సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

అష్టవిధ నాయికలు – స్వాధీనపతిక

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

అష్టవిధ నాయికల గురించిన ప్రస్తావన మొట్టమొదట క్రీ.పూ.2వ శతాబ్దంలో భరతముని సంస్కృతంలో రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనబడినది. 16వ శతాబ్దిలో జీవించిన కందుకూరి రుద్రకవి అష్టవిధ నాయికలను వర్ణిస్తూ జనార్ధనాష్టకం రచించాడు. అష్టవిధ నాయికలు కేవలం రచనల్లోనే కాక చిత్రకళ, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్య సాంప్రదాయాలలో తెలుపబడ్డాయి. మధ్యయుగపు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి.
అన్నమయ్య రచించిన శృంగార కీర్తనల్లో ఈ నాయికల విశేష వర్ణన ఉంది. అన్నమయ్యకు ఈ ప్రేరణ వైష్ణవ భక్తి నుండి సంక్రమించినదని భావించవచ్చు. అన్నమయ్య శ్రీవైష్ణవ వేదాంత పద్ధతి ననుసరించి, శ్రీవైష్ణవ మతమునకు చెందిన పండ్రెండుమంది ఆళ్వార్ల యొక్క “నాలాయిర దివ్య ప్రబంధము”లో నున్న నాయికా భావనకు అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. గురువుల యొద్ద నేర్చిన వేదాంతము, ఆళ్వారుల చరిత్రలు, భాగవత, విష్ణుపురాణములలో, నారద, శాండిల్యాది భక్తి సూత్రములలోనూ వివరింపబడిన గోపికాభక్తియే అన్నమయ్య శృంగార సంకీర్తనా రచనకు ప్రేరణ కావచ్చు. తననొక నాయికగా భావించుకొని, స్వామిని నాయకునిగా మనసున నిలుపుకొని, రసిక స్త్రీలకు కూడా మనసుకందని మనోభావాలను, శృంగార మర్మాలను విప్పి చెప్పడం దైవాంశ సంభూతుడైన అన్నమయ్యకు తప్ప అన్యులకు సాధ్యంకాదు.
ఈ అష్టవిధ నాయికలను వారి వారి మన:ప్రవృత్తిని బట్టి, శృంగార చేష్టలను బట్టి

1. స్వాధీనపతిక

2.వాసకసజ్జిక

3.విరహోత్కంఠిత

4.విప్రలబ్ద

5.ఖండిత

6.కలహాంతరిత

7.ప్రోషితభర్తృక

8.అభిసారిక అనే పేర్లతో పిలుస్తారు.

రామరాజభూషణుడు రచించిన కావ్యాలకార సంగ్రహము (సరసభూపాలీయము) లో వీరి ప్రవృత్తుల గురించి ఓ చక్కని పద్యంలో వివరించడం జరిగింది.

సీ.వరుడు కైవసమైన వనిత స్వాధీనభ/ర్తృక; ప్రియాగమ వేళ గృహము దనువు
సవరించు నింతి వాసక సజ్జ; పతి రాక/తడవుండ నుత్కంఠ దాల్చు నింతి
విరహోత్క; సంకేతమరసి నాధుడు లేమి /వెస నార్త యౌకాంత విప్రలబ్ధ
విభుడన్య సతిబొంది వేకువ రా గుందు/నబల ఖండిత; యల్క నధిపు దెగడి
గీ.అనుశయము జెందు సతి కలహాంతరిత; ని/జేశుడు విదేశ గతుడైన గృసత దాల్చు
నతివ ప్రోషిత పతిక; కాంతాభిసరణ /శీల యభిసారి కాఖ్యయై చెలువు మెఱయు.

స్వాధీనపతిక:
అన్నమయ్య వీక్షించిన అష్టవిధ శృంగార నాయికలలో మొదటగా స్వాధీనపతిక నాయిక యొక్క మన:ప్రవృత్తిని బట్టి, శృంగార చేష్టలు, అవస్థలను బట్టి అన్నమయ్య కీర్తించిన విధానాన్ని ఈ క్రింది శృంగార కీర్తనలో చూద్దాం. పరస్త్రీలను గాంక్షింపక తనయందే అనురక్తుడైన పతి గల నాయిక ను స్వాధీన పతిక అంటారు. స్వాధీన పతికతో తోడి సతులు పలికే చమత్కారాలు ఈ కీర్తనలో చూద్దాం.
కీర్తన:

పల్లవి: చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ
యెక్కువైన నీభాగ్య మేమని చెప్పుదమే
చ.1. నెలత నీనోములు నేడే ఫలియించె గదే
కలలు నీకిపుడె నిక్కలలాయెనే
పలికిన సగినాలు పతి వచ్చె గదవే
తలచగానే విభుడు తానే ఇందు వచ్చెను ||చక్కని||

చ.2. తొల్లిటి మీ పూజలు తుదకెక్కె గదవే
యెల్లగా నీకోరికలు యీడేరెనే
చెల్లుబడి నీ పంతము చేకూరె గదవే
యిల్లిదివో నీరమణు డెదుటనున్నాడు ||చక్కని||

చ.3. నీ వెంచిన యెన్నికలు నెరవేరె గదవే
కావలసినవి తారుకాణలాయెనే
దేవులవయితివి వావి దిష్టములాయ గదవే
శ్రీవేంకటేశుడు నిన్ను జేకూరినాడు ||చక్కని||

(రాగం: రామక్రియ; శృం.సం.సం 28; రాగి రేకు 1862; కీ.సం.361)
విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక స్వాధీనపతికయైన పద్మావతీదేవి, నాయికతో తోడి సతులు పలికే పలుకులు ఇవి.

పల్లవి: చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ
యెక్కువైన నీభాగ్య మేమని చెప్పుదమే ||

పద్మావతీ! సుందరాంగుడైన శ్రీనివాసుడు నీకు భర్తగా లభించాడు. ఇంత సౌభాగ్యవతివైన నిన్ను నీ అదృష్టాన్ని ఏమని చెప్పగలం, పొగడగలం. అనగా నీకు అనుకూలుడైన భర్త లభించాడు. నీవు స్వాధీన పతికవే అని చెప్పడం.

చ.1. నెలత నీనోములు నేడే ఫలియించె గదే
కలలు నీకిపుడె నిక్కలలాయెనే
పలికిన సగినాలు పతి వచ్చె గదవే
తలచగానే విభుడు తానే ఇందు వచ్చెను

పడతీ! నీవు నోచిన నోములన్నీ ఫలించి నీకు ఇంత అనుకూలుడైన భర్త లభించాడు. నీవు కలలనీ నేడు నిజమయ్యాయి. నీకు అన్నీ ఇక శుభ శకునాలే! నీవు మనసులో తలచుకుంటే చాలు పతి వచ్చి నీముందు వాలుతాడు.

చ.2. తొల్లిటి మీ పూజలు తుదకెక్కె గదవే
యెల్లగా నీకోరికలు యీడేరెనే
చెల్లుబడి నీ పంతము చేకూరె గదవే
యిల్లిదివో నీరమణు డెదుటనున్నాడు

నీవు ఆదినుండీ చేసిన పూజలూ వ్రతాలు గట్టెక్కాయి. నీకోరికలు సమస్తమూ సిద్ధించాయి. స్వామినే పొందాలనే నీకోరికా, పంతమూ నెగ్గాయి కదా! ఇదివో శ్రీనివాసుడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు నీకోసం. అని అంటున్నారు తోడి సవతులు.

చ.3. నీ వెంచిన యెన్నికలు నెరవేరె గదవే
కావలసినవి తారుకాణలాయెనే
దేవులవయితివి వావి దిష్టములాయ గదవే
శ్రీవేంకటేశుడు నిన్ను జేకూరినాడు

నీ కోరిక ప్రకారం నీవు యెంచుకున్న స్వామినే పొందగలిగావనడానికి కావలసిన తార్కాణాలు, ప్రమాణాలు అనేకం కనిపిస్తున్నాయి కదా! నీ ఇష్టప్రీతిగా మహారాణిగా చూడబడుతున్నావు. శ్రీవేంకటేశ్వరుడు నిన్ను యేరి కోరి జత గూడాడు అంటున్నారు.

ముఖ్యమైన అర్ధాలు: సగినాలు = శకునాలు; తుదకెక్కె = గట్టెక్కె; యెల్ల = సమస్తము; చేకూడె = సిద్ధించె; తారుకాణాలు = తార్కాణాలు, ప్రమాణాలు, దృష్టాంతములు; దేవులవైతివి = మహారాజ్ఞీత్వం, రాణీవాసం; దిష్టము = చూడబడినవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked