సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం 2020

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

నెలత నిన్ను మోహించడమే నేరమైందటయ్యా! ఇదెక్కడి తంటా.. అమ్మ అలమేలు మంగమ్మను గమనించవయ్యా! అంటున్నాడు అన్నమయ్య.

కీర్తన:
పల్లవి: నెలఁత మోహించినదే నేరమటయ్యా
పలువిన్నపాల కిఁకఁ బనిలేదయ్యా ॥పల్లవి॥
చ.1 చెక్కునఁ జేర్చినచేత సేమంతిరేకులు రాలె
చొక్కపు నీసతి దెస చూడవయ్యా
నిక్కి చూడ నంతలోనే నిలువునఁ గొప్పు వీడె
వెక్కసపుఁజలమేల విచ్చేయవయ్యా ॥నెలఁ॥
చ.2 ముంచిన వూర్పులవెంట ముత్యపుఁగన్నీను జారె-
నించుకంత తెమలపు యిదేమయ్యా
చంచలపునడపుల సందడించెఁ జెమటలు
అంచెల నీమనసు కాయటవయ్యా ॥నెలఁ॥
చ.3 పెట్టినపయ్యదలోన బేఁటుగందములు రాలె
చిట్టకాల కింతి నింతసేసితివయ్యా
యిట్టె శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
అట్టె మేను పచ్చి సేతురటవయ్యా ॥నెలఁ॥
(రాగం ఆహిరి; రేకు 1195-3; సం. 21-501)
విశ్లేషణ:
పల్లవి: నెలఁత మోహించినదే నేరమటయ్యా
పలువిన్నపాల కిఁకఁ బనిలేదయ్యా
అమ్మాయి నిన్ను ప్రేమించడమే నేరమైపోయినదా! ఇదెక్కడి విడ్డూరమయ్యా స్వామీ! ఆమె నీకు ఎన్ని విన్నపాలు రాయబారాలు చేసింది? పట్టించుకునే పనే లేదా ఏమిటీ అంటున్నాడు.

చరణం.1: చెక్కునఁ జేర్చినచేత సేమంతిరేకులు రాలె
చొక్కపు నీసతి దెస చూడవయ్యా
నిక్కి చూడ నంతలోనే నిలువునఁ గొప్పు వీడె
వెక్కసపుఁజలమేల విచ్చేయవయ్యా
అసలేమి జరుగుతున్నదో పరిస్థితులేమిటో గమనిస్తున్నావా? ఆ అలమేలుమంగమ్మ నీకోసం చెక్కిట చేయిపెట్టుకుని ఎంత వేచి యున్నదో గమనించారా? ఆమె అలా చెయ్యిపెట్టుకుని కూర్చుని కూర్చుని చేమంతి పూల రేకులన్నీ రాలి క్రిందపడ్డాయుఇ. అవన్నా గమనించావా? ఏ పాపమెరుగని నీకోసం కనిపెట్టుకుని యున్న నీ అలమేలుమంగ వైపు ఒక్కసారి చూడవయ్యా! దయచేసి. నీ కోసం ఆవిడ నిక్కి నిక్కి మెడనెత్తి చూడడంవలన ఆవిడ పెట్టుకున్న అందమైన కొప్పు ముడి ఊడిపోయిందన్న విషయమైనా గమనించావా? అయినా నీకు ఈ అనవసర పట్టుదలలెందుకు స్వామీ! ఒక్కసారి ఆవిడవైపు దృష్టి సారించి అమ్మను ప్రసన్నం చెయ్యి అంటున్నాడు.
చరణం.2. ముంచినవూర్పులవెంట ముత్యపుఁగన్నీను జారె-
నించుకంత తెమలపు యిదేమయ్యా
చంచలపునడపుల సందడించెఁ జెమటలు
అంచెల నీమనసు కాయటవయ్యా
అమ్మ మీకోసం ఎదురు చూసి చూసి నిట్టూర్పులు విడచి విడచి ఆమె కళ్ళలో నుండి నీరు ముత్యాల లాగా జారి టప టపా పడడమయినా గమనించావా? కొంచెం కూడా తెముల్చుకొని కొంచెం అమ్మను చూడవా? ఎప్పుడూ భక్తులను రక్షించే పనిలోనే నిమగ్నమయి ఉంటావా? ఆమె ఆతృతతో ఎదురుచూపులు చూస్తూ కంగారుగా అటూ ఇటూ నడుస్తూ ఉంటే చెమటలు ధారగా కారిపోతున్నాయి. అయినా నీ మనసు ఇంత కాఠిన్యం వహించేదేమయ్యా స్వామీ! అంటున్నాడు.
చరణం.3 పెట్టినపయ్యదలోన బేఁటుగందములు రాలె
చిట్టకాల కింతి నింతసేసితివయ్యా
యిట్టె శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
అట్టె మేను పచ్చి సేతురటవయ్యా
అమ్మ తన ఎదపై రాచుకున్న చందనలేపనాన్ని చూశావా? ఎండిపొయ్యి రాలిపడిపోతున్నది. ఎంత పరాచకాలు, తమాషాలయినా ఇదేంటయ్యా! నీ చిలిపి శృంగారానికి ఒక హద్దంటూ లేదా ఏమిటి? మళ్ళీ అంతలో తటాలున వచ్చి అమ్మను చేరుకుంటావు. ఇలాంటి పచ్చి పచ్చి శృంగారం మీకు తగునా? అంటున్నాడు అన్నమయ్య ఆ శ్రీవేంకటేశ్వరుడిని.

ముఖ్యమైన అర్ధాలు –
నెలత = మహిళ; చొక్కపు = అభిజాతము, ఓయారము, కమనీయము, క్రమము, కలికి; నిక్కి = పైకిలేచి చూచుట; వెక్కేసము = దుస్సహత్వము, సహించలేని; ముంచిన వూర్పులు = గాఢ నిట్టూపులు; తెమలవు = పనులు ముగించుకొనుట; సందడించు = ప్రసరించు, అతిశయించు; అంచ = పార్శ్వం, సామీప్యం; కాయటవయ్యా = కఠినమా? ; పేటు గంధము = సరిగ లోనగువానితో నేసినపట్టెను పేటు అంటారు. పేటు గంధమంటే పేటులాగా వెడల్పుగా పూసిన గంధం; చిట్టకాలు = సరదా, ఆటపట్టించడం, శృంగారచేష్ట; మేను పచ్చి = దేహపరంగా చేసే మొరటు శృంగారపు పనులు అని అర్ధం.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked