సారస్వతం

పేరులో (name) నేముంది​!

​-శారదాప్రసాద్

​​​ఆ మధ్య మేము అమెరికా వెళ్ళినపుడు,మా అమ్మాయి స్నేహితురాలు ఇంటికి వెళ్ళటం జరి​గింది. వాళ్ళూ తెలుగు వాళ్ళే. ఆ అమ్మాయి తల్లి తండ్రులు,అత్తా మామలు అందరూ హైదరాబాద్ లో స్థిరపడ్డా​రట. ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు.​ ​’ అమ్మా ! నీ పిల్లల పేర్లేమిటీ?’​ ​అని ఆ అమ్మాయిని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకునే క్రమంలో​ ​అడగటం జరి​గింది. అందుకు ఆ అమ్మాయి​ ​’అంకుల్! మా పెద్ద అమ్మాయి పేరు ‘తుషి’,రెండవ అమ్మాయి పేరు ‘మాయ​’ అని చెప్పగానే నేను బిత్తరపోయాను. ‘తుషి అంటే అర్ధం ఏమిటమ్మా?’ అని ఆ అమ్మాయిని అడిగితే,ఆ అమ్మాయి ‘నాకు తెలియదండి,’త’ కారం వచ్చేటట్లు పేరు ​ఉండాలని మా పురోహితుడు చెబితే,నేనూ మా వారు కుస్తీపడి​ ​’​ ​పిల్లల పేర్లు’ అనే పుస్తకం చూడటమే కాకుండా నెట్ లో కూడా వెతికి తుషి అనే పేరు ఖాయం చేశామండి’ అని గర్వంగా ఏదో ఘనకార్యం సాధించినట్లు చెప్పింది.మరి మీ పెద్దవారి సలహా తీసు​కోలేదా?​ ​అని నేనడిగితే,ఆ అమ్మాయి​ మా​ ​పిల్లలకు మా ​ఇష్టమొచ్చిన పేర్లు పెట్టుకుంటాం​! దానికి పెద్దవారి సలహా ​ఎందుకు?మాకు పేరు పె​ట్టటం చేతకాక పోతే​ ​వాళ్ళను అడగటంలో అర్ధం ​ఉంది​. అంతే కాని , చిన్న చిన్న విషయాలతో వాళ్లకు ​ఇబ్బంది కలిగించటం ఎందుకు?అని గుక్క తిప్పుకోకుండా ఆ అమ్మాయి సమాధానం చెప్పటం పూర్తిచేసి,’అంకుల్! తుషి ఆంటే అర్ధం ఏమిటో మీరైనా చెప్పరా?’​ ​అని అడిగింది.దానికి నేను​, ​’అది ఏ భాషలోని పదమో , దాని అర్ధం ఏమిటో నాకు అసలు తెలియదు,కాని ఒకటి మాత్రం గుర్తుకొస్తుంది,గుంటూరులో మా ఎదురింటి వారు వారి కుక్క పిల్లను ముద్దుగా ‘తుషి’ అని పిలవటం’ అని నేను చెబుతుంటే, మా అమ్మాయి నా కాలు తొక్కుతుంది, వాళ్ళు బాధపడుతారేమోనని! ముద్దుగా ​ఉండే ఆ పాపను చూసినంతసేపూ నాకు బాధగా, జాలిగా ​ఉంది. ఆ అమ్మాయిని చూసినంతసేపు​ ​నాకు మా ఎదురింట్లో ​ఉన్న కుక్క పిల్లే గుర్తుకొస్తుంది.

‘అయిపోయినదేదో అయిపొయింది,రెండవ​ ​పిల్లకైనా మంచి పేరు పెట్టు​కోవచ్చు కదా!’ అని అడగగానే ‘అయితే మొదట పిల్ల పేరు బాగాలేదన్నట్లేగా! అంతటికీ ఈయనే కారణం!’​ ​అని భర్త వంక కొరకొరా చూడటం మొదలైంది. అప్పుడు నాకు కొద్దిగా భయం కలిగింది, భార్యాభర్తల కలహానికి నేను కారణ భూతుడిని అవుతున్నందులకు! వెంటనే నేను సద్ది చెప్పి​ ​’పేరులో ఏముం​దమ్మా, పెరిగి పెద్దదై మీకు మంచిపేరు తెస్తుంది మీ’తుషి’. అసలు Shakespeare ఏమన్నాడో తెలుసా! ‘You may call Rose by any name, but it never loses its fragrance!‘​ ​అని అన్నాడు. దాన్నే సి.నారాయణరెడ్డి గారు ‘గులాబీని ఏ పేరున పిలుచుకున్న గానీ, అది సహజ పరీమళం వదల​దెన్నడేనీ!’ అని తెలుగులో చక్కగా చెప్పారు అని వివరిస్తుంటే, కొంత మార్పు కనపడింది వాతావరణంలో. అమ్మ!పరవాలేదు ఉపద్రవం తప్పింది,తొందరగా బయట పడితే బాగుంటుందని మా అమ్మాయి ‘వెళ్లి వస్తామండీ!, చాలా పొద్దు పోయింది’ అని చెప్పి బయలు దేరుతుంటే,​ ​ఆ అమ్మాయి వచ్చి, ‘కాసేపు ఆగకూడదా! అంకుల్ మంచి విషయాలు చెబుతున్నారు’ అని చెప్పి మమ్మల్ని మళ్ళీ కూర్చోపెట్టింది.’అది సరే అంకుల్! మరి ‘మాయ’​ ఆంటే అర్ధం ఏమిటో చెప్పరా!’ అని జాలిగా అడిగింది. మా అమ్మాయి నాకు చెప్పవద్దని సైగ చేయటం ఆ అమ్మాయి చూసి,’మధ్యలో నీకు ఇబ్బంది ఏమిటీ?’​ ​అని మా అమ్మాయిని చనువుకొద్దీ మందలించి, నా వంక ఉత్సాహంగా చూస్తుంది​. కనీసం​ ​’మాయ’ ఆంటే మంచి అర్ధం ఏమన్నా చెబుతానేమో నని! నిజం చెప్పకుండా ఉండలేను,తెలియదని అబద్ధం ఆడనూ లేను!మా అమ్మాయి, నా భార్య నా వంక భయంగా చూస్తున్నారు, ఏమి బాంబు పేలుస్తానేమో​ నని.​ ​’ చెప్పండి uncle! నేను ఏమీ అనుకోను.’ అని ఆ అమ్మాయి అమాయకంగా అడగటం చూస్తే,నాకు నిజం చెప్పాలనే ​​​అనిపించింది .(ఇంటికి వెళ్ళిన తర్వాత,మా వాళ్లకు సద్ది చెప్పుకోవచ్చులే అనే ధైర్యంతో)​ ​’అమ్మా! మాయ ఆంటే అజ్ఞానం,మోహం ​ఇలాంటి అర్ధాలే ​ఉన్నాయి ,నాకు తెలిసినంతవరకూ’ అని గబగబా చెప్పి వెంటనే బయలు దేరాం. ఇంటికి వచ్చిన త​ర్వాత చాల కథ నడిచింది.

అది అప్రస్తుతం, confidential ! ఇదంతా ​ఎందుకు చెబుతున్నానంటే పిల్లలకు పెట్టుకునే పేర్లను బట్టి తల్లితండ్రుల సంస్కారం తెలుస్తుంది.అట్టి సంస్కారవంతుల కుటుంబంలో పుట్టిన పిల్లలకు కొద్దో గొప్పో ఆ వాసనలు అబ్బక మానవు.ఏదో నారాయణరెడ్డి గారు కవితా ధోరణిలో అలా అన్నారు గాని,గులాబీని ఉమ్మెత్త పువ్వు అని పి​లిస్తే ఏమి బాగుంటుంది? నా చిన్నతనంలో శ్రీమతి సత్యభామారెడ్డి గారనే ప్రముఖ ‘స్త్రీలవైద్య’ నిపుణు​రా​లు​ ​మద్రాస్ విజయా హాస్పిటల్ లో పనిచేశేవారు.ఆ హాస్పిటల్ లో మాకు తెలిసిన వారు చికిత్స పొందుతున్నారు.నాకు ‘బంధురోగి లేక రోగబంధును’​ ​చూడటం కన్నా ఆ డాక్టర్ గారిని చూడాలనే కుతూహలం ఎక్కువగా ​ఉండేది .ఆమెను చూశాను, పేరుకు తగ్గట్లుగానే ​ఆమె ​అందగత్తె.ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆమెనే అడిగాను​, ​’మీకు ఈ పేరు ఎవరు పెట్టారని?’​ ​అంత బిజీలో ఆమె​,​’అక్కడ reception లో మా నాన్నగారు ​ఉన్నారు, వారిని అడగండి.’​ ​అని చెప్పగానే వెంటనే వారి వద్దకు వెళ్లి,​ ​ప్రాధేయపడితే వారు​ ​ఆ పేరు పెట్టింది శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు​ ​అని చెప్పగానే ఆయన సంస్కారానికి మనసులోనే పొంగిపోయి బయటకు వచ్చాను.​ ​అసలు,’సత్యభామ’ ఆంటే ఏమిటో తెలుసా? ​సత్య​ అంటే ​నిజంగా , ఇక భామ ఆంటే స్త్రీ అని అర్ధం. అంతా​ ​కలిపితే​ ​’నిజమైన స్త్రీ ఆంటే ​ఇలా ​ఉండాలి’ అని అర్ధం. ఎంత చక్కటి పేరు! నారాయణ రెడ్డి గారి​ కూతుళ్ళ పేర్లు​ ​గంగ, యమున, సరస్వతి,​కృష్ణవేణి ​. అలాగే జంధ్యాల​గారి కూతుళ్ళ​ పేర్లు సాహితి, సంపద​. ​

ఎంత చక్కటి పేర్లో చూశారా! వారి అభిరుచి, సంస్కారం వారు తమ పిల్లకు పెట్టుకున్న పేర్లలో కూడా ప్రతి​బింబిస్తుంది.కొన్ని​ మినహాయింపులు కూడా లేకపోలేదు.గాంధీ ,నెహ్రూల పేర్లు పెట్టుకున్న కొందరు రౌడీలుగా కూడా చెలామణి అయ్యారు!ఇకపోతే ​మరోరకం వారు ​ఉన్నారు! వారు మంచి​ ​(పిచ్చి) ఛాందసులు. వారికి అదో రకం సాంప్రదాయపు పిచ్చి. ఆ ఇంటి ఆయన గొప్ప శివభక్తుడు.కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. ఇంటికి ‘కైలాసం’​ ​అని పేరు పెట్టుకున్నాడు​.​​పరవాలేదు​ ​ఆయన ఇల్లు ఆయన ఇష్టం.​ అయితే ఇక్కడ కూడా ఒక చిక్కుండేది. ఎవరైనా ఎప్పుడైనా ఆ ఇంటి ఆయన ఎక్కడ ఉన్నారని అడిగితే ,దానికి కొందరు హాస్యప్రియులు ఇప్పుడే ఆయన కైలాసానికి వెళ్లారని చెప్పేవారు!ఆ ఇంటి ఆయనకు కుక్కలంటే ​ఎంతో ప్రేమ! ఒక కుక్కను పెంచుకుంటున్నారు. వారు ఆ కుక్కకు ‘నంది’ అని పేరు పెట్టుకొని, ఆ కుక్కను​ ​నందీ​ అని పిలుస్తుంటే,వీరికి నందీశ్వరుని​ మీద కోపమా లేక ప్రేమో నాకు ఇప్పటికి అర్ధం కాలేదు​!నందిని కుక్క అనకుంటే చాలులే, అని అనుకున్నాను.ఏమి చేద్దాం! ఎవరి పిచ్చి వారికి ఆనందం! పేరులో ఏముంది? అని కొట్టి పారెయ్యకండి. పేరులో(name)నేముంది!

మీరైనా మీ మనవళ్ళకు,మనవరాళ్ళకు చక్కటి అర్ధవంతమైన తెలుగు పేర్లను పెట్టండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked