పకుండా పరుగెట్టుకుంటూ వెళ్ళిపోతే నేనే ఆయన వెనక గరుత్ముండితో, అందరితో పాటూ పరుగెట్టాల్సి వచ్చింది. మరోసారి నాతో మాటైనా చెప్పకుండా చేతిలో చక్రాయుధాన్ని అంబరీషుడికిచ్చేసాడు. ఈయనా నా మాట వినేది? హూ..” లక్ష్మీ మూతి మూడు వంకర్లు తిప్పుతూ నిట్టూర్చింది.
నారదుడు ఏం చేయాలో తెలియక అక్కడే ఇంకా నిలబడ్డం చూసి విష్ణువు చెప్పాడు, “నారదా, భక్తుడు నాపేరు పలుకుతున్నప్పుడు నేనే ఏమీ చేయలేకపోతే అతన్ని ఎవరు ఆదుకుంటారు? తప్పదు మరి, అన్నిసార్లూ త్యాగరాజులవంటి భాగవతులే కాదు ఒక్కోసారి అజామీళులు కూడా వస్తూ ఉంటారు వైకుంఠానికి. నాకు అందరూ సమానమే అనినీకు తెలియదా?”
నారదుడు ఇంకేం మాట్లాడాలో తెలియక నిట్టూర్చి వైకుంఠంలోంచి బయటకి వచ్చేడు. ఎవరికీ కనపడకుండా ద్వారం బయటనుండి అప్పటివరకూ ఇదంతా విన్న జయవిజయులు నవ్వుతున్నవాళ్ళు ఒక్కసారి సీరియస్ గా మొహాలు పెట్టారు బయటకి వచ్చిన నారదుణ్ణి చూసి. ఆయనకి కోపం వచ్చి శపిస్తే? మళ్ళీ భూలోకం మీద ఎన్ని జన్మలెత్తాలో ఆ జన్మలు ఎలా ఉంటాయో ఈసరికి కాస్తో కూస్తో తెల్సు కాబట్టి.
(3)

మరోసారి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, భారద్దేశం
రెండు మూడు నెలల తర్వాత లింఫ్ నోడ్స్ లోకి చొచ్చుకుపోయిన కేన్సర్ బాగా ముదిరి, వళ్ళంతా పాకిపోయి అప్పల్నాయుడు చచ్చిపోయాడు. పోయేటప్పుడు పిల్లలూ భార్యా, మిగతా వాళ్లందరూ దగ్గిరే ఉన్నారు కూడా. పంతులు పక్కనే ఉండి ‘నారాయణ నారాయణ’ అని అనిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పల్నాయుడి పార్థివ శరీరానికి ముఖ్య మంత్రి గారూ మిగతా పెద్దలందరూ వచ్చి సానుభూతి ప్రకటించాక అందరూ లోకాయపారీగా అనుకున్న విషయం అప్పల్నాయుడు పోతూ పోతూ నిజంగానే నారాయణ నారాయణ అన్నాడు! అందువల్ల పంతులు చెప్పినట్టూ అప్పల్నాయుడు జేరినది తప్పకుండా వైకుంఠధామమే!
త్రిలోకసంచారికి ఈ విషయం తెలియగానే హుటాహుటిన వైకుంఠానికి బయల్దేరాడు నిజంగా అప్పల్నాయుడు వైకుంఠం చేరాడో లేదో చూడ్డానికి.
(4)

మళ్ళీ వైకుంఠం
అప్పల్నాయుడు వైకుంఠంలో లేడు. అంటే “అంత్య కాలేచ మామేవ స్మరణ ముక్తా కళేబరం” అనేది శుద్ధ తప్పు అయినా అయి ఉండాలి లేకపోతే విష్ణుమాయ ఏదో జరిగుండాలి. ఆ మాయ ఏమిటా అని నారదుడు అడిగేలోపుల విష్ణువే నవ్వుతూ పలకరించేడు, “ఏమిటిలా వచ్చేవ్ నారదా మళ్ళీ? అప్పల్నాయుడి గురించేనా?”
“అవును స్వామీ, ఇప్పుడెక్కడున్నాడు అప్పల్నాయుడు? నేను భూలోకం వెళ్ళినప్పుడు నాయుడు మీపేరు నోట్లో ఉండగానే పోయాడని చెప్పుకోవడం విన్నాను.”
“దండకారణ్యంలో ఫలానా చోటికి వెళ్ళి చూసి కనబడినదేమిటో వెంఠనే వెనక్కి చెప్పు.”
నారదుడు మరునిముషంలో ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో ఉన్న దండకారణ్యం చేరేడు. రాములవారి కాలంలో దండకారణ్యం కానీ ఇప్పుడు అరణ్యాలెక్కడున్నై? కాంక్రీటు వనాలు దాటి దాటి చివర్లో ఏదో కొంచెం పచ్చని చెట్ల మధ్య కనిపించినంతమేర అన్నీ చూసి అప్పల్నాయుడు కనబడక, ఏమీ తేల్చుకోలేక వెనక్కొచ్చాడు మళ్ళీ.
విష్ణువు అడిగేడు నారదుణ్ణి “ఇప్పుడే కదా వెళ్ళేవు, అప్పుడే అప్పల్నాయుడు కనిపించాడా?”
“నన్ను అటూ ఇటూ తిరగమని చెప్పడమే కానీ ఈ మర్మం ఏమిటో మీరే చెప్పేయొచ్చుకదా? అక్కడ దండకారణ్యమే లేదు. చెట్లూ చేమలూ కొట్టి పారేసి జనం ఇళ్ళు కట్టేసుకుంటున్నారు. అప్పల్నాయుడిలాంటివారు కో అంటే కోటిమందున్నారు అక్కడ కలప అమ్ముకోవడానికి. వాళ్ళలో అసలు అప్పల్నాయుడు ఎవడని తెలుస్తుంది?” నీరసంగా చెప్పేడు నారదుడు, “అయినా ముందు మీరు చెప్పినది తప్పు అని ఒప్పుకోండి స్వామీ. ఎప్పుడో వెనకటి యుగాల్లో అజామీళుడు నారాయణ అని వైకుంఠానికి వచ్చేడంటే నమ్ముతాం కానీ ఈ రోజుల్లో అప్పల్నాయుడు పోయేటపుడు మీ పేరు నోట్లో కదలాడినా ఇక్కడకి రాలేదంటే మీరు భగవద్గీతలో చెప్పినది యుగధర్మం తప్పినట్టూ, ముమ్మాటికీ తప్పే కదా?”
అమ్మవారు ఓరగా చూసింది స్వామి వేపు ఇదంతా ఎలా సమర్ధించుకుంటాడో అనుకుంటూ.
అయ్యవారు చెప్పేడు గొంతు సవరించుకుని, “నేను ఇప్పుడు చూపించేది వినీలాకాశంలో కనిపిస్తుంది చూడండి. అప్పుడు అప్పల్నాయిడి గురించి మీకే తెలుస్తుంది.” విష్ణువు కుడిచేత్తో ఆకాశం కేసి చేయి చూపించాడు.
ఇటు నుంచి అమ్మవారూ, ఆదిశేషుడూ, అటు నుంచి ధ్రువుడూ విష్ణువు చూపించిన వైపు తలలు రిక్కించి ఛూస్తూంటే నారదుడు కూడా దృష్టి అటే సారించాడు.
కనిపించినది భూమిమీద అప్పల్నాయుడి చివరి క్షణాలు. నాయుడు చచ్చిపోతూంటే వాళ్ళావిడ ఏడుస్తోంది, నాయుడి నోట్లో “నారాయణ నారాయణ నక్క తోక ..” అంటూ చిన్నప్పుడు తాను నేర్చుకున్న పాట. పక్కనే “నారాయణ నారాయణ” అని నాయుడి చేత అనిపించడానికి పంతులి ప్రయత్నం.
ఆ దృశ్యం, శ్రవణం చూడ్డం అయిపోయాక నారదుడు అడిగేడు, “స్వామీ ఇంత చేసినా మరి అప్పల్నాయుడు వైకుంఠానికి ఎందుకు రాలేదు?”

“పోయేటప్పుడు చివరి క్షణాల్లో అప్పల్నాయుడేమన్నాడో గమనించావా నారదా?”
“నారాయణ నారాయణ అనే కదా?” విష్ణువు లాజిక్ అర్ధం కానట్టూ అడిగేడు నారదుడు.
“అప్పల్నాయుడి నోట్లోంచి వచ్చినది మొదట్లో నారాయణ నారాయణ అనేది సరే, కానీ చివరి క్షణంలో అన్న రెండు పదాలు నక్క, తోక అనేవి. అలా దేన్ని గుర్తుపెట్టుకుంటే దానిలాగే పుడతాడని నేను గీతలో చెప్పినట్టూ అప్పల్నాయుడు ఇప్పుడు దండకారణ్యంలో నక్కగా పుట్టాడు. అందుకే నిన్ను అక్కడకి వెళ్ళి చూసి రమ్మన్నాను,” నవ్వుతూ చెప్పేడు విష్ణువు.
అయ్యవారి లాజిక్ అర్ధమైనట్టూ, అమ్మవారు కిసుక్కున నవ్వింది. ఆదిశేషుడూ, బయటనే ఉండి ఇదంతా వింటున్న జయవిజయులూ, పైనుంచి నిరంతరం విష్ణు ముఖారవిందాన్ని చూసే ధ్రువుడూ, విష్ణుమాయకి చేతులెత్తి నమస్కారం చేస్తూంటే, నారదుడు నవ్వు రాకుండా దాన్ని నోట్లోనే ఉంచుకుని ‘నారాయణ నారాయణ’ అంటూ స్వామికి చేతులు జోడించాడు.
పద్మనాభుడు ఎప్పటిలాగానే మనోహరంగా నవ్వుతూ, ‘నాదేంలేదు సుమా ఎవరి కర్మ వాళ్లదే’ అంటున్నట్టూ చేతులు గాలిలో ఆడించి యోగనిద్రలోకి జారుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked