కవితా స్రవంతి

భ్రమ

– పారనంది శాంతకుమారి

వయసుపెరిగినంత మాత్రాన
బుద్ధి పెరుగుతుందని అనుకోవటం భ్రమ.
మనసుమంచిదైనంత మాత్రాన
మమత ఉంటుందనుకోవటం భ్రమ.
విధ్యావంతుడైనంత మాత్రాన
వివేకం ఉంటుందనిఅనుకోవటం భ్రమ.
అమెరికా సంబంధం అయినంత మాత్రాన
అమ్మాయి సుఖపడుతుందని అనుకోవటం భ్రమ.
తక్కువ చదువుకున్న అమ్మాయి వస్తే
ఇంటిపనులన్నీ చేసేస్తుందని అనుకోవటం భ్రమ.
కాలం కలిసి వచ్చినంత మాత్రాన
నడిచివచ్చే కొడుకు పుడతాడనుకోవటం భ్రమ.
రంగురాళ్ళు ధరించినంత మాత్రాన
రాత మారిపోతుందని అనుకోవటం భ్రమ.
డబ్బు సంపాదించినంత మాత్రాన
సుఖం కలుగుతుందని అనుకోవటం భ్రమ.
విరాళాలు ఇచ్చినంత మాత్రాన
వైరాగ్యం కలుగుతుందని అనుకోవటం భ్రమ.
తల్లితండ్రులను బయటకు పంపినంత మాత్రాన
భార్యతో సుఖపడవచ్చన్నది భ్రమ.
కార్పోరేట్ కళాశాలల్లో చదివించినంత మాత్రాన
కొడుకు ఎత్తుకు ఎదిగిపోతాడని అనుకోవటం భ్రమ.
కన్నీళ్ళు కార్చినంతమాత్రాన
కరుణ ఉంటుందనుకోవటం భ్రమ.
కషాయం కట్టినంతమాత్రాన
కావేశం ఉండదనుకోవటం భ్రమ.
టీవీ తెరపై కనిపించినంత మాత్రాన
తేజోవంతుడనుకోవడం భ్రమ.
పండితుడిలా నాలుగువాక్యాలు పలికినంతమాత్రాన
సర్వసంగ పరిత్యాగి అనుకోవటం భ్రమ.
ఆత్మజ్ఞానిని అని చెప్పినంతమాత్రాన
అతనిలో అజ్ఞానం తొలగిపోయిందనుకోవటం భ్రమ.
కష్టపడి పెంచినంతమాత్రాన
కడలో కొడుకులు చూస్తారనుకోవటం భ్రమ.
ఇలా ప్రతీదానినీ నమ్మి
నట్టేట మునగటం వట్టిశ్రమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked