కవితా స్రవంతి

శరత్ పున్నమలు

-శాంతి కృష్ణ (హైదరాబాద్)

అరుదెంచిన ఆనందమేదో

చైత్రగీతమవుతుంటే….

ఎన్ని జ్ఞాపకాల మధురిమలో

పువ్వులా విచ్చుకున్న మనసుపై

అదేపనిగ పుప్పొడులు కురిపిస్తున్నాయి….

ఈ ఏకాంతానికిపుడేపేరు పెట్టాలో

తెలియట్లేదు….

వద్దన్న కొద్దీ మోసుకొచ్చే

నీ ఊసుల తెమ్మెరలతో

తన్మయమొందుతున్నాయి పరిసరాలన్నీ….

మళ్ళీ నిన్ను నాకు పరిచయం చేస్తూ

పేరు తెలియని భాషలో

మనసు అదేపనిగ కావ్యాలు రాస్తోంది….

గాలి లాలి పాటలో

జోలపాడే ఈ రేయిలో

కలల వర్షంలో మరీ మరీ

తడవాలనుంది….

ఎన్ని మధుర భావనలు కురిశాయో….

కన్నులిపుడు శరత్ పున్నమలై వెలుగుతున్నాయి…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked