కవితా స్రవంతి

పాపం! పిల్లలు

– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

అభం శుభం తెలియని పిల్లలను,
కేర్ టేకర్స్ కు అప్పజెప్తున్నారు.
దినదినగండంగా ఆ పిల్లలు,
డే కేర్ సెంటర్ లో గడుపుతున్నారు.
అర్ధమే తప్ప ఆత్మీయత పట్టని మనస్తత్వంతో,
చదువేతప్ప సంస్కారం మనసుతలుపు తట్టని అజ్ఞానంతో
ఈ కేర్ టేకర్స్,
అమాయకత్వమేతప్ప వేరేదీ తెలియనిపిల్లలను,
సంపాదనకోసం తల్లితండ్రులుపడే అత్యాశకి
బలవటమేతప్ప వేరేమీచేయలేని బేలలను,
తమదైన అజ్ఞానంతోఆడిస్తున్నారు,
లాల్యాన్ని పొందాల్సిన వారిబాల్యాన్ని
తమదైన నిర్లక్ష్యంతో ఓడిస్తున్నారు.
బేర్ మంటూ ఈ పసిపిల్లలు పాపం
కేర్ సెంటర్ లలో గడుపుతున్నారు.
తల్లితండ్రుల బుద్ధిలేనితనాన్ని ఆసరాగా చేసుకొని
ఈబేబీ కేర్ సెంటర్ లను నడుపుతున్నారు.
ఇది మదుపులేని వ్యాపారమని,
ఇది అదుపులేని వ్యవహారమని తెలిసినా,
పసిపిల్లల బాల్యం నుసిఅవుతున్నా,
ఎవరూ పట్టించుకోవటం లేదు,
ఈ డే కేర్ సెంటర్ల ఆట కట్టించాలనుకోవటం లేదు,
ఈ పసి పిల్లల దురదృష్టాన్ని తుదముట్టించాలనుకోవటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked