సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ

ఈ కీర్తనలో అన్నమయ్య తన్ను తాను నాయికగా భావించుకొని స్వామీ! నీ మనసునాకు తెలియరావడంలేదు. తమరిపై నాకు ఎంత కోరిక ఉన్నా వెనుకంజ వేస్తున్నాను. మీరంటే నాకు ప్రేమలేక కాదు సుమా! మీరు అన్యమనస్కంగాను, చీకాకుతోను ఉన్నారు అంటూ అన్నమయ్య స్వామితో తన శృంగార వ్యవహారాన్ని ఏకరువు పెడుతున్నాడు. ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం.
కీర్తన:
పల్లవి: ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ
కొంకితి నింతే నేఁ గొసరఁ జుమ్మీ
చ.1 చుక్కలు గాయఁగా నేఁజూడఁ దలెత్తితి నింతె
ఇక్కడ నేముండుతా నే నెఱఁగఁజుమ్మీ
చిక్కువడ్డముత్యములు చేతులఁ బట్టితి నింతే
అక్కర నివేఁటివని యడుగఁజుమ్మీ ॥ఇంకా॥
చ.2 తుమ్మిదలు బెదరఁగాఁ దోడ నే నవ్వితి నింతే
తమ్మిమోవి నిన్ను నేమీఁ దడవఁజుమ్మీ
వుమ్మ గాలివిసరఁగా నొంటి నేఁ బండితి నింతే
అమ్మరో నీతో నే నలుగఁజుమ్మీ ॥ఇంకా ॥
చ.3 చీకాకురేకులు చూచి చే గోరగీరితి నింతే
చేకొని నీమేను పచ్చిసేయఁజుమ్మీ
యీకడ శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
పైకొని చొక్కితి నింతు పదరఁజుమ్మీ ॥ఇంకా॥
(రాగం: ఆహిరి; రేకు: 1194-2,కీర్తన; 21-494)

విశ్లేషణ:
పల్లవి: ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ
కొంకితి నింతే నేఁ గొసరఁ జుమ్మీ
స్వామీ! నీ మనసేమిటో ఎఱుగకున్నాను. ఎంతో సంకోచిస్తున్నాను. నా కోర్కెను బహిర్గతం చెయ్యలేకపోతున్నాను. అంటే స్వామి తనపై ధ్యాస చూపడంలేదని అన్యమనస్కంగా ఉన్నాడని నాయిక వాపోతున్నది.
చ.1. చుక్కలు గాయఁగా నేఁజూడఁ దలెత్తితి నింతె
ఇక్కడ నేముండుతా నే నెఱఁగఁజుమ్మీ
చిక్కువడ్డముత్యములు చేతులఁ బట్టితి నింతే
అక్కర నివేఁటివని యడుగఁజుమ్మీ
స్వామీ! ఆకాశంలో నక్షత్రాలన్నీ వచ్చేశాయని గమనించి తలెత్తి చూశాను. అయితే ఇక్కడ ప్రస్తుతం ఏమి జరుగుతున్నదో ఎంత పొద్దు గడిచిందో తెలియడంలేదు. మీ మెడలోని ముత్యాల సరులు చిక్కులు పడ్డాయని చేతితో సవరించ యత్నించాను. అంతే గానీ ఇలా ఎందుకు జరిగిందని అడగడానికి ఎంతమాత్రం కాదు సుమా!
చ.2. తుమ్మిదలు బెదరఁగాఁ దోడ నే నవ్వితి నింతే
తమ్మిమోవి నిన్ను నేమీఁ దడవఁజుమ్మీ
వుమ్మ గాలివిసరఁగా నొంటి నేఁ బండితి నింతే
అమ్మరో నీతో నే నలుగఁజుమ్మీ
స్వామీ! తమరి అధరాలపై తేనె ఉందని భావించి కొన్ని తుమ్మెదలు మీ పెదవులపై వాలడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని చూసిన నాకు నవ్వు వచ్చింది. వెంటనే మీది తామరపూవు వంటి మోము అని సమాధాన పడ్డాను కానీ ఏమీ భయపడలేదు. ఆ విషయాన్ని తర్కించలేదు. గాలి స్థంభించి ఊపిరి ఆడడంలేదని నేను ఒంటరిగా అలా నడుము వాల్చాను అంతే! నీ మీద మాత్రము నాకు ఎటువంటి అలకా లేదు సుమీ!

చ.3. చీకాకురేకులు చూచి చే గోరగీరితి నింతే
చేకొని నీమేను పచ్చిసేయఁజుమ్మీ
యీకడ శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
పైకొని చొక్కితి నింతు పదరఁజుమ్మీ
స్వామీ! మీ మోములో ఏవో చికాకు రేఖలు అలుముకున్నాయి. అవి చూసి మిమ్మలను నా వేపుకు మనసు త్రిప్పుకోవాలని గోటితో మెల్లిగా గీరాను అంతే! అంతే గానీ మీ అందమైన శరీరంపై గాయాలు చేయాలని కాదు సుమా! స్వామీ! శ్రీవేంకటేశ్వరా! ఇప్పుడు నన్ను ఇక్కడ చేరి ఆనందింపజేస్తున్నావు. దానికి అతిశయించిన మహదానందంతో నిండి ఉన్నాను. అంతే గానీ ఏమాత్రం తొందర పడడం లేదు స్వామీ! నిజం నమ్మండి నన్ను.

ముఖ్య అర్ధములు యెఱుగ జుమ్మీ = తెలియక ఉన్నాను సుమా!; కొంకితి = సంకోచించితి; కొసరు = ప్రార్థించు, మఱి కొంచెమిమ్మని యాచించు; చుక్కలు గాయగా = నింగిలో నక్షత్రాలు రాగా; ఏముండుతా = ఏమి ఉన్నదో, ఏమి జరుగుచున్నదో; అక్కర = అవసరము; నివేఁటివని = ఏమిటి అని ప్రశ్నించడం; తుమ్మిద = తుమ్మెద; బెదరగా = భయముతో వాలడం అన్న అర్ధం తీసుకొనదగును; తమ్మి మోవి = తామర పుష్పము వంటి మొహము; తడవ = పర్యాయము, తర్కించు అనే అర్ధంలో; వుమ్మ గాలివిసరఁగా = గాలి లేక ఉక్కబోయుట, ఉమ్మదింపుగా ఉండుట; ఒంటినే బండితి = ఒంటరిగా పడుకొన్నాను; అమ్మరో = అమ్మయ్యో, అయ్యో, లేదు అని చెప్పే విధానం; అలుగ జుమ్మీ! = ఏమాత్రం అలక వహించలేదు సుమా!; చీకాకు రేకలు = చీకాకు తో కూడిన ముఖ విన్యాసపు రేఖలు; గోరగీరితి = గోటితో గీరితిని (ఇది ఒక శృంగార చేష్ట, నఖక్షతము అని అంటారు) మేను = శరీరము; పచ్చి జేయ = పుండు, గాయము చేయను; చొక్కు = పారవశ్యము; పదరు = చలించు, త్వరపడు, కోపించు.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked