సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాడు

అన్నమయ్య తానో చెలికత్తెగా మారి అమ్మ పద్మావతీ దేవికి శృంగారం విషయంలో సలహాలిస్తున్నాడు. ఆ వింతలు విశేషాలు మనమూ విని తరిద్దాం రండి.
కీర్తన:
పల్లవి: సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాడు
బిగ్గె గాగిలించుకొని పెనగినగాక

చ.1. పెదవిపై మాటల బ్రియములు పుట్టునా
వుదుటు గుబ్బల బతి నూదిన గాక
సదరపు జెనకుల చవులు పుట్టీనా
సదమదముగ రతి సలిపిన గాక || సిగ్గుతోడ ||

చ.2. సెలవుల నవ్వితేనే చిత్తము గరగునా
సొలయుచు మోవిచవి చూపిన గాక
ములువాడి చూపుల మోహములు పుట్టునా
లలిదమ్ములము పొత్తు గలసిన గాక || సిగ్గుతోడ ||

చ.3. సరసములాడితేనే సంగాతాలెనయునా
సరుస దనువు లొక్కజటైన గాక
యిరవై శ్రీవేంకటేశుడింతలోనె నిన్నుగూడె
పరపుపైనే చాలునా వురమెక్కిన గాక || సిగ్గుతోడ ||
(రాగం: సాళంగనాట; రేకు సం: 827, కీర్తన; 18-162)
విశ్లేషణ:
సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాడు
బిగ్గె గాగిలించుకొని పెనగినగాక
సిగ్గు బిడియం స్త్రీకి సహజమే! కానీ తొలిరోజుల్లో అలా ఉండడం కూడా సహజమే! కానీ ఎప్పుడూ అలా ఉండడం తగదు. అలా ఉంటే మగవాడు చిక్కుతాడా? కేవలం పడకలో లొంగదీసుకోవడమే కాదు. ఆయన రొమ్ముపై తిష్టవేసుకుంటే తప్ప నీ లక్ష్యం నెరవేరదని అమ్మవారికి తానో చెలికత్తెగా మారి సలహా ఇస్తున్నాడు అన్నమయ్య.
చ.1. పెదవిపై మాటల బ్రియములు పుట్టునా
వుదుటు గుబ్బల బతి నూదిన గాక
సదరపు జెనకుల చవులు పుట్టీనా
సదమదముగ రతి సలిపిన గాక
ఊరకనే పెదవులు కలిపి మాట్లాడినంతమాత్రాన నీ మీద ప్రేమ పుడుతుందటమ్మా! పొంగిన ఉరోజములు ఆయనకు అదిమినంత మాత్రమున కోరికలు గలుగుతాయా? నలిగిపోయేట్లు రమించాలిగదా? మెత్తగా ఉంతే లాభం లేదు తల్లీ..అని సలహనిస్తూ హితవు చెప్తున్నాడు.

చ.2. సెలవుల నవ్వితేనే చిత్తము గరగునా
సొలయుచు మోవిచవి చూపిన గాక
ములువాడి చూపుల మోహములు పుట్టునా
లలిదమ్ములము పొత్తు గలసిన గాక
అమ్మా! పెదవుల చివరనుండి మాట్లాడినంత మాత్రానా ఆ శ్రీనివాసుని మనసు కరుగుతుందా తల్లీ! పరవశాన మధురాధరం అందించాలి. బాగా గ్రుచ్చుకునే వాడి చూపులతో స్వామికేసి చూడాలి. ఉత్సాహంగా ఒకరి నోట్లో తాంబూలము ఒకరు అందుకోవాలి. ఉత్త కౌగిలింతలతో, మాటలతో నీపని సానుకూలం కాదు తల్లీ అని చెప్తున్నాడు.
చ.3. సరసములాడితేనే సంగాతాలెనయునా
సరుస దనువు లొక్కజటైన గాక
యిరవై శ్రీవేంకటేశుడింతలోనె నిన్నుగూడె
పరపుపైనే చాలునా వురమెక్కిన గాక
అమ్మా! ఊరక ఛలోక్తులాడినంత మాత్రాన చెలిమి బలపడుతుందా? దగ్గరగా జేరి రెండు తనువులు ఒకటిగా అయిపోవాలి. ఇలా చేస్తే ఆ శ్రీవేంకటేశ్వరుడు నిన్ను చేరి పరవశిస్తాడు. కేవలం పరుపుపై ఆయనను లొంగదీసుకుంటే సరిపోదు. ఆయన ఉరముపై తిష్టవేయాలి. పద్మావతీదేవి ఆయన ఉరముపై ఉన్నదన్న గుర్తుగా ఆయన ఈ శృంగార కీర్తన ఈ విధంగా చెలికత్తెగా మారి రక్తి కట్టించాడు..

ముఖ్య అర్ధములు గొంకు = సంకోచించు, మెత్తబడు; బిగ్గె = బిగ్గరగా, పెద్దగా, ఎక్కువగా; గాగలించు = కౌగలించుకొను; పెనగు = చుట్టుకొను; ఉదుట గుబ్బలు = వక్షోజములు; ఊదుట = అదుముట; చవులు = కోరికలు; సదరము = చతురమైన, స్నేహమైన, చాకచక్యముగ; చెనకు = తాకు, నొక్కు; సదమదము = ఎక్కువ ఆయాసం వచ్చునటుల; చిత్తము = మనసు; సొలయు = బాగా అలసిపోవు, మూర్ఛనొందు; మోవిచవి = అధరామృతము; దమ్ములము = తాంబూలము; పొత్తుగలయుట = ఇక్కడ ఒకరి నోటిలోని తాంబూలము మరొకరు అందిపుచ్చుకొను అనే అర్ధంలో; సంగాతము = చెలిమి; తనువులు = శరీరములు; ఒక్కజటైనగాక = ఒక్కటిగా కలియుట; ఉరమెక్కు = రొమ్ముపై నిలుచు (శ్రీవేంకటేశ్వర్ను ఉరముపై శ్రీపద్మావతి అమ్మవారు నెలవైనదని చెప్పుట)

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked