కవితా స్రవంతి

తోడు-నీడ వారికి వారే!

– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

నాన్నలేని అమ్మ ఎక్కడుంది ….ఆలోచించి చూస్తే!
అమ్మలేని నాన్న ఎక్కడున్నారు….అవలోకించి చూస్తే!
లేచినవెంటనే మంగళసూత్రాలను కళ్ళకద్దుకొంటూ అమ్మ,
అమ్మకళ్ళను సూత్రాలనుంచే చుంబిస్తూ నాన్న,
తనుకలిపిన మొదటికప్పు కాఫీని అందిస్తూఅమ్మ,
బెడ్ కాఫీని చిరునవ్వుతో అందుకుంటూ నాన్న!
అమ్మ స్నానంచేసి వచ్చేసరికి పువ్వులు కోసిఉంచిన నాన్న,
నాన్నకోసిన పువ్వులతో పూజమొదలెడుతూ అమ్మ!
అమ్మ పూజముగించుకొనివచ్చి టిఫిన్ ఇచ్చేసరికి
అమ్మ వంటకు కావాల్సిన కూరగాయలు కొనితెచ్చి,
సమయానికి అమ్మకు అందించే నాన్న!
అమ్మ అడగకుండానే పిల్లలకు కావలసినవి కొనిపెట్టమంటూ
అమ్మచేతిలో డబ్బుంచిమరీ ఆఫీసు కు వెళ్ళేనాన్న!
వస్తున్నప్పుడు ఏంతేవాలంటూ ప్రేమగా
మధ్యలోఒకసారి అమ్మకు ఫోన్చేసే నాన్న!
పిల్లల్ని అలాతిప్పివద్దాం పదండి అంటూఅమ్మ,
మారు మాట్లాడకుండా,విసుక్కోకుండా,
వచ్చినవెంటనే షికారుకు తీసుకొనివెళ్ళే నాన్న!
అర్ధరాత్రి నిద్రలో పిల్లలులేచి ఏడుస్తుంటే
అమ్మకు నిద్రాభంగం కలగకుండా ఉండాలని
తన భుజంపై వేసుకొని పిల్లల్ని పడుకోపెట్టిన నాన్న!
పిల్లల్ని చదువులకై హాస్టల్ లో ఉంచినప్పుడు
వ్యధ చెందుతున్న అమ్మని ఓదారుస్తూ నాన్న!
తమ ఆశలపై నీళ్ళు చల్లినట్లుగా
పిల్లలు వారి ఇష్టం వచ్చినట్లుగా
వారి వైవాహిక జీవితభాగస్వామిని ఎంచుకున్నప్పుడు,
కళ్ళముందే కట్టుకున్న కలలమేడలు కూలిపోయాయంటూ
అనంతంగా రోధిస్తూ అమ్మ,
పిల్లల వైపునుండి వాదిస్తూ,
వారి పరిస్థితులు,మనఃస్థితులూ అమ్మకు వివరిస్తూ,
వైరాగ్యాన్ని,కర్తవ్యాన్ని అమ్మకు తెలియచేస్తూ,నాన్న!
దూరమైపోయారండి పిల్లలంటూ అమ్మ ఏడుస్తుంటే,
నేరంకాదది,సహజం అంటూ ఓదారుస్తూ,
అమ్మకు సంసారరహస్యం విడమరిచిచెబుతూ, నాన్న!
మనం మన అమ్మానాన్నలను విడిచి రాలేదా,
మన నిత్య జీవితంలో వాళ్ళను మరిచి పోలేదా?
వీళ్ళు కూడా అంతే,మనని అనుసరిస్తున్నారంతే,
అంటూ అమ్మకు నిజాలను బోధిస్తూ,నాన్న!
కళ్ళనీళ్ళతో అమ్మ,ఆ నీళ్ళు తుడుస్తూ నాన్న!
ఒంటరిగా అమ్మ,తనకు జంటగా నేనున్నానంటూ నాన్న!
భయంతో అమ్మ, అభయాన్నిస్తూ నాన్న!
విరక్తితో అమ్మ, ఆసక్తిని పంచుతూ నాన్న!
తేరుకున్న అమ్మ,నాన్నఒడిని చేరుకున్న గుమ్మ!
ఇక్కడ భారంగా…..
తలుపులు విడిచిపోయిన గుమ్మాల్లా బోసిగా మిగిలిన అమ్మానాన్నలు !
ఎక్కడికో దూరంగా……
గుమ్మాలను విడిచిపెట్టిపోయిన తలుపుల్లా వెళ్ళిపోయిన పిల్లలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked