సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

అష్టవిధ నాయికలు – వాసక సజ్జిక

– టేకుమళ్ళ వెంకటప్పయ్య

“ప్రియాగమనవేళాయాం మణ్డయన్తీ ముహుర్ముహుః|/కేళీగృహం తథాత్మానం సా స్యాద్వాసకసజ్జికా||”

అని విద్యానాథుడు తన ‘ప్రతాపరుద్రీయము’లో వాసకసజ్జిక యొక్క లక్షణాలను చెప్తాడు. వాసకం అంటే ఇల్లు, వస్త్రం, పరిమళం వెదజల్లే మూలిక / వేరు, సజ్జిక అంటే సిద్దంగా ఉండడం అందుకే వాసక సజ్జికకు ఆ పేరు. ఈ తరహా నాయిక ప్రియుడు లేక పతిరాక కోసం ఎదురుచూపులు చూస్తూ, ఏ క్షణమైనా రావచ్చునని తనను, తన పడకగదిని సుమనోహర, పరిమళ, సుగంధ భరితంగా అలంకరించుకొని తన పతికి కనువిందు చేయటానికి సిద్ధంగా ఉండే నాయిక. రకరకాల మణులు పొదిగిన బంగారు ప్రమిదల్లో సువాసన గల తైలం పోసి దివ్వెలను వెలిగించి, లేత తమలపాకులు, పోకచెక్కలు, పచ్చకర్పూరం, కుకుమపువ్వు, యాలకులు, లవంగాలు ఒక అందమైన పళ్ళెంలో సిద్ధం చేసుకుని ప్రియునికోసం యెదురు చూసే నాయిక. ఈమె అందంగా తయారై ప్రియుని రాకకోసం తద్వారా లభించే ఆనందాల కోసం నిరీక్షిస్తున్నట్లు గ్రంధాలలో చెప్తారు. ఈమె అందాన్ని కొన్ని సార్లు కవులు రతీదేవితో పోలుస్తారు. వాసవసజ్జికశిల్పం ఖజురహో లోని లక్ష్మణ దేవాలయంలోను మరియు జాతీయ సంగ్రహాలయాలలో కనిపిస్తాయి.

రామరాజభూషణుని ‘ప్రియాగమవేళ గృహముఁ,దనువు సవరించు నింతి వాసకసజ్జ’ అన్న మాట సైతం పై విషయన్ని సమర్ధిస్తూ ఉన్నది కనుక యిదీ ప్రతాపరుద్రీయ సమభావనయే అనడం సత్య దూరం కాదు. ‘వాసకం వాసస్థానం సజ్జయతీతి వాసకసజ్జా’ అనియు, ‘వాసకే సజ్జా కృతమండనా’ అనియు వాసకసజ్జాపదమునకు గల వ్యుత్పత్తులు ఆవిధంగా లోకంలో మనకు సమకూరినవే! కాని ‘స్త్రీణాం వారస్తు వాసకః ’ అని కూడా ఉన్నది. ‘స్త్రీని కలిసికొనుటకు పురుషుడేర్పరచుకొన్న వారము వాసకము’ అని దీని కర్థము. ఇది ఈ ఆధునిక కాలంలో పాశ్చాత్య దేశాలలోనూ, ప్రస్తుతం మన దేశంలోనూ విస్తరిస్తున్న ‘డేటింగ్’ వంటిది అని అంటారు కొంతమంది. పూర్వకాలంలో గొప్పవారు, ధనవంతులకు బహుభార్యలుండడం ఆచారంగా వుండడం వలన వారిలో కొందరు స్త్రీలను పురుషులు కొన్ని కొన్ని నిర్ణీత సమయములలో/వారములలో కలుసుకొనే వారనీ అట్టి వారమే వాసకమనీ నానుడి ఉంది. ఆ వాసకమునందు అలంకరించుకొని సిద్ధముగా నుండు నాయిక ‘వాసకసజ్జిక’ అని ప్రతాపరుద్రీయ వ్యాఖ్యాతలైన కుమారస్వామి ప్రభృతులు ఇంకో అర్థమును తెల్పినారు.
సర్వజ్ఞ సింగభూపాలుడు రసార్ణవసుధాకరములో ఈక్రింది శ్లోకమును వాసకసజ్జిక కుదాహరణముగా నిచ్చినాడు. “కేళీగేహం లలితశయనం భూషితం చాత్మదేహం/దర్శం దర్శం దయితపదవీం సాదరం వీక్షమాణా|కామక్రీడాం మనసి వివిధాం భావినీం కల్పయన్తీ/సారంగాక్షీ రణరణికయా నిఃశ్వసన్తీ సమాస్తే||” అనగా ప్రియుడు తనగృహమునకు వచ్చు వేళయైనది. ఆసమయమునకు నాయిక తన కేళీగృహమును, లలితమైన, అందమైన శయ్యను, తనను అలంకరించుకొని, మిక్కిలి ఆదరంతో, అనురాగంతో, మాటిమాటికి దారివేపు అతని రాకకై చూస్తూ, తద్వారా జరగబోయే వివిధకామక్రీడల భావనలను మనస్సులో పరి పరి ఊహిస్తూ, ఉత్కంఠతో ఉండిపోయిన నాయిక అని భావన.

ఈక్రింది పద్యంలో రామరాజభూషణుడు పురలక్ష్మికి వాసకసజ్జికాత్వము నాపాదిస్తూ తన కావ్యాలంకారసంగ్రహములో చక్కని ఉదాహరణము నిచ్చినాడు.
“యవన చమూ సమూహముల నాజి జయించి, యుదగ్రదిగ్జయో/త్సవవిభవాభిరాముఁడయి సారెకు నోబయనారసింహభూ/ధవుఁ డరుదెంచులగ్నమునఁ దత్పురలక్ష్మి విభూషితోల్లస/ద్భవన విశేషయై మృగమదద్రవవాసనఁ దాల్చు నిచ్చలున్.” అనగా యవన సేనాసమూహములను యుద్ధములో జయించి, దిగ్విజయవిభూషణుడైన మహారాజు వచ్చు ముహూర్తమునకు ఆతని పురలక్ష్మి భవనముల నలంకరించుకొని, కస్తూరీసుగంధయుతయై ఉండెనని పురలక్ష్మికి రామరాజభూషణుడు వాసకసజ్జికాత్వము నాపాదించడం బహుధా హర్షణీయం. మంచి కవిసమయం కూడా! ఈ విధమైన శృంగారనాయికాతత్త్వమును పురలక్ష్మికి ఆపాదించి పురలక్ష్మిని వాసకసజ్జిక గావించినాడు.
అన్నమయ్య వీక్షించిన అష్టవిధ శృంగార నాయిక వాసక సజ్జిక నాయిక యొక్క మన:ప్రవృత్తిని బట్టి, శృంగార చేష్టలు, అవస్థలను బట్టి అన్నమయ్య కీర్తించిన విధానాన్ని ఈ క్రింది శృంగార కీర్తనలో చూద్దాం. వాసక సజ్జికతో తోడి సతులు పలికే చమత్కారాలు ఈ కీర్తనలో చూద్దాం.
కీర్తన:
పల్లవి: చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేఁడు
వేడుక సింగారాలు వింత వింతలాయను
చ.1. జక్కవ గుబ్బల మీఁది సరులు
వెక్కసపుఁ గొప్పలోని విరులు
చెక్కుటద్దపుఁ గాంతుల సిరులు
చక్కని యీకెకు నెన్ని సమకూడె గురులు ॥చూడ॥
చ. 2. నిలువున నొయ్యారపు నీట్లు
వలపె పయ్యెద వల్లెవాట్లు
మలయు మోము సురటిమాట్లు
కుటుకునవ్వు లీకెకుఁ గొండలుఁ గోట్లు ॥చూడ॥
చ. 3. కావరపుఁ బిఱుఁదుల కలిమీ
భావములో వలపుల బలిమీ
శ్రీ వేంకటేశుఁడు గూడెఁ జెలియలమేల్మంగను
చేవదేరె నీకెకు చెప్పరాని చెలిమీ ॥చూడ॥
(రాగం: సామంతం; శృం.సం.సం 28; రాగి రేకు 1849; కీ.సం.285)

విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక వాసక సజ్జిక యైన పద్మావతీదేవి, నాయికతో తోడి చెలికత్తెలు పలికే పలుకులు ఇవి.

పల్లవి: చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేఁడు
వేడుక సింగారాలు వింత వింతలాయను||

అమ్మవారి అందచందాలను వర్ణిస్తూ తోడి చెలికత్తెలు ఏమంటున్నారో చూడండి. అమ్మలాలా! కొమ్మలాలా! చూశారా! ఈ దేవేరి ముఖ కాంతులు…ఆ పద్ధతీను. అమ్మ బలీయమైన కోరికతో సింగారించుకొని ఎంత విలాస వంతంగా, కొత్త కొత్తగా ఉన్నదో! చూడండి.

చ.1. జక్కవ గుబ్బల మీఁది సరులు
వెక్కసపుఁ గొప్పలోని విరులు
చెక్కుటద్దపుఁ గాంతుల సిరులు
చక్కని యీకెకు నెన్ని సమకూడె గురులు

చక్రవాకముల వంటి వక్షద్వయము తగినట్లు అందంగా అమరి ఉన్నవి. అమ్మ కొప్పులోని పుష్పాలను చూశారా ఎంత వింతశోభను గొలుపుతున్నాయో! అమ్మవారి చెక్కిళ్ళు అద్దపు కాంతులీనుతూ మెరుస్తున్నాయి కదా! ఇంత చక్కని అమ్మకు ఎన్ని చక్కని శోభలు అధికంగా సమకూరాయో చెప్ప శక్యం కావడంలేదని చెలికత్తెలు అమ్మ శోభను చూసి తరించి పోతున్నారు.

చ.2. నిలువున నొయ్యారపు నీట్లు
వలపె పయ్యెద వల్లెవాట్లు
మలయు మోము సురటిమాట్లు
కుటుకునవ్వు లీకెకుఁ గొండలుఁ గోట్లు

అమ్మవారి శరీరం గమనించారా! నిట్టనిలువుగా ఎత్తుగా శృంగార గర్వంతో అతిశయించి ఉన్నది. ఆమె ప్రేమనే పయ్యెదపై పవిట వల్లెవాటుగా ఉన్నది. ఆ మోము మాటి మాటికీ అటూ ఇటూ తిప్పుతూ వన్నెల విసనకర్ర లా తిరుగుతూ ఉన్నది. అమ్మ నోరు వంకరగా తమాషాగా ఎంత అందంగా ఎంత గొప్పగా పెట్టిందో చూశారా!

చ.3. కావరపుఁ బిఱుఁదుల కలిమీ
భావములో వలపుల బలిమీ
శ్రీ వేంకటేశుఁడు గూడెఁ జెలియలమేల్మంగను
చేవదేరె నీకెకు చెప్పరాని చెలిమీ

ఎత్తైన పిరుదులతో అంతరంగ తరంగాలలో స్వామివారిపై ప్రేమను కుమ్మరిస్తూ ఉన్న అమ్మవారిని శ్రీవేంకటేశ్వరుడు కలియబోతున్న, కూడబోతున్న సందర్భంలోని ఆనందం గమనించారా! ప్రేమలో ఆరితేరిన అమ్మవారికి స్వామినికూడేందుకు ఎంత ప్రేమ? వాసకసజ్జికలా `అని చెలికత్తెలు మాట్లాడడంలో ఔచిత్యం ఉంది. ఆనందం ఉంది. అర్ధం ఉంది. పరమార్ధం ఉంది.

ముఖ్యమైన అర్ధాలు:

జక్కవ = చక్రవాకము; సరులు = సరిగా, తగినట్లుగా; వెక్కసము = వింత; సిరులు = శోభలు; గురులు = అధికముగా; నిలువున = ఎత్తుగా; నీటు = శృంగార గర్వం; వల్లెవాటు = పైట వలె కప్పుకొను వస్త్రము (నెల్లూరు చిత్తూరు జిల్లాలలోని మాట) మలయు = వ్యాపించు, తిరుగు; సురటి = విసనకఱ్ఱ; కుటుకు = వంకర; కావరము = గర్వము; చేవదీరు = ఆరితేరు, సర్వము తెలిసికొన్న.
“కుటుకునవ్వు లీకెకుఁ గొండలుఁ గోట్లు” అన్న వాక్యంలో కొండలు, గోట్లు అన్న పదప్రయోగములలో
“కొండలు” అనగా “గొప్పదయిన” అని తీసుకొనబడినది. “గోట్లు” అన్న పదం వాడడంలో ఔచిత్యం కోట్లు లేక లెక్కకు మిక్కిలి అన్న అర్ధం స్ఫురించుచున్నది.

విశేష పదప్రయోగం:

అన్నమయ్య ఈ కీర్తనలో “జక్కవ గుబ్బలు” అనే వినూత్న పద ప్రయోగం గావించారు. దానిలోని అంతరార్ధం బోధపడాలంటే మనకు చక్రవాక పక్షుల గురించి తెలియవలసి ఉంది. చక్రవాక పక్షులు ఎప్పుడూ జంటగానే ఉంటాయి. పక్క పక్కనే అన్నివేళలా. అందుకే చనుగవకు ఉపమానంగా “వక్షోజాల జంట” ను ఎంత అందంగా చక్రవాక పక్షుల జంటతో నిర్దేశించాడో చూడండి అన్నమయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked