కథా భారతి

పందిరి నీడ

– వదలి రాధాకృష్ణ

‘తాతయ్యా! మనకు గుడి ఎంత దూరం! ఈ రోజు కోటిసోమవారం కదా గుడికి వెళ్ళి దర్శనం చేసుకు వద్దామని.’
భానుమూర్తి మాట్లాడలేదు.
‘అదే తాతయ్యా! శివయ్య గుడి అయితే మరీ మంచిది.’
‘ఇవన్నీ ఎవరు చెప్పారే నీకు. అసలు మీ ఊరిలో శివాలయం ఉన్నదా!’
‘లేకేమి. కాకపోతే మాకు ఓ పది కిలోమీటర్లు దూరం ఉంటుంది. డాడీ ప్రతిసారీ కార్లో తీసుకెళతారు.
‘మీ డాడీకి నిన్ను కారులో గుడికి తీసుకెళ్లే అంత తీరిక ఉందా’
‘ఉండకపోవడమేమిటి. తీసుకెళ్లకపోతే ఈ సంగీత ఊరుకుంటుందా ఏమిటి!’ అయినా ఎందుకలా అడుగుతున్నావ్.
‘లేదమ్మాయ్! ఐదు సంవత్సరాలు గడిచిపోయినా స్వంతదేశానికి వచ్చే తీరిక లేని మీ డాడీకి నిన్ను పది కిలోమీటర్లు తీసుకెళ్లే తీరిక దొరుకుతోందా అని.’
‘దట్స్ ఐయామ్ సంగీత’ గలగలా నవ్వేసింది.
భానుమూర్తి మాట్లాడలేదు.
‘సర్లే చెప్పు తాతయ్యా! ఈ కోటిసోమవారం రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి రావాలని!!’
‘ఈ ఊరిలో శివాలయం లేదు. మన ప్రక్క ఊరు శివపురంలో ఉంది. ఇక్కడికి రెండు కిలోమీటర్లు ఉంటుంది.’
‘మరెలా తాతా!’
‘నీ ప్రక్కన తాతయ్య ఉండగా మరెలా… ఇప్పుడెలా ఏమిటి చెప్పు’
‘దట్స్ మీ తాతయ్య’
ఆనాడు దీని బారసాల నాడు స్వప్నా అనే పేరు పెట్టాలని అందరూ అనుకున్నారు.
‘లేదు డాడీ అమ్మ చెబుతుంది. ఆమె చెప్పిన పేరే నా కూతురు పేరు.’ కొడుకు అన్నాడు. కోడలు మాట్లాడలేదు.
‘అసలు మీ అమ్మ ఈ లోకంలో ఉండే రకమా! ఎక్కడో వంటింట్లో బూర్లు మూకుడు దగ్గర చక్కర్లు కొడుతూ ఉంటుంది. వంటలామెకు పనులు పురమాయించకబోతే ఈవిడకు బుర్ర నిలవాడు.’ కొంచెం నిష్ఠూరం గానే అన్నాడు భానుమూర్తి అన్నగారు రమణమూర్తి.
‘అమ్మను పిలవండి. మనవరాలి నామకరణ ఘట్టం కూడా నాకెందుకు లే అని వదిలి పారేసి వంతల పండిట్లో అఘోరిస్తే ఏం చేసేది.’ మొత్తానికి వెళ్ళి కామాక్షమ్మను పిలుచుకు వచ్చారు.
‘నాకేమిటి తెలుస్తుందిరా! పిల్లలు వాళ్ళ ఇష్టం వాళ్ళది.’
‘లేదు అత్తయ్యా! మీ అబ్బాయి మిమ్మల్ని అడగాలంటున్నారు.’
‘నీకిష్టమైన పేరు చెప్పు ఒదినా… మీ మానవరాలే కదా!’ కామాక్షమ్మ కొంచెం బిడియ పడింది.
‘చెప్పవోయ్! కోడలు కూడా నువ్వే చెప్పాలంటుంటేను.’
‘కామాక్షమ్మ మరింత బిడియపడ సాగింది. పదిమందీ ఆవిదను నీలేశారు. అంతమంది అడిగే సరికి నోరు విప్పక తప్పింది కాదు.
‘ఈ చంటిది మన ‘వరాలు’… దీనికి సంగీత అనే పేరు బాగుంటుందని. కొడుకు కోడలు అందరూ సై అంటే సై అనేశారు. అటువంటి మనవరాలు సంగీత అమెరికానుండి ఇన్నాళ్ళకి మరలా ఊడిపడింది.
‘తాతా వస్తావా! కోటిసోమవారం గుడికి తీసుకెళతానన్నావు.’
‘మీ అమ్మను తీసుకెళ్ళొచ్చుగా!’
‘ఈ పూట మామయ్య వస్తాడని చెప్పింది అమ్మ. తాను ఇంట్లో ఉంటుందట.’

—-

‘పోనీ నీకు ఖాళీగా లేకపోతే ఇక్కడ ఉన్న ఏదో గుడిలో దీపం వెలిగించి వచ్చేస్తాను తాతా!’
‘లేదులే అమ్మాయ్! రెండు కిలోమీటర్లు దూరం స్కూటర్ మీద ఎంతసేపు తీసుకెళతాను చెప్పు. పదా!’ భానుమూర్తికి ఒంట్లో కొంచెం నిస్త్రాణిగా ఉన్నా కదలక తప్పలేదు.
* * *
తనకు సంతోషంగా ఉంది. సంగీతను చూస్తుంటే ఆ సంతోషం కట్ట త్రెంచుకు వస్తోంది. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. పొడికళ్లతో మేలుకొని ఉండిపోయాడు. ఒక అనిర్వచనీయమైన అనుభూతితో అలా గడుపుతూనే ఉన్నాడు. తనకు సంతోషకరంగానే ఉంది. కానీ శరీరానికి వచ్చిన ముసలితనం తనను అలాగా ఉండనివ్వడం లేదు. లోలోపలి శరీర రుగ్మతలకు అదుపు అనేది ఉండటంలేదు.
ఉన్నట్లుంది భానుమూర్తి మనసంతా ఉదారంగా మారిపోతోంది. కారణం ఎప్పుడో పెద్ద పెద్ద చదువులు చదివేసి ఉద్యోగం కోసమనుకుంటూ అమెరికా విమానమెక్కేసిన ఒక్కగానొక్క కొడుకు కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడకు రావడమే.
రంజిత్ వచ్చి వారం రోజులు దాటింది. కోడలు సుధామయి. మనవరాలు సంగీత కూడా రావడం ఆయనగారికి ఆనందాన్ని ఇస్తోంది. తనవారి రాకతో ఉన్నట్లుంది ఊరిలో తన పరపతి అమాంతం పెరిగిపోయినట్లయింది.
‘రంజీ బాబు బాగా తెల్లపాడిపోయినాది భానూ! చిన్నప్పుడు నిక్కర్లు పైకి ఎగలాగుకుంటూ ఈ కోడేరు రోడ్లమీద తిరిగిన మనిషిని ఇప్పుడు చూశావా విదేశాలంటూ విమాణాలలో చక్కర్లు కొట్టేస్తున్నాడు.’ తన చిరకాల మిత్రుడు రసరాజు భానుమూర్తి గొప్పతనాన్ని కొడుకు ఎదుగుదలను తదేకంగా ఏకరువు పెడుతున్నాడు.
నాదేముంది రాజూ! వాడు చదువుకున్నాడు. పైకి వచ్చాడు. అంతా వాడి కష్టం… కానీ పెంచిన వాడి అమ్మ చాలవాను!!’ కామాక్షి కళ్ళలో మెదిలే సరికి కనురెప్పల కావల సన్నటి కన్నీటి పొర వచ్చి అమాంతం కమ్మేసింది. ఒక్కసారి గుండె గద్గదమయిపోయింది. మనసు బావురుమంది.
‘పోనీలే భానూ! మా చెల్లెమ్మ ఎంతో పుణ్యం చేసుకొంది. నీ వంటి ఉత్తముడిని భర్తగా పొందింది. ఏ ఇబ్బందులూ లేకుండా నీ చేతుల్లో వెళ్లిపోయింది. ఇంతకన్నా కావాల్సిన అదృష్టం మనిషికి ఇంకేముంది చెప్పు.’ రసరాజు మాటలు భానుమూర్తికి ఎంతో స్వాంతన చేకూరుస్తున్నాయి.
రంజిత్ ఇంటికి వచ్చాడన్న మతేగాని పట్టుమని పూట ఇంట్లో ఉంటేనా! మళ్ళీ తిరిగి వెళ్లడానికి వీసాలు అంటాడు… ఆఫీసు పనులంటాడు.
అక్కడ అమెరికాలో ఎలా ఉంటాడో తెలియదు గాని ఇక్కడ క్షణం తీరిక లేని వ్యాపకాలతో గడిపేస్తున్నాడు.
తమ ఆస్తిపాస్తుల గురించి, పొలం పుట్రల గురించి వివరంగా చెప్పాలనుకుంటాడు.
‘ఇప్పుడు అవన్నీ నాకెందుకు డాడీ! చూసుకునేందుకు నువ్వున్నావు కదా!’ అంటూ మాట దాటేస్తాడు.
‘అదేంత్రా! పెద్దవాడిని అయిపోతున్నాను. మీ అమ్మ మనకి బై బై చెప్పి వెళ్లిపోయింది. నేను కూడా రేపో మాపో ‘బైబై’ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.
‘అబ్బా డాడీ! అందుకే నిన్ను కూడా నాతో అమెరికా వచ్చేయమనేది. అక్కడయితే నాకు నువ్వు… నేను నీకూను’ ఏదో మాట పొడిగించబోతాడు.
‘ఆ ఒక్కటీ కాదు! అయినా అవసరం వచ్చినపుడు ఆలోచిద్దాం!’
‘అలాగే అంటూ ఉండు. అయిన వాలకు దూరంగా ఎప్పుడూ ఇలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ..’
‘అవును మావయ్యా! మా నాన్న ఒక్కడే ఇక్కడ ఉంటున్నాడనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఈయన.’ కోడలు మాటలు భానుమూర్తిని కొంత మొహమాటానికి గురిచేస్తున్నాయి.
చెప్పాలంటే భార్య బ్రతికి ఉన్నంత కాలం భానుమూర్తి ఎంతో ఉదారంగా బ్రతికాడు. ఆమె లోకంతో తాను కూడా మమేకమయ్యేవాడు. కామాక్షి ఫక్తు పాతకాలపు మనిషి. పూజలు పునస్కారాలు, గుళ్లూ గోపురాలంటూ ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉండేది. మడి దడి అనుకుంటూ ఉపవాసాలు చేస్తూ బ్రతుకీడుస్తూ ఉండేది.
భానుమూర్తి ఎప్పుడూ భార్యకు ఎదురు చెప్పలేదు. వద్దని వారిస్తే ఎక్కడ మనసు కష్ట పెట్టు కుంటుందోనని మిన్నకుండిపోయేవాడు. చెప్పాలంటే తాను కొంత ఆధునిక భావాలు కలగలిసిన మనిషి కావడంతో ఇటువంటి సాంప్రదాయ భావనలకు దూరంగా ఉండేవాడు. అలాగని భార్యతో ఎప్పుడూ వితండవాదానికి దిగింది కూడా లేదు.
‘నాన్నా! ఇన్నాళ్ల నుండి నేను అమెరికాలో ఉంటున్నానన్న మాటేగాని నువ్వు ఎప్పుడూ కనీసం విమానం కూడా ఎక్కింది లేదు. అదే మా ఫ్రెండ్స్ సంగతి చూడు. వాళ్ళ తల్లిదండ్రులు, అత్తామామలు ఒహటేమిటి ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి వెళుతూనే ఉంటారు. వాళ్ళు నన్ను అడుగుతారు కూడాను. చెప్పాగా, ఆమధ్యనే అత్తగారు మామగారు మూడు నెలలు ఉంది తిరిగి ఇండియాకి వచ్చేశారు.’
రంజిత్ ఇండియాకి వచ్చి మూడు వారాలు దాటింది. వచ్చినప్పటి నుండి తనతో రమ్మని పోరుతూనే ఉన్నాడు.
‘అది కాదు లేరా అబ్బాయ్! మీ అమ్మ బ్రతికి ఉంటే ఇద్దరం వచ్చి కొన్నాళ్లు ఉండేవారమేమో! కానీ ఆవిడ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది.’
‘— — —‘
‘ఆమెకి టైమ్ అయిపోయింది. వెళ్లిపోయింది. నువ్వు ఒక్కడివే ఈ వయసులో ఈ ఊరిలో ఇలాగ…’
‘అదే సమస్య అంటాను. నేను ఒంటరి అనుకోవడం లేదు. అయిన తెలిసిన ఊరు… అలవాతయిన మనుషులూను! అక్కడకు వచ్చి ఇలాగ ఉండగలనా అన్నదే మీమాంస!! తర్వాత చూడామ్. రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా!!!’
‘తాతయ్యా! ఈ రోజు మాసశివరాత్రి. శివాలయానికి పోయివస్తాను’ భానుమూర్తికి చాలా ఆశ్చర్యంగా ఉంది. కామాక్షికి ఈ ఆధ్యాత్మిక చింతన జాస్తి. ఎప్పుడు ఏ గుడికి వెళ్లాల్సి వచ్చినా తాను లేకుండా వెళ్ళేది కాదు. లోలోపల కొంత అసహనంగా అనిపించినా ఏనాడూ కాదన్నది లేదు. నిత్యం వెంట నిలుస్తూనే ఉండేవాడు. అలానే ఐదారు సార్లు ఆమెతో కలిసి తీర్థయాత్రలకూ తిరిగి వచ్చాడు.
‘తాతయ్యా! పోయివచ్చేదా!!’
‘నీకు తోడుగా ఈ తాతయ్య ఉన్నాడు కదమ్మా! నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం తాత నీకు తోడుగా ఉంటాడు.’ ఇంత చిన్న వయసులో మానవరాలి ఆధ్యాత్మిన చింతన వింతగా అనిపిస్తోంది. చెప్పాలంటే భార్య ఉన్నంత కాలం కొంతలో కొంత ఆమె ధోరణితో మమేక మవుతూ వచ్చాడు. తర్వాత తనకు తెలియకిండానే అంతర్ముఖానిగా మారిపోయాడు. క్రమంగా ఆయన ఓ నిరాశ తాలూకు జీవన క్రమంలో ఒదిగిపోయాడు.
అప్పటి నుండి భానుమూర్తి ఈ గుళ్లూ గోపుర దర్శనాలు, ఆలయ సందర్శనాలకు పూర్తిగా దూరమై పోయాడు.
‘నాకా ముసలితనం ముసురుకొచ్చేస్తోంది. ఏ క్షణాన ఎలాగ ఉంటానో తెలియని పరిస్థితి నాడీ. అందుకే ఇక్కడ ఉన్నవన్నీ నీకు అప్పజెప్పాల్సిన అవసరం ఉంది.’ కొడుకుని వచ్చినప్పటి నుండి పోరుతున్నాడు.
రంజిత్ తండ్రి మాటల్ని బుర్రకు ఎక్కించుకొనే రకం కాదు. ‘చూడంలే’ అన్న ఒక పెదవి విరుపు ఆయనగారి నోటినుండి వెలువడిన ప్రతీక్షణము భానుమూర్తి కొంత నిరాశకు గురి అవుతూనే ఉన్నాడు.
‘తాతా వెళ్దామా!’ మనవరాలు మాట కాదనలేదు భానుమూర్తి. ఆమె తనను గుడి దర్శనానికి తీసుకెళ్లమన్న ప్రతిసారీ అలవికాని ఆనందాన్ని చవిచూస్తున్నాడు. ఎంత వేసవి కాలమయినా నిస్సత్తువ ఆవహించేస్తున్నా సంగీతను వెంట పెట్టుకొని వెళుతూనే ఉన్నాడు.
అమెరికా నుండి వచ్చి రెండు నెలలు అయిపోయింది. అమానాన్నలు మటుకు ఊరులు పట్టుకు తిరుగుతూన్నా సంగీత మటుకు తాతయ్యకు కాలక్షేపంగా నిలుస్తూనే ఉంది. ఇప్పుడు సంగీత కారణంగా తనను తాను ప్రోత్సహించుకుంటున్నాడు. తననుండి తాను విడివడి బయటకు వస్తున్నాడు. ఆలోచిస్తే భానుమూర్తి మనసు నిండు పున్నమి లాగా అనిపిస్తోంది.
ఒక కాలాతీత నైజాన్ని మానవరాలులో చూడగల్గుతున్నాడు. ఆ నైజాం తనకు అత్యంత ప్రియపాత్రంగా అలరారుతోంది. దానితో సంగీత చాలా ఆపేక్షగా అగుపిస్తోంది.
‘తాతయ్యా! నాన్న నిన్ను కొన్నాళ్లు అమెరికాకు రమ్మంటున్నారు కదా! నాకోసమైనా రావచ్చును కదా!’ మనవరాలు మన ‘వారాలు’ అయిపోతోంది. ఆ మాటలు చాలా అపురూపంగా ఉన్నాయి.
‘నువ్వు రమ్మని పిలవలేదు కదా!’ అందామనుకున్నాడు. అలా అంటే నానా మాటే నా మాట అనుకో అంటుందని తెలుసు.
‘వచ్చేయ్ తాతయ్యా! ఇక్కడ నువ్వు నాకు మంచి కంపెనీ ఇచ్చినావు. నేను అక్కడ నీకు కంపెనీ ఇస్తాను. ఇట్స్ మై ప్రామిస్!’ సంగీత నోటి మాటలు చాలా ప్రభావశీలంగా ఉన్నాయి.
భానుమూర్తి తరచి తరచి చూసుకుంటున్నాడు. భార్య యొక్క వ్యవహార సరళి ఇప్పుడు మానవరాలిలో చూస్తున్నాడు. బామ్మకు తగ్గ వారసురాలిగా తాతయ్యను సముదాయిస్తోంది. తాతయ్య ప్రోత్సాహంతో ఆ ప్రాంతంలోని దేవాలయాలన్నింటినీ చుట్టుముట్టి వచ్చేసింది.
కామాక్షమ్మ వారసత్వ ప్రతినిధి తానవుతోంది. ముఖ్యంగా భానుమూర్తిని వెంట పెట్టుకొని తిరుపతి వెళ్ళిరావడము గొప్ప అనుభూతిని మిగులుస్తోంది.
ఎన్నో ఏళ్లుగా ఏదో యాంత్రికంగా ఇలా బ్రతుకీడుస్తున్నాడే గాని తనంతటగా తిరుపతి పోయి వచ్చింది లేదు. అప్పట్లో భార్య కోసం తప్ప ఏ దేముణ్ణీ వెళ్ళి పలకరించి వచ్చింది లేదు.
అడిగి అడిగి ఈయన ఇంతే అనుకొని రంజిత్ తండ్రిని రమ్మనమని అడగటం మానేశాడు. సుధామయి కూడా భర్తను అనుసరిస్తూనే ఉంది.
కానీ సంగీత…
మానవరాలి ప్రేమానురాగాలు భానుమూర్తి మీద అలవికాని ప్రభావాన్ని చూపుతున్నాయి. వచ్చి ఉన్నది బహు కొద్ది నెలలు మాత్రమే అయినా మానసికంగా ఇప్పుడు భానుమూర్తి బలపడుతున్నాడు.
అక్కడ కొత్త ప్రాంతంలో ఉండలేను అనుకున్న ఆలోచన నుండి క్రమంగా ప్రక్కకు జరుగుతున్నాడు. మానవరాలి స్ఫూర్తితో గుండెను దిటవు చేసుకుంటున్నాడు. ఆమె అడుగుల మాటు జాడలు అమితమైన ఆత్మ స్థైర్యాన్ని ఆపాదించి పెడుతున్నాయి.
‘సరేనమ్మా! రంజిత్ ఈ మారు మీతో వచ్చేస్తున్నాను.’ మానవరాలిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ అంటున్నాడు.
పెరట్లోని పందిరి క్రింద వాలు కుర్చీలో కూర్చున్నా భానుమూర్తి తమకు హాయినిచ్చే నీడలా నిలుస్తూంటే ఓ వసుధైక నేపధ్యం వారసత్వ పెన్నిధిగా అగుపిస్తోంది అక్కడ.

* * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked