ధారావాహికలు

రావణాసురిడి జననం

-అక్కిరాజు రామాపతి రావు

ఆ తర్వాత ఆ అన్నదమ్ములు ముగ్గురూ తండ్రి ఉండే తపోవనానికి తరలి పోయినారు. ఎప్పుడైతే రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుడి వల్ల అచింత్యమైన, అమోఘమైన వరాలు పొందారని సుమాలి తెలుసుకొన్నాడో ఇక నిర్భయంగా ఉండవచ్చుననీ,పోయిన ఆధిపత్యం తిరిగి సంపాదించుకోవచ్చుననీ ‘మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు’ అనే మంత్రులతో పాతాళలోకం నుంచి నేరుగా దశకంఠుడి దగ్గరకు వచ్చి అతణ్ణి కౌగిలించుకొని అభినందించి ‘నాయనా! నీ వల్ల మేము నిర్భయులమైనాము. మనం లంకలో ఉండక పోవటం చూసి మీ అన్న ధనదుడు అక్కడ విలాసంగా పరిపాలిస్తున్నాడు. నీవు సామ, దాన, భేదోపాయాలలో దేనితోనైనా వాణ్ణి అక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. మేమంతా నిన్ను అనుసరించుకొని ఉంటాము. నీవు మన రాక్షసజాతిని విపత్సముద్రం నుంచి రక్షించావు’ అని ప్రశంసించాడు. దశాస్యుడు మొదట ఒప్పుకోలేదు. ‘నీవు నా మాతామహుడివి! నిజమే కాని, కుబేరుడు నాకు జ్యేష్ఠభ్రాతకదా! జ్యేష్టుడు తండ్రితో సమానుడంటారు. అటువంటి వాణ్ణి నేను ఎట్లా అవమానిస్తాను? గెంటివేస్తాను?’ అని ధర్మసందేహం వెలిబుచ్చాడు. సుమాలి ఇక ఏం చేస్తాడు? అక్కడ నుంచి నిష్క్రమించాడు.
ఆ తరువాత కొంతకాలానికి ప్రహస్తుడు దశవదనుని దగ్గరకు వచ్చి ‘వీరాధివీరులకు చుట్టరికాలు అడ్డువస్తాయా? చూడు అదితి, దితి అక్కచెల్లెళ్ళే కదా! వాళ్ళిద్దరూ కశ్యపమహర్షి భార్యలే కదా! మొదట దితి సంతానమే భూమండలాన్నంతా పరిపాలించేవారు. వాళ్ళే లోకాధిపతులుగా ఉండేవారు. అయితే అన్యాయంగా విష్ణువు చేత దైత్యులను చంపించి దేవతలు లోకాలను వశపరచుకొన్నారు. ఈ దురన్యాయాన్ని చక్కదిద్దవలసినవాడివి నీవు తప్ప మరి ఒకరు లేరు. కాబట్టి కుబేరుడికి లంక నుంచి ఉద్వాసన చెప్పి నీవు లంకను ఆక్రమించాలి’ అని ప్రహస్తుడు రావణుడి మనసులో నాటుకొనేట్లు ప్రభోదించాడు.
అప్పుడు దశకంఠుడు ప్రహస్తుణ్ణి, ఇంకా తన పరివారాన్నీ వెంటపెట్టుకొని త్రికూటపర్వతం మీద ఉన్న లంకకు పోయినాడు. ప్రహస్తుణ్ణి, కుబేరుడి దగ్గరకు దూతగా పంపించాడు. దూతతో తన సందేశం కుబేరుడికిట్లా విన్పించ వలసిందిగా చెప్పాడు. ‘ఈ లంక మొదట రాక్షసుల నివాసస్థానం. దేవతల వంచన వల్ల నీవు దీనిని ఆక్రమించావు. కాబట్టి ఇప్పుడు నీవు దీనిని వదిలిపెట్టి వెళ్ళాలి. ప్రబలులమైన మేము దీనిని మళ్ళీ మా వశం చేసుకుంటాము’ అని చెప్పవలసిందని కోరాడు. ప్రహస్తుడు వెళ్లి ధనపతికి ఈ సందేశం వినిపించాడు. ‘సామమార్గాన మా రాజ్యం మాకు వశం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము, అంతే’ అని చెప్పాడు. అప్పుడు కుబేరుడా దూతతో ‘ఏమయ్యా! రాక్షసులంతా ఈ నగరం విడిచిపెట్టి పోయిన తర్వాత, ఇది శూన్యమై పోయింది. బోసిపోయి, పాడుపడి, శిథిలమై పోకుండా ఇక్కడ ఉండమని మా తండ్రి నాకు చెప్పాడు. నేను దీనిని గొప్ప ఐశ్వర్యవిలసితమూ, సర్వాంగసుందరమూ చేశాను. ఇప్పుడు మీరు వచ్చారు. మనం కలిసిమెలసి ఉందాం. ఇందులో కష్టమేముంది? పోయేదేముంది? ఇక్కడ నాకెంత భాగం ఉందొ నీకూ అంతే హక్కు ఉంటుంది’ అని తన మాటలు దశకంఠుడితో చెప్పవలసిందిగా చెప్పి పంపించాడు.
ప్రహస్తుడికి ఇట్లా చెప్పి ధనదుడు వెంటనే తండ్రి విశ్రవసువు దగ్గరకు వెళ్ళి ‘తండ్రీ! దశగ్రీవుడు నన్ను లంకను విడిచిపెట్టి వెళ్ళవలసిందని కోరుతున్నాడు. మరి నన్ను ఎక్కడకు వెళ్ళి ఉండమంటావు?’ అని అడిగాడు.
అప్పుడా మహర్షి ‘నాయనా! ముందుగానే వాడు నాకీ విషయం చెప్పాడు. వాడు మూర్ఖుడు. బ్రహ్మ వరాల వల్ల పోతరించి ఉన్నాడు. నేను కోపించినా వినలేదు. కాబట్టి నీవు లంకను విడిచిపెట్టి కైలాసపర్వతం సమీపంలో నీ ఆవాసం ఏర్పరుచుకో! అక్కడి మందాకినీ సకల శుభప్రదాయిని. ఆ పరిసరాలన్నీ చూడముచ్చటగా అత్యంత రమణీయంగా ఉంటాయి. ఆ దుష్టుడితో వైరం ఎందుకు? అది నీకు శ్రేయస్కరం కాదు. ఇక కైలాసం పరమపవిత్ర ప్రదేశం. దేవతలకు విహార భూమి. గరుడ, గాంధర్వ, కిన్నెర, కింపురుషులతో సంతోషదాయకంగా ఉంటుంది’ అని హితబోధ చేశాడు కుబేరుడికి.

అప్పుడు కుబేరుడు లంకకు వచ్చి పుత్ర, కళత్ర, మిత్ర, అమాత్య బాంధవంగా లంకను విడిచి కైలాసపర్వత సమీపానికి వచ్చాడు. ప్రహస్తుడు, రావణుడికి ఆ వార్త పరమసంతోషంతో తెలియజేశాడు. అప్పుడా దశవదనుడి ఆనందానికి అవధులు లేకపోయినాయి. తన తమ్ములతో, బలగంతో లంక చేరాడు. మూలమూలల ఉన్న రాక్షసులంతా వచ్చి లంకాపట్టణంలో రాక్షసరజుగా ఆ దశకంఠుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశారు. ఆ పరాక్రమశాలి పాలనలో లంక మరింత ఐశ్వర్యంతో ప్రవర్థమానమైంది. లంకాదీషుడిగా రావణుడు లోకప్రసిద్ధుడైనాడు. ఇనుమడించిన సిరిసంపదలతో లంక రెండో అమరావతిలాగా విలసిల్లుతూ వచ్చింది అప్పటినుంచీ.

కుబేరుడు రజతగిరి సమీపంలో ఒక నగరం నిర్మింప చేసుకొని తన సమస్త పరివారంతో అక్కడ సుఖంగా ఉంటూ ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked