కథా భారతి

మనసులో ఏముందో?

ఆర్. శర్మ దంతుర్తి

కాలేజీ నుంచి ఇంటికొచ్చిన అనామిక మొహం కడుక్కుని లాప్ టాప్ మీద ఏదో పని చేసుకుంటూంటే అమ్మ కాదంబరి పలకరించింది, “అన్నీ సరిగ్గా ఉన్నట్టేనా?”
“ఆ ఏదోలే, ఇప్పుడు మాట్లాడకు. చాలా చిరాగ్గా ఉంది.”
మరో గంట గడిచాక మొగుడు దేవానంద్ బాత్రూంలో దూరినప్పుడు అనామిక తీరిగ్గా ఉండడం చూసి అడిగింది కాదంబరి, “ఇప్పుడు చెప్పు ఏమిటి కధ?”
అనామిక చిన్నగా ఏడవడం వినిపిస్తే కాదంబరి కంగారుగా అడిగింది, “ఏమైందే? నాతో చెప్పు.”
వేరే గదిలోకి రమ్మని అమ్మకి చేత్తో సైగ చేసి అక్కడికెళ్ళాక బాగా ఏడవడం మొదలుపెట్టింది అనామిక. ఏడిచేవాళ్ళని కాసేపు ఆ బాధ అంతా దిగిపోయేదాకా ఏడవనివ్వడం మంచిది కనక కాదంబరి ఊరుకుంది. కాసేపటికి తేరుకున్న అనామిక చెప్పింది, “ఈ రోజు ఆఫీసులో ఆ ప్రోజక్ట్ మేనేజర్ దక్షిణాదివాడు వెంకట్ అనే ఆయన పిలిచాడు నన్ను తన రూములోకి. ఎందుకో అని వెళ్ళాను. ట్రైనింగ్ క్లాసులో కొన్ని మంచి ప్రశ్నలు ఇచ్చాను అందరికీ అవన్నీ అలా నోట్లోంచి వచ్చినవే. ఎక్కడా రాసిపెట్టుకోలేదు. కాస్త అవన్నీ రాసి ఇస్తారా? అవి కాపీలు చేసి అందరికీ ఇస్తాను క్లాసులో. మీరు చెప్పే నోట్స్ శ్రధ్ధగా రాసుకోవడం చూసి అడుగుతున్నా” అన్నాడు.
“ఇందులో ఏడవడానికేం ఉంది?”
“ఏవుందా అని అడుగుతున్నావా? రూములోకి రమ్మన్న మరు క్షణం నుంచీ వళ్ళంతా తడుముతున్నట్టూ ఇలా పైనుంచి కిందకీ కిందనుంచి పైకీ అలా నా వంపు సొంపులు చూస్తూనే ఉన్నాడు. నేను ఏం మాట్లాడానో అసలు విన్నాడో లేదో కానీ కళ్ళన్నీ నా మొహం తప్ప మిగతా అంతా చూడడానికే పిలిచినట్టు ప్రవర్తించాడు. అసలే ఈ రోజు వేసుకున్న ఆ నీలం డ్రెస్ పాతది. అది వేసుకెళ్తే నా ఛాతీ, లోపలి బట్టలూ బాగా కనిపిస్తున్నాయి. అవి చూడ్డానికే పిల్చినట్టూ మాట్లాడేడు. గుండెలు అదురుతుండగా ముళ్ళమీద కూర్చునట్టూ కూర్చుని వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆయన గదిలోకి వెళ్ళాలంటే భయమేస్తోంది. ఏం చేయలంటావు?”
“ఇదో దరిద్రం మన ఆడవాళ్ళకి. నాన్నని వెళ్ళి ఓ సారి మాట్లాడమంటావా?”
అనామిక ఏదో అనబోతూంటే తలుపు ధడేల్న ఒక్కసారిగా తెరుచుకుంది, “ఎవరో నాకు చెప్పేదేమిటి వెళ్ళి మాట్లాడాలో వద్దో? నేను రేపే వెళ్ళి మాట్లాడతాను వాడితో. వళ్ళు దగ్గిరపెట్టుకోకపోతే ఈ బొంబాయ్ లో పుట్టగతులు ఉండవని వార్నింగ్ ఇచ్చి మరీ వస్తా,” దేవానంద్ లోపలికి వస్తూ చెప్పేడు, “నేను బయటనుంచి అంతా విన్నాను.”
“ఊరుకోండి, మీరు అసలు వెళ్లనే వద్దు. ఉన్న కాస్త మంచి అభిప్రాయం ఏదైనా ఉంటే దాన్ని చెడగొట్టదానికి తప్ప ఎందుకూ పనికిరాదు మీ రాయబారం,” ఈసడిస్తూ చెప్పింది కాదంబరి.
“నాన్నా, దయచేసి ఏమీ చేయకు,” అనామిక అనగానే దేవానంద్ బయటకి వెళ్ళాడు.
కాదంబరి చెప్పింది కూతురితో, “మనకి చేతనైంది మనం చేద్దాం. ముందా నీలం డ్రెస్సూ, మిగతా పాత డ్రెస్సులూ పారేసి కొత్తవి కొనుక్కో. దుప్పట్టా పైకి లాక్కుని ఉండు. మీద చేయి వేసినా మరో సారి ఇలా మాట్లాడినా ఓ సారి వార్నింగ్ ఇప్పిద్దాం. అలా చూసినందుకు మనం ఏం చేయగలం? బస్సుల్లోనూ, రైళ్లలోనూ కూడా అలాగే చేస్తున్నారు ఇప్పుడు. మనం చేయగలిగింది, ప్రస్తుతానికి మన జాగ్రత్తలో మనం ఉండడం.”
“నాన్న వెళ్ళి ఆయన్తో మాట్లాడితే ఇంకా పెద్ద గొడవ అవదూ?”
“ఆయన వెళ్ళకుండా నేను చూస్తానులే.”
***
రెండు వారాలయ్యాక ఓ రోజు మళ్ళీ వెంకట్ అనామికతో మాట్లాడాడు, ఈ సారి బయట అందరూ ఉండే హాల్ లాంటి చోట. కంగారుగా అంటున్నట్టూ చెప్పేడు, “అనామిక గారు మిమ్మల్ని ఆ రోజు ట్ర్తైనింగ్ క్లాసులో ప్రశ్నలు ఇమ్మన్నాను కానీ అవి అవసరం లేదు, సారీ అలా అడిగినందుకు, మన బాస్ కూడా నాతో చెప్పారు అలా అడగకూడదని.” మొత్తం మాట్లాడ్డానికి రెండు నిముషాలైనా పట్టలేదు కానీ మాట్లాడుతున్నంతసేపూ తన చేతిలో ఉన్న ఫైల్లో ఏదో కాయితం చూసుకుంటూ చెప్పాడు. ఎలా వచ్చాడో అలాగే కంగారుగా వెళ్ళిపోయాడు.
అనామిక కాస్త అనుమానంగా చూడబోయింది గానీ, అసలు తన కేసి చూడకుండా వడివడిగా నడుచుకుంటూ పోయే వెంకట్ తో ఏమనాలో తెలియలేదు. “దరిద్రం వదిలింది” అనుకుంది లోపల. మర్నాటినుండీ పెద్ద రిలీఫ్.
తండ్రికి ఎలాగా ఈ వ్యవహారం గురించి తెలుసు కనకా, ఇంక ఆయన దగ్గిర దాచేది ఏమీ లేదు కనకా, ఇంట్లోకి రాగానే అనామిక చెప్పింది ఆఫీసులో జరిగిన విషయం, “ఏమైందో తెలియదు కానీ తల వంచుకుని నాకేసి చూడకుండా మరీ చెప్పాడు ముందు అడిగిన ప్రశ్నఅక్కర్లేదని. పీడా పోయింది.”
అటుతిరిగి టివి చూస్తున్న దేవానంద్ పెదాలమీద సన్నని కనీకనపడని నవ్వు వాళ్ళావిడా కూతురూ కనిపెట్టలేకపోయారు. అప్పటికి రెండ్రోజుల క్రితం జరిగిన విషయం గుర్తు తెచ్చుకుని దేవానంద్ మనసులో నవ్వుకున్నాడు.
***
రెండు రోజుల క్రితం జరిగినది గుర్తు రాగానే గర్వంగా అనిపించింది దేవానంద్ కి. అనామిక తన ఆఫీసులోంచి వెళ్ళిపోయాక దేవానంద్ కూతురి ఆఫీసు లోపలకి వెళ్ళి వెంకట్ తో మాట్లాడ్డానికి అనుమతి అడిగాడు. ఇద్దరూ ఓ గదిలోకి వెళ్ళగానే దేవానంద్ జూలు విదిల్చిన సింహంలాగా చెప్పాడు, ఇలా కూతురు ఏడుస్తున్నట్టూ, మరో సారి ఇలా జరిగితే వెంకట్ మక్కెలు విరుగుతాయనీను.
భయపడిన వెంకట్ అతి సౌమ్యంగా అన్నాడు, “మీ అమ్మాయ్ ట్రైనింగ్ క్లాసులో చాలా బుధ్ధిగా నోట్స్ రాసుకుంటూంటే అలా ప్రశ్నలు అడిగానండి అంతకన్నా మరో అభిప్రాయం ఏమీ లేదు మరి ఆవిడకి ఏమనిపించిందో?”
రెచ్చిపోయిన దేవానంద్ చెప్పాడు, “నువ్వు మా అమ్మాయిని నీ గదిలోకి పిల్చావనీ వంటి మీద చేయి వేయడం తప్ప మిగతావన్నీ చేసావనీ చెప్తోంది మా అమ్మాయి. వంటి మీద అందాలన్నీ జుర్రేసుకుంటున్నట్టూ చూస్తుంటే అమ్మాయికి ఎలా ఉంటుందో నీకు తెలియదు లా ఉంది. చూడబోతే నీకు పెళ్ళీ అదీ అయినట్టు లేదు. ఇలా మరో సారి మా అమ్మాయి జోలికొచ్చావంటే ఇక్కడే కాలో చెయ్యో విరక్కొట్టి ఇంక మళ్ళీ జీవితంలో మర్చిపోలేని అవిటివాడిగా చేస్తాం. మా బొంబాయ్ జనం గురించి నీకు తెలియదు లా ఉంది. ఇస్తే ప్రాణం ఇస్తాం, తీస్తే ప్రాణం తీస్తాం.”
“మీ అమ్మాయి ఇలా అనుకుందని నాకు అసలు తట్టలేదండి. క్షమించాలి. మరెప్పుడూ మీ అమ్మాయితో అలా ప్రశ్నలు ఇమ్మని కానీ మరోటి గానీ అడగను, సరేనా?”
“సరే, నేను నిన్ను గమనిస్తున్నానని మర్చిపోకు, మరి” మరో సారి హెచ్చరించి వెళ్ళడానికి లేచాడు దేవానంద్. ఇంటికొచ్చిన దేవానంద్ వాళ్ళావిడతో గానీ కూతురితో గానీ ఇలా వెంకట్ తో మాట్లాడినట్టూ ఏమీ చెప్పలేదు.
***
మరో నెలకి ట్రైనింగ్ అయిపోయాక అనామిక ని ఏదో ప్రోజక్ట్ లో పెట్టారు. దీనికి టీమ్ మేనేజర్ మళ్ళీ వెంకట్. అనామిక కి మరో ఇద్దరితో కలిపి ఏం చేయాలో చెప్పి వెంకట్ తన పని చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ప్రోజక్ట్ ఎలా జరుగుతోందో తెలుసుకోవడానికి వెంకట్ ముగ్గుర్నీ ఒకేసారి కలిసి మాట్లడుతున్నాడు కానీ ఒక్కొక్కర్నీ ఎప్పుడూ పిల్చిన దాఖలాలు లేవు. అనామిక ఎప్పుడైనా కనిపించి హల్లో అనబోయేలోపులే వెంకట్ మరో చోటికి వెళ్లడమో, ఏదో చేతిలో కాయితాలు చూసుకోవడమో జరుగుతోంది. అనామిక మీద ఏదైనా చెత్త రిపోర్ట్ చేసాడా అంటే అదీ లేదు. ఈవిడ పెర్సనల్ ఫైల్లో అన్నీ బాగానే ఉన్నాయి.
నాలుగైదు నెలలు గడిచాక ఓ రోజు మరో మీటింగ్ ప్రోజక్ట్ ప్రోగ్రస్ మీద. ఈ సారి మీటింగ్ లో వెంకట్ తన మొహం అనామిక కి కనపడకుండా జాగ్రత్త పడి ప్రోజక్ట్ విషయాలన్నీ మిగతా ఇద్దరితోనూ మాట్లాడుతున్నప్పుడు అనామిక కలగ జేసుకుని ఏదో చెప్పబోయింది. వెంకట్ తల వంచుకుని విన్నాడు. తాను చెప్పేది వెంకట్ వినలేదేమో అనుకుని “ఇప్పుడేం చేయమంటారు” అంది అనామిక.
అనామికకేసి అసలు చూడకుండానే చేతిలో కాయితాలు చూసుకుంటూనే చెప్పేడు వెంకట్ “ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే కంటిన్యూ చేద్దాం. మరో నెలలో ఈ మాడ్యూల్ మీద స్పష్టత వస్తుంది. మిగతా మాడ్యూల్స్ అన్నీ అవగానే అవన్నీ కలిపినప్పుడు టెస్టింగ్ లో చూద్దాం.”
తనకేసి కూడా చూడనందుకు మిగతావారి ముందు కాస్త అవమానం అనిపించిన అనామిక నోరుమూసుకుంది. మీటింగ్ అయిపోయాక మిగతా ఇద్దరితో చెప్పింది ఇదే విషయం – వెంకట్ తన మొహం కేసి కూడా చూడకపోవడం. ఎవరేం కళనున్నారోగానీ “దాని గురించి పట్టించుకోవద్దు, మొదట మన ప్రోజక్ట్ అవ్వాలి,” అని సర్దేసాక అనాకమిక కి ఏం చేయాలో తెలియలేదు,
***
మరో రెండు నెలలు గడిచాయ్. ప్రోజక్ట్ అయిపోవచ్చేరోజుల్లో ఓ రోజు అనామిక తల్లి దగ్గిర మళ్ళీ ఇంట్లో ఏడవడం గమనించాడు దేవానంద్ మునపటిలాగానే. ఈ సారి అనామిక చెప్పినది ఏమిటంటే, అసలు వెంకట్ తనకేసి కానీ తాను కల్పించుకుని మాట్లాడినప్పుడు కానీ అసలు తనవంకే చూడడు. ఏం చేయాలి?
కాదంబరి అంది, “ఇదే ఈ మగవాళ్లతో ఉన్న గొడవ. వళ్ళంతా జుర్రుకున్నట్టు చూస్తారు లేకపోతే అసలు మనం ఉన్నట్టే పట్టించుకోరు. నువ్వు సరైన డ్రెస్ వేసుకుంటున్నావా? మళ్ళీ నీ వంటి కేసి చూస్తున్నాడా? నువ్వు చూడనప్పుడు దొంగ చూపులు చూస్తున్నాడేమో?”
“లేదు అసలు నాకేసే చూడడం లేదు. నా పెర్సనల్ ఫైల్ లో చెడ్డ వివరాలు రాసారేమో అని కనుక్కున్నా. అదీ లేదు.”
“ఓ సారి మాట్లాడే పని ఉన్నట్టూ ఆయన క్యూబ్ లేక ఆఫీసులోకి వెళ్లకపోయావా?”
“అదీ అయింది. నేను గుమ్మం దగ్గిరకి రాగానే వెంఠనే లేచి నుంచుని పనేదో ఉన్నట్టు బయటకి వెళ్తాడు. అసలు నాకేసి చూడకుండానే. మిగతా వాళ్లతో చెప్పాను ఈ విషయం. వాళ్లతో బాగానే ఉన్నాట్ట.”
“సరే ఇప్పుడేం చేద్దాం?”
“ఇదేంటమ్మా, నేను కొత్త బట్టలు వేసుకున్నా, నవ్వినా హలో అన్నా అసలు నాకేసి చూడకపోవడం? ఈయన మొదట్లో నాకేసి చూసాడనుకున్నాను కానీ ఇప్పుడు ఈయనో ఫ్రిజిడ్ అసలు అమ్మాయి అన్నా, అందం అన్నా ఏమిటో తెలియని పెద్ద చెక్కదుంగ లా ఓ నవ్వూ లేదూ ఓ ముచ్చటా లేదు. ఎలా వీడిని మాటల్లోకి దించడం?”
“ఏ సినిమా గురించో, దక్షిణాది యాత్ర గురించో మాట్లాడితే…” కాదంబరి మాట ముగించ కుండానే దేవానంద్ అరుస్తున్నట్టూ చెప్పాడు, “క్రితం సారి వళ్లంతా చూస్తున్నాడని అన్నారు. ఇప్పుడు మాట్లాడటం లేదు. పీడ విరగడయింది అని సంతోషం గా ఉండండి మరి. గొడవ పూర్తిగా వదిలింది కదా?”
“నాన్నా అసలు మొహం కేసి కూడా చూడడు, నేను వేసుకున్న బట్టలు కానీ, ఏదీ పట్టించుకోడు. అసలు నేను తన ఎదురుగా ఉన్నట్టే గమనించడని అనిపిస్తూంది. ఎలా ఈయనతో పనిచేయడం?”
“నీకిచ్చిన పని నువ్వు చేసుకో, అసలు వాడు నీకేసీ నీ బట్టలకేసీ చూసినందుకేగా గొడవ మొదలైంది?”
ఇలా మాటల యుధ్ధం జరుగుతుంటే కాదంబరి అంది దేవానంద్ తో “మీరు వెళ్లండి అవతలకి. అమ్మాయిల గురించి మీకేం తెలియదు. ముందు అలా వంటి మీద చూసాడంటే వెధవ అయిండాలి అనుకున్నాం. ఇలా చెక్క దుంగలా ఉంటే ఏ అమ్మాయికి నచ్చుతుంది? అసలు మీరు ఇందులో తల దూర్చకండి. పోయి టివిలో మీ క్రికెట్ మాచ్ చూసుకోండి.”
మతిపోయినవాడిలా దేవానంద్ బయటకొచ్చాడు. ఏమీ అర్థం కాలేదు వీళ్ళ వరస. మొదట్లో అసలు వళ్లంతా తడిమినట్టూ చూస్తున్నాడు అంటే తాను వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు వీళ్ళకి తెలియకుండా. ఇప్పుడేమో అసలు చూడనే చూడడం లేదని మరో గొడవా? ఈ ఆడవాళ్ళ మనస్థత్వం ఏమిటసలు? వీళ్లకేసి చూస్తే ఓ గొడవా చూడకపోతే మరో గొడవానా? తానేం చేయాలిప్పుడు? మళ్ళీ వెంకట్ దగ్గిరకెళ్ళి మా అమ్మాయి కేసి ఓ చూపు చూస్తూండు కుర్రాడా అని చెప్పాలా? ఎంత దరిద్రం! ఛ ఛ, తానెంత వెధవ పనిచేసాడు వెంకట్ దగ్గిరకెళ్ళి!
గదిలోంచి అమ్మాయి, దేవానంద్ వాళ్ళావిడా ఏదో నిశ్చయించుకున్నవాళ్లలాగా నవ్వుతూ బయటకొచ్చేసరికి దేవానంద్ టివి కట్టేసి మొహం మాడిపోయి మతిపోయినవాడిలా గోడకేసి చూడడం కనిపించింది. కాదంబరి అతని దగ్గిరకెళ్ళి “ఏం అలా ఉన్నారు? వంట్లో బాగానే ఉందా?” అడిగింది.
“ఆ ఏదో గొడవలే, నా ఏడుపు నన్ను ఏడవనియ్!” విసురుగా అరుస్తూ బయటకెళ్ళిపోయేడు దేవానంద్, అసలు ఎవరికీ ఎప్పటికీ అర్థంకాని ఆడవాళ్ల మనసులో జరిగేది ఏమిటో తెలుసుకోలేని అందరి మగవాళ్ళలాగానే.
“ఇదేంటే అమ్మా నాన్న ఇలా అరవడం నాగురించేనా?” అనామిక అడిగింది.
“మగాళ్లందరూ అంతేలేవే. వాళ్లకి మనం ఎంత చెప్పినా అమ్మాయిల మనసు అర్ధం కాదు. మన గొడవలు మనం చూసుకోవాల్సిందే. రెండురోజులకి ఆయనే సర్దుకుంటాడు,” కాదంబరి నవ్వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked