ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 18వ భాగము )

– యస్. యస్. వి రమణారావు

“అది సార్ సంగతి” రాజు పూర్తి చేశాడు
“అంతేనా?”అన్నాడు అభిషేక్”ఈ విషయం చెప్పడానికి నువు ఇంత సంకోచం పడడమెందుకు?”
రాజు ఆశ్చర్యపోయాడు”అదేంటి సార్,ఒక అమ్మాయి అర్థరాత్రి బీచ్ కి వెళ్ళడం,అక్కడ రౌడీలని చితక బాదడం,అదంతా వీడియో రికార్డింగ్ చేయడం,ఇదంతా మీకు వింతగా ఎబ్నార్మల్ గా అనిపించడం లేదా?”
“ఏంలేదు.అర్థరాత్రి బీచ్ కి వెళ్ళాలనే ఉత్సాహం ఉంది,అనుకోనిదేమైనా జరిగితే తనను తాను రక్షించుకోగలననే ధైర్యం ఉంది.అంతకు మించి ఏం కనబడట్లేదు నాకు”
“మీరిలా అంటారని మీ సంస్కారాన్ని బట్టి ఊహించాను సార్.కాని తరవాత ఇంకొక విషయం జరిగింది సార్.” రాజు ఆగాడు.అభిషేక్ వింటున్నాడు” ఆ ఇంటి బయటకు వచ్చి కేతుబాబుని ఏ హాస్పటల్ కి తీసుకు వెళ్ళారో కనుక్కుని ఆ హాస్పటల్ కి వెళ్ళుతుండగా నాకు ఓఫోన్ వచ్చింది సార్”రాజు మళ్ళీ ఆగి ఇంకో పెగ్గు పోసుకున్నాడు అభి దింకా మొదటిపెగ్గే ఇంకా పూర్తికాలేదు.రాజు అప్పుడే నాలుగులో ఉన్నాడు.ఒక సిప్ చేసి రాజు మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు
“ఆఫోన్ విశ్వామిత్ర నుంచి వచ్చింది.విశ్వామిత్ర నంబరు వైజాగ్ పోలీస్ స్టేషన్ లో ప్రతీ ఒక్కడికి తెలుసు”రాజు ఒక్కసారిగా ఆ సన్నివేశంలోకి వెళిపోయాడు
……

కేర్ హాస్పటల్లో స్పెషల్ రూమ్ లో ఉన్న కేతుబాబుని పరామర్శించడానికి వెళుతున్న రాజు ఫోన్ ఒక్కసారిగా మ్రోగింది.ఫోన్ తీసి చూశాడు,విశ్వామిత్రది.వెంటనే ఫోన్ ఆన్ చేసాడు”ఏంటి మిత్రా,ఏంటి విషయం?”మిత్రతో రాజుకి మంచి రిలేషన్సే ఉన్నాయి.”కేతుబాబు నువ్వు ప్రశాంతి నగర్ కెందుకు వెళ్ళారు?”విశ్వామిత్ర గొంతులో సీరియస్నెస్ గమనించాడు రాజు.వెంటనే మొత్తం జరిగిన విషయాలన్నీ పొల్లుపోకుండా చెప్పాడు.”కేతుబాబు ఎలా ఉన్నాడు?””బాగానే ఉన్నాడు మిత్రా,సాయంత్రంకల్లా డిస్ఛార్జ్ చేస్తారంట”
“సరే,మనిషిని పంపిస్తాను”
’అంటే హాస్పటల్ బిల్లు విశ్వామిత్ర కడతాడన్నమాట’ “సరే మిత్రా”
“ఇంకొక్క మాట.కేసు వదిలెయ్యమని కేతుకి చెప్పు”
“అలాగే మిత్రా,మరి సురేష్?”

“ఏదో ఒకటి చెప్పు”మిత్ర గొంతు పైస్థాయిలో మ్రోగింది ఫోన్ లో.”రాజు చేతిలో ఫోన్ వణికింది.”తండ్రి నక్సలైటు,తల్లి ఆల్ఖైదా.మేనమామలు ఇద్దరు,ఒకడు ఆర్మీ ఇంకొకడు పోలీస్.తాతలిద్దరూ మినిస్టర్ లు”రాజు మాట్లాడలేదు.విశ్వామిత్ర సీరియస్ గా ఉన్నపుడు ఎలా ఉండాలో రౌడీలకే కాదు,పోలీసులకి కూడా తెలిసిన విషయమే
“ఇంకొక్క మాట.ఇకపై ఆమె గురించి స్టేషన్ లో ఏం కదలిక జరిగినా నువ్వు నాకు చెప్తావు.అర్థమైందా”విశ్వామిత్ర గొంతు ఉరిమింది
“అర్థమైంది మిత్రా,అలాగే”చెప్పాడు రాజు
ఫోన్ ఆఫ్ చేశాడు విశ్వామిత్ర

* * * * * * * * * * * * * * *

అంతావిన్న అభిషేక్ మొహం కొంచెం సీరియస్ గా మారింది.”ఈ విషయం అర్థమైంది.ఎక్సైజ్ కానిస్టేబుల్ కి శివహైమ పేరు ఎలా తెలుసు?”అడిగాడు
“అదికూడా ఇంచుమించు ఇలాంటిదే సార్.కాని నేను ఆ విషయం చెప్పేకంటే,గోపీ అదే ఆ ఎక్సైజ్ కానిస్టేబుల్,వాడు చెబుతేనే బావుంటుంది సార్”అంటూ వాడికి వెంటనే ఫోన్ చేశాడు,గోపీ వెంటనే పావుగంటలో వచ్చాడు.
“ఆరోజు రాత్రి పదీ పదకొండు మధ్యన జరిగిన సంఘటన సార్ అది.అంతకుముందు జరిగింది కూడా నాకు తరవాత తెలిసింది సార్.అదికూడా మీకు చెప్తాను.”గోపీ చెప్పడం ప్రారంభించాడు…

బీచ్ రోడ్ లో హీరోహోండా బైక్ మీద గూండాల్లాంటి వ్యక్తులిద్దరు వాళ్ళిద్దరూ అప్పుడే చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటూ బీచ్ రోడ్ లో స్లోగా వెళుతున్నారు. కరెంటు పోవడం వల్ల స్ట్రీట్ లైట్ లు కూడా వెలగకపోవడంతో దారంతా చీకటిగా ఉంది.డ్రైవింగ్ సీట్ లో ఉన్నవాడు వెనక్కి తిరిగి ఏదో మాట్లాడుతున్నాడు.అప్పుడు వెనక ఉన్నవాడికి కనబడింది,ఎవరో చెయ్యి ఊపుతూ బైక్ ఆపమన్నట్టుగా సంజ్ఞ చేస్తోంది.”అబ్బ! ఏంలక్ రా మనది,సినిమా,కారేజీలో బిరియాని పార్సిల్,అమ్మాయి,ఆపు ఆపు..”బైక్ వెంటనే ఆగింది.సైడ్ స్టాండ్ వేసి దిగారు ఇద్దరూ.ఆ అమ్మాయి శివహైమ.
“ఇక్కడ పెద్ద ఏక్సిడెంట్ జరిగింది.స్కోడా కారు.చీకట్లో కనపడకపోవడం వల్ల గేదెను డాష్ చేశారు.బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల బెలూన్స్ ఓపెన్ అవలేదు.ఫాదర్,మదర్ అండ్ సన్ అనుకుంటాను.సన్ ఈస్ డ్రైవింగ్.కారు చాలా వేగంలో ఉండడం వల్లముగ్గురికీ చాలా బలంగా దెబ్బలు తగిలాయి.వెంటనే హాస్పటల్ కి తీసుకువెళ్ళాలి.నాఫ్రెండ్స్ ని కాల్ చేద్దామంటే ఇక్కడ సిగ్నల్ లేదు. మీరు కొంచెం హెల్ప్ చేసి నాకారులోకి లిఫ్ట్ చేస్తే,నేను హాస్పటల్ కు తీసుకు వెళిపోతాను”చక చక చెప్పింది శివహైమ.ముగ్గురూ కలిసి వాళ్ళని శివహైమ టయోటా కారులో ఎక్కించారు.పరిస్థితి చూసి వాళ్ళిద్దరూ కూడా కారులో కూర్చున్నారు.కారు రివ్వున కేర్ హాస్పటల్ వైపు దూసుకుపోయింది.

కేర్ హాస్పటల్ లో ఎమర్జన్సీ వార్డ్ లో ఎడ్మిట్ చేయడం,డాక్టర్ రావడం చూడడం,సమయానికి తీసుకు వచ్చారని వాళ్ళని అభినందించడం, వాళ్ళ జేబుల్లోంచి బయటపడ్డ వాళ్ళ వస్తువుల ద్వారా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడం అన్నీ అయ్యేసరికి పదిన్నర దాటింది.
“రండి.మిమ్మల్ని డ్రాప్ చేస్తాను”చెప్పింది శివహైమ.
“అక్కర్లేదు మేడమ్.మేం ఆటోలో వెళిపోతాం”అన్నారిద్దరూ
“ఫరవాలేదు,కూర్చోండి”
ఒకడు ముందు,ఇంకొకడు వెనక కూర్చున్నారిద్దరూ.

టయోటా కారు రివ్వున బీచ్ రోడ్డువైపు దూసుకుపోయింది.బైక్ వున్న చోటుకి ,కేర్ హాస్పటల్ కి మధ్య ఒక పది కిమీ దూరం ఉంది.ఆగూండా కేరెక్టర్లిద్దరికీ కారు చాలా బాగా నచ్చింది.వెనకాల సీట్లో కూర్చున్నవాడు ముందున్నవాడితో చెవిలో అన్నాడు.”మందు కూడా ఉంటే బావుంటుందిరా ఇలాంటప్పుడు”నోరుముయ్.గమ్మునుండు”అన్నాడు ముందుసీట్లో కూర్చున్నవాడు.”ఏంటి?”అడిగింది శివహైమ”అబ్బే,ఏంలేదు మేడమ్.ఏవో మా కబుర్లు”చెప్పాడు మొదటివాడు. ఇంకొక మూడు కిలోమీటర్లు వెళితే చేరిపోతారనగా రోడ్ మీద తెరిచి ఉన్న వైన్ షాప్ ని చూసి వెనకాల సీట్లో కూర్చున్నవాడు ఒక్కసారిగా అరిచాడు”తెరిచుందిరా”ముందుసీట్లో కూర్చున్నవాడు మళ్ళా వెనక్కు తిరిగి”దొరబాబు షాపురా అది.తెల్దేటి?కౌంటర్ లో పైడితల్లిగాడే ఉన్నాడు.ఇప్పుడెళ్ళామనుకో కుమ్మేస్తాడు”
“ఏంటి?”మళ్ళీ అడిగింది హైమ.కారు స్లో చేసింది
“ఏంలేదు మేడమ్?”చెప్పాడు ముందుసీట్లో కూర్చున్నవాడు.
శివహైమ కారు ఆపింది”ఏమిటి చెప్పండి.ఇందాకట్నుంచి గుసగుసలాడేసుకుంటున్నారు?”

ఇక చెప్పక తప్పలేదు మొదటివాడికి.”ఏంలేదు మేడమ్.బైక్ లో బిరియానీ ఉంది.మందుకూడా ఉంటే బావుంటుంది కదా అంటున్నాడు మేడమ్”
నవ్వింది శివహైమ”అదా.సరే వెళ్ళి తెచ్చుకోండి.షాపు తెరిచే ఉందిగా”
వాళ్ళింకా తటపటాయిస్తున్నారు”ఏమిటి?డబ్బులు కావాలా?ఇస్తాను తెచ్చుకోండి?”
“అదికాదు మేడమ్ మాఅన్న, ఆషాపు ఓనర్, ఈ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే, కి పడదు.అదీకాక కౌంటర్ లో పైడితల్లి ఉన్నాడు.మమ్మల్ని చూస్తే ఆడు ప్రాణాలతో ఉండనివ్వడు”
“ఎవరు మీఅన్న?”అడిగింది శివహైమ
ఆ ప్రశ్న వినగానే ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.ఇద్దరూ ఒకే కంఠంతో చెప్పారు”మిత్ర,విశ్వామిత్ర”

హైమ కారులోంచి దిగింది”మీకు కావలసింది మందే కదా,నేను తెస్తాను”
“వద్దు మేడమ్.లేడీస్ మందుషాపుకెళితే బాగోదు”అన్నారిద్దరూ
“ఫరవాలేదు.ముగ్గురి ప్రాణాలు కాపాడడానిక్ సహాయం చేశారు.యూ డిజర్వ్ ఇట్”
శివహైమ చక చక అడుగులు వేస్తూ వేగంగా షాపు దగ్గరికి వెళ్ళింది.”విస్కీ ఏది బావుంటుంది?”షాప్ బాయ్ ని అడిగింది
“థౌజండ్ పైపర్స్”చెప్పాడు వాడు కొంచెం ఆశ్చర్యంగానే.కౌంటర్లో ఉన్న పైడితల్లి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు
“వన్ బాటిల్”చెప్పింది శివహైమ
బాయ్ తీసుకు వచ్చి కేష్ కౌంటర్ ముందు కూర్చున్న,విశ్వామిత్ర అనుచరులు ఇందాక మాట్లాడుకున్న, పైడితల్లి అనే వ్యక్తిదగ్గర పెట్టాడు.ముప్ఫైఏళ్లు లోపే ఉంటాయి,అతనికి.అయిదడుగుల ఎనిమిది అంగుళాల పొడుగుతో నల్లగా పంచికట్టి తమిళసినిమా విలన్ లా ఉన్నాడు
“ఎంత?”అడిగింది
“పద్దెనిమిది వందలు”
“సరే బిల్లియ్యి”చెప్పింది శివహైమ,డబ్బుకోసం పర్సు ఓపెన్ చేస్తూ
పైడితల్లి కొంచెం ఆశ్చర్యంగా చూశాడు.”బిల్లు కావాలా మేడమ్?”
“అదేంటి?వస్తువు అమ్మినపుడు బిల్లివ్వవా?”
పైడితల్లి మొహంలో రంగులు మారాయి.అప్రయత్నంగా మొహంలోకి కోపం వచ్చింది.ఒకసారి బాటిల్ వంక చూశాడు.థౌశండ్ పైపర్స్.తమాయించుకుని”బిల్లుబుక్కు ఇంటిదగ్గర ఉండిపోయింది మేడమ్.మీరు రేపొస్తే ఇస్తాను”
“అలవాటు ప్రకారం అడిగాను.ఫరవాలేదు.ఎంత?”
“పద్దెనిమిది వందలు”
రెండు వెయ్యినోట్లు ఇచ్చి చిల్లర తీసుకుంది శివహైమ.ఇచ్చిన బాటిల్ ని తీసుకుని వెనక్కి తిరగబోతూ బాటిల్ మీద ఎమ్ ఆర్ పి చూసింది.
“ఇదేమిటి,పధ్నాలుగు వందలని రాసుంది.?”
ఇంక కోపం ఆపుకోవడం పైడితల్లికి సాధ్యం కాలేదు.

“అదంతే,ఇష్టమైతే తీసుకో,లేకపోతే మానెయ్”పైడితల్లి మొదటి తప్పు చేశాడు.శివహైమ మొహం రంగులు మారింది.బాటిల్ కౌంటర్ టేబుల్ మీద పెట్టింది.”నాలుగు వందలియ్యి”చెప్పింది.షాపులో ఇంకా ఇద్దరు కుర్రాళ్ళున్నారు.పైడితల్లి వాళ్ళకి సైగ చేశాడు.వాళ్ళిద్దరూ కౌంటర్ వైపు అడుగులు వేశారు.ఈలోపల శివహైమ కారులో కూర్చున్న ఇద్దరూ ఏదో జరుగుతోందని గ్రహించి ఇంక కారులో కూర్చోలేక,భయంగా ఉన్నా,కారు దిగి షాపు దగ్గరకు వచ్చారు.అసలే కోపంగా ఉన్న పైడితల్లికి వాళ్ళిద్దరినీ చూడగానే కోపం నసాళానికి అంటింది.”అదిరా అసలు సంగతి.ఈళ్ళిద్దరినీ చూసుకుని గుంట రెచ్చిపోతోంది.ఈళ్ళకి మందు కొనడానికి వచ్చిందిది.దీన్ని క్లాసనుకుని ఇంతవరకూ ఊరుకున్నా.ముగ్గుర్నీ కలిపి ఏసెయ్యండ్రా”గట్టిగా అరిచాడు.పైడితల్లి రెండోతప్పు కూడా చేసేశాడు

పెద్ద ఫైటింగ్ జరిగేదే,కాని అప్పుడే అదే సమయంలో షాపుకి వచ్చాడు కానిస్టేబుల్ ఇక్బాల్.అతనికి తెలిసిన షాపే అది”రమ్ బాటిల్ ఇవ్వరా”అన్నాడు షాపులో కుర్రాడితో.వెంటనే అనుమానం వచ్చి తలతిప్పి చూశాడు.అటు ముగ్గురు,ఇటు ముగ్గురు,అందులో ఒక అమ్మాయి.పైడితల్లివైపు ప్రశ్నార్థకంగా చూశాడు.పైడితల్లి తల ఊపాడు ప్రోబ్లం ఉందన్నట్టుగా.ఇక్బాల్ వెంటనే రంగంలోకి దిగాడు.శివహైమ పక్కనున్న విశ్వామిత్ర అనుచరులిద్దరూ అతనికి తెలిసిన వాళ్ళే.శివహైమ వైపు చూసి అడిగాడు”ఏంటి ప్రోబ్లం?”అడిగాడు.వాళ్ళిద్దరేం మాట్లాడలేదు.శివహైమ చెప్పింది”విస్కీబాటిల్ ఎమ్ ఆర్ పి కంటే ఎక్కువ ధరకి అమ్ముతున్నాడు.”
ఇక్బాల్ నవ్వాడు”అదా.మరి ఈళ్ళందరూ గవర్నమెంట్ లో మినిస్టర్ కాడినుంచి ప్యూన్ దాకా అందరికీ లంచాలిచ్చుకోవాలి కద మేడమ్” ఇక్బాల్ మాట ఇంకా పూర్తికాలేదు
“దాంతో నాకేంటి సంబంధం?ఇంతకీ నువ్వెవరు?”అడిగింది శివహైమ

ఇక్బాల్ మాట్లాడలేదు.కళ్ళు పెద్దవి చేసి శివహైమ వైపు చూశాడు.”ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇక్బాల్ గారు మేడమ్”చెప్పాడు విశ్వామిత్ర అనుచరులలో ఒకడు
“సిగ్గులేదూ”శివహైమ కళ్ళు ఎర్రబడ్డాయి.అదిరిపోయారు అక్కడున్నవాళ్ళందరూ ఆమాట వినగానే”నీకు నీ డిపార్ట్మెంట్ కి లంచాలిచ్చి మీనోళ్ళు మూయిస్తారు వీళ్ళు.రాత్ర్రి పదకొండు దాటినా వీడు షాపు తెరిచే వుంచాడు.షాపు మూయించాల్సిన నువ్వు వచ్చి ఇక్కడ మందు కొంటున్నావు.ఎమ్ ఆర్ పి కంటె ఎక్కువగా అమ్ముతున్నవాడిని అడగకుండా నాకు నీతులు చెపుతున్నావు”ఇంక కోపం ఆపుకోవడం పైడితల్లికి సాధ్యం కాలేదు.”ఇంకా చూస్తారేట్రా నాలుగెయ్యండ్రా,ఆ విశ్వామిత్రగాడి అండ చూసుకుని రెచ్చిపోతున్నారీళ్ళు”కౌంటర్ క్రిందనుంచి కర్రలు తీసి బయటకు దూకారందరూ.”పదండి మేడం పారిపోదాం”హైమ వెనకాల వాళ్ళు పరిగెత్తారు.శివహైమ కూడా పరుగెత్తింది,కాని వెనకకు కాదు,ముందుకి.పరుగెడుతూనే ఒక జంప్ సైడ్ కిక్ తో పైడితల్లి చేతిలో కర్ర విరక్కొటింది.ఇంకొక ఫ్రంట్ కిక్ తో పైడితల్లి నెక్ విరిగిపోయింది,కర్ర విరిగిన షాక్ నుంచి వాళ్ళు తేరుకునేలోపే.వెంటనే కర్రతో కొట్టబోతున్న పక్కనున్నవాడి మణికట్టు ఎడమచేత్తో పట్టుకుని,వాడికాలి వెనకభాగాన్ని తన్ని వాడ్ని కింద పడేసింది.తరువాత వాడిమీద కాలు ఆన్చి మూడొవాడ్ని ఇంకొక ఫ్ర్ంట్ సైడ్ కిక్ తో వాడి పని పూర్తి చేసింది.ముగ్గురూ కిందపడి బాధతో విలవిలా తన్నుకోవడం చూసిన మిగతాముగ్గురికీ ఇక్బాల్ తో సహా నోటి తడి ఆరిపోయింది.శివహైమ ఇక్బాల్ కేసి చూసి చెప్పింది”వీళ్ళ ముగ్గుర్ని హాస్పటల్కి వెంటనే తీసుకెళ్ళు.అక్కడ్నుంచి ఫోన్ చెయ్యి.పావుగంటలో ఫోన్ రావాలి”పక్కకు తిరిగి మిత్ర అనుచరుల వైపు చూసింది.వాళ్ళిద్దరూ వెంటనే ఇక్బాల్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నారు.పైడితల్లి ఆల్టో కారులోకి ముగ్గురిని కూర్చోబెట్టారు.తరవాత రెండు కార్లు వ్యతిరేక దిశల్లో దూసుకుపోయాయి.

* * * * * * * * * * * *

ఎక్సైజ్ కానిస్టేబుల్ తన కథ ముగించాడు.”మరి ఆ వైన్ షాపు,బెల్ట్ షాపా?” అడిగాడు అభిషేక్.”అవును సార్”చెప్పాడు ఇక్బాల్”మరి ఆషాపు ఓనర్ మాజీ ఎమ్మెల్యే శివహైమని బెదిరించడానికి గాని,కేసు పెట్టడానికి గాని ప్రయత్నించలేదా?”
“మర్నాడే కంప్లయింట్ వచ్చింది సార్.ఆరోజు రాజు ఎందుకో ఫోన్ చేస్తే నేనీ విషయం మొత్తం చెప్పాను.రాజు అప్పుడు నాకు ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగినా విశ్వామిత్ర ఎంటర్ అవుతాడనీ ,ప్రాణాలకే ప్రమాదమనీ హెచ్చరించాడు.దాంతో నేను భయపడి కేసు బలంగా లేదని తరవాత ఎప్పుడైనా చూద్దామని మాజీ ఎమ్మెల్యేతో చెప్పి బతిమలాడుకుని బయటపడ్డాను”
ఇంతలో అభిషేక్ ఫోన్ మ్రోగింది.అవతలనుంచి జగదీష్
“ఎస్.అదీ నిజమే.రేపు నేను స్టేషన్ కి వస్తాను.ఆఫీసులోనే మాట్లాడదాం”
మళ్లీ జగదీష్ ఏదో మాట్లాడాడు.”ఓకె.దట్స్ రైట్.ఇద్దరు చాలు.”

జగదీష్ మళ్ళీ ఏదో మాట్లాడాడు.”ఎస్.చెప్తాను.ఐ విల్ ఎడ్వైస్ హిమ్”ఫోన్ పెట్టేశాడు అభిషేక్
రాజు ప్రశ్నార్థకంగా చూశాడు అభిషేక్ వైపు”రాజూ నువ్వు ఇవాళనుంచి నాతోనే ఇక్కడే ఉంటావు.మీ మిసెస్ ని కూడా ఇక్కడే ఉండమని ఎస్పి గారి సలహా”
“విజయవాడ్లో ఆమె అన్నయ్య ఉన్నాడు సార్.గవర్నమెంట్ పోలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్.అక్కడకి పంపించేస్తాను”
“వెరీగుడ్.విజయవాడలో నాకు డిఎస్పి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు.అతనికి కూడా చెప్తాను”
“థాంక్యూ సార్”ఎస్పి పట్ల,అభిషేక్ పట్ల క్రృతజ్ఞతతో రాజు కళ్ళు చెమర్చాయి
బెడ్ రూమ్ లో పడుకోమని ఎంత చెప్పినా వినకుండా రాజు హాలులోనే పడుకున్నాడు,అభిషేక్ బెడ్రూంకి బయట అడిషనల్ సెక్యురిటీగా.మందువల్లనా,పనిభారంవల్లనా ఇద్దరికీ గాఢంగానే నిద్ర పట్టింది

* * * * * * * * *

మర్నాడు రవిబాబు పోలీస్ స్టేషన్ లో ఉండడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతన్ని సిబిఐ గెస్ట్ హౌస్ కి స్పెషల్ సెక్యూరిటీతో తీసుకురావల్సి వచ్చింది.అప్పుడు రవిబాబు చెప్పిన విషయం రాజుని దిగ్భ్రాంతికి గురిచేసింది,అభిషేక్ మాత్రం చిన్ననవ్వు నవ్వి ఊరుకున్నాడు.ఆవిషయం ఏమిటంటే ..

రవిబాబు చెప్పడం ప్రారంభించాడు”నేను నాదాబాలో చూపించిన వ్యక్తి అప్పుడప్పుడు గ్రాండియోర్ కి వస్తుండేవాడు.వచ్చినప్పుడల్లా నాలుగయిదు రోజులుండేవాడు.ఇతనితోపాటు ఇంకొక అతను కూడా వచ్చేవాడు.దాబాకు అతను కూడా వచ్చాడు.ఆశ్చర్యంగా విశ్వామిత్ర కూడా అదేరోజుల్లో కొద్ది ముందు వెనకగా వచ్చేవాడు.కాకతాళీయమేమో అనుకునేవాణ్ణి.కాని కాదని ఒకరోజు తెలిసింది.ఆరోజు,నేను “కొంచెంసేపు ఆగాడు రవిబాబు.రాజువంక చూశాడు.”ఫరవాలేదు చెప్పు”చెప్పాడు అభిషేక్”అదికాదు సార్.కొంచెం మంచినీళ్ళు”రాజు ఒకసారి కళ్ళు పెద్దవి చేసి రవిబాబుకేసి ఒకసారి చూశాడు,కమెడియన్ బ్రహ్మానందంలా.రవిబాబు తల ఊపాడు కృషభగవాన్ లా’ఇన్ఫర్మేషన్ అలాంటిది’ అన్నట్టు.మంచినీళ్ళు తాగి మళ్ళీ ప్రారంభించాడు రవిబాబు”ఆరోజు రాత్రి తొమ్మిదయింది.విశ్వామిత్ర హోటల్ లో ఉన్నప్పుడల్లా అతనికి చెప్పి వెళ్ళడం నాకు అలవాటు.ఆరోజుకూడా అలాగే వెళ్ళాను.పొరపాటున రూము తలుపు తట్టాను.తలుపు తెరుచుకుంది.తెరిచిన వ్యక్తి ,నేనిందాక చెప్పిన వ్యక్తుల్లో ఒకడు.అతన్ని చూశాక నాకు అనుమానం వచ్చింది,వేరేరూముకి వచ్చానా అని.అనుమానం నివృత్తి చేసుకునే లోపే”ఎస్?”ప్రశ్నార్థకంగా అడిగాడతను.”ఐ వాంట్ టు మీట్ మిష్టర్ మిత్రా” చెప్పాను,ఇంకా అనుమానం మనసులో మెదులుతో ఉండగానే.ఆశ్చర్యంగా అతను అడ్డం తొలిగి వెనక్కు తిరిగాడు.లోపలకు అడుగు పెట్టాక నాకు తెలిసింది అది వేరే రూమ్ అని.కర్టెన్ల సందులోంచి మిత్రా కనబడుతున్నాడు.అప్పుడు నేను మొదటిసారిగా మిత్రా ఇంగ్లీష్ లో మాట్లాడడం విన్నాను.”ఒక్కసారి ఆగి ఊపిరి పీల్చుకున్నాడు రవిబాబు”మిత్ర, నేను ఇందాక మాట్లాడి ఇద్దరు వ్యక్తుల్లో రెండవ వ్యక్తి ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు.వారిద్దరి మధ్య ఆర్టిస్ట్ లు బొమ్మలు గీసే స్టాండ్ లాటిది ఒకటి ఉంది.దానిమీద ఏదో బ్లూప్రింట్ ఉంది.నాకెందుకో మిత్రని అక్కడ కలవడం మంచిగా అనిపించలేదు.వెంటనే ముందు నడుస్తున్న ఆవ్యక్తి చెయ్యి తట్టి ’ఐ విల్ మీట్ హిమ్ ఇన్ హిస్ రూమ్’అని చెప్పి బయట పడ్డాను”రవిబాబు ముగించాడు.రాజు దిగ్భాంత్రిలో మునిగిపోయాడు.”నారేంజ్ దాటిపోయింది సార్,నాకేం అర్థం కావటం లేదు.విశ్వామిత్రేంటి ఇంగ్లీష్ లో మాట్లాడడమేంటి”అభిషేక్ చిన్నగా నవ్వాడు.అతనికీ కొంచెం కొంచెం మబ్బులు విడుతున్నాయి”థాంక్స్ రవిబాబు.ఇక నువ్వెళ్ళచ్చు.సెక్యురిటి కావాలంటే ప్రొవైడ్ చేస్తాను.””అక్కర్లేదు సార్.నేను కొన్నాళ్ళు మాఊరు వెళిపోతాను”చెప్పి శెలవు తీసుకున్నాడు రవిబాబు.మళ్ళీ అదేమాట అన్నాడు రాజు.అభిషేక్ మళ్ళీ చిన్నగా నవ్వాడు”మీకర్థమైనట్టుంది సార్”

“కొంచెం,కొంచెం.మళ్ళీ మనం ఇంకో వారంరోజుల తరవాత కలుద్దాం రాజూ.నువ్వుకూడా మీమిసెస్తో కలిసి విజయవాడకు వెళ్ళి కొన్నాళ్ళుండు.ఎప్పుడు రావాలో నీకు చెప్తాను.కాని ఎందుకైనా మంచిది ఎవరికీ చెప్పకు ఎక్కడకు వెళుతున్నావో.ఏ తీర్థయాత్రలకో వెళుతున్నానని చెప్పు”
“ఓకె సర్”

వారంరోజులు ఇట్టే గడిచిపోయాయి.అభిషేక్ పూర్తిగా రికవర్ అయాడు.రాజుకూడా వారంరోజులు హాలీడే ఎంజాయ్ చేసి వచ్చాడు.వస్తూనే గెస్ట్ హౌస్ కి వచ్చాడు.అభిషేక్ రాజుని చూస్తూనే “కమాన్ రాజూ ఒక ఇంపార్టెంట్ పని.నీకు మునిసిపల్ కార్పోరేషన్ లో తెలిసినవాళ్ళు ఎవరైన వున్నారా?”అడిగాడు.
“నేను గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నాను సార్.అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ తెలిసినవాళ్ళున్నారు.ఏంకావాలి సార్”
టేబుల్ డ్రాలోంచి పిన్ చేసి ఉన్న రెండు A4 సైజ్ వైట్ పేపర్స్ తీశాడు అభిషేక్.వాటినిండా ఏవో నంబర్లు రాసి ఉన్నాయి.”మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కి వెళ్ళి ఈనంబర్లలో ఉన్న ఇళ్ళు,ప్లాట్లు ఎవరివో కనుక్కోండి.వుయ్ విల్ మీట్ ఇన్ ద ఈవెనింగ్”

* * * * * * * * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked