సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము

ఈ కీర్తనలో అన్నమయ్య అమ్మ అలమేలుమంగమ్మ, చెలులతో గూడి స్వామికి విన్నవించుకుంటున్నపలుకులను మనకు అందిస్తున్నాడు. విశేషం ఏమిటంటే అన్నమయ్య కడపజిల్లా పులివెందులలో వెలసిన శ్రీరంగనాధ స్వామిపై వ్రాసిన శృంగార సంకీర్తనలో పదహారు వేల సతులతో గూడినవానికి సిగ్గెందుకు స్వామీ! మేమంతా నీ ఎదుటనే నిలబడ్డాము. భయమేల? వంకలు పెట్టకుండా మమ్ములను చేకొనండి అంటూ సాగుతుంది ఈ కీర్తన. ఆ విశేషాలు చూద్దాం.
కీర్తన:
పల్లవి: ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము
వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు ॥పల్లవి॥
చ.1 వావులు నీకెంచనేల వాడల గొల్లెతలకు
దేవరవు గావా తెలిసినదే
యీవల మావంక నిట్టె యేమి చూచేవు తప్పక
మోవనాడితి మిధివో మొదలనే నేము ॥ఇంక॥
చ.2 చందాలు చెప్పఁగనేల సతినెత్తుక వచ్చితి
విందుకు రాజవు గావా యెరిఁగినదే
దిందుపడి మమ్ము నేల తిట్టేవు పెదవులను
నిందవేసితి మిదివో నిన్ననే నేము ॥ఇంక॥
చ.3 వెలినవ్వేల పదారువేలఁ బెండ్లాడితివి
బలిమికాఁడవు గావా భావించినదే
చెలఁగి పులివిందల శ్రీరంగదేవుఁడ వని
కలసితి మిదె శ్రీ వేంకటరాయ నేము ॥ఇంక॥
(రాగం: మలహరి; రేకు: 603-4, కీర్తన; 14-15)
విశ్లేషణ:
పల్లవి: ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము
వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు
అన్నమయ్యకు బహుశ: కృష్ణావతార సన్నివేశం మదిలో మెదలి ఉండవచ్చు. పదహారు వేల గోపికలతో ఆడిపాడిన కృష్ణునికి సంకోచమా? ఏమి విచిత్రమిది? అని పరికిస్తూ శ్రీరంగనాధ స్వామిని కీర్తిస్తూ… స్వామీ! మీరేమీ శంకలు పడవద్దు. సంకోచపడవద్దు. భయం అసలే వద్దు సుమా! మీకిష్టమైన వారమంతా నీ ఎదుటనే నిలబడ్డాము. ఇప్పుడు ఇంక ఏవేవో వంకలు పెట్టి మాట్లాడకండి.రండి మమ్మేలుకొనండి అని చెప్తున్న సన్నివేశమిది.
చ.1 వావులు నీకెంచనేల వాడల గొల్లెతలకు
దేవరవు గావా తెలిసినదే
యీవల మావంక నిట్టె యేమి చూచేవు తప్పక
మోవనాడితి మిధివో మొదలనే నేము
స్వామీ! మేమంతా గొల్లెతలము. నీ పొందుకోరి నిలిచి ఉన్నాము. ఇప్పుడు వావి వరసలు ఎంచి ఏమి ప్రయోజనం. అంతా నీవారమే! నీవు దేవాది దేవుడవు. పరంధాముడవు ఆ విషయం అందరికీ విదితమే గదా! ఇప్పుడు మా వైపు చూస్తూ కూడా ఎందుకు సంకోచంగా నిలబడ్డావు నీవు ? నీ విషయాలన్నీ మాకు క్రొత్తగాదు కదా! మానోటితో మేమే మొదటే చెబుతున్నాము వినుస్వామీ! అంటున్నది అమ్మ.
చ.2 చందాలు చెప్పఁగనేల సతినెత్తుక వచ్చితి
విందుకు రాజవు గావా యెరిఁగినదే
దిందుపడి మమ్ము నేల తిట్టేవు పెదవులను
నిందవేసితి మిదివో నిన్ననే నేము
స్వామీ! నీ చేతలు చెప్ప శక్యంకానివి సుమా! రుక్మిణీదేవిని రధంపై ఎత్తుకుని వచ్చిన విషయం మేమెరుగనిదా? ఇందుకు నీవే శ్రేష్టుడైనవాడవన్న విషయమూ తెలిసినదే! భ్రమపడి మమ్ములను ఎందుకు నీ పెదవులతో తూలనాడతావు? మేము మిమ్ము నిందించాము మొదట నిన్ననే! ఆ తర్వాత మమ్మలను ఆడిపోసుకోవద్దు అంటూ చమత్కారంగా అంటోంది అమ్మ.
చ.3 వెలినవ్వేల పదారువేలఁ బెండ్లాడితివి
బలిమికాఁడవు గావా భావించినదే
చెలఁగి పులివిందల శ్రీరంగదేవుఁడ వని
కలసితి మిదె శ్రీ వేంకటరాయ నేము
ఇప్పుడు మీ ప్రకాశవంతమైన గొప్ప నవ్వులేల స్వామీ! పదహారువేల మందిని పెండ్లాడిన మొనగాడివి కదా! ఇవన్నీ మేము ఊహించినవే కదా! విరిసిన సౌందర్యంతో పులివెందులలో శ్రీరంగనాధుడవైన నీవు, తిరుమలలో శ్రీవేంకటేశ్వరునిగా వెలయగా మీతో కలిసిన విషయం ఎరుగవా! ఇంకా బిడియం సంకోచం ఎందులకు? మమ్మేలి ఆనందింపజేయి స్వామీ అని ప్రార్ధిస్తోంది అమ్మ.
ముఖ్య అర్ధములు వెరపు = శంక, సంకోచము; వంకలొత్తు = ఏవో కుంటి సాకులు పలుకు; వావులు = వావి, వరుసల సంబంధము; మోవనాడితి = మొహంపైనే విషయం సూటిగా దాపరికము లేకుండా చెప్పితిని; చందాలు = విధానాలు, పద్ధతులు; రాజవు = మొనగాడు, శ్రేష్టుడు; దిందుపడు = మూర్ఛపోవు [బ్రౌన్‌], క్రిందుపడు, డిందుపడు – ఇక్కడ తొందరపాటు తనం అర్ధం తీసుకోవడం ఉచితమనిపిస్తోంది, వెలినవ్వు = విచిత్రమైన నవ్వు, గొప్ప నవ్వు – వెలినోటిమెగము అనగా ఎలుఁగుబంటి, భల్లూకము అని అర్ధం అలాంటి పెద్ద నవ్వు నవ్వాడని అన్నమయ్య భావన అయి ఉండవచ్చు. బలిమి = పరాక్రమము, గొప్పదనము; చెలఁగి = నిలుచు, నెలయు, నెలవుకొను, విరిసినటువంటి.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked