ధారావాహికలు

ప్రశ్న

ప్రశ్నల ప్రయాణంలో ప్రగతికి మార్గాలు

అమరనాథ్ . జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257

మనం ఏదైనా పని చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా వాటి తాలూకా కలిగే ప్రేరణల వలన మన మదిలో ఎన్నో ఆలోచలను ప్రశ్నల రూపంలో ఉత్పన్నమై వాటికి సంభందించిన సమాధానల కోసం మనసు తహ తహ లాడుతూ వుంటుంది. నిజంగా ప్రతి ఒక్కరికి ఇది ఆహ్వానించ తగ్గ పరిణామమే. ఎందుకంటె సమాధానం దొరకని ప్రశ్న మనసును వేధిస్తూ చికాకు పరుస్తూనే వుంటుంది. సమాధానం దొరికిన ప్రశ్న వలన అవగాహన పెరగటమే కాదు మనసు ఏంతో ఆనందంగా ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతూ వుంటుంది నిజమే కదా !
ఆదిమానవ సమాజం నుండి ఆధునిక మానవుడి వరకు రాతి యుగాల నాటి రాతి పనిముట్ల నుండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు సాగిన, సాగుతున్న పురోగమనం వెనుక వున్న పునాదులు మానవుని మెదడులో అనుక్షణం మెదిలే ప్రశ్నలే అంటే అతిశయోక్తి కాదు. మెరిసే మెరుపులు,ఉరిమే ఉరుములు,వర్షించే మేఘాలు,భయంకర ధ్వనులతో పడే పిడుగులు,దావాలనాలతో మండే అడవులు ఇలా ప్రకృతితో జరిగిన మానవుని రక్షణ పోరాటం తర తరాలుగా పరం పరలుగా ఎన్నో ఎన్నెన్నోమానవ జీవన అభివృద్దికి దోహదపడే ఆవిష్కరణలకు బీజాలు వేసాయి. వీటన్నిటి వెనక వున్న మానవ జీవన మనుగడకు దిక్సూచి ప్రశ్నేఅని చెప్పక తప్పదు!
ప్రశ్న అనే దానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే బాల్యం నుండి జీవిత చరమదశ వరకు ప్రతి రోజూ ఎన్నో సందేహాలతో రోజు ప్రారంభమయ్యి వాటి ఫై అవగాహన పెంచుకుంటూ జీవనయాత్ర కొనసాగుతూ వుంటుంది. ముఖ్యంగా జీవితంలోనేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ జీవితాన్ని విజయవంతంగా నడపాలంటే ప్రతి సందర్భంలో చేసే పని పట్ల లేదా చేయబోయే పని పట్ల అవగాహన అవసరం. ముఖ్యంగా విద్యార్ధి దశ నుండే తమ చదువులకు సంబంధించి ప్రశ్నద్వారా పురోగమనం సాధించటం అనేది అవసరమైన విషయం అందుకే ప్రశ్నఅనేది మనిషిలో జ్ఞానం పెంచటమే కాదు తెలిసికోవాల్సిన విషయం పట్ల స్పష్టత ,ఖచ్చితత్వం, జ్ఞానం మరియు మన భవిష్యత్ పురోగమనానికి ఉపయోగకరంగా ఉంటుంది. సహజంగానే చిన్నతనం నుండే ప్రతి వారికి ప్రశ్నించే తత్త్వం అలవడుతుంది తన చుట్టూ వుండే పరిసరాల గురించి,పరిసరాలలో జరిగే సంఘటనల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే చిన్న పిల్లల మదిలో మెదిలే ప్రశ్నలకు పెద్దలు చక్కని సమాధానాల ద్వారా వారిలో జ్ఞానం పెంచే ప్రయత్నాలు చేసి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి.

ప్రశ్నకు సరియైన సమాధానం లేకపోతె జీవితమే ప్రశ్నార్దకంగా మిగిలి పోతుంది!

ప్రశ్న అడగటానికి కొందరు సిగ్గు పడతారు మరికొందరు భయపడతారు కారణం ఇతరులు మనకేమి తెలియదని అనుకుంటారేమోనని! ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది మనం అడిగే ప్రశ్న ఒక్కొక్కసారి ఇత్రరుల సందేహాలను కూడా నివృత్తి చేస్తుంది. అందుకనే విద్యార్ధి దశ నుండే మనం చదివే చదువుల పట్ల లేదా ఆడే ఆటల పట్ల అవగాహన పెంచుకోవాలంటే ప్రశ్నించాల్సిందే మరి! ప్రశ్నించటం ద్వారా విద్యార్ధి అవగాహన పెరగటమే కాదు ప్రశ్నకు సమాధానం చెప్పే ఉపాధ్యాయుడి నిపుణత ఇంకా పెరుగుతుంది. ఎందుకంటె సబ్జెక్టు పట్ల లోతైన విశ్లేషణ ఉపాధ్యాయుడు చేయాలి కాబట్టి. గతంలో ఉపాద్యాయులు మరుసటి రోజు తాము చెప్పవలసిన పాఠాన్ని క్షుణ్ణంగా అధ్యనం చేసి ఆ సబ్జెక్టుకు,సంబంధించి వచ్చే ప్రశ్నలకు కూడా ఉదాహరణల రూపంలో చెప్పే విధంగా తయారయ్యేవారంటే ప్రశ్నల కున్న గొప్పదనమే మరి !

ఏదో ప్రశ్న అడగాలి కాబట్టి అడగటం,ఏదో ప్రశ్న వేయాలి కాబట్టి వేయటం రెండూ సరైన విధాలు కావు. ప్రశ్న అంటేనే అవగాహన పెంచుకోవాటానికి అభివృద్ధి చెందటానికి అనేది మరువద్దు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తరగతి గదుల్లో విద్యార్థులు చెప్పింది వినటమే తప్ప ప్రశ్నించటం అనే విధానం తగ్గిపోతోంది. ఫార్మా,ఇంజినీరింగ్,మార్కెటింగ్, వైద్యం, వృత్తి విద్యా సంబంధమైన అనేక రంగాలలో ఈ పరిస్టితి కొనసాగుతూనే వుంది. దీనివలన ఆత్మవిశ్వాసంతో కదపాల్సిన అడుగులు తడబడుతున్నాయి. దీనివలన పేరుకి డిగ్రీ పట్టలు,మార్కుల సర్టిఫికెట్స్ వున్నా కూడా బతుకు భారోసాకు కావాల్సిన పునాదులు లేకపోవటం చేత చదువులు పూర్తి చేసుకున్నాక కూడా మెదడు నిండా ప్రశ్నల తోనే విద్యార్థులు బయటకు వస్తున్నారనేది కాదనలేని సత్యం! ఈ కారణం వల్లే చేతికి రావాల్సిన అవకాశాలు నైపుణ్యాలు కొరవడి చేజారి పోతున్నాయి. అందుకే జ్ఞానం పెంచుకోవాల్సిన సమయం లోనే ప్రతి ఒక్కరు విజ్ఞానం పెంచుకోవటానికి కృషిచేయాలి. ఎందుకంటె సమయం చాలా చాలా విలువైనదీ.
ఏమిటి?ఎందుకు?ఎప్పుడు?ఎలా?అనే ప్రశ్నల పునాది పైనే ప్రపంచ అభివృద్ధి కొనసాగుతోంది. అందుకే ప్రశ్నించటం ఎలా ?ప్రశ్నలు అడగటం ఎలా? మరియు ప్రశ్నించటం వలన వుపయోగాలేమిటి తో కూడా పరిశీలిద్దాం!

ప్రశ్నలు అడగటం ఎలా? ఎందుకు?

 • తరగతి గదుల్లో వినే ఏ పాఠ్యాంశమైనా శ్రద్దగా వినటం,వాటికి సంభందించిన సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి.
  పాఠాలను సాధన చేసే ప్రతి సందర్భంలో వచ్చే సందేహాలను ఖచ్చితంగా మరుసటి రోజు అడిగి తెలుసుకోవాలి. దానికై సందేహాలను గుర్తు కోసం ఒక కాగితం పైన వ్రాసుకుంటే అడగవలసిన ప్రశ్నల వివరాలు గుర్తులో ఉంటాయి.
 • ఏ పాఠానికి సంబంధించిన ప్రశ్నైనా అడిగే విషయంలో స్పష్టత వుండాలి అందుకే నోటి ద్వారా అడిగే విషయంలో తత్తరపాటు లేకుండా సందేహాన్ని కాగితం పై వ్రాసుకుంటే మంచిది
 • ప్రశ్నఏభాషలోఅడిగినా కూడా అది అందరికి అర్ధమయ్యే రీతిలో వుండాలి. దీనివలన ఇతరులకు ఇదే ప్రశ్న అడగాలనుకుంటే వారికి కూడా సమాధానం దొరుకుతుంది.
 • ప్రశ్న వేయటం కోసం విషయ సంబంధం లేని ప్రశ్నలు అడగరాదు. ప్రశ్న వేయటం అంటే అవగాహన మరియు జ్ఞానం పెంచుకోవటానికి అనేది గుర్తుంచుకోవాలి.
 • ప్రశ్న వేయటం అంటేనే సబ్జక్ట్స్ పైన అవగాహన పెంచుకోవటం అందుకనే ప్రశ్న ద్వారా వచ్చే సమాధానం గుర్తు కోసం వ్రాసుకోవటం తప్పనిసరి !
 • ప్రశ్నలు అడగటం వలన మన అవగాహన పెరగటమే కాదు ఉపాధ్యాయులు కూడా ఎప్పడికప్పుడు కొత్త విషయాలతో మీకు సమాధానాలు చెప్పే విధంగా సంసిద్ధులై వుంటారు.

ప్రశ్నలు వేయటం ఎందుకోసం? దేనికోసం?

 • ఉపాధ్యాయులు పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులకు అర్ధమైనదా లేదా అని తెలుసుకోవటం కోసం మధ్య మధ్యలో ప్రశ్నల రూపం లో పరిక్షిస్తుంటారు ఇది మన మంచికేనని గుర్తుంచుకోండి. దీనివలన వినే శ్రద్ద, జాగ్రత్త మనలో పెరుగుతుంది.
 • ఉపాధ్యాయులు వేసే ప్రశ్నలు చెప్పిన సబ్జెక్టు పైన మన అవగాహన పెరిగిందా లేదా అని తెలుసుకోవతానికేనని మన అభివృద్ధికే నని గుర్తుంచుకోండి.అంతే కాని మనల్లేదో అవమానించటానికనే భావన మనసులోకి రానీయవద్దు.
  ప్రశ్నలు వేయటం వలన మనం ఎక్కడ వెనుకబడి ఉన్నామో ఉపాధ్యాయుడు అర్ధం చేసికొని తిరిగి ఆ సబ్జెక్టు పట్ల మనలో స్పష్టమైన అవగాహన పెంచే ప్రయత్నాలు జరగవచ్చు.
 • ప్రశ్నలు వేయటం వలన అవగాహనే కాదు భయం బెరుకు పోయి నలుగురిలో మాట్లాడే ధైర్యం ఏర్పడుతుంది.అందుకనే ఉపాధ్యాయులు ఈ విషయాన్ని కూడా ద్రుష్టిలో ఉంచుకొని ప్రశ్నలు అడుగుతుంటారు.
  ప్రశ్నలు వేయటం మరియు అడగటం వలన ఉపయోగాలు
 • ప్రశ్నలు వేయటం లేదా అడిగిన్చుకోవటం వలన విద్యార్ధులలో భయం బెరుకు పోవటమే కాదు విద్యార్ధి మరియు ఉపాధ్యాయునికి మధ్య పరస్పర అవగాహన చక్కటి సంబంద బాంధవ్యాలు ఏర్పడతాయి.
  కొత్త విషయాలు తెలిసికుంటుంన్నామనే,ఆనందం భవిష్యత్లో ఇంకా ఎన్నో విషయాలునేర్వగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
 • ప్రశ్నవలన విషయాన్నిసమగ్రంగా తెలుసుకునే అవకాశం మరియు సమర్థతతో సమస్యలను ఎదుర్కొనే అవకాశముంటుంది
 • మన పైన మనకు జీవితంలో అనుకున్న స్థాయిలో ఎదగ గలమనే భరోసా ఏర్పడుతుంది. అంతేకాదు మన అడుగులు ఖచ్చితంగా పురోగమనం వైపే పడతాయి కూడా!

ఇక ముగింపుగా ప్రశ్నించటం, ప్రశ్నించబడటం అవమానం కాదు అధికారం అంతకంటే కాదు. ఇది ప్రతి మనిషి జీవితంలో తెలియని విషయాల పట్ల తెలుసుకునే అవగాహనే!మనల్ని మనం తీర్చి దిద్దుకుంటూ నూతన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణల కోసం అభివృద్ధి వైపు వేసే ఒక అడుగు,అందుకే ఈ ప్రశ్నల ప్రయాణంలో ప్రగతికి మార్గాలు తెరుద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked