కథా భారతి

బ్రహ్మ తేజస్సు

-అన్నపంతుల జగన్నాధ రావు

(ఇది తెలంగాణలో నవాబుల కాలంలో జరిగిన యదార్ధ సంఘటనగా జనశ్రుతిలో వుంది)

ఆకలి. మూడక్షరాల మాట. మనిషిని ముప్పుతిప్పలు పెట్టే మాట. జఠరాగ్నిని తట్టుకోవడం కష్టమనిపిస్తోంది నారాయణ సోమయాజికి. అన్నం తిని మూడు రోజులైంది. మూడు రోజుల కిందట సాయంకాలం తిన్న గుప్పెడు అటుకులే ఆఖరి ఆహారం. రెండురోజుల నుండీ మంచినీళ్ళ తోనే కాలం గడుపుతున్నాడు. పొద్దున్న పంటి బిగువున సంధ్యావందనం చేశాడు. అప్పటి నుంచి నిస్త్రాణగా పడుకొనే వున్నాడు మండువాలో. లేచి మంచినీళ్ళు తాగడానికి కూడా సత్తువ లేదు. కానీ కడుపులో అగ్నిహోత్రుడు వూరుకుంటాడా? బలవంతంగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. కాసిన్ని మంచినీళ్ళు తాగడంతో కొద్దిగా ఓపికవచ్చినట్టు అనిపించింది. “అమ్మా, గంగాభవానీ, నా ప్రాణాలు నిలబెడుతున్నావా తల్లీ” అనుకున్నాడు.

ఇల్లంతా కలయ జూశాడు. లంకంత యిల్లు. ఒకప్పుడు పిల్లా పాపలతో, వచ్చేపోయే బంధువులతో కళకళలాడుతూ వుండేది. తన దగ్గర వేదం చెప్పుకొనే విద్యార్ధులే పదిహేను యిరవై మంది వుండేవారు యింట్లో. అంతమందికీ విసుక్కోకుండా మూడు పూటలా అన్నం వండి పెట్టేది తన భార్య సావిత్రి. ఎప్పుడు లేచేదో, యెప్పుడు నిద్రపోయేదో తెలియదు. ముఖంపై చిరునవ్వు చెదరనివ్వకుండా పనులన్నీ చక్కబెట్టేది. ఆ వైభవం యేదీ యిప్పుడు? తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ హారతి కర్పూరంలా హరించుకు పోయాయి. ఇంట్లో వున్న వస్తువులన్నిటికీ కాళ్ళు వచ్చేయి. ఆఖరికి యిల్లు కూడా కుదువ పెట్టవలసి వచ్చింది. క్షీణిస్తున్న తన ఆర్ధిక స్థితిని చూసి బంధువులందరూ నెమ్మదిగా ముఖం చాటేశారు. ఇంట్లో భోజనం పెట్టి విద్య నేర్పించే స్తోమత లేకపోవడంతో శిష్యులెవరూ రావడం లేదు. రెండేళ్ళ కిందట అనారోగ్యంతో సావిత్రి కన్నుమూసింది. తనకి వైద్యం చేయించడానికి వేరే దారి లేక యిల్లు తనఖా పెట్టవలసి వచ్చింది. అయినా మనిషి దక్కలేదు. జీవితపు మలిసంధ్యలో వొంటరి వాడైపోయాడు.

ఎంతోమందికి ఆశ్రయం కల్పించిన యిల్లు యిప్పుడు కళావిహీనంగా మారి బోసిపోయింది. తనకి సంతతి లేకపోయినా, శిష్యులే సంతానంగా భావించేవాడు. తన దగ్గర వేదం చెప్పుకున్న శిష్యులంతా ప్రయోజకులయ్యారు. భోజన వసతులు కల్పించి వుచితంగా విద్యాదానం చెయ్యడమే తన యింట్లో వంశానుగతంగా వస్తున్న సాంప్రదాయం. శిష్యులు అభిమానంతో యేమిచ్చినా పుచ్చుకొనే అలవాటు యేనాడూ లేదు. రెండు నెలల కిందట, తన దగ్గర వేదం చెప్పుకొని ఘనాపాటీ అనిపించుకున్న కేశవుడు వచ్చి, తన పరిస్థితిని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “గురువుగారూ, మీరింక యిక్కడ వుండొద్దు. నాతో వచ్చేయండి. మిమ్మల్ని నా కన్నతండ్రిలా చూసుకుంటాను” అన్నాడు.

“నామీద నీకున్న అపేక్ష నాకు తెలుసురా కేశవా. కానీ, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అనే రామాయణ వాక్యం మరిచిపోయావా?” అన్నాడు తను.

“అదికాదు గురువుగారూ! అమ్మగారు కూడా లేరు. ఈ వయసులో మీరు యిక్కడ వొంటరిగా…” నసిగాడు కేశవుడు.

“ఒరేయ్! నేను పుట్టి పెరిగిన యిల్లురా యిది. ఈ గాలి, యీ వూరు వీటితోనే నా జీవితం ముడిపడిపోయింది. ఈ యింటితో నాకెన్నో జ్ఞాపకాలు, అనుబంధాలూను. వీటన్నిటిని వదిలి నేను యెక్కడికీ రాలేను. ఈ కట్టె యిక్కడే రాలిపోవలసిందే” గాద్గదికంగా అన్నాడు నారాయణ సోమయాజి.
“మీ నోటివెంట అమంగళం పలకకండి గురువుగారూ” అంటూ కొంత పైకం తీసి యివ్వబోయాడు కేశవుడు.

“నాకు ధనసహాయం చేసేంత పెద్దవాడి నయ్యాననుకుంటున్నావురా?” చిరుకోపంతో అన్నాడు నారాయణ సోమయాజి.

“ఎంతమాట గురువుగారూ. ఇది సహాయం కాదు, గురుదక్షిణ అనుకోండి” అన్నాడు కేశవుడు.

“ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా విద్యాదానం చెయ్యడమే మా పెద్దలు నేర్పించిన వరవడి. ఇప్పటి వరకూ నేను అదే మార్గాన్ని అనుసరిస్తూ వచ్చేను. ప్రస్తుతం జీవితం చరమాంకంలో వున్నాను. ఇప్పుడిక ధనాపేక్షతో పితృ పితామహుల గతికి తప్పలేను” అన్నాడు నారాయణ సోమయాజి.

చేసేదేమీ లేక భారంగా వెనుదిరిగాడు కేశవుడు.

-000-

నీళ్ళు తాగి ఘడియైనా కాలేదు. ఆత్మారాముడు మళ్ళీ ఆకలీ అంటున్నాడు. ఇక లాభం లేదు, లేచి బయటకు వెళ్ళి యేదో ఒక ప్రయత్నం చేయకపోతే ప్రాణాలు నిలిచేలా లేవు అనుకున్నాడు నారాయణ సోమయాజి. పోనీ, ప్రాణాలు పోతేనేం, తాను యిక యెవరికోసం బతకాలి? కానీ ఆలా చేస్తే అది ఆత్మహత్యకింద అవుతుంది. ఆత్మహత్య మహాపాపం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అని కదా శృతి వాక్యం. అంచేత శరీరాన్ని నిలుపుకోవాలి. కాబట్టి యేదో ఒకటి చెయ్యాల్సిందే. ఇంతవరకూ తను యెవ్వరి దగ్గరా చెయ్యి సాచి యెరుగడు. అన్నార్ధమై యాచించడమంటేనే యేదోలా వుంది. కానీ యేం చెయ్యడం? యాచించవలసి వచ్చేసరికి, విష్ణుమూర్తి అంతటి వాడే వామనుడైపోలేదా?

ఇలా అనుకుంటూ, వుత్తరీయం భుజాన వేసుకొని, యింట్లోంచి బయటకు వచ్చాడు. జేష్టమాసం, మిట్ట మధ్యాహ్నం కావడంతో గ్రీష్మాదిత్యుడు భీషణంగా ప్రతాపం చూపిస్తున్నాడు. రహదారి నిప్పుల కొలిమిలా వుంది. వీధిలో యెక్కడా నరసంచారం లేదు. అన్ని యిళ్ళు తలుపులు మూసేసి వున్నాయి. అయినా యెవరింటికి వెళతాడు, యేమని అడుగుతాడు.

పచ్చని మేని ఛాయ యెర్రగా మారిపోయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. నాలుక తడారిపోతోంది. దేహమంతా చెమటతో తడిసి ముద్దై పోతోంది. పాదరక్షలు లేకపోవడంతో పాదాలు బొబ్బలెక్కుతున్నాయి. గమ్యం తెలియకుండా నడుస్తున్నాడు నారాయణ సోమయాజి. మూసిన తలుపులు వెక్కిరిస్తున్నాయి. ఒకప్పుడు వేదమే యీ దేశంలో సామాజిక జీవనానికి మూలం. అలాంటిది ఆ వేదానికి ప్రతినిధియైన తాను యీనాడు క్షుద్బాధతో నడివీధి పాలయ్యాడు. “అమ్మా, వేదమాతా! యేమిటి తల్లీ యీ పరీక్ష?” అనుకున్నాడు నారాయణ సోమయాజి.

వీధి చివరలో పెద్ద గడీ. తలుపులు తీసి వున్నాయి. అపరాహ్ణవేళ కాబట్టి, యింకా భోజనాలు అయి వుండక పోవచ్చు అనుకుంటూ గడీలోకి అడుగు పెట్టాడు నారాయణ సోమయాజి. అదే వూళ్ళో వుంటున్నా యింతకు ముందెప్పుడూ గడీలో అడుగు పెట్టలేదు నారాయణ సోమయాజి. ఎదురుగా యెత్తైన అరుగుల మీద దొరగారు కూర్చొని వున్నారు. వారి చుట్టూ ఐదారుగురు కూర్చొని తాంబూలచర్వణం చేస్తున్నారు. అంటే భోజనాలు అయిపోయాయన్నమాట – నిరాశగా అనుకున్నాడు నారాయణ సోమయాజి. అయితేనేం, యేదో వొక సహాయం దొరకక పోతుందా అనుకుంటూ దగ్గరగా వెళ్ళేడు. అతని రాకని యెవరూ గమనించలేదు. చిన్నగా దగ్గాడు. ఫలితం శూన్యం. అయినా యేమని అడుగుతాడు. నాకు ఆకలి వేస్తోంది, అన్నం పెట్టండీ అని అడుగుతాడా? అందుకు అభిమానం అడ్డొచ్చింది. కానీ, ఆకలిదే పై చెయ్యి అయింది. సరే, యేదైతే అది అవుతుంది అనుకుంటూ తడారిపోయిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ “శతమానం భవతి శతాయు: పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతీ” అంటూ ఆశీర్వచన మంత్రం చదివాడు.

దొరగారు కళ్ళెత్తి చూశారు. నారాయణ సోమయాజి ఆశగా చూశాడు. దొర పక్కన కూర్చున్న వ్యక్తి “అడుక్కు తినేటోల్లకి యేలాపాలా లేకుండా పోతాంది” అన్నాడు. అతని పక్కన కూర్చున్న యింకొకడు “యేలాపాలా లేక పోవడమేంది. సరిగ్గా బోయినాల యేల జూస్కోనే వచ్చిండు బాపనాయన” అన్నాడు నవ్వుతూ. నారాయణ సోమయాజి సిగ్గుతో చితికిపోయాడు. భూమి నిలువునా చీలిపోయి తనలో ఐక్యం చేసుకుంటే బావుణ్ణు అనిపించింది. వెనక్కి తిరగబోతుండగా, లోనికి పో అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు దొర. వేరే దారి లేక లోనికి నడిచాడు నారాయణ సోమయాజి. వెనక నుంచి వెకిలి నవ్వులు వినిపిస్తూనే వున్నాయి.

ఒక్కొక్క గుమ్మం దాటుకుంటూ లోనికి వెళ్తున్నాడు నారాయణ సోమయాజి. ఒక గదిలో కొంతమంది యువకులు కూర్చొని, పులి జూదం ఆడుతున్నారు. పక్కగా వెళ్తున్న నారాయణ సోమయాజిని చూసి “ఓయ్, యేడకి పోతున్నావ్?” అంటూ గద్దించి అడిగాడొకడు.

“దొరగారు లోనికి వెళ్ళమన్నారు” సమాధానం చెప్పాడు నారాయణ సోమయాజి.

“ఏం గావాలే?” మళ్ళీ అడిగాడు వాడు.

“భో.. భో..జనం” తడబడుతూ అన్నాడు నారాయణ సోమయాజి.

“ఇదేమైనా నీ అత్తోరి యిల్లనుకున్నావు. ఇంటల్లునికి మల్లె పోతుంటివి?” గట్టిగా అడిగాడు ఆ యువకుడు. నారాయణ సోమయాజికి యేం జవాబు చెప్పాలో తోచలేదు.

“పోనీయ్ రా, పాపం బాపనాయన” అన్నాడు పక్కనే వున్న మరొకడు.

“బాపనాయన అయితేంది. మూడుసార్లు పుట్టిండా? ఇగో, యిట్టా రా. ఇయన్నీ దీసి పెరట్లో బావి కాడ పెట్టి పో” పక్కనే వున్న యెంగిలి కాళీ గ్లాసులు, వుమ్మేసిన పాత్రలు చూపిస్తూ అన్నాడు ఆ యువకుడు. నేనా అన్నట్టు చూశాడు నారాయణ సోమయాజి. “ఏం, యీ పని నువ్వు చెయ్యరాదని యేడైనా రాసుందా?” వంకర నవ్వు నవ్వుతూ అన్నాడు ఆ యువకుడు. చేసేది లేక పాత్ర సామాను పట్టుకొని లోనికి నడిచాడు నారాయణ సోమయాజి. “బాపనాయనకి మంచిగ బుద్ధి చెప్పినావ్ రా” అంటున్నారెవరో. వెనక్కి తిరిగి చూడలేకపోయాడు నారాయణ సోమయాజి.

రెండు గుమ్మాలు దాటి వెళ్ళేసరికి, పట్టు చీర కట్టుకొని, ఒంటి నిండా నగలు ధరించి వున్న దొరసాని యెదురైంది. ఎన్ని నగలు ధరిస్తేనేం, నల్లని ఆమె శరీర ఛాయకి అవి వన్నె తీసుకురాలేకపోతున్నాయి. నారాయణ సోమయాజికి సావిత్రి గుర్తుకు వచ్చింది. నారచీర కట్టుకున్నా, పసుపుతాడు వేసుకున్నా, నుదుటన కాసంత బొట్టుపెట్టుకొని, అన్నపూర్ణా దేవిలా వుండేది.

తాంబూలం నములుతున్న నోటితోనే “ఏం గావాలే?” అని బొంగురు గొంతుతో అడిగింది దొరసాని. ఆమె పక్కనున్న దాసి, అతని చేతిలో వున్న పాత్ర సామాన్లు అందుకొని, పెరట్లోకి వెళ్ళిపోయింది.

“దీర్ఘ సుమంగళీ భవ! అమ్మా, అన్నార్ధినై వచ్చాను” అన్నాడు నారాయణ సోమయాజి.

ఎగాదిగా చూసి, రా అన్నట్టు సైగ చేసి, లోనికి నడిచింది దొరసాని. ఆమె వెనుక నిస్సహాయంగా నడిచాడు నారాయణ సోమయాజి. రెండు గదులు దాటిన తరువాత, విశాలమైన భోజనశాలకి ఆనుకొని వున్న వంటింట్లోకి నడిచి, “ఇగో, ఆడున్న సిబ్బెలు, గిన్నెలు అన్నీ మంచిగ శుభ్రం చెయ్” అంటూ అంట్ల గిన్నెలు చూపించి, తను వసారాలో వున్న తూగుటూయ్యాలలో కూర్చొని వూగసాగింది దొరసాని. నారాయణ సోమయాజి నిర్ఘాంతపోయాడు. ఎలాంటి వాణ్ణి, యెలా అయిపోయాను అనుకున్నాడు. మంత్రసాని పనికి వొప్పుకున్నాక అన్నీ చెయ్యాల్సిందే అనుకుంటూ ఆత్మారాముణ్ణి తిట్టుకుంటూ దొరసాని అప్పగించిన పని ముగించి, ఒక పక్కన నిలుచున్నాడు.

దొరసాని యెంతకీ తనవైపు చూడదే. వంటింట్లో గట్టుమీద పచ్చని అరటి గెలలు వున్నాయి. నాలుగైదు పళ్ళు కింద రాలిపడ్డాయి కూడానూ. దాసీది వచ్చి, వాటిని తీసి బయట పడేస్తుంటే ప్రాణం వుసూరు మంది నారాయణ సోమయాజికి. రెండు ఘడియలు గడిచేయి. నిలుచుని నిలుచుని కాళ్ళు నొప్పెడుతున్నాయి. కడుపులో అగ్నిహోత్రుడు జ్వలించిపోతున్నాడు. ధైర్యం చేసి దొరసాని ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. అతని వంక చిరాగ్గా చూస్తూ, “ఇయ్యాలకేం లేవుగానీ, రేపు రా, పో” అంది దొరసాని. నారాయణ సోమయాజికి కోపం, వుక్రోషం తన్నుకొచ్చాయి. ఏం చెయ్యగలడు తను? శపించలేడు, రోదించలేడు. ఉదరంలో జ్వలిస్తున్న అగ్నిహోత్రుణ్ణి తలచుకుంటూ ఋగ్వేదాంతర్గతమైన అగ్ని సూక్తం అందుకున్నాడు.

“అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ | హోతారం రత్నధాతమమ్ ||
అగ్ని: పూర్వేభిర్ ఋషి భిరీడ్యో నూతనై రుత ! సదేవాన్ ఏమ వక్షతి !!
అగ్ని నా రయిమశ్నవత్ పోషమేవ దివే దివే !యశసం వీర వత్తమమ్ !!
అగ్నేయం యజ్ఞ మధ్వరం విశ్వత: పరిభూరసి ! స ఇద్దేవేషు గచ్ఛతి !!”

వేదం వల్లిస్తూనే, ఎవరి వంకా చూడకుండా, పెద్ద పెద్ద అంగలేస్తూ, యింట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఎర్రబడిన దేహంతో నడిచివస్తున్న హుతాశనుడిలా వున్నాడు. ఇంకా ప్రధాన ద్వారం వరకూ రాకముందే, పెరట్లో నుంచి అరుపులు వినిపించాయి. దాసీలు, పనివాళ్ళూ, అంతా హాడావుడిగా పెరట్లోకి పరుగులు తీస్తున్నారు. ఎలాంటి నిప్పు రవ్వా పడకుండానే, ధాన్యాగారం తగలబడిపోతోంది. అగ్ని హోత్రుడు వేయి నాలుకలతో చెలరేగుతున్నాడు. మంటలు వేగంగా వంటింటి వైపు విస్తరిస్తున్నాయి. పనివాళ్ళతో పాటు, యింట్లో వున్న వాళ్ళందరూ దొరగారితో సహా బెంబేలెత్తి పరుగెడుతున్నారు. ఎవ్వరూ యేమీ చెయ్యలేకపోతున్నారు.

వేదోచ్ఛాటన చేస్తూ వస్తున్న నారాయణ సోమయాజికి యేం జరుగుతోందో తెలియడం లేదు. పూనకం వచ్చిన వాడిలా నడుస్తూ, గడీ లోంచి బయటకు వచ్చేసి, ఎదురుగా వున్న యింటి అరుగుమీద కూర్చున్నాడు. వూరు వూరంతా కదలి వచ్చింది. అగ్ని కీలలు తమ యిళ్ళ మీదకి యెక్కడ వ్యాపిస్తాయోనని భయభ్రాంతులౌతున్నారు. ఎవరో వచ్చి నారాయణ సోమయాజిని అడిగారు “ఏం జరిగింది స్వామీ?” అని.

“బ్రహ్మ తేజస్సు ఆకలి తీర్చుకుంటోంది” నిర్లిప్తంగా అన్నాడు నారాయణ సోమయాజి. చుట్టూ వున్న బ్రాహ్మణ్యానికి అర్ధమైపోయింది. ఈ మహా పండితునికి యేదో జరగరాని అవమానం జరిగి వుంటుంది. దాంతో అగ్నిని ఆవాహన చేశాడు అని. చుట్టుపక్కల యిళ్ళున్న వాళ్ళు వచ్చి “రక్షించండి స్వామీ” అంటూ నారాయణ సోమయాజి కాళ్ళ మీద పడ్డారు.

అప్పటికి పూర్తిగా లౌకిక జగత్తులోకి వచ్చాడు నారాయణ సోమయాజి. ఎదురుగా చూస్తే, దొరగారి గడీ అంతా మంటల్లో దగ్ధమౌతూ కనిపించింది. తనవంక భయంతో, ఆశతో చూస్తున్న జనం కనిపించేరు. వెంటనే “యచ్చిద్ధి తే విశో యథా ప్ర దేవ వరుణ” అంటూ వరుణసూక్తం వల్లించడం మొదలుపెట్టేడు. రెండు నిమిషాలలో, యెక్కడా మబ్బు తునకైనా లేకుండానే, దట్టమైన వర్షం గడీ వున్న మేరకు గోడ కట్టినట్టుగా కురవసాగింది. ప్రజలంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. పక్కనున్న యిళ్ళమీద ఒక్క నీటి చుక్కైనా పడలేదు. అగ్ని జ్వాలలు చల్లారాయి. గడీ మొత్తం బూడిద కుప్పలా మారింది. విషయం దొర చెవిన చేరింది. దొర పరుగెట్టుకుంటూ వచ్చి నారాయణ సోమయాజి పాదాల మీద పడ్డాడు.

“నీ వైభవం నీతోనే సరి. నీ వంశంలో నీ తరవాత యింకెవ్వరికీ సుఖ ప్రారబ్ధం లేదు. ఇది దైవ నిర్ణయం” అంటూ వుత్తరీయం బుజాన వేసుకొని బయల్దేరాడు నారాయణ సోమయాజి. అతని నోట వచ్చిన మాట అక్షర సత్యమై చరిత్రలో నిరూపితమైంది.

-000-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on బ్రహ్మ తేజస్సు

భానుమతి మంథా said : Guest one year ago

ఆనాటి పరిస్థితులు కళ్లకి కట్టినట్లు చెప్పారు. మళ్లీ వేద విద్యకి , పండితులకి అదే స్థితి వచ్చేలాగుంది. కళ్ల నీళ్లు ఆగలేదు. రచయితకి అభినందనలు.

  • Hyderabad, India