ధారావాహికలు

రావణుడి వివాహం

-అక్కిరాజు రామాపతి రావు

లంకారాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత దశగ్రీవుడు తన చెల్లెలు శూర్పణఖను, కాలరాక్షసుడి కొడుకైన విద్యుజ్జిహ్వుడి కిచ్చి పెళ్ళి చేశాడు. ఒకనాడు లంకాధిపతి వేటకు వెళ్లి, అక్కడ – నవయౌవనవతి అయిన తన కూతురితో చెట్టుకింద నిరీక్షణ దృక్కులుతో ఉన్న ఒక దైతుణ్ణి చూశాడు. రావణుడు విస్మయం చెంది ‘ఈ నిర్జన వనంలో మీరెందుకిక్కడ ఉన్నారని’ ఆ దైతుణ్ణి అడిగాడు.
అప్పుడా పిల్ల తండ్రి ‘నేను దితి పుత్రుణ్ణి. నన్ను మయు డంటారు. దేవతలూ, రాక్షసులూ కూడా నాకు దగ్గర వాళ్ళే. దేవతలు నా ప్రజ్ఞాశాలితను మెచ్చి హేమ అనే అప్సరసను నాకు భార్యగా ఇచ్చారు. ఆమెతో నేను సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఉండేవాణ్ణి. ఇంతలో హేమ దేవతల పనిమీద స్వర్గానికి వెళ్లి ఇప్పటికి పదమూడు సంవత్సరాలైనా ఇంకా తిరిగిరాలేదు. పద్నాలుగో సంవత్సరం నేను నా ప్రజ్ఞనంతా వినియోగించి స్వర్ణప్రభా విలసితమైన, వజ్రవైడూర్య శోభితమైన ఒక నగరాన్ని నా మాయాశక్తితో నిర్మించాను. కాని అందులో ఉండలేక, ఈ పిల్లకు తగిన వరుణ్ణి ఎంచుకోలేకా ఇట్లా అడవుల పాలైనాను. హేమ లేని నా బతుకు వెలితి పాలైంది. ఈ పిల్లను చూస్తుంటే మరింత దిగులవుతున్నది నాకు. ఆడపిల్ల గల తండ్రికి ఉండే వేదన అంతాఇంతా కాదు. పుట్టినింటికీ, మెట్టినింటికీ కీర్తికానీ, అపకీర్తికానీ వచ్చేది కూతురు వల్లనే. ఆ తపనతో మంచి సంబంధం కోసం ఎంతో అన్వేషిస్తున్నాను. ఈ పిల్ల అంటే నాకు ప్రాణం. ఈమె కాక నాకు హేమ వల్ల ఇద్దరు కొడుకులు కలిగారు. పెద్దవాడు మాయావి, తరువాత వాడు దుందుభి. నా కథంతా చెప్పాను. మరి నీ సంగతి ఏమిటో తెలుసుకోవచ్చా’ అని కోరాడు మయుడు.

అప్పుడు రావణుడు ‘నేను విశ్రవసుమహర్షి పుత్రుణ్ణి’ అని చెప్పాడు. ఈ సంబంధం బాగుందే అని లోలోపల మయుడు సంతోషించాడు. ‘దశగ్రీవా! ఈమె నాకూతురని చెప్పాను కదా! నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని అభిలషిస్తున్నాను నేను. దయతో నా కోర్కె సఫలం చెయ్యి’ అని అర్థించాడు.
మయుడి కోర్కె విని రావణుడు సంతోషించాడు. అప్పుడే అక్కడే అగ్నిని సృష్టించి అగ్నిసాక్షిగా మండోదరీదేవిని పెండ్లి చేసుకున్నాడు.
రావణుడి తమ్ముల పెళ్ళిళ్ళు
మయుడు బాగా ఆలోచించే ఈ పని చేశాడు. ఎందుకంటే తాను విముఖత చూపినా తనను తోసేసి తన కూతురిని రాక్షసవివాహం చేసుకొనేట్లు ఉంది రావణుడి వైఖరి-అని ఆయన కనిపెట్టాడు. అదీకాక ఈ దశగ్రీవుడు బ్రహ్మవంశంలో పుట్టాడు. ఇంతకంటే మంచి సంబంధం తనకు దొరక బోతుందా అనుకున్నాడు మయుడు. తాను ప్రీతిపూర్వకంగా ఇస్తే మండోదరి ఎంతో సంతోషంగా కాపురం చేసుకుంటుందని అని కూడా భావించాడు. ఈ పాణిగ్రహణ శుభసమయాన మయుడు, రావణుడికి వరదక్షిణగా ‘శక్తి’ అనే అమోఘమైన ఆయుధాన్ని బహూకరించాడు. శ్రీరామరావణ యుద్ధంలో ఈ ఆయుధం ప్రయోగించే లక్ష్మణుణ్ణి మూర్ఛపోయేట్లు చేశాడు రావణుడు.

రావణుడు మండోదరిని తోడుకొని లంకకు వెళ్ళాడు. తమ్ముళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేశాడు. వైరోచనుడి మనుమరాలు వజ్రజ్వాల కుంభకర్ణుడి భార్య, శైలూషుడనే గంధర్వుడి తనయ సరమ విభీషణుడి భార్య, సరమకు ఆ పేరు రావడానికి ఒక కథ వుంది. అదేమంటే ఆమె మానససరోవరం తీరంలో పుట్టింది. అప్పుడు వర్షాకాలం. వర్షాలు కురిసి ఆ సరస్సు పొంగుతూ శిశువు ఉన్న తీరం వరకు రాసాగింది. అప్పుడా శిశువు భయంతో ఆక్రందించింది. అప్పుడా పిల్ల తల్లి సరో మా వర్ధస్వ (మానససరస్సా! పొంగి తీరాన్ని ముంచకు) అని వేడుకుంది ఆ సరస్సును. ‘సరో మా’ అని ప్రార్థించింది కాబట్టి ఆ శిశువుకు ‘సరమ’ అని పేరు వచ్చింది. పెళ్ళిళ్ళు అయి ఆ దంపతులు సుఖంగా పొద్దులు పుచ్చసాగారు.
ఇట్లా కాలం గడుస్తూ ఉండగా మండోదరీదేవి ప్రసవించి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. వాడు పుడుతూనే మేఘం గర్జించినట్లు రోదించగా అప్పటి నుంచి వాడికి మేఘనాధుడనే పేరు వచ్చింది. మేఘనాధుణ్ణి తల్లిదండ్రులు ముద్దుమురిపాలతో అపురూపంగా పెంచారు.
ఒక రోజు కుంభకర్ణుడు అన్నతో ‘నేను బ్రహ్మవరప్రసాదిని కనుక నిద్రపోవటానికి నాకు తగినట్లు ఒక మహాభవనాన్ని నిర్మింపచేయవలసింది’ అని కోరుకున్నాడు. అప్పుడు దశకంఠుడు తమ్ముడికి తగిన ఒక మహాశయన మందిరాన్ని నిర్మింపచేశాడు. ఆ శయనమందిర నిర్మాణం కొన్ని ఆమడల పొడవు, కొన్ని ఆమడల వెడల్పూ, అందుకు తగిన ఎత్తుతో మహావిశాలంగా, విస్తీర్ణంగా, సుందరంగా జరిగింది.
ఇల్లు నిర్మింపచేసుకొన్నవాడు ఇంట్లో ప్రవేశించినట్లు శుభ ముహూర్తాన కుంభకర్ణుడు అందులో ప్రవేశించి ఇక నిద్రకుపక్రమించాడు. ఆ మందిరంలో కొన్ని వేల సంవత్సరాలు అట్లా కుంభకర్ణుడు నిద్రపోతూనే ఉన్నాడు.
ఆ కాలంలో రావణుడు వేల్పులపై దండెత్తాడు. దేవతలను నానావిధాలుగా హింసలపాలు చేశాడు. నందనవనాన్ని ధ్వంసం చేశాడు. ఋషులనూ, గంధర్వులనూ, యక్షులనూ చావగొట్టాడు. క్రూరకర్మలు చేయడమే ఒక వినోదంగా ప్రవర్తించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked