కవితా స్రవంతి

🌷నీ పరిచయం🌷

నీ పరిచయం

రచన
శాంతి కృష్ణ,
హైదరాబాద్.
9502236670

వసంతపు పరిమళాలను అద్దిందేమో…
చివురులు తొడిగాయి
శిశిరపు గురుతులన్నీ…!

ప్రతి వేకువ
కొన్ని నవ్వుల పువ్వులతో
ప్రతి రేయి
తీయని ఊసులతో….

మన మాటలన్నీ
కోయిల కూజితాలుగా
మధుర ధ్వనులయ్యాయి…

మన నవ్వులన్నీ
విప్పారిన కుసుమాలుగా
నందనవనమయ్యాయి…

మన మనసులు మళ్ళీ
పురి విప్పిన మయూరాలై
నర్తించడం మొదలెట్టాయి…

మనకే తెలియని
సరికొత్త లోకాన్ని
సృష్టించుకుంటూ…

ఇప్పుడేమైందో తెలియదు
ఆ మైత్రీవనం వాడిపోతోంది…
వసంతపు పరిమళం జాడలేక…

ఇప్పుడు….

రాత్రంతా నడచిన జాబిలి అడుగులు
వేకువ కళ్ళకు నిట్టూర్పులుగా మిగిలాయి….

కొన్ని గురుతులంతే
కాలాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి….
కరిగి పోయిన క్షణాలను
లెక్కించుకుంటూ…!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked