ధారావాహికలు

శ్రీరామ పట్టాభిషేక సంరంభం

అయోధ్యానగరమంతా సంతోషంతో కళకళలాడుతున్నది. శ్రీరాముడు తమ ఏలికగా పట్టాభిషేకం జరుపుకొబోతున్నాడు అని అయోధ్య పౌరుల హర్షం ఆకాశం అంటుతూ ఉంది. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకానికి కావలసిన సన్నాహాలన్నీ భరతుడు (ఆనాడు దశరథమహారాజులాగా) చూసుకుంటున్నాడు.
సుగ్రీవుడితో ఆ మహాయశుడైన భరతుడు ‘కపిరాజా! శ్రీరామ పట్టాభిషేకం జరగబోతున్నదికదా! సమస్త సముద్రజలాలు, నదీజలాలు వెంటనే తెప్పించే భారం నీదే’ అని సుగ్రీవుణ్ణి అర్థించాడు. వెంటనే సుగ్రీవుడు శీఘ్రవేగులూ, అత్యంత బలపరాక్రమ సంపన్నులూ అయిన నలుగురు వానర ప్రముఖులను పిలిచి – ‘ఇప్పటికిప్పుడు మీరు నాలుగు సముద్రాల జలాలు తీసుకొని రావాలి’ అని వాళ్ళను ఆదేశించాడు. నవరత్నస్థిగీతకాంచన కళాశాలను వారికందజేశాడు. “సూర్యోదయాత్పూర్వమే ఆ జలాలతో మీరిక్కడ ఉండాలి” అని సుగ్రీవాజ్ఞాగా వారినాయన ఆదేశించాడు. గరుడానిల వేగంతో వాళ్ళు ఆ పని నిర్వహించటానికి వెళ్ళారు. వీళ్ళే కాకుండా జాంబవంతుడూ, హనుమంతుడూ, ఋషభుడూ, వేగదర్శీ ఐదువందల నదులలో నుంచి జలాలను తీసుకొని రావటానికి పయనమైనారు.
వానరులలో పూజ్యుడైన సుషేణుడు తూర్పుసముద్రం నుంచి రత్నాలు పొదిగిన కాంచనకలశంలో జలం నింపు అప్పటికప్పుడు తెచ్చాడు. అట్లానే ఋషభుడనే వానర ప్రముఖుడు దక్షిణసముద్రం నుంచి జలాలను తెచ్చాడు. గవయుడు తన సువర్ణకలశంలో పశ్చిమసముద్రం నుంచి నీరు తెచ్చాడు. అత్యద్భుత వేగపరాక్రముడనే నలుడు ఉత్తరసముద్రం నుంచి పవిత్ర జలాన్ని తన హేమకలశంలో తెచ్చాడు.

పౌరుషం, పరాక్రమం, బుద్ధీ అనే గుణాలన్నీ ఎవరిలో విలసిల్లుతూ ఉంటాయో అతనికి ఈ హారం ఇవ్వు’ అన్నాడు. వెంటనే సీతమ్మ ఆ హారం ఆ సుగుణాలన్నీ ఉన్న హనుమంతునికి బహుకరించింది.
అప్పుడు హనుమంతుడు ఆ ముక్తాహారాన్ని అలంకరించుకోగా తెల్లటి మేఘం ఆశ్రయించిన మహాశైలంలాగా శోభించాడు. ఆ తరువాత కుతూహలంతో చూస్తున్న మైందద్వివిదులకు, నీలుడికీ సమ్మానార్హమైన కానుకలిచ్చి సత్కరించాడు. అదేవిధంగా వానరవీరులందరినీ ఆ కొసలాధిపుడు సంతోషపెట్టాడు.
ఇట్లా సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, తక్కిన వానర ప్రముఖులను శ్రీరాముడు ఘనంగా సత్కరించాడు. ఆయన పట్టాభిషేకాన్ని తిలకించిన వానరులంతా పరమసంతోషం పొందారు. తమ ప్రభువైన సుగ్రీవుడితో వానర యూథపతులూ, తక్కిన వానరసైన్యమూ శ్రీరాముడి దగ్గర అనుమతి పొంది కిష్కింధకు ప్రయాణమైనారు. విభీషణుడు కూడా శ్రీరామ ప్రభువు సెలవు పొంది లంకానగరానికి పయనమైపోయినాడు.
శత్రుసంహారకుడు, పరమోదారుడు లక్ష్మణుడితో ‘నాయనా! నీవు అన్ని ధర్మాలు తెలిసినవాడివి. మన పూర్వులంతా యశస్కరంగా పరిపాలించారు. నే నిప్పుడు పరిపాలనభారం స్వీకరించాను. నీ సహాయం నాకు తప్పక ఉంటుందని తెలుసు. నిన్ను యౌవరాజ్యపట్టాభిషిక్తుణ్ణి చేస్తాను’ అన్నాడు. కాని అందుకు లక్ష్మణుడు సమ్మతించలేదు. శ్రీరాముడు అప్పుడు భరతుడికి యౌవరాజ్యాభిషేకం చేశాడు.

శ్రీరామపట్టాభిషేకం

వానరవీరులంతా సముద్రజలాలు, నదీనదజలాలు తీసుకొని రావడం చూసి శత్రుఘ్నుడు వశిష్టమహర్షికి తెలియజేశాడు. అప్పుడు వశిష్టమహర్షి వేదవిదులతో కలిసి శ్రీరాముణ్ణి సీతాసమేతంగా రత్నశోభిత సువర్ణ పీఠంపై అధివసింపజేశాడు వశిష్టుడు. వామదేవుడు, జాబాలి, కాశ్యపుడూ, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనే ఎనిమిది మంది మహర్షులు, అష్టవసువులు ఇంద్రుడికి రాజ్యాభిషేకం చేసినట్లుగా పవిత్రోదకాలతో శ్రీరాముణ్ణి అభిషేకించారు.
ఆ తర్వాత ఆ పవిత్రసలిలాలతో ఋత్విక్కులు, కన్నెపడచులు, మంత్రులు, వణిక్ ప్రముఖులు, నగరవృద్ధులు, యోధవరులు శ్రీరాముణ్ణి అభిషేకించారు. దిక్పాలకులు, దేవతాప్రముఖులు గగనం నుంచే దివ్య నదీజలాలతో శ్రీరాముణ్ణి అభిషేకించారు.
మంగళప్రదమైన ఈ అభిషేక కార్యకలాపం ముగిసిన తరువాత శత్రుఘ్నుడు, శ్రీరాముడికి శ్వేతచ్చత్రం పట్టాడు. సుగ్రీవుడు, విభీషణుడు ఇరువైపులా శశిప్రభా భాసుర (చంద్రకాంతి ధవళ)మైన వింజామరలు వీచారు. ఇంద్రుడప్పుడు వాయుదేవుడితో శ్రీరాముడికి కాంచన కహ్లారమాల కానుకగా పంపించాడు.నవరత్నఖచితమైన ఆణిముత్యాల హారాన్ని కూడా శ్రీరాముడి కలంకరింపజేశాడు దేవేంద్రుడు. ఆ సమయంలో దేవగంధర్వులు పాడారు. అచ్చరులు ఆడారు. ఆ సమయంలో సమస్త ప్రకృతి పులకించి శోభించింది. పైరుపచ్చలు సమృద్ధిగా ఫలించాయి. పండ్లచెట్లు పండ్ల బరువుతో వంగిపోయినాయి. పూలచెట్లు సుగంధబంధుర పరిమళాలు గుప్పించాయి.
పట్టాభిషేకం చేసుకున్న శ్రీరాముడు ముందుగా వేదవిప్రులకు అధిక సంఖ్యలో గుర్రాలను, సవత్సకాలైన గోవులను దానం చేశాడు. శ్రేష్ఠమైన వృషభాలను కూడా దానమిచ్చాడు. ఇంకా ఆ బ్రాహ్మణోత్తములకు అసంఖ్యాకమైన బంగారు నాణేలను, మేలిమి పట్టువస్త్రాలను, ఆభరణాలను దానం చేశాడు. సుగ్రీవుడికి సూర్యకిరణ ప్రభాసంకలితమైన దివ్యమణిమయ కాంచనమాలను బహుకరించాడు. వజ్రాలు, వైడూర్యాలు పొదిగిన కాంతిచ్ఛటలతో రాజిల్లుతున్న కేయూరాలను అంగదుడికి కానుకగా ఇచ్చాడు. సీతమ్మకు మణులు పొదిగిన ముత్యాలహారాన్ని అలంకారాలనూ ఇచ్చాడు. ఆమె ఆ హారం మెడలోనుంచి తీసి హనుమంతుని వైపూ, వానరుల వైపూ, భర్త వైపూ చూచింది. శ్రీరాముడు ఆమె అభిప్రాయం గమనించి ఆమెతో – సౌభాగ్యవతీ! నీకు ఎవరంటే ప్రీతి ఉన్నదో, తేజస్సు, ధైర్యం, యశస్సు, నేర్పు, సామర్థ్యం, వినయం, నీతి.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked