కథా భారతి

కొడుకు స్థిరపడితే!

“హలో!”
“హలో! నేను బ్యాంకు మేనేజర్ ను మాట్లాడుతున్నాను, సుధీర్ గారా! మాట్లాడేది?”
“నమస్తే సార్! నేను సుధీర్ నే మాట్లాడుతున్నా!”
“మీరోసారి బ్రాంచ్ కు రాగలరా?”
“అలాగే సార్! మరో అరగంటలో వస్తాను.”
ఫోన్ పెట్టేసాడు మేనేజర్. ఈ మధ్యనే బ్రాంచ్ కు కొత్త మేనేజర్ వచ్చారు. నాకు కొత్త మేనేజర్ తో పరిచయం లేదు. కానీ వారు నన్ను ఎందుకు రమ్మన్నారో అర్థం కాక ఆలోచనలో పడిపోయా. మా నాన్న గారు రంగస్వామి గారు, మా ఊరి మాజీ సర్పంచ్. రెండు సంవత్సరాల క్రిందట ప్రమాదంలో చనిపోయారు. నాకు చదువు అబ్బక పోవడంతో ఆరేళ్ళ క్రితం నాలుగు లక్షల పెట్టుబడితో ఎలక్ట్రికల్ షాప్ పెట్టించారు. దేవుడి దయవల్ల, మా నాన్నగారి ఆశీస్సుల వల్ల అంతా బాగానే నడుస్తోంది. వ్యాపారం బాగా నడవడంతో బ్యాంకు వాళ్ళు కూడా పిలచి మరీ లోను ఇచ్చారు. రీపేమెంట్ కూడా బాగానే కడుతున్నాను. కానీ ఇప్పుడు బ్యాంకు మేనేజర్ ఎందుకు పిలిచారో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
“రేయ్! కబీర్! కొట్టు చూస్కో! బ్యాంకు దాకా వెళ్లి వస్తా!” కబీర్ మా షాప్ లోనే పనిచేస్తాడు.
బైక్ స్టార్ట్ చేసే ముందు బ్యాంకు లో అటెండర్ గా పనిచేసే వీరబాబు గుర్తుకు వచ్చాడు. వాడికి బ్యాంకు లో జరిగే అన్ని విషయాలు తెలుస్తాయి. అన్నింటి మీద ఓ కన్నేసి ఉంటాడు వాడు. వీరబాబుకు ఫోన్ కలిపా.
“హలో!”
“నేను సుధీర్ ను మాట్లాడుతున్నా! మేనేజర్ గారు బ్రాంచ్ కు రమ్మన్నారు. ఆ విషయం తెలుసుకొందామని!”
“ఏం లేదు అన్నా! మీ ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడు కదా! అతను బ్యాంకు లో ఆరేళ్ళ క్రితం ఎడ్యుకేషన్ లోన్ తీసుకొన్నాడు. కానీ రీపేమేంట్ కట్టడం లేదు, అతనికి మీ నాన్న గారు ష్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడు మీ నాన్న గారు లేరు కనుక, ఆ విషయం మీతో మాట్లాడుదామని పిలుచుంటారు.” చెప్పాడు వీరబాబు.
బైక్ స్టార్ట్ చేశా. నా బైక్ ముందుకు నడుస్తూ వుంది, కానీ నా ఆలోచనలు వెనక్కు వెళ్తున్నాయి.
ప్రసాద్ వాళ్ళ నాన్న కుప్పయ్య. వాళ్లకు ఎకరా పొలం ఉంది, అందులో వ్యవసాయం చేసే వాళ్ళు. వాళ్ళ పొలంతో పాటు మా పొలాన్ని కూడా కొంత కౌలుకు తీసుకొని పంటలు వేసేవారు. కుప్పయ్య చాలా బలంగా ఉండేవాడు, ధైర్యవంతుడు కూడా. వంద కిలోల బస్తాను ఒక్కడే ఎత్తు కెల్లేవాడు. అర్ధ రాత్రయినా సరే పొలంలో పంటకు ఒంటరిగా నీళ్ళు కట్టేవాడు. కుప్పయ్య ఒక్కగానొక్క కొడుకు ప్రసాద్. నా స్నేహితుడు, అతను చదువులో ఎప్పుడూ ఫస్ట్, నేను ఎప్పుడూ లాస్టే.
ప్రసాద్ కన్నా మేము ధనవంతులు అయినప్పటికీ, నా కన్నా ప్రసాద్ ఇంటలిజెంట్ అయినప్పటికీ మా స్నేహం సజావుగానే సాగింది. అప్పుడు ఇంటర్మీడియట్ రిజల్స్ వచ్చాయి. ప్రసాద్ మా కాలేజీ ఫస్ట్. నేను ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి ఆరు సబ్జట్ లలో తప్పాను. ఇక ఆ రోజు మా నాన్న గారు చేసిన యాగి అంతా ఇంతా కాదు, అప్పుడే సర్పంచ్ గా ఎన్నికై చుట్టుప్రక్కల ఊర్లలో పేరు సంపాయించారు మా నాన్న. నేను ఇంటర్మీడియట్ తప్పి, ఆయన పేరు చేడగొట్టానని నన్ను చెడామడా తిట్టాడు. ప్రసాద్ డిగ్రీ చేరాడు, నేను ఇంటర్మీడియట్ లో తప్పిన పరీక్షలు రాయడం మెదలుపెట్టా. మూడేళ్ళలో ప్రసాద్ కు డిగ్రీ పట్టా చేతికి వచ్చింది. కానీ ఇంటర్మీడియట్ బోర్డు పై నా దండయాత్ర మాత్రం పూర్తవలేదు. చదువులో నా శక్తి ఏపాటిదో మా నాన్న గారు అర్థం చేసుకొని , ఏదైనా వ్యాపారం చెయ్యమని నాకు నాలుగు లక్షలు ఇచ్చారు. ఇదిగో నేను ఈ ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకొన్నా.
ఓ రోజు కుప్పయ్య, ప్రసాదు ఇద్దరూ మా పొలం లో పనిచేస్తుండగా మా నాన్న గారు ప్రసాద్ ను పిలిచారు.
“డిగ్రీ తరువాత ఏం చేస్తావ్?” అని అడిగారు.
“ప్రసాద్ చేత చదువు మాన్పించి, పొలం పనులకు తీసుకొని వస్తున్నాడు వాళ్ళ నాన్న.” చెప్పాను మా నాన్నతో.
“నువ్వు ఏం చదవాలని అనుకొంటూ ఉన్నావ్?” ప్రసాద్ ను సూటిగా అడిగారు.
“MCA చేసి, I.T లో పనిచెయ్యాలని అనుకొంటున్నాను.” చెప్పాడు ప్రసాద్.
“పిల్లాడు మంచిగా చదువుకొంటానని అంటే నువ్వు పొలం పనులకు తీసుకొని వచ్చావు ఏంటి?” కుప్పయ్య ను చూస్తూ గంభీరంగా అడిగాడు మా నాన్న.
“వాడికి చదవాలనే కోరిక ఉండచ్చు, కానీ వాడ్ని చదివించే స్థోమత నాకు లేదయ్యా!” తల దించు కొంటూ మా నాన్న గారి ముందు నిలబడ్డాడు కుప్పయ్య.
“నా కొడుక్కి సరస్వతీ కటాక్షం లేక నేను బాధ పడుతున్నా. నీ కొడుక్కి ఆ తల్లి దయ నిండుగా ఉంది. కానీ నువ్వు వాడ్ని చదివించలేనని అంటే ఎలా?”
“మీకు తెలియంది ఏముందయ్యా! నేను పడుతున్న కట్టం మీరు ఎరుగుదురు, నాకు గిట్టుతున్న ఆదాయం మీరు ఎరుగుదురు. పండించిన పంటల్లో నాకోచ్చే వాటాలో విత్తనానికి, ఎరువులకు, కోతకు అయ్యే ఖర్చును తీసేస్తే రెండు పూటలూ, నాలుగు మెతుకులు తినగలుగుతున్నాము తప్ప మిగులుబడి ఎక్కడ ఉంది?” సున్నితంగా ప్రశ్నించాడు కుప్పయ్య.
“కానీ నీ కొడుకును చదివిస్తే వాడు ప్రయోజికుడు అవుతాడు. మంచిగా సంపాయిస్తాడు. అప్పుడు నీకు ఈ కష్టాలు ఉండవు. లేదంటే వాడు కూడా నీలాగా కష్టాలు పడుతూ బతుకు బండిని లాగించాలి.”
కుప్పయ్య ఏమీ మాట్లాడలేదు, తన దగ్గర సమాధానం లేదనుకొంటా.
“సరే ! మన బ్యాంకు మేనేజర్ గారితో మాట్లాడుతాను. చదువుకోవడానికి లోన్ ఇస్తారేమో కనుక్కొంటా. అవసరమైతే నేను జామీను సంతకం పెడతా.” నిట్టూరుస్తూ చెప్పాడు మా నాన్న.
ఆ మాట వినగానే కుప్పయ్య ముఖం వెలిగిపోయింది. ఇక ప్రసాద్ అయితే చెప్పనక్కర్లేదు, మా నాన్న గారి కాళ్ళ మీద పడినంత పనిచేసాడు.
ఆ మరునాడే కుప్పయ్యను, ప్రసాద్ ను వెంటబెట్టుకొని బ్యాంకు మేనేజర్ ను కలిసారు మా నాన్న. మా నాన్న గారి ష్యూరిటీ తీసుకొని , కుప్పయ్య ఎకరం పొలం, ఇల్లు కాగితాలు పెట్టుకొని లోన్ మంజూరు చేసారు మేనేజర్ గారు. సరిగ్గా మరో మూడేళ్ళకు ప్రసాద్ చదువు పూర్తయ్యింది. క్యాంపస్ లో ఉద్యోగం వచ్చింది. నెలకోసారి ఊర్లోకు వచ్చేవాడు. మా అందరితో మాట్లాడేవాడు. తన ఆఫీసులోనే శ్రావణి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని , ఆ అమ్మాయికి కూడా తనంటే ఇష్టమని చెప్పేవాడు. మా నాన్న గారు లోన్ వివరాలు అడిగితే క్రమం తప్పకుండా లోన్ కడుతున్నానని చెప్పేవాడు. ఆ తరువాత కొంతకాలానికి ప్రమాదంలో మా నాన్న గారు చనిపోయారు. బిజినస్ లో బజీ అవడం వల్ల నేను వ్యవసాయం చేయించడం తగ్గించేసాను. కుప్పయ్య కూడా పెద్దగా కనిపించేవాడు కాదు. ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదని విన్నాను. ప్రసాద్ కూడా క్రమంగా ఊరికి రావడం తగ్గించాడు, ఫోన్ చెయ్యడం మానేసాడు
ఆలోచనలతోనే బ్యాంకు దగ్గర బైక్ ఆపాను. మేనేజర్ గదిలోకి వెళ్లాను.
“నమస్తే సార్!” నేను సుధీర్ ను, ఇందాక మీరు ఫోన్ చేసారు!”
“వెల్కమ్ సుధీర్! కూర్చోండి!”
“థ్యాంక్స్ సార్!” ఆయన చూపించిన కుర్చీ లో కూర్చొన్నాను.
“కాఫీ, టీ ఏం తీసుకొంటారు?”
“పర్లేదు సార్! చెప్పండి!”
“మీ నాన్న గారు ప్రసాద్ అనే వ్యక్తికి ష్యూరిటీ ఇచ్చారు. మీకు అతను తెలుసా?”
“తెలుసు సార్! అతను నా స్నేహితుడు.”
“అతను మొదట్లో ఆరేడు కంతులు రీపేమెంట్ కట్టి , ఆ తరువాత కట్టకుండా ఆపేసాడు. వడ్డీ తో సహా అతని అప్పు ఆరు లక్షలకు పైగా ఉంది. వాళ్ళింటికి చాలా సార్లు నోటీసుకు పంపాము, అతనికి చాలా సార్లు మెయిల్ పంపాము. కానీ వారినుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. “
“అతను ఊర్లోకు రావడం మానేసాడు సార్! ఫోన్ నంబర్ కూడా మార్చేసాడు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఊర్లో ఉన్నారు.”
“ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా మాతో రావాల్సి ఉంటుంది.”
“అలాగే సార్!”
మేనేజర్ గారు, మరో క్లర్క్, అటెండర్ వీరబాబు, నేను. మొత్తం నలుగరం రెండు బైక్లలో కుప్పయ్య ఇంటికి వెళ్లాం.
ఊరికి దూరంగా ఉన్న వాళ్ళ ఎకరా పొలంలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ప్రసాద్ వాళ్ళ తల్లి దుర్గమ్మ పశువులకు మేత వేస్తూ ఇంటి ముందు కనబడింది. నన్ను చూడగానే గుర్తు పట్టింది.
“బాగున్నావా నాయన!” నన్ను పలకరించింది.
“బాగున్నాను దుర్గమ్మా! కుప్పయ్య ను కలవడానికి బ్యాంకు మేనేజర్ గారు వచ్చారు. “
వెంటనే బయట ఉన్న మంచం వాల్చి “కూర్చోండి , ఆయన్ని తీసుకొని వస్తాను!” అంటూ లోనికి వెళ్ళింది. మేము ఆమె చూపిన మంచం పై కూర్చొన్నాము.
కొద్దిసేపటికి దుర్గమ్మ లోపల నుండి కుప్పయ్యను నడిపించుకొంటూ తీసుకొని వచ్చింది. నాకు తెలిసిన కుప్పయ్యకు, ఇప్పుడు నా ముందు ఉన్న కుప్పయ్యకు చాలా తేడా ఉంది. నాకు తెలిసిన కుప్పయ్య చాలా బలవంతుడు, ధైర్యవంతుడు. కానీ ఇప్పుడు నా ముందు ఉన్న కుప్పయ్య బాగా కృశించిపోయి ఉన్నాడు. నడవడానికి కూడా బయపడుతున్నాడు. ఒక్కో అడుగూ వేసుకొంటూ గసపోస్తూ వస్తున్నాడు. కుప్పయ్యను అలా చూడగానే నా మనసు కకావికలం అయ్యింది.
“మీ అబ్బాయి తీసుకొన్న లోన్ ఇంతవరకూ కట్టనేలేదు, ఆ విషయం గురించి మాట్లాడుదామని వచ్చాను.” చెప్పాడు మేనేజర్.
“అవును సార్! ఈ పొలం, ఇల్లు తాకట్టు పెట్టి, వాడి చదువుకు లోన్ తీసుకొన్నాం. వాడు లోన్ కడుతాడని అనుకొన్నాం. కానీ వాడు లోన్ కట్టకుండా మమ్మల్ని నట్టేట ముంచాడు. “ మేనేజర్ కు రెండు చేతులతో దణ్ణం పెడుతూ చెప్పాడు కుప్పయ్య.
“అతను ఎక్కడ ఉన్నాడో చెప్పండి, మేం అతన్ని పట్టుకొని లోన్ కట్టిస్తాం.” అడిగాడు మేనేజర్.
“హైదరాబాదు లో ఉన్నాడని తెలుసు, కానీ ఆడ ఏడ ఉన్నాడో తెలీదు. పెళ్లి చేసుకొన్నాడని కొందరు చెప్పారు.” దుర్గమ్మ చెప్పింది.
“ఆడికి పెళ్ళాం వచ్చేసరికి కన్న మమ్మల్ని, సొంత ఊరిని, అప్పు ఇచ్చిన బ్యాంకు ని, జామీను పెట్టిన రంగస్వామి గారిని అందర్నీ మరచి పోయాడు సారూ!” రొప్పుతూ , గస పోస్తూ చెప్పాడు కుప్పయ్య.
“పది రోజుల్లో అప్పు కట్టక పొతే ఇంటిని, పొలాన్ని జప్తు చెయ్యాల్సి వస్తుంది.” చెప్పాడు మేనేజర్.
“చాలా కాలంగా ఆడు ఇంటికి రావడం లేదు, ఇక వస్తాడన్న నమ్మకం కూడా లేదు, అప్పు కట్టే శక్తి మాకు లేదు. మీ రూల్సు ఎలా ఉంటే అలా చెయ్యండి. నా జీవితాంతం కట్టపడ్డాను, ఈ పొలాన్ని ఇంటిని సంపాయించాను, ఆడ్ని చదివించాను. చివరి రోజుల్లో నాకు ఏదీ దక్కకుండా పోతా ఉంది.” తన నిస్సహాయతను, నిరాశను వ్యక్తం చేసాడు కుప్పయ్య.
“ఇంటిని జప్తు చేస్తే మీరు ఎక్కడకు పోతారు కుప్పయ్యా?” అడిగాను కుప్పయ్యను.
“ఏడికని చెప్పేది బాబు, వాడు స్థిరపడితే మాకు కట్టాలు ఉండవని అనుకొన్నాం, కానీ ఆడ్ని కన్న పాపానికి మేము రోడ్డున పడాల్సి వస్తా ఉంది. అందుకే లోకంలో నానుడి, ‘కొడుకు స్థిరపడితే, కన్న వాళ్ళు రోడ్డున పడతారని’.”
“మీరు ఈ కాగితాల మీద సంతకం పెట్టండి!” అంటూ ఇద్దరి దగ్గరా సంతకాలు పెట్టుకొన్నాడు క్లర్క్. దుర్గమ్మ కడుపులో బాధను ఆపుకోలేక ఏడ్చేసింది, కుప్పయ్య మాత్రం పైకి కనబడకుండా రోదించాడు. ఈ వయసు లో వాళ్ళ పరిస్థితి చూసి నాకు వారిపై జాలేసింది, ప్రసాద్ పై ద్వేషం పుట్టుకొచ్చింది. వాడ్ని ఎలాగైనా పట్టుకొని బ్యాంకు మేనేజర్ ముందు నిలబెట్టాలని నిర్ణయించుకొన్నా. అదే రోజు సాయంత్రం హైదరాబాదుకు బయలుదేరా.
చాలా పెద్ద కంపెనీ అది. ఐదంతస్తుల భవనం. సెంట్రల్ ఏసీ. బయటవాటికి ప్రవేశం లేదు, సెక్యూరిటీ ను కలిసాను.
“ప్రసాద్ ను కలవాలి!”
“ఏ ప్రసాదు?”
నిజమే అంతపెద్ద కంపెనీలో ఎందరో ప్రసాద్ లు ఉండచ్చు. నా పర్స్ లో ఉన్న అతని పాస్ పోర్ట్ సైజు పోటో గుర్తుకు వచ్చింది. దాన్ని చూపించా.
“ఈ సార్ శ్రావణి మేడంగారి హజ్బెండ్ కదా!” అడిగాడు.
ప్రసాద్, శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని రెండేళ్ళ క్రితం కలిసినప్పుడు చెప్పాడు. అది గుర్తుకు వచ్చి
“అవును, ఒకసారి ప్రసాద్ ను పిలుస్తారా?”
“ఆ సారూ చాలా కాలం క్రితమే ఇక్కడ జాబ్ మానేశారు. వేరే ఎక్కడో పనిచేస్తారు.”
“మరైతే నీకు శ్రావణి గారు తెలుసు కదా!” మళ్ళీ అడిగా.
“తెలుసు సార్! చాలా మంచి మేడం. ఇక్కడ పనిచేసే సార్లు, మేడం లు నన్ను రేయ్ అని, సెక్యూరిటీ అని పిలుస్తారు. ఆ మేడం ఒక్కరే నన్ను బాబాయ్ అని అభిమానంగా పిలుస్తారు.” శ్రావణి గారి గురించి చాలా మంచిగా చెప్పాడు సెక్యూరిటీ.
“ఇంతకీ మీరెవరు?” నన్ను మళ్ళీ ప్రశ్నించాడు.
“నేను ప్రసాద్ స్నేహితుడిని, ప్రసాద్ వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, చివరి రోజుల్లో ఉన్నాడు. ఆ విషయం చెబుదామని వచ్చాను.”
“శ్రావణి మేడం గారు ఆరునెలల నుండి ఆఫీస్ కు రావడం లేదు. మెటర్నటీ లీవు పెట్టారు.”
“పోనీ , వాళ్ళు ఎక్కడుంటారో చెబితే!”
“ఇక్కడకు దగ్గరలోనే గ్రీన్ హౌస్ అపార్ట్మెంట్ లో ఉంటారు.” అంటూ అడ్రస్ చెప్పాడు.
సెక్యూరిటీ చెప్పిన దాని ప్రకారం శ్రావణి మంచిదే. తప్పు ప్రసాద్ దగ్గరే ఉన్నట్టు అనిపించింది. అతను చెప్పిన అపార్ట్మెంట్ కు వెళ్ళా. హౌస్ నంబర్ తెలుసుకొని కాలింగ్ బెల్ నొక్కా.
“ఎవరూ?” పాతికేళ్ళ అమ్మాయి తలుపు తీసింది. లోన ఉయ్యాలలో పాప నిద్రపోతూ ఉంది.
“ప్రసాద్ వాళ్ళ ఇల్లు?”
“ఇదే ప్రసాద్ వాళ్ళ ఇల్లు, నేను ప్రసాద్ వైఫ్ ను. మీరు?”
“నా పేరు సుధీర్, ప్రసాద్ స్నేహితుడిని.”
“అంటే ప్రసాద్ చిన్నప్పటి ఫ్రెండ్, సర్పంచ్ గారి అబ్బాయి!”
నా వివరాలు తెలిసినట్టు ఉంది. నన్ను గుర్తుపట్టింది.
“అవును, నేనే ఆ సుధీర్ ను.”
“రండి అన్నయ్యా! ఆయన మీ గురించి చాలా సార్లు చెప్పారు. కాఫీ తీసుకొని వస్తాను, కూర్చోండి.”
“ఇప్పుడు అవేవీ వద్దమ్మా! ప్రసాద్ ఇంట్లో లేడా?”
“లేరు, ఆయనకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు, ట్రైనింగ్ కోసం పూణే కు పంపారు. మరో వారం రోజుల్లో వచ్చేస్తారు. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా!”
“అవునమ్మా, ప్రసాద్ వాళ్ళ అమ్మా,నాన్న చనిపోయారు. ప్రసాద్ ఫోన్ నంబర్ లేకపోవడం వల్ల, అడ్రస్ తెలియక పోవడం వల్ల చెప్పలేక పోయాం. ఇప్పుడు ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని వెతుక్కొంటూ ఇంత దూరం రావాల్సి వచ్చింది!”
ఆ మాట వినగానే శ్రావణి నివ్వెరపోయింది. కొన్ని సెకన్ల పాటు షాక్ లో ఉండి ఆ తరువాత తేరుకొంది.
“చనిపోయారా! ఎందుకు చనిపోయారు? ఎప్పుడు జరిగింది?” కంట్లో నుండి ధారగా వస్తున్న నీటిని అప్రయత్నంగా తుడుచుకొంటూ అడిగింది.
“వారం క్రితం, సూసైడ్ చేసుకొన్నారు!”
“సూసైడ్ చేసుకోన్నారా!” ఆశ్చర్యాన్ని, భయాన్ని, బాధను కలగలిపి అడిగింది.
“అవునమ్మా! ప్రసాద్ చదువుల కోసం బ్యాంకు నుండి లోన్ తీసుకొన్నారు. ఆ లోన్ తిరిగి కట్టకపోయేసరికి బ్యాంకు వాళ్ళు ఇంటిని, పొలాన్ని జప్తు చేసారు. దాంతో ప్రసాద్ వాళ్ళ అమ్మా, నాన్న రోడ్డున పడ్డారు. ఎంతో పరువుగా బ్రతికిన వాళ్ళు ఇలా జరిగేసరికి అవమాన భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.” అబద్ధాలన్నీ ఏర్చి, కూర్చి ఆమెకు చెప్పాను.
“పెళ్ళైన కొత్తలో ఆయన్ని అడిగితే లోన్ కడుతున్నానని, మామగారికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నానని చెప్పేవారు. డబ్బు విషయాలన్నీ ఆయనే చూసుకొనే వారు. నా ATM కార్డ్ కూడా ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది. అందుకే నేను ఆ ఆతరువాత ఈ విషయం గూర్చి ఆయన్ని ప్రత్యేకంగా ఎప్పుడూ అడగలేదు.”
“అతను నీకు అబద్ధం చెప్పాడో, లేక నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావో నాకు తెలీదు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ప్రసాద్ నుండి వాళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి ఆర్ధిక సాయం అందడం లేదు. ఏడాది నుండి ప్రసాద్ తన తల్లిదండ్రులతో కాంటాక్ట్ లో లేడు.”
“కానీ ఇవన్నీ నాకు తెలియదు అన్నయ్యా, తెలుసుంటే అంత ఘోరం జరగనిచ్చే దాన్నికాను. “
“కనీసం నువ్వు కూడా పెళ్లి తరువాత మీ అత్తగారిని, మామగారిని కలవలేదు, వారి ఆశీస్సులు తీసుకోలేదు. కనీసం మీకో బిడ్డ పుట్టినప్పుడయినా వారికి ఆ తీపి కబురు చెప్పనేలేదు!” తననే సూటిగా చూస్తూ అడిగా.
“తన సొంత ఊరికి తీసుకొని వెళ్ళమని నేను ఆయన్ని చాలా సార్లు అడిగాను. ఈరోజు, రేపు అంటూ ఆయన తాచ్చారం చేసారు. ఇంతలోనే నేను ప్రగ్నంట్ కావడం, నెలలు నిండకుండానే పాప పుట్టడం, మొదలైన కారణాల వల్ల అత్తగారు, మామగారు గురించి అడగలేదు. ఆయన్ని చదివించడం కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారని ఆయన చెప్పేవాడు. ఇవ్వాళ ఆయన మంచి స్థాయిలో ఉండి కూడా వారికి భరోసా ఇవ్వలేకపోయాం.” అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.
సెక్యూరిటీ చెప్పినదాన్ని బట్టి, ఇప్పుడు చూస్తున్నదాన్ని బట్టి శ్రావణి మంచిదే అనే నిర్ధారణకు వచ్చాను. తప్పంతా కచ్చితంగా ప్రసాద్ లోనే ఉంది. ఏరు దాటాక తప్ప తగలేసినట్టు, అవసరం తీరిపోయాక కన్నవారిని, సొంత ఊరిని, విస్మరించాడు. ఏడుస్తున్న శ్రావణి ను చూస్తోంటే జాలేసింది.
“బాధపడకమ్మా! వారు చనిపోయారని నేను చెప్పింది అబద్దం. అది తప్ప తక్కినదంతా నిజం.”
“అంటే వారు బ్రతికే ఉన్నారా! బాగున్నారా!!” ఆమె కళ్ళలో సంతోషపు వెలుగు కనబడింది.
“బాగానే ఉన్నారు! చావుకు చాలా దగ్గర్లో!”
“మమ్మల్ని క్షమించండి అన్నయ్యా! వెంటనే ఆయనకు ఫోన్ చేస్తాను. లోన్ విషయం గుర్తు చేస్తాను.”
“మరచిపోయినవాడికి గుర్తు చెయ్యచ్చు. మరచిపోవాలని అనుకొంటూ ఉన్నవాడికి గుర్తు చెయ్యడం వృధా అవుతుంది.”
“మీరు చెప్పింది నిజమే, మా ప్రవర్తన పట్ల నాకు చాలా గిల్టీ గా ఉంది!” తల దించుకొంటూ చెప్పింది శ్రావణి.
“లోన్ గురించి ప్రసాద్ ను ఏమీ అడగద్దు, నేను వచ్చిన విషయం కూడా అతనికి చెప్పద్దు. అతను ట్రైనింగ్ నుండి తిరిగి రాగానే వాళ్ళ అమ్మగారు చనిపోయారని నేను టెలిగ్రాం పెడతాను. అది చూసాక అతను ఎలా స్పందిస్తాడో చూద్దాం. అతడు తల్లిదండ్రులను అశ్రద్ద చేసాడో! లేక అవసరం లేదనుకోన్నాడో!!”
“అలాగే అన్నయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆయన రాగానే మీకు కాల్ చేస్తాను, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. నా నంబర్ నోట్ చేసుకోండి. లోన్ గురించి మామగారికి ధైర్యం చెప్పండి. అవసరమయితే నా నగలు ఆమ్మేసి అయినా అప్పు కడతామని చెప్పండి.”
*********
అనుకొన్నట్టు గానే వారం రోజుల తర్వాత ప్రసాద్ వాళ్ళ అమ్మ చనిపోయిందని ప్రసాద్ కు టెలిగ్రాం పెట్టా. టెలిగ్రాం పెట్టిన మరుసటి రోజే ప్రసాద్, శ్రావణి వాళ్ళ పాపను తీసుకొని కార్ లో ఊరికి వచ్చారు. నేను వారి కోసమే ప్రసాద్ ఇంటిదగ్గర ఎదురుచూస్తూ ఉన్నా.
ప్రసాద్ ఇంటికి రాగానే ఆరోగ్యంగా వంట చేస్తూ ఉన్న తన తల్లిని చూసాడు. అతని ముఖంలో సంతోషం, ఆశ్చర్యం సమపాళ్ళలో కనబడింది. ఆవెంటనే అతని ముఖం పై కోపపు రంగు అలుముకొంది. కోపంగా నావైపుకు దూసుకొని వచ్చి “ఎందుకు అబద్ధం చెప్పావ్? మా అమ్మ చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావ్?” నన్ను ప్రశ్నించాడు. నేనేమీ మాట్లాడలేదు.
“మేము బ్రతికుండగా నువ్వు ఎలాగూ రావు! కనీసం చచ్చాక అయినా తలకొరివి పెట్టడానికి వస్తావో, రావో పరీక్షిద్దామని నేనే టెలిగ్రాం పెట్టమన్నాను.” లోపల నుండి రెండు కర్రల ఆసరాతో అతి కష్టం మీద వచ్చాడు కుప్పయ్య.
“నాన్న! అలా మాట్లాడకండి నాన్న, నేను ఇంటికి రాక పోవడం తప్పే……”
“ఇంటికి రాకపోవడం మాత్రమే కాదు, కన్నవాళ్ళు బ్రతికున్నారో, లేక చచ్చారో కూడా మరచిపోయావు నువ్వు. నీకు సహాయం చేసిన రంగస్వామి గారిని, అప్పు ఇచ్చిన బ్యాంకు ను మరచిపోయావు. మాకు మాటమాత్రం కూడా చెప్పకుండా పెళ్లిచేసుకోన్నావు, ఆఖరకు మాకో మనమరాలు పుట్టిందన్న విషయాన్ని కూడా చెప్పలేదు నువ్వు.” ఆక్రోశించింది దుర్గమ్మ.
“నన్ను క్షమించండి అమ్మా! మిమ్మల్ని అశ్రద్ద చేసానే గానీ, మీ మీద అభిమానం లేక కాదు!”
“నీలాంటి కొడుకులు కన్నవారు బ్రతికున్నప్పుడు అభిమానం చూపరు, చచ్చిపోయాక మాత్రమే చూపగలరు.” తన మాటల దాడిని పెంచారు కుప్పయ్య.
“అంతమాట అనకండి నాన్న!”
“ఈ సుధీర్ బాబు లేకపోతే అంతపనీ జరిగుండేది. బ్యాంకు వాళ్ళు ఇంటిని, పొలాన్ని జప్తు చేస్తాం అన్నారు. అదే కనుక జరిగుంటే ఆ బాధతో నేను, మీ నాన్న పురుగులు మందు తాకి చచ్చిపోదాం అనుకొన్నాం. అప్పుడు ఈ సుధీర్ బాబే మాకు ధైర్యాన్ని చెప్పాడు. నిన్ను ఎలాగైనా రప్పిస్తానని మాకు మాట ఇచ్చాడు.” నా వైపు కృతజ్ఞతగా చూస్తూ చెప్పింది దుర్గమ్మ.
“చాలా థాంక్స్ సుధీర్. నా తప్పును తెలియచేసావు. నా కర్తవ్యాన్ని గుర్తు చేసావు. ఆ రోజు మీ నాన్న గారు బ్యాంకు లో లోన్ ఇప్పించి నాకు బ్రతుకును ఇచ్చారు. ఈ రోజు నువ్వు నా కన్నవారిని బ్రతికుండేలా చేసావు. నీ మేలు మరచిపోలేను.”
“నన్ను ఆశీర్వదించండి అత్తయా!” దుర్గమ్మ కాళ్ళ మీద పడింది శ్రావణి.
తన మనమరాలిని ముద్దులాడాడు కుప్పయ్య. తన మనమరాలు తాతయ్య పోలికా? లేక నాన్నమ్మ పోలికా?? అని గొడవపుతున్నారు ముసలోళ్ళు ఇద్దరూ. నేను, ప్రసాద్ ఇద్దరం బ్యాంకు మేనేజర్ ను కలవడానికి బయలుదేరాం.

********* స్వస్తి *********

మీ
పేట యుగంధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked