కవితా స్రవంతి

*అన్యాపదేశం*

-దర్భముళ్ల  చంద్రశేఖర్

నిన్నటిలో పుట్టిన అబద్ధానివి నువ్వు…
రేపటిలో మొలిచే నిజాన్ని నేను!

ఏ ఉన్మాదుడి ఊహలోంచో… ఊహాన్ లోంచో…
ఉరికి వచ్చి, ఊరికొచ్చి
ఉరి చిచ్చు పెట్టిన ఉపద్రవానివి…
జడ లిప్పుకు తాండవం చేస్తున్న జగజ్జంత్రీవి!
ఊడలు ఊబిలోకి దిగేసి
నిర్దాక్షిణ్యంగా నాల్కతో లాగి నలిపేసే
దెయ్యాల మర్రివి… రాక్షస కంత్రీవి!!
అయినా నా ధృడ సంకల్పం ముందు
నువ్వు నన్నేమి చేయలేవు……..!!!

ఒక్క బేతాళుడివి…
కొమ్ములతో వేలాడే పాపాల పాతాళుడివి…
ఏ భుజం ఆసరాగా దొరుకుతుందని చూసే పిచ్చి పీనుగవి
నీలాంటి ఎందరో బేతాళుల్ని
ముగింపు లేని వందల వేల శంకల్ని వంకల్ని
తెగ నరికే విక్ర”మార్కు” తలారిని నేను!!!

గుర్తుందా….
ఆనాడు అమృతాన్ని అరచుక్క చవి చూడకుండానే
నాల్కలు చీల్చుకున్న విష సర్పమా…
నీ కందకుండా అమృతభాండాన్ని అదిలించి
మరీ ఎగరేసుకు పోయిన దమ్మున్న  ఖగరాజుని నేను రా!
ఈనాడు నా గుండె అమృతాన్ని
నీ గరళంతో విషతుల్యం ఎలా అవనిస్తాను???
నీ కరాళ నృత్యం
నా ఉరఃపంజరం ముంగిట్లో ఎలా చేయనిస్తాను???
ఓరీ పరాన్న భుక్కూ! ఒళ్లల్లా హుక్కులున్న చీకేసిన తొక్కూ…
గాలిలో గజం పాక లేని గుడ్డిగవ్వవి!
మరి నేనో రెక్కలు కాలినా…
పాకుతూనే దిక్కుల్ని దీర్ఘ దృష్టితో తడిమి
నూరు యోజనాల కవతలి ప్రయోజనానికి పనికొచ్చిన
మొండి గువ్వను రా!!!

నీకు తెలుసా… నువ్వు నన్నేం చేయలేవు!
నేను చైతన్యం… జవం… జీవం!!!
ఇంకేం తెలుసుకుంటావులే….
నిజానికి నువ్వొక నిద్రపోతున్న శవం!!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked