కవితా స్రవంతి

ప్రేమలేఖ

– అరాశ

నేనిట సేమమే యచట నీవును సేమముగా దలంచెదన్

మానితివేల జాబులను మానసవీధిన మీ విహారమే

గాన రుచించదోగిరము కంటికి నిద్దుర రాదు నన్ను నీ

దానిగ జేసికొమ్ము సరదా కయి నన్ విడబోకురా ప్రభో

గండు తుమ్మెద నీట కమలమున్ గనుగొని

ఝుంఝుమ్మనుచు పాడె చూడరమ్ము

జంట పక్షులు కొమ్మనంటి కూర్చొని ప్రేమ

కబురులు వినిపించె కదలి రమ్ము

తరువును లతయిట పెరిమతో పెనవేసి

విరులను వెదజల్లె నరయ రమ్ము

అలలతో కదలాడి యవనిని ముద్దాడు

కడలిని కనులార గనగరమ్ము

పురుషునిన్ జూచి ప్రకృతియే పులకరించె

ప్రకృతి గాంచిన పురుషుడే పరవశించె

కనులు గనియెడి దృశ్యమే మనసు జేరి

కలత రేపిన వైనమే గనుము నేడు

కోరను కోటి రూకలను కోరనవెన్నడు మేడ మిద్దెలన్

గోరను పట్టు వస్త్రముల గోరను హేమ విభూషణావళుల్

కోరను విందు భోజనము కోరను నిత్య విహారమెప్పుడున్

కోరెద నొక్కటే యమిత కూరిమి కోరిక దీర్చరమ్మురా

తలుపు చప్పుడు వినినంత తరలి జూతు

పిలుపు విన నీవెనంచని పలుక జూతు

అడుగు సవ్వడి నీదని వెడలి జూతు

నిమిష నిమిషము నినుగన నెదిరిజూతు

తలచిన చాలు నా కనుల దాపున నీదగు రూపురేఖలే

నిలిచిటు మందహాసమును నిండుగ వెన్నెలలట్లు చిందు నే

పిలిచిన చాలు నా కలల పేర్మి వసించుచు దివ్యలీలగా

చిలిపి తనంబుతో సలుపు చేష్టలముంచెదవెంత వింతరో

లేఖ చదివిన వెంట రాలేకయున్న

జాబునొక్కటి రాయుమే జాగులేక

ఎదిరి చూచెద మరువకుమెచటనున్న

తనువులే రెండు మనకును మనసు యొకటె

తప్పులున్నను మన్నించి యొప్పులు గను

భావనము చేసి చదువగా ప్రార్థనంబు

యిట్లు భవదీయ ప్రేయసినిట్టిలేఖ

గొనిన నికచాలు పదివేలు వినుతులిడుదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked