సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

అష్టవిధ నాయికలు – ఖండిత

– టేకుమళ్ళ వెంకటప్పయ్య

కావ్యములలో శృంగారరసమునకు ఆలంబనగా నాయికానాయకులు నిలుస్తారు. నాయికానాయకుల చక్షుష్ప్రీతి, మనస్సంగములవల్ల కలుగు మనోవికారమే రూఢమై శృంగారరసముగా పరిణమించును. నాయికా ప్రసక్తిలో ఆసక్తికరమైన విషయము అష్టవిధశృంగార నాయికావర్గీకరణము. ఇది నాయిక తాత్కాలిక మనోధర్మ వర్గీకరణమే కాని, నాయికాప్రకృతి వర్గీకరణము కాదు. అనగా ఒకే నాయిక తత్తత్కాలమనోధర్మము ననుసరించి, ఈ అష్టవర్గములలో ఏదో యొక వర్గమునకు చెంది యుండుననుట సబబు. ఆ కోవలో ఖండిత ఒక నాయిక. ఈ మాసం ఖండిత నాయికను గుఱించి అన్నమయ్య ఏ విధంగా తెలియజేశాడో తెలుసుకునే ముందుగా ఖండిత నాయిక లక్షణాలను తెలుసుకుందాం.

ఖండిత నాయికను “నీత్వాఽన్యత్ర నిశాం ప్రాతరాగతే ప్రాణవల్లభే| / అన్యాసంభోగచిహ్నై స్తు కుపితా ఖండితా మతా||” అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో నిర్వచించాడు. అనగా ‘రాత్రియంతయు అన్యకాంతతో గడిపి, ప్రొద్దున తత్సంభోగచిహ్నములతో వచ్చిన నాయకునిపట్ల కుపితయైన నాయిక ఖండిత’ అని అర్థము. ప్రియుడు అన్యకాంతాసంగము చేసి వచ్చినాడని శంకించి కోపగించిన నాయిక ఖండిత. అన్యకాంతాసంగమము జరిగినదను అనుమానమే ఈనాయికయొక్క రోషదైన్యాదులకు కారణము అని గమనించవలసి యున్నది. సాపరాధుడైన నాయకుని దేహమునందలి పరకాంతా సంగమ సంకేతములను పరిశీలించి, చింత, నిశ్శ్వాసము, ఖేదము, సఖీసంలాపము, గ్లాని, దైన్యము, అశ్రుపాతము, రోషము, భూషణత్యాగము, రోదనాదులతో ఖండితానాయిక తన యవస్థ నభినయించవలెనని భరతుడు తన నాట్య శాస్త్రం లో తెల్పినాడు. రసార్ణవసుధాకరములోని శ్లోకము ఖండితా నాయికయొక్క చేష్టలను చక్కగా వర్ణించబడినది. “ప్రభాతే ప్రాణేశం నవమదనముద్రాంకితతనుం / వధూర్దృష్ట్వా రోషాత్ కిమపి కుటిలం జల్పతి ముహుః| / ముహుర్ధత్తే చిన్తాం ముహురపి పరిభ్రామ్యతి ముహు / ర్విధత్తే నిఃశ్వాసం ముహురపిచ బాష్పం విసృజతి|| దీని అర్ధం ఏమిటంటే… ప్రభాతమునందు ప్రాణేశునియొక్క నవమదన ముద్రాంకితమైన శరీరమును గాంచి, రోషంతో మాటికి మాటికీ ఏవో ఎత్తిపొడుపు మాటలు అనడం. మఱిమఱి చింత వహిస్తూ…నిలుకడ లేక చలించడం, నిఃశ్వాసములు వెడలించడం, కన్నీటిని ధారగా గార్చడం. ఈ విధంగా నాయిక నాయకుని ప్రవర్తన పట్ల గలిగిన సంక్షోభము నామె చేష్టలలో వ్యక్తం గావడం.

వక్రోక్తి (వ్యాజస్తుతి) గల శ్లోకము ఒకటి “పుష్పబాణవిలాసం” గ్రంధంలో ఉన్నది. “సత్యం తద్యదవోచథా మమ మహాన్ రాగ స్త్వదీయాదితి/త్వం ప్రాప్తోఽసి విభాత ఏవ సదనం మాం ద్రష్టుకామో యతః| / రాగం కించ బిభర్షి నాథ హృదయే కాశ్మీరపత్త్రోదితం / నేత్రే జాగరజం లలాటఫలకే లాక్షారసాపాదితమ్.|| “ఓ నాయకుడా! నాకు మనసులో మాత్రమే నీపై రాగమున్నది. మఱి నీకో శరీరమందంతటను రాగమున్నది. నీయెదలో కశ్మీరపత్ర రాగ మున్నది; కనులలో జాగరణరాగ మున్నది; నొసటిపై లాక్షారసరాగ మున్నది. నాపై ఎంత మక్కువయో, నాకడకు పెందలకడనే వచ్చితివి అని అన్యాపదేశంగా నాయకుని రాత్రి రాలేదని దెప్పి పొడుస్తూ మాట్లాడడం. నీవు వచించినట్లు నీకు నాయందు గల రాగాతిశయ మధికమైన దనుటలో అసత్య మింతయు లేదు. ఇచ్చట రాగ మనగా అనురాగమనియు, ఎఱ్ఱదనమనియు గ్రహింపవలెను. ‘నాకు మనసులో మాత్రమే రాగమనగా అనురాగ మున్నది. నీకో శరీర మంతటను రాగము ఉన్నది’ అని అని అన్యాపదేశంగా శరీరం మొత్తం ఎర్రదనం ఉన్నదంటూ వ్యాజస్తుతిచే నాయిక నాయకుని వక్రోక్తితో నిందిస్తూ ఉన్నది.

అన్నమయ్య శృంగార కీర్తనలో “అనుమానించగనేలా అవిగో నీ చేతలు…దిన దిన కొత్తలెల్లా దిష్టమాయ మాకు” అంటూ ఖండిత అయిన నాయిక నాయకునితో పలికే వింత వింత పలుకులను విందాం.

కీర్తన:
పల్లవి: అనుమానించగనేలా అవిగో నీచేతలు
దినదిన కొత్తలెల్లా దిష్టమాయ మాకు.
చ.1.కొసరి యెవ్వతె నీతో కొంగువట్టి పెనగెనో
పసపల్లా నంటె నదె పచ్చడానను
యెసగి చెక్కులువట్టి యెంత వేడుకొనెనో
సుసరాన గోరికొన సోకులు చూపట్టెను ||అనుమా||
చ.2. కమ్మటి నాపె యేరీతి కాగిట బిగించెనో
కుమ్మెలువోయి గుబ్బలగురు లున్నవి
యిమ్మల నీవొడివట్టి ఎంత వొడబరచెనో
నెమ్మది గానుకిచ్చిన నిమ్మపండ్లు గంటిని ||అనుమా||
చ.3. పదాలకు మొక్కి యెట్టు పానుపుపై గూడెనో
పోదితో మైతావి నీపై బొలుపొందెను
పాదుగ నలమేల్మంగ పతివి శ్రీవేంకటేశ
యీదెశ నన్నేలితివి ఈకె నీకు జట్టము ||అనుమా||
(రాగము: శంకరాభరణం, 28-286 రాగిరేకు 1849)

విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక ఖండితయైన పద్మావతీదేవి, నాయిక నాయకుని పరకాంతతో గడిపి వచ్చాడని కోపంతో మాట్లాడే సన్నివేశం.

పల్లవి: అనుమానించగనేలా అవిగో నీచేతలు
దినదిన కొత్తలెల్లా దిష్టమాయ మాకు.

స్వామీ! ప్రాణనాధా! అనుమానించడం ఎందుకు? అనుమానించానని అనుకోవడం ఎందుకు? ప్రతిరోజూ నీచేతలు నాకు వింత వింతగా కొత్తగా కొత్తగా కనిపిస్తున్నాయి.
చ.1.కొసరి యెవ్వతె నీతో కొంగువట్టి పెనగెనో
పసపల్లా నంటె నదె పచ్చడానను
యెసగి చెక్కులువట్టి యెంత వేడుకొనెనో
సుసరాన గోరికొన సోకులు చూపట్టెను

స్వామీ! ఏ కాంత నీ కొంగు పట్టుకుని చుట్టుకుని నీతో తిరిగినదో! ఎఱ్ఱటి వర్ణం నీ వస్త్రాలకు అంటుకున్నదో చూశారా! నీ చెక్కిలి పట్టుకుని ఎంత వేడుకున్నదో మరి! అంత సులభంగా నిన్ను వశం చేసుకున్న తార్కాణాలు కనపడుతున్నాయి.
చ.2. కమ్మటి నాపె యేరీతి కాగిట బిగించెనో
కుమ్మెలువోయి గుబ్బలగురు లున్నవి
యిమ్మల నీవొడివట్టి ఎంత వొడబరచెనో
నెమ్మది గానుకిచ్చిన నిమ్మపండ్లు గంటిని

అందమైన ఆమె నిన్ను ఎంత గట్టిగా కౌగిలిలో బంధించిందో మరి! ఆమె వక్షోజాల వత్తిడి ముద్రలతో నీ ఎద గాయాలు అయినది. నిన్ను వశపరచుకుని నీ వొడిలో ఇబ్బడిముబ్బడిగా ఏమి ఆటలాడినదో తెలీదు నీ వొడిలో కిచ్చిలి నారింజపండ్లు ఉన్నవి.
చ.3. పాదాలకు మొక్కి యెట్టు పానుపుపై గూడెనో
పోదితో మైతావి నీపై బొలుపొందెను
పాదుగ నలమేల్మంగ పతివి శ్రీవేంకటేశ
యీదెశ నన్నేలితివి ఈకె నీకు జట్టము

స్వామీ! నీ పాదాలకు మ్రొక్కి ఏవిధంగా నీ పానుపై జేరి నీతో జతగూడినదో! ఆమె ద్వారా వచ్చిన గంధము, కర్పూరము మొదలైన పూతలు నీ శరీరం పై అందంగా శోభిస్తున్నాయి అని అమ్మవారు అంటున్నారు. నిలకడగా ఆలోచిస్తే నీవు అలమేల్మంగపతివి కదా! ఈ విధంగా ఏలుకుంటున్నావు అలాంటప్పుడు ఈమెయే నీకు అందమైన జత సుమా! అని అన్నమయ్య స్వామికి నివేదిస్తున్నాడు.

ముఖ్యమైన అర్ధాలు: దిష్టము = చూడబడినవి; పసపల్లా = ఎర్రటి కాంతిగల; పచ్చడము = వస్త్రము; చెక్కులు = చెక్కిలి; సుసరము = సులభము; కుమ్మెలువోయి = గాయమవడం; గుబ్బలగురుతులు = వక్షోజాల ఒత్తిడి గుర్తులు; ఇమ్మల = రెండింతలు; వొడబరచెనో = ఒప్పించెనో, అంగీకరించేట్టు చేసెనో; కిచ్చిన నిమ్మపండ్లు = కిచ్చిలి నారింజ పండ్లు; పోదితో = గొప్పగా అనే అర్ధంలో (విశేషణం); మైతావి = శరీరంపై పూత; పొలుపు = అందము, సొంపు; పాదుగ = ఆశ్రయముగ; ఈకె = ఈమె; జట్టము = అందమైన సరియైన విధానముతో ఉన్నది అనే అర్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked