సారస్వతం

జ్యోతిష సారము

– Murali Vadavalli

‘నువ్వు జ్యోతిషం నేర్చుకోవడం మొదలుపెట్టి ఎన్నేళ్ళయ్యింది?’

‘పాతికేళ్ళు’.

‘ఈ పాతికేళ్ళలో ఏమి నేర్చుకున్నావో స్థూలంగా చెప్పగలవా?’

‘తప్పకుండా. నేను తెలుసుకున్నవాటిలో నిజంగా పనికొచ్చేది ఒక్కటే ఉంది. అది తెలుసుకున్నాక ఇక జ్యోతిషంతో పనిలేదని కూడా తెలిసింది.’

‘అలాగా, అదేమిటో కాస్త చెప్పుదూ.’

‘అలాగే, విను. జ్యోతిషమంటే జనసామాన్యంలో ఉన్న అభిప్రాయమేమిటంటే, దాన్ని ఉపయోగించి మన జీవితంలోని కష్టనష్టాల్నీ, వాటికి పరిష్కారాలనీ, అలాగే సుఖపడే యోగాలనీ, అవి కలిగే సమయాన్నీ తెలుసుకోవచ్చని. ఈ వివరాలన్నీ చాలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చని. నేను మొదటగా గ్రహించినదేమిటంటే, ఈ అభిప్రాయం కొంతమటుకు నిజమే కానీ, కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యడం వల్ల ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాదని. ఉదాహరణకి, ఒకాయన వచ్చి మా అబ్బాయికి పదో తరగతిలో లెక్కల్లో ఎన్ని మార్కులు వస్తాయో జాతకం చూసి చెప్పగలరా అని అడిగాడనుకో‍. అది జాతకం ద్వారా తెలిసే విషయం కాదు. అలాగే, నేను ఇల్లు కొనుక్కోవాలి. హైదరాబాదులో, ఏ ప్రదేశంలో, ఏ వీధిలో, ఎన్నో ఇల్లు నాకు దొరుకుతుందో జాతకం ద్వారా చెప్పమంటే అది కూడా జరిగే పని కాదు.

శాస్త్రం ద్వారా తెలిసేవి కొన్ని స్థూలమైన వివరాలు మాత్రమే. పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆ సంవత్సరం చదువులో ‘గుర్తించగలిగేంత’ (above average) విజయాన్నో, అపజయాన్నో సాధించే పరిస్థితి జాతకంలో కనిపిస్తే కనిపించవచ్చు. అలాగే ఒక వ్యక్తి ఇల్లు కోసం గట్టి ప్రయత్నం చేసి సాధించే పరిస్థితి ఉంటే జాతకంలో కనిపించవచ్చు. కానీ చాలా వివరంగా చెప్పడం సాధ్యపడదు.’

‘అయితే జాతకం ద్వారా విహంగ వీక్షణం మాత్రమే చెయ్యగలం, సూక్ష్మ వివరాలు తెలుసుకోలేం అంటావు.’

‘అవును. కానీ అదే విషయాన్ని నేను కొంచం గట్టిగా బయటకి చెప్పిన సందర్భం ఒకటి వచ్చింది ఇదివరకు. అప్పుడు ఒకాయన నాకు పరిచయమై, జ్యోతిషం ద్వారా అతి సూక్ష్మ వివరాలు కూడా తెలుసుకోవడం సాధ్యమే అని నాకు నిరూపించాడు. ఆ వివరాల్లోకి ఇప్పుడు వెళ్ళనవసరం లేదు కాని, ఒకటి మాత్రం చెప్పగలను. సూక్ష్మవివరాలు తెలుసుకోడానికి శాస్త్రాధ్యయనం ఒక్కటే చాలదు. దానికి మంత్రోపాసన కావాలి. నేనా మార్గంలోకి వెళ్ళలేదు.’

‘అలాగా, సరే. మరి నువ్వు తెలుసుకున్న సంగతి ఏమిటో చెప్పు మరీ.’

‘ఒక్క మాటలో చెప్పాలంటే, జ్యోతిషాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం వల్ల నాకు ‘కర్మ స్వరూపం’ కొంత‌ అర్థమైంది. అది అర్థమయ్యాక ఇక లౌకికమైన‌ జ్యోతిషంతో పని ఉండక్కరలేదని నా అభిప్రాయం. పైగా ఇది అర్థం చేసుకోడానికి చాలా సులభమైన విషయం కూడానూ. అదేమిటో విను.

కర్మ అంటే ఒక లావాదేవీ (transaction). అది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి, నీకు అనుకూలమైన వ్యక్తులూ, పరిస్థితుల రూపంలో ఉంటుంది. రెండు, ప్రతికూలమైన పరిస్థితులూ, మనుషులూను. మూడు, నీ అధీనంలో ఉండి, నువ్వు పెత్తనం చలాయించగల మనుషులూ, పరిస్థితులుగా ఉంటుంది.’

‘ఓస్, ఇంతేనా.’

‘జాగ్రత్తగా విను. మొదటిదాన్ని ధనాత్మకమైన కర్మ (ధనకర్మ) అందాం. రెండో దాన్ని ఋణకర్మ అనీ, మూడోదాన్ని అధికారం అనీ అందాం. ఇవి ప్రతి వ్యక్తి జీవితంలోనూ చాలా లోతుగా పని చేస్తుంటాయి. వీటిని గమనికలోకి తెచ్చుకోడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. కొన్ని ఉదాహరణలు చెప్తాను విను. సంపద, తనకి ఉపకారం చేసిపెట్టే బంధువులూ, స్నేహితులూ ఇవన్నీ ధనకర్మ. తాను ఒదిగి ఉండాల్సిన పరిస్థితులూ, తనపైన పెత్తనం చేసే వ్యక్తులూ, తన ధనాన్నీ, సమయాన్నీ, కష్టాన్నీ ఖర్చుచేసి తీరవలసిన పరిస్థితులూ ఋణకర్మ.

ఇక అధికారం అంటే, తాను పూనుకుని ముందుకు నడిపించాల్సిన పరిస్థితులూ, అందుకోసం తనతో/తన క్రిందా పనిచేసే వ్యక్తులూ, వాళ్ళకి ఉపకారమైనా అపకారమైనా చెయ్యగలిగే స్వేచ్ఛ తనకి ఉండడమూను. ఈ అధికారాన్ని ఎలా చెలాయించాం అన్నదాని మీద ఆధారపడి మళ్ళీ కొత్తగా ధన, ఋణ కర్మలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏ వ్యక్తి జీవితంలోని ఏ భౌతిక‌ పరిస్థితినైనా ఈ మూడింట్లో ఒకదానిగా జమ కట్టవచ్చు. అలా జమ కట్టలేని భౌతిక‌ పరిస్థితి ఏదీ ఉండదని కూడా చెప్పగలను.’

‘బానే ఉంది. కానీ, ఇందులో పెద్ద విషయం ఏముంది? దీన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది?’

‘జ్యోతిషం ద్వారా ఒక మనిషికి ఏ ఏ జీవిత విభాగాల్లో పైన చెప్పిన‌ ఏ ఏ విధమైన కర్మ పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది.’

‘అది అందరూ చెప్పే మాటే కదా. నీకు ప్రత్యేకంగా తెలిసిన సంగతి ఏముంది?’

‘నాకు ప్రత్యేకంగా తెలిసిన సంగతి ఏమీ లేదు. నిజానికి పైన చెప్పిన కర్మ పరిస్థితుల్ని మన జీవితంలో మనం గమనించుకోడానికి జ్యోతిషంతో పని లేదు. కొంచం ఆలోచించుకుంటే చాలు. కానీ, జ్యోతిషం ద్వారా ఇంకొక్క విశేషం కూడా తెలుస్తుంది. అదేమంటే, పైన చెప్పిన కర్మ పరిస్థితులు ఉన్నాయే, అవి ప్రతి జీవితంలోనూ ఎంతో కొంత‌, ఎప్పుడో అప్పుడు మారుతూ ఉంటాయి అని. ఉదాహరణకి, ఒక వ్యక్తి కొంతకాలం ఆర్థికంగా ఇబ్బందులు పడవచ్చు, కానీ, తర్వాత అతనికి కలిసి రావచ్చు. అలాగే, ఒక వయసులో ఆరోగ్యం బాగుండక పోవచ్చు, తర్వాత బాగు పడవచ్చు. వ్యాపారంలో అంతా అనుకూలంగా ఉండి, హఠాత్తుగా తిరగబడిపోవచ్చు. ఇట్లాంటి మార్పులు వచ్చే కాలాల గురించి జ్యోతిషం ద్వారా కొంతమటుకు తెలుసుకోవచ్చు.’

‘ఇందులోనూ పెద్ద కొత్త విషయం ఏమీ లేదు. కాళిదాసు అన్నాడుగా, ‘కస్యైకాన్తం సుఖముపనతం దుఃఖమేకాన్తతో వా, నీచైర్గచ్ఛత్యుపరి చ దశా చక్రనేమి క్రమేణ’ అని. అంటే, ఈ ప్రపంచంలో కేవలమూ సుఖమేగానీ, కేవలమూ దుఃఖమేగానీ అనుభవించినవాడు ఎవడున్నాడు? అందరికీ కొంతకాలం సుఖమూ, కొంతకాలం దుఃఖమూ చక్రభ్రమణం లాగ వస్తూ పోతూనే ఉంటాయి అని.’

‘అవును. ఇట్లా మార్పులు వచ్చే సందర్భాల్ని కూడా మనకి మనమే గమనించుకోవచ్చు, ఏ జ్యోతిషమూ అక్కర్లేకుండానే. మార్పు వచ్చే సమయం వచ్చినప్పుడు మనకి కొత్త ఆలోచనలూ, కొత్త పరిచయాలూ కలిగి నూతన కార్యాచరణంలోనికి దిగడం జరుగుతుంది. అయితే ఈ విధమైన మార్పు మొదలయ్యాకే మనం గమనించుకోగలం. జాతక పరిశీలన చేసుకుంటే, మార్పులు కలిగే కాలాల్ని కొంచం ముందుగా పసిగట్టి, ఒక హెచ్చరికగా తీసుకోవచ్చును. కానీ, మార్పు వస్తుందని, అది కొంతమటుకు ఈ విధంగా ఉంటుందనీ స్థూలంగా మాత్రమే మనం జాతకం ద్వారా గ్రహించగలం. సూక్ష్మంగా చెప్పలేము.’

‘ఒక ప్రతికూలమైన మార్పు ఏదో వస్తోందని జాతకం ద్వారా తెలిసిందనుకో, దాన్ని తప్పించుకోగలమా?’

‘తప్పించుకోలేము. గ్రహశాంతులవంటివి చేయించవచ్చును అని పెద్దలు అంటారు కాని, నాలాంటి జీవులు కర్మనుంచి తప్పించుకోగలరు అంటే నేనే నమ్మలేను.’

‘మరి ఇంక జ్యోతిషం వల్ల ఉపయోగమేముంది?’

‘తొందర పడకు. జ్యోతిషాన్ని అధ్యయనం చెయ్యడంవల్ల నేను గ్రహించినది ఏమంటే, మన భౌతిక పరిస్థితులన్నీ లావాదేవీలుగా ఉన్నాయనీ. అందులో ధనకర్మ కోసమూ, అధికారం కోసమూ మనం చాలా ఆరాటపడతాము అనీ, ఋణకర్మ అంటే చాలా భయపడతాము అనీ. అంతే కాదు, మార్పుని ఆపలేము అని కూడా తెలిసింది. కానీ, ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం ఉంది. జ్యోతిషం చెప్పేది భౌతికమైన కర్మ పరిస్థితుల గురించి మాత్రమే. మన మనస్సు గురించి కాదు. పైన చెప్పిన మూడు రకాల లావాదేవీలు ఉన్నాయే, అవి భౌతికమైనవే కాదు, మానసికమైనవి కూడాను.’

‘అంటే?’

‘నీకు ధనకర్మో, అధికారమో నడుస్తూ ఉందనుకో. నువ్వు అహంకరిస్తావు. నీకన్న చిన్నవాళ్ళ పట్ల తిరస్కారభావం వహిస్తావు. లేదా, అన్యాయాలు చేస్తావు. అప్పటికప్పుడు నీకు ఏమీ జరగదు. కాలం నీకు అనుకూలంగా ఉందిగా, అందుకని. అలాగే నీకు ఋణకర్మ నడుస్తూ ఉందనుకో. అప్పటికి నువ్వు నోరు మూసుకుని కూర్చున్నా, మనసులో పగబడతావు. నాకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు వీడి అంతు చూస్తానని మనసులో కసి పెట్టుకుంటావు. ఇదంతా మనం మనసులో పోగేసుకునే కర్మ.

జాతకంలో మార్పులు వచ్చే కాలాలు తెలుస్తాయని చెప్పాను కదా. ఆ మార్పులు ఎలా వస్తాయో తెలుసా? గ్రహాలు ఎలా పని చేస్తాయో తెలుసా? గ్రహాలంటే చిత్రగుప్తులు, అంటే ఆడిటర్లు. మన జీవితంలోని ఒక్కో విభాగానికి చెందిన గ్రహం ఒక్కో కాలంలో మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే, ఆ విభాగంలో మార్పు తీసుకొస్తుంది. మన ఖాతాలో కొంత సొమ్ము ఉందనుకో, దాన్ని ఖర్చు పెట్టుకోమని ఇస్తుంది. అప్పటిదాకా మనసులో కసి పెంచుకుని ఉన్న మనం, ఒక్కసారిగా సొమ్ము చేతిలో పడేసరికి ఏం చేస్తామో నువ్వే ఊహించుకోవచ్చు. అలాగే, అప్పటి దాకా ఉన్న అనుకూలమైన పరిస్థితిని ఆసరాగా చేసుకుని మనం విర్రవీగి చేసుకున్న‌ ఋణం ఉంటుందే, దాన్ని వెంటనే కట్టేలాగ ఆదేశిస్తుంది. అప్పటిదాకా మనం చెలాయించిన అధికారాన్ని రద్దుచేసి, మనం ఇబ్బంది పెట్టిన వాడికే మనమీద అధికారాన్ని ఇస్తుంది. అంతా తలకిందులౌతుంది.’

‘జాతకం ద్వారా ఈ విధమైన, సమూలమైన మార్పులు వచ్చే కాలాలు ఎలా తెలుస్తాయో కొంచం చెప్పరాదూ?’

‘దానికి కొంచం వివరంగా చెప్పాలి. మరొక సందర్భంలో ఆ వివరాలు చెప్తాను కానీ, ఇక్కడ అసలు విషయం నువ్వు గ్రహించినట్టు లేదు. భౌతికమైన కర్మ ఒక పక్క నడుస్తుండగా, మరో పక్క‌ మనం మానసికంగా కర్మని పోగేసుకుంటున్నామని. దాని ఫలితంగా చిత్రగుప్తులు మన దగ్గరకి వచ్చినప్పుడు, వాళ్ళకి మన కర్మని రద్దుచేసే అవకాశం ఇవ్వకుండా, కొత్త కర్మని ఇచ్చి తీరవలసిన‌ పరిస్థితిని కల్పిస్తున్నామని. అర్థమైందా?’

‘ఆ, అర్థమౌతున్నట్టే ఉంది.’

‘ఒక మార్పు జీవితంలో ప్రారంభం అవుతోందని తెలియగానే గ్రహించవలసింది ఏమిటంటే, ఒక చిత్రగుప్తుడు మనకి సన్నిహితంగా వచ్చాడని. అప్పుడు మనకి కొత్త అవకాశాలు కనిపించడం, మనసు వాటి వెనక పరుగులు పెట్టడం జరుగుతుంది. మనం పోగుచేసుకున్న‌ మానసిక కర్మకి అనుగుణంగానే ఆ అవకాశాలు ఫలితాలుగా పరిణమిస్తాయి. అంటే మనం దెబ్బతినడమో, లాభపడడమో జరుగుతుంది. మనం మానసిక జీవులం కాబట్టి, మనకి మనసుని దాటడం సాధ్యం కాదు కాబట్టి, కర్మని దాటలేమని అనుకుంటాము.

కానీ, ఒక్కటి గ్రహించు. ఒక మనిషి గురించి, ఒక పరిస్థితి గురించి ఏ విధమైన భావన మన‌ మనసులో చేయగలం అన్నది పూర్తిగా మన చేతిలోనే ఉన్నది. మనం ఒక అన్యాయానికి గురి అయితే, పగబట్టవలసిన అవసరం లేదు. పోనీలే అని సర్దుకుపోవచ్చు. ఒకడు మనకి ఉపకారం చేస్తే, అది నా జాతకం అని అహంకరించి, మరెవ్వరికీ దానిలో భాగం పెట్టకుండా స్వార్థపడక్కరలేదు. భగవత్ప్రసాదం అని పదిమందితోనూ పంచుకోవచ్చు. ఒకడు మనకి అధికారమిస్తే, విర్రవీగి అందరితోనూ ఊడిగం చేయించనక్కరలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని, పదిమందికి శిక్షణ ఇచ్చి, పైకి తీసుకురావచ్చును.

మనసులో కర్మని సృష్టించుకోవాలా, వద్దా అన్నది ఎప్పుడూ మన చేతి లోనే ఉన్నది. గ్రహాల చేతిలో లేదు. అది గ్రహించి, మనం మనసుని చక్కజేసుకుంటే చాలు. భౌతిక పరిస్థితులు ఎప్పుటికైనా మారవలసినవే. అవి ఎలా మారుతాయి అన్నది మన చేతిలోనే, ఈ ప్రస్తుత క్షణంలోనే, మన ప్రవర్తన మీదనే ఆధారపడి ఉన్నదని గ్రహిస్తే చాలు. అదే నాకు తెలిసిన మహా విషయం. కొత్తది కాదు. కొత్తగా తెలిసింది. అంతే.’

‘బాగుంది. చాలా బాగుంది. మరి మనసుని చక్కజేసుకోవడం నిజంగా సాధ్యమే అంటావా? అది మన చేతిలో నిజంగా ఉందనే అంటావా?’

‘అదీ అసలైన ప్రశ్న. ఆ ప్రశ్ననే గట్టిగా పట్టుకో. అలా పట్టుకోగా, పట్టుకోగా ఏమౌతుందో తెలుసా?’

‘ఏమౌతుంది?’

ఆ ప్రశ్నకి సంబంధించిన మానసిక కర్మని నువ్వు పోగేసుకుంటావు. ఏదో ఒక శుభ ఘ‌డియలో ఆ ప్రశ్నకి సంబంధించిన చిత్రగుప్తుడు నీ దగ్గరకి వస్తాడు. ఒక మహానుభావుని పాదాలదగ్గరకి నిన్ను తీసుకునిపోతాడు. ఆ పాదాలు నీ మనసులోకి ప్రవేశించి స్థిరపడిపోతాయి. ఇక నీ మనసుకి కర్మ ఉండదు. ఆ పాదాలే ఉంటాయి. మానసికమైన కర్మ లేకపోతే భౌతికమైన కర్మ కూడా లేదు. శుభాశుభాలు మనస్సుకి సంబంధించినవి. భౌతిక పరిస్థితులకి సంబంధించినవి కావు. శ్రీరాముడూ, ధర్మరాజూ ఇంకా మన కాలంలో శ్రీరామకృష్ణులూ, రమణమహర్షీ మొదలైనవాళ్ళ జీవితాలు భౌతికంగా సుఖమైనవి ఏమీ కావు.’

‘ఆహాహా, ఇప్పుడు చక్కగా అర్థమైంది. నిజంగానే ఏది తెలుసుకుంటే జ్యోతిషంతో పని లేదో, ఆ విషయమే చెప్పావు. మనందరి మనస్సులలోనూ ఆ పాదాలే నిలవాలని ప్రార్థన చేద్దాము.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked