కథా భారతి

నిర్ణయం

– పాలెపు బుచ్చిరాజు

సాగర్ తో తన పెళ్లి ఇలా బెడిసి కొడుతుందని అనుకోలేదు జలధి. అన్నయ్య అయితే అమ్మానాన్నలని కాదని కులంగాని పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబం నుంచి వేరుపడి వేరే కాపురం పెట్టాడు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకునే అందరు తలిదండ్రుల లాగే వారిద్దరూ చాలా కృంగి పోయారు. వాళ్ళని మరింత నిరాశ పరచడం ఇష్టం లేక, వాళ్ళు చూపించిన సంబంధమే చేసుకోవడానికి ఒప్పుకుంది జలధి. సాగర్ తలిదండ్రులు బాగా డబ్బున్నవాళ్ళు. అతను ఎం టెక్ . చదివి, వైజాగులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అందంగా ఆకర్షణియంగా ఉంటాడు. జలధి కూడా ఐ.టి లో డిగ్రీ చేసి, కేంపస్ ఇంటర్వ్యులో టి. సి. ఎస్. లో సెలక్టు అయింది.

పెళ్ళయిన కొత్తలో మూడు నెలల పాటు రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. అత్తవారింట్లో ఆ ఆస్థి పాస్తులు, ఆడంబరాలు చూశాక, తమ తాహతుకు మించిన సంబంధమే అనిపించింది జలధికి. తలిదండ్రులకి ఒక్కడే కొడుకు అతి గారాబంగా పెరిగాడు. ఆ యింట్లో అతని మాటకి తిరుగు లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తెలిసి వస్తోంది. డబ్బు వెంట వచ్చే డాబూ, దర్పము, డబ్బుతో దేనినైనా కొనగలం అనే ధీమా కూడా మస్తుగా ఉన్నాయి వారందరిలో. సాగర్ ఎవరినీ లెక్క చేయడు. విలాసాలంటే విపరీతమైన మోజు. లేట్ నైట్ డ్రింక్సు పార్టీలు, గర్ల్ ఫ్రెండ్స్, అతి సామాన్యమైన విషయం. జలధికి తాగే వాళ్ళంటే పరమ అసహ్యం. నెమ్మదిగా సర్ది చెప్పుకుందామని సమయం కోసం ఎదురు చూస్తోంది. ఈ లోగా అతనికి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఇది తెలిశాక మాత్రం జలధి తనని తాను నిభాయించుకోలేకపోయింది. భర్తతో భేటీ వేసుకోక తప్పలేదు. జలధి దృష్టిలో ఇదేదో మొక్కలోనే త్రుంచివేయడం ఉత్తమం. నెలలు గడిచి, సంవత్సరాలుగామారే వరకు ఉపేక్షిస్తే, పిల్లలు, సంసారం, ఇలా బాదర బందీలు పెరుగుతాయి. అప్పుడు వెనుదిరిగి చూడలేని పరిస్థితి రావచ్చు. ఒక నిర్ణయానికి వచ్చిన జలధి, ఒకనాడు సాగర్ ని నిలదీసింది.
“పెళ్ళికి ముందు నీ యిష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించి ఉండవచ్చు. కాని, ఇప్పుడు నీ జీవితంలోకి నేను వచ్చాను. నా ఆశల్ని, ఆశయాల్ని కూడా నువ్వు గౌరవించ వలసి ఉంది. నీ రెండు వ్యసనాలూ కూడా నేను సహించ లేనివి. వాటిని నువ్వు వదిలి పెట్టాలి. “
అది విని వెటకారంగా నవ్వాడు సాగర్. “ఇది మరీ బాగుంది. ఇప్పుడు నువ్వొచ్చావని నా పాత అలవాట్లన్నీ మానుకోవాలా? నా స్నేహితుల్ని, నాకు ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవాలా? అది జరగని పని. నువ్వు అలాంటి ఆశలేమీ పెట్టుకోకు. నేను నీ కెలాంటి లోటూ చేయను. నిన్నేమీ బలవంత పెట్టను. కాని నా దారికి మాత్రం నువ్వు అడ్డురావడానికి వీల్లేదు. “ నిష్కర్షగా చెప్పాడు.
జలధి ఏమాత్రము చలించలేదు. కొన్నాళ్ళు చెప్పి చూసింది. చెడు వ్యసనాల వల్ల ఆరోగ్యం పాడవుతుందని మంచిగాను. దాని ఫలితాలు భయంకరంగా ఉండవచ్చునని బెదిరించీ ప్రయత్నించింది. అవేమీ పనిచేయలేదు. ఆఖరి అస్త్రంగా అత్తమామలకి చెప్పి చూసింది. వారు చెట్టంత కొడుకుని నిలదీసేందుకు తయారుగా లేరు. “ఏమో! వాడి జీవితం వాడి ఇష్టం.” అని మౌనం వహించారు.
కాని జలధి అలా ఎలా ఊరు కోగలదు? ఇది తన భావి జీవితానికి సంబంధించిన సమస్య. ? రోజురోజుకి పరిస్థితి దిగజారిపోతుంది తప్ప మెరుగుపడే సూచనలేమీ కనిపించడంలేదు. కొంత కాలం దూరంగా ఉండాలని పది రోజుల పాటు పుట్టింటికి వెళ్ళింది.
అమ్మని అడిగింది. ” ఏంటమ్మా! మీరు అన్నీ బాగా తెలుసుకునే చేశారా? ఈ సంబంధం? నేను మిమ్మల్ని ఎదిరించే ఇష్టం లేక మీరు చెప్పినట్టే అతన్ని చేసుకున్నాను. ఇప్పుడు చూడు ఏమయిందో! అతనికి లేని అవగుణాలు లేవు. చదువుకున్న మూర్ఖుడు. అతన్ని గురించి సరైన వివరాలు తెలుసుకోలేదా? లేక దాచి పెట్టారా? “
“అయ్యో! అదేమిటే? అలా అంటావు? కావాలని నీ గొంతు కోస్తామా? కాకపొతే, అతనికి ఈ అలవాట్లు ఉన్నట్టు చూచాయగా తెలిసినా, పెళ్ళయితే అన్నీ సర్దుకుంటాయిలే అని సరిపెట్టుకున్నాము. ఇంతకీ ఇప్పుడేమయింది? “ అని అడిగింది తల్లి.
“అదుగో! ఆ సర్దుబాటే ఇప్పుడు కొంపముంచింది. అతనిప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు. నాకిష్టం లేని పనులు నా ఎదురుగా జరుగుతూ ఉంటే చూస్తూ బతకలేను నేను. అతనికి మాత్రం మారే ఉద్దేశం ఏ కోశానా లేదు. ఇప్పుడు నేను పెద్ద చిక్కులో పడ్డాను.”
“తొందర పడకే తల్లీ! నాలుగు రోజులు ఓపిక పడితే అంతా బాగుపడవచ్చు. అతనిలో ఏవో అవగుణాలున్నాయని, కాపురం పాడు చేసుకుంటావా?” భయంతో అంది తల్లి.

“అదే, అదే మీ బలహీనత. పెళ్ళయితే బాగుపడతాడని, ఓ పిల్ల పుడితే పరిస్థితులు మెరుగు పడతాయని, జాప్యం చేస్తారు. దానితో తడిసి మోపెడు అవుతుంది. అప్పుడు కక్కలేక మింగలేక కొట్టుకోవలసి వస్తుంది. ఇటువంటి వాటిల్లో ఎంత త్వరగా తెగతెంపులు చేసుకుంటే అంత మంచిది. “
“అలా అనకే తల్లీ! తొందరపడి ఏ ఘోరమైన పనీ చేయకు. కావాలంటే వెళ్లి అతని కాళ్ళు పట్టుకుంటాము. “
“మీకేం ఖర్మ? అతని కాళ్ళు పట్టుకోవడానికి? నాకు కొంత ఆలోచించుకోవడానికి టైము కావాలి. నేనేమీ తొందర పడను లే!” అని అక్కడితో ఆపుచేసింది జలధి.
పుట్టింటిలో ఉన్న పదిరోజుల్లోను జలధికి మనసు మనసులో లేదు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఎదిరించే సాహసం చేయలేక సంసారాలు పాడైపోతాయని, మొగవాళ్ళ దురాగతాల్ని మౌనంగా సహిస్తారు. దాన్ని ఆసరాగా తీసుకుని మొగవాళ్ళు పేట్రేగి పోతారు. సంవత్సరాలు గడిచి పిల్లలు, బాధ్యతలు నెత్తి మీదకి వచ్చేసరికి పరిస్థితి చేజారి పోతుంది. అప్పుడు విడిపోవడం వరకు వస్తే బాదర బందీలు ఎక్కువ అవుతాయి. అదేదో ఇపుడే తేల్చుకోవడం మేలు. బంధువర్గంలో పట్టుమని పదిరోజులు కాపరం చేయకుండా చెడగొట్టుకుంది అని చెడ్డపేరు రావచ్చు. అదే విచిత్రం. కాపరాలు చెడి పోవడానికి కారణం ఆడది ఒక్కరితే కారణం అని ముందుగానే నిర్ధారణ చేసేస్తారు నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. జలధి మనసులో ఆలోచనల దుమారం చెలరేగింది. ఏమైనా సాగర్ కి ఎదురుపడి మాట్లాడి అంతు తేల్చుకోవడమే మంచిదని నిర్ణయించుకుంది.
పదిరోజులు కాగానే తిరిగి వచ్చిన జలధి, వారం రోజుల పాటు సాగర్ ప్రవర్తనని గమనించింది. ఏమాత్రము మార్పు లేదు. సరికదా ఇంట్లోనే మందు పార్టీలు మొదలు పెట్టాడు. అది చాలక, ఒకరిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి, జలధికి పరిచయం చేశాడు. జలధి ఇంక భరించ లేకపోయింది.
ఒకనాడు, దగ్గర కూర్చుని అతనితో ఇలా అంది. “ సాగర్! మన ఇద్దరి వివాహం పెద్దల ద్వారా, వారి ఇచ్చానుసారం జరిగింది. కాని, ఈ కొద్ది పాటి అనుభవంతో, మన ఇద్దరి దారులు, గమ్యాలు వేరని నాకు అనిపిస్తోంది. రాను, రాను మనమధ్య సయోధ్య కన్నా విరోధమే ఎక్కువ చోటు చేసుకునేలా ఉంది. నీలో మార్పు అసంభవమని తేల్చి చెప్పావు. నాకు కూడా లోలోపల కృంగి పోతూ, బతకడం ఇష్టం లేదు. మనం ఇప్పుడే వేరు కావడం మంచిది.”

కొత్తగా పెళ్ళయి వచ్చిన ఆడపిల్ల అంత ధైర్యంగా భర్తని నిలదీస్తుందని ఊహించ లేదు సాగర్. కొంచెం ఖంగు తిన్నాడు. అయినా బింకంగా, ” నీ యిష్టం. తరవాత జరిగే పర్యవసానాలకి నువ్వే కారణం అవుతావు. ఆలోచించుకో!” అన్నాడు.
“అయితే, మన వివాహం రద్దు చేసుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదన్నమాట?”
“నీకు లేని భయం నాకెందుకు?”
“సరే! అయితే విను. విడిపోవడం అన్నది ఖాయం కనుక ఎలా విడిపోదాం? అన్నది ఇప్పుడు ఆలోచిద్దాం. నేను రెండు విధానాలు సూచిస్తాను. ఎంపిక నీది. ఒకటి. మనిద్దరికీ పడలేదు కనుక విడాకుల కోసం పరస్పర అంగీకారంతో కోర్టుకి వెళ్దాం. ఆరునెలల్లో మంజూరు అవుతుంది. ఈ పద్ధతిలో నువ్వు నాకు మావాళ్ళ దగ్గర తీసుకున్న కట్నం డబ్బు అయిదు లక్షలు వాపసు ఇవ్వ వలసి ఉంటుంది. నేను జీవితంలో తిరిగి సెటిలు అయ్యేవరకు నా తలిదండ్రుల మీద ఆధారపడ కుండా నాకది ఉపయోగపడుతుంది. కోర్టు ద్వారా విడాకులకి ఈ షరతు తప్పని సరి. ఈ పద్ధతి నీకిష్టం లేకపోతే, నేను పుట్టింటికి వెళ్ళిపోయి, మీ కుటుంబం అందరి మీదా సెక్షను 498- ఎ క్రింద కేసు పెడతాను. దీనివల్ల నువ్వు నీ తలిదండ్రులు ముందుగా జైలుకి వెళ్తారు. పర్యవసానం ఎలా ఉన్నా మనమంతా లాయర్లకి డబ్బు పోసి ఇల్లు గుల్ల చేసుకుంటాము. సంఘంలో పరువు ప్రతిష్టలు పోతాయి. నీ యిష్టం. నేను రెండిటికి సిద్ధమే! తొందరలేదు వారం రోజుల్లో ఆలోచించుకుని చెప్పు. అప్పటివరకు మనం మామూలుగానే బతుకుదాము. నీ దారికి నేనడ్డురాను. “
సాగర్ షాక్ తిన్నాడు. ఆడుతూ పాడుతూ నిర్లక్ష్యంగా తిరిగే కుర్రవాడు అతను. జీవితం మీద అంతగా అవగాహనలేదు. బాధ్యతారహితంగా అమ్మానాన్నల అండలో బతికేశాడు. కాని అతనిలో వేడి రక్తం ఓటమిని ఒప్పుకోలేదు. ఏం చేయాలో తోచక అమ్మానాన్నలతో విషయం చెప్పాడు. సహజంగానే వారూ దెబ్బతిన్నారు. అనుకోని సంఘటన ఎదురైంది. వారి అనుభవ జ్జానంతో కొన్ని గంటల సేపు తర్జన భర్జనలు జరిపి, సెక్షను 498-ఎ గురించి బాగా తెలిసిన వారు కనుక, డబ్బిచ్చి , ఆరు నెలల్లో కోర్టులో విడాకులు పుచ్చుకోవడానికే ఒప్పుకున్నారు.
చట్టం 498-ఎ రాక ముందు ఎందరో అమాయిక ప్రాణులు సంఘంలోని దురాచారాలకి బలై పోయారు. అది వచ్చాక దాన్ని అస్త్రంగా వాడుకుని, దురుపయోగంచేసిన వాళ్లెందరో ఉన్నట్టు దాఖలాలు ఉన్నాయి. ఏమైతేనేం, ఈ రోజు, అదే చట్టం జలధికి తానా ఊబిలోంచి బైట పడడానికి అస్త్రంగా ఉపయోగపడింది.
గడువు లోపలే సాగర్ తమ నిర్ణయం జలధికి తెలిపాడు.
జలధి, “గుడ్! ఈ వారంలో మనిద్దరం కోర్టుకి వెళ్లి పేపర్లు దాఖలు చేసి వద్దాం. తరవాత, నువ్వు నా ఎకౌంటు లో అయిదు లక్షలు జమచేయి.” అని చెప్పింది.
కోర్టులో విడాకుల పత్రాలు దాఖలు చేసి,సాగర్, జలధి ఎవరిళ్లకి వారు వెళ్ళారు.
ఇంటికి వచ్చిన జలధిని చూసిన తల్లి ‘ఇదేదో కొంపలు ముంచినట్టే ఉంది‘ అనుకుంటూ ఏడుపు ముఖంతో ఎదురు వెళ్లి. “ఏమయిందే? వచ్చేశావేం?” అని అడిగింది.
“లోపలికి వచ్చికాస్త మంచినీళ్ళు అయినా తాగనీ” అని లోపల అడుగు పెట్టింది జలధి.
కాస్త కుదుట పడ్డాక తాపీగా అన్నీ చెప్పింది అమ్మకి.
తల్లి ఏడవడమే తరవాయి. “ఇదేంటే? ఇలా చేశావు.. ఇప్పుడు నేను నీకు మళ్లి పెళ్ళిఎలా చేయగలనే?” తలబాదు కుంటూ అడిగింది.
జలధి అమ్మని ఓదార్చి, “ అమ్మా! నువ్వు బాధపడకు. నేను మీ గుండెల మీద కుంపటిలా కుర్చోబోను. నాకు ఆలోచించు కోవడానికి ఆరు నెలలు టైము ఉంది. ఇది నా సమస్య. నేనే పరిష్కరించు కుంటాను. ఇన్నాళ్ళు పెంచారు. మరొక ఆర్నెల్లు భారం కానుగా” అంది.
“అదేంటే తల్లీ! అలా మాట్లాడుతున్నావు? నిన్ను ఒక ఇంటిదాన్ని చేద్దామని పెళ్లి చేశాం కాని నిన్ను వదిలించుకుందుకు కాదు. “ బాధ పడుతూ అంది తల్లి.
“త్వరలోనే నేను మళ్లి ఒక ఇంటిదాన్ని అవుతాను.. నువ్వేమీ బెంగ పెట్టుకోకు.” అంది ధైర్యంగా జలధి.
“ఏమోనమ్మా! ఈ నాటి పిల్లలూ, వాళ్ళ మనోభావాలూ వాళ్ళకే తెలియాలి. మేమంతా పూర్వకాలపు వాళ్ళం.” అని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టింది తల్లి.
జలధి పుట్టింటిలో ఉంటూనే ఆఫీసుకి వెళ్లి వస్తోంది. సుమారు నెల రోజులు దాటాక, జలధి బేంకు ఎకౌంటు లో అయిదు లక్షలు జమ అయినట్టు ఎస్. ఎం. ఎస్. వచ్చింది. వాళ్ళ నిర్ణయంలో మార్పు లేదని
తెలుసుకున్న జలధి, ఎక్కువ రాద్దాంతం చేయకుండా సంధి చేసుకునే సంస్కారం వాళ్ళలో ఉన్నందుకు సంతోషించింది. ఆరు నెలలు పూర్తయ్యాయి. కోర్టు ద్వారా విడాకుల పత్రాలు దొరికాయి. కోర్టులోనే సాగర్ తో కరచాలనం చేసి “గుడ్ బై” చెప్పింది జలధి.
ఇంటికి తిరిగి వచ్చి, ఇంతకాలంగా తన మనసులో ఉన్న ఆలోచనని ఆచరణలో పెట్టా లని నిశ్చయించుకుంది.
రత్నాకర్ తన క్లాస్ మేట్. చాలా మంచివాడు. నెమ్మదస్తుడు. ఒకప్పుడు తన వెనకాలపడి ప్రేమనర్థించిన వాడు. తను అరేంజిడ్ మేరేజ్ చేసుకుంటా నంటే, ఆ రోజునుంచి తనపట్ల గౌరవభావంతో ప్రవర్తించినవాడు. అతని సెల్ నెంబరు తన దగ్గర ఉంది. అతన్ని కాంటాక్టు చేసి, కుశల ప్రశ్నలు వేసింది. ఇంకా పెళ్లి కాలేదని తెలిసి, “నీతో మాట్లాడాలి. సాయంత్రం ‘దస్ పల్లా’కి రాగలవా? “ అని అడిగింది. అతను సంతోషంగా ఒప్పుకున్నాడు.
తన బంగారు భవిష్యత్తుకి తాను వేసుకున్న బాటలో నడవడానికి నిశ్చయించుకుంది జలధి

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked