ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు – 9

సత్యం మందపాటి చెబుతున్న

గణాధిపత్యం!

“మన ఈనాటి ప్రహసనం, ఒక జోకుతో మొదలుపెడతాను. ఇది నువ్వు వినే వుంటావు. జోకంటే నా జోకు కాదు. తెలుగు హాస్య ప్రియునందరికీ గురువుగారు ముళ్ళపూడి వెంకటరమణ గారిది” అన్నాడు కృష్ణ.
అర్జున్ సర్దుకు కూర్చుని, “చెప్పు బావా, నాకు ముళ్ళపూడిగారి జోకులంటే ప్రాణం” అన్నాడు.
“ఒక పల్లెలో రెడ్డిగారి పార్టీకీ, నాయుడుగారి పార్టీకీ పెద్ద పోట్లాట జరుగుతున్నదిట. పోట్లాట అంటే నోటి దురద తీర్చుకునే నోట్లాట కాదు. రెండు పార్టీల వాళ్ళూ ఆవకాయ పెట్టుకునే కత్తులతో, చకచకా ఒకళ్ళనొకళ్ళు నరికేసుకుంటుంటే, వాళ్ళ తలకాయలు నరికిన పుచ్చకాయ ముక్కల్లాగా ఎగిరి పడుతున్నాయిట. ఆడవాళ్ళూ, పిల్లలూ భయంతో ఇంట్లోనించీ బయటికి రావటం లేదు. కానీ అక్కడ రచ్చబండ దగ్గర ఒకాయన మాత్రం, తాపీగా చుట్ట త్రాగుతూ, ఆకాశంలోకి చూస్తూ, కాలు మీద కాలు వేసుకుని పడుకుని వున్నాడుట. వాళ్ళు ఎంత కొట్టుకుంటున్నా, ఆయన దగ్గరికి వచ్చేసరికీ ఎంతో మర్యాదనిస్తూ, ఆయనకో సలాం కొట్టి జాగ్రత్తగా ఆయన్ని తప్పుకుని దూరంగా వెడుతున్నారుట. అదెందుకో నీకు తెలుసని నాకు తెలుసు. అయినా చెప్పేస్తున్నాను. ఆయన ఆ రెండు పార్టీలవారి దగ్గరా ఘనంగా అప్పులు చేశాడు. మరి ఆయన తల ఎగిరిపోతే, వాళ్ళ డబ్బులు కూడా హూష్ కాకీ అని కాకిలా ఆకాశంలోకి ఎగిరిపోతాయి. అందుకని” ఆపాడు కృష్ణ.

పెద్దగా నవ్వాడు అర్జున్. “ఇది ఒకసారి కాదు బావా, చాలసార్లు విన్నాను. మంచి జోకు… అవునూ.. ఇప్పుడు ఆ జోకు ఎందుకు చెప్పావు?” అడిగాడు అర్జున్.
నవ్వాడు కృష్ణ. “ఇదీ నువ్వు అడుగుతావని తెలుసు. జాగ్రత్తగా విను అర్జునా! ఇది ఆయన సరదాగా చెప్పినా, దీంట్లో మన ఉద్యోగ విజయాలకి పనికి వచ్చే, మంచి సందేశం వుంది” అన్నాడు.
“సందేశమా. అప్పుల అప్పారావు కథలో సందేశమా, ఏమిటది?” తన సందేహం వెలిబుచ్చాడు అర్జున్.
“అంటే ఆ రెండు పార్టిల వారికీ, అతనితో ఎంతో అవసరం వుంది. ఆ అవసరం వున్నంత కాలం అతనికి ఢోకా లేదు. అలాగే ఉద్యోగరంగంలో కూడా, నీతో అవసరం వున్నంతవరకూ, నీకు ఏ ఇబ్బందీ వుండదు కదా, నీకెంతో గౌరవం కూడా ఇస్తారు ఈ కార్పొరేట్ ఉద్యోగాల్లో. కాకపోతే, నువ్వు వాళ్ళు నీ మీద ఆధారపడే కొన్ని సందర్భాలను, విషయాలను.. ఏ పేరు పెట్టినా సరే.. అలాటి అవసరాలను సృష్టించగలగాలి” చెప్పటం ఆపాడు కృష్ణ.
అర్జున్ ఒక్క క్షణం ఆలోచించి, బుర్ర గోక్కుంటూ నెమ్మదిగా అన్నాడు. “బావా, నువ్వు చెప్పేవి చాల
ఉపయోగపడే విధంగా వుంటాయి కానీ, ఏదన్నా ఉదాహరణలు చెబితే కానీ, పూర్తిగా అర్ధం కావు”.
పెద్దగా నవ్వాడు కృష్ణ. “ఉదాహరణ కావాలా, చెబుతానుండు…” అంటూ ఒక నిమిషం మౌనంగా వున్నాడు. తన ఆలోచన పూర్తవగానే అన్నాడు.

“సరే.. ఇది విను. మేము అమెరికాకి రాకముందు, అంటే 1970లలో నేను తిరువనంతపురం, కేరళలో,
పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మేనేజరుగా పని చేశానని నీకు తెలుసు. అప్పుడే నాకు తర్వాత భారతదేశానికి రాష్ట్రపతి అయిన కలాంగారితో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. ఆరోజుల్లోనే అక్కడ, కొన్ని డిపార్ట్మెంట్లలో వున్న తలకాయల (డివిజన్ డైరెటర్లూ.. వాళ్ళ మేనేజర్లూ) తలకాయలు కొన్ని ఇటు వూగితే కొన్ని అటు వూగేవి. ఒకళ్ళంటే ఇంకొకళ్ళకి పడని ఎన్నో రాజకీయాలు. ఆ పరిస్థితిలోనే తల వంచుకుని తన పనేదో తను చేసుకోవటమే కాకుండా, తనతో పని చేసే వారికి కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి, ఏ ప్రాజెక్టునయినా చకచకా చేయగలనని నిరూపించిన వ్యక్తి ఎపీజె అబ్దుల్ కలాం. ఎక్కడా ఎవరితోనూ, సాంకేతికంగా తప్ప ఇతర విషయాల్లో వాదనలకి దిగేవాడు కాదు. బ్రహ్మచారి అవటం వల్ల, పగలూ రాత్రీ అనే తేడా లేకుండా ఎప్పుడూ పనిచేస్తూనే వుండేవాడు. ఆయన్ని మొట్టమొదటి ఎస్.ఎల్.వీ. (సాటిలైట్ లాంచ్ వెహికిల్) ప్రాజెక్టుకి మేనేజర్ చేశారు. అంటే సాటిలైట్లని అంతరిక్షంలోకి పంపించే రాకెట్ల పూర్తి డిజైను, తయారీ. ఆయనకి ఆ ప్రాజెక్ట్ మీద వున్న పట్టు, పనితనం, అవగాహన, మిగతా డిపార్ట్మెంట్లతో సమయానికి పని పూర్తయేలా మాట్లాడే తీరు, నేను కొన్ని మీటింగుల్లో ఆయనతో వుండటం వల్ల కళ్ళారా చూశాను. ఎవరికి ఎన్ని రాజకీయాలు వున్నా, ఆయనకి ప్రతివారూ మర్యాద ఇచ్చేవాళ్ళే. వాళ్ళకీ తెలుసు, అది సరైన దారిలో ఎంతో స్పీడుగా గమ్యానికి వెడుతున్న రైలుబండి అని. అడ్డమొస్తే దాని క్రింద పడతారే కానీ, అది ఆగదని. అది మా ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ గారికీ తెలుసు. కలాంగారికి ఆయన పూర్తి మద్దతు – అంటే నూటికి నూరుపాళ్ళు వుంది. అందుకని, ఎంతోమంది డైరెక్టర్లే కలాంగారిని ముట్టుకునేవాళ్ళు కాదు. ఇందాక చెప్పానే అప్పారావుగారిలా. ఆయనకేమన్నా జరిగితే కష్టం మరి. ఆ ప్రాజెక్ట్ మీద ఆయనకున్న ఆ గట్టి పట్టు వున్నవాళ్ళు తక్కువ. ఒకవేళ వున్నా, ఆయనలా బుర్ర పెట్టి, ఒళ్ళు వంచి రాత్రింబగళ్ళూ పనిచేసే వాళ్ళు అరుదు. తర్వాత ఆయన ఇస్రోకి ఎంతో గొప్ప సేవ చేశాక, ఇంకో డిఫెన్స్ కంపెనీకి వెళ్ళి, భారతీయ యుధ్ధ పరికరాలకు ఎంతో ఉపయోగపడే ఆకాష్, పృధ్వి మొదలైన రాకెట్ల ప్రాజెక్టులని పూర్తి చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. తరువాత దేశానికే అధ్యక్షుడయాడు. ఎక్కడ వున్నా, ఏ ఉద్యోగం చేసినా, తనదంటూ ఒక పేరు తెచ్చుకుని, అందరి గౌరవాన్ని పొందాడు” అన్నాడు కృష్ణ.
“అవును బావా, నాకు కూడా అయనంటే ఎంతో గౌరవం. సామాన్య కుటుంబంలోనించీ వచ్చినా, కేవలం తన తెలివితేటలతో, ప్రవర్తనతో, చాతుర్యంతో, కష్టపడి ఎదిగిన మనిషి. నువ్వేదో చిన్నదో బుల్లిదో ఉదహరణ ఇస్తావనుకుంటే, నన్నొక కుదుపు కుదిపావు” అన్నాడు అర్జున్ నవ్వుతూ.

కృష్ణ కూడా నవ్వాడు. “నా ఉద్యోగపర్వంలో కూడా, నేనది పూర్తిగా పాటించాను. ఉద్యోగ విజయాల్లో మన అవసరాలు తీరాలంటే, మన మేనేజర్లకీ, తదితరులకీ మన అవసరం వుండాలి. ముద్దొచ్చినప్పుడే చంకెక్కమంటారు కదా. అలా అన్నమాట”
పెద్దగా నవ్వాడు అర్జున్. “ఇప్పటికే నేను మా కంపెనీలో ‘లీన్ మాన్యుఫాక్యరింగ్ స్పెషలిష్టు’ని. ఎవరికి ఏ అనుమానం వున్నా నా దగ్గరకే వస్తుంటారు” అన్నాడు.
“వెరీ గుడ్. దటీస్ ది వే టు గో. కీప్ ఇట్ అప్” అని మెచ్చుకున్నాడు కృష్ణ.

“అలా మనం ఒక ధృవతారలా వెలిగిపోవాలంటే, కష్టపడి పనిచేసినా మరి మనలో సరుకుండాలి కదా” సాలోచనగా అన్నాడు అర్జున్.
కృష్ణ నవ్వి, “అవును మరి వుండాలి కదా” అన్నాడు.
“ఈ మధ్యనే ఒక చాల పెద్ద కంపెనీలో, కొన్ని వందలమందిని ఉద్యోగాల్లోనించీ తీసేశారుట. వఠ్ఠి అబద్ధాల రెస్యూమేతో ఉద్యోగాలు సంపాదించి, హెచ్వన్ వీసాల మీద వచ్చిన మనవాళ్ళే వాళ్ళల్లో చాలమంది.” అన్నాడు అర్జున్.
‘ఆవును. అది ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తుంది కానీ, మిగతా చోట్ల, విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలాటి దేశాల్లో పనిచేయదు. కొన్నాళ్ళు దాచినా వాళ్ళ పనితనం చూశాక వారి బండారం ఇట్టే బయట పడిపోతుంది. మరిలా ఎందుకు చేస్తారో” అన్నాడు కృష్ణ.
“చాల కారణాలున్నాయి. మన రాష్ట్రంలో చదువు అమ్ముడుపోయింది. ప్రతి పల్లెటూళ్ళోనూ కేవలం డబ్బులుండి ఓనమాలు కూడా రాని వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని వందల కాలేజీ వ్యాపారాలకు మన పిల్లల చదువు అమ్ముడుపోయింది. చాల కాలేజీల్లో వీళ్ళకి చదువుచెప్పేవాళ్ళు లేరు. కంప్యూటర్ ప్రోగ్రామింగులో పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఆత్మకూరులోనో బొందలపాడులోనో చేరరు. బెంగుళూరో, అమెరికానో వెడతారు. ఒకవేళ కొంతమంది వున్నా కాలేజీల్లో చెప్పకపోగా, వాళ్ళ చేతే నబయట ప్రైవేట్లు చెప్పించుకోమంటారు. అదొక పెద్ద విషవలయంలే. ఇప్పుడది అనవసరం. బట్టీలు పట్టి పరీక్షలు వ్రాయాలి. పరీక్షల పాసవటం మీద వున్న శ్రధ్ధ, అసలు విషయం నేర్చుకుందామన్న దానిమీద వుండదు. మార్కులు కూడా బట్టి విక్రమార్కులకే ఎక్కువ వస్తాయి. ఇవికాక ఆర్ధికపరంగా కాకుండా కులాల పేరుతో రిజర్వేషన్లు. ఇంకా ఇలాటివి చాల వున్నాయిలే! అందువల్లే పూర్వంలా ఆ సరుకు వున్న వాళ్ళు చాల తక్కువమంది వుంటున్నారు” అన్నాడు అర్జున్.
“అవును. ఏ ఐఐటిల్లోనో, మిగతా ఎన్నో మంచి కాలేజీల్లోనో చదివినవాళ్ళు తప్పితే, మిగతా ‘డబ్బేరా సర్వస్వం’ కాలేజీల్లో చదివిన వాళ్ళని కొంతమందిని చూశాను. విషయ పరిఙానం తక్కువ. అమెరికా కార్పొరేట్ రంగంలో వీళ్ళకి అవి నేర్పే సమయం తక్కువ. ట్రైనింగ్ ఇవ్వటం కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా చిన్న కంపెనీల్లో వెంటనే ప్రాజెక్టుల్లోకి దూకేయమంటారు. కొన్నాళ్ళు ఎక్కడయినా పనిచేసి, కావలసిన విషయం నేర్చుకుని వచ్చినవాళ్ళకి ఫరవాలేదు. కానీ ఇండియాలో ఇలాటి బట్టీ చదువులు చదివి, సరుకు లేకుండా వచ్చిన వారికి, త్వరగా టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించకపోతే మాత్రం చాల కష్టం. కొండొకచో ఉద్యోగం వూడటం కూడా జరుగుతుంది. తర్వాత హెచ్ వన్ వీసా రాక వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. అయినా ఇప్పుడు ఇక్కడ మనకి ఆ విషయాలు అనవసరం అనుకో” ఆగాడు కృష్ణ.

“అవును. మొన్ననే మా ఆఫీసులో కెవిన్ అనే అతనికి ప్రమోషన్ ఇచ్చారు. అతను అంత తెలివైన వాడూ కాదు, పెద్ద పనిమంతుడూ కాదు. అతనికి అలా ప్రమోషన్ ఇవ్వటం చూసి మా అందరికీ ఆశ్చర్యం వేసింది. కాకపోతే అతనెప్పుడూ మా మేనేజర్ పక్కనో, వెనకాలో వుంటాడనుకో” అన్నాడు అర్జున్.
“అయితే ఇప్పుడు నీకో పురాణ కథ చెప్పాలి. వింటావా?” అడిగాడు కృష్ణ.
“ఉద్యోగ విజయాల్లో పురాణ కథలెందుకు బావా” అన్నాడు అర్జున్. మరి అతని కడుపులో ఆకలి దంచేస్తున్నది.
“లేదు, నీకు చెప్పబోయేది నీకెంతో అవసరమైన కథే. దేవుళ్ళ పేరుతో చెబితే వెంటనే వంటబడుతుంది కదూ. సరిగ్గా వినకపోతే, కళ్ళు మూసుకుని చెంపలేసుకో మనవచ్చు. అందుకని. నువ్వు గణాధిపత్యం కథ విన్నావా?” అడిగాడు కృష్ణ.
“లేదు. చెప్పు” అన్నాడు అర్జున్.
“కొంచెం సరదాగా నా మాటల్లో చెబుతాను. అంతేకానీ మన దేవుళ్ళని తక్కువ చేసి చెప్పటం కాదు. సరేనా?” అడిగాడు కృష్ణ.
“చెప్పు బావా” అన్నాడు అర్జున్.

“పూర్వం, అంటే నువ్వూ, నేనూ, రుక్మిణి, మీ నాన్న.. అదేలే పాండురంగం మామయ్య పుట్టకముందు, ఎన్నో యుగాలకి ముందు, మహాశివుడు లోక గణాధిపత్యం వినాయకుడికి ఇవ్వాలా, కుమారస్వామికి ఇవ్వాలా అన్న మీమాంసలో పడ్డాడుట. భార్యామణి పార్వతినీ, ఋషులనీ, ముని పుంగవులనీ అడిగితే, వారిద్దరిలో ఎవరికి ఇష్టమైన వారిని వాళ్ళు ప్రతిపాదించారుట. కానీ అందరూ ఒక నిర్ణయానికి రాలేకపోయారుట. సరిగ్గా అది మన ఆఫీసుల్లో ఒక డైరెక్టర్, మిగతా డైరెక్టర్లని సలహా అడిగినట్టే. అది శివుడిగారికి నచ్చలేదు. అప్పుడు ఏం చేద్దామా అని మూడు కళ్ళూ మూసుకుని ఆలోచిస్తుంటే, నారద మహాముని ‘నారాయణ, నారాయణ’ అంటూ వచ్చాడు. వచ్చి ‘ఈశ్వరా, పరమేశ్వరా. మీరేదో దీర్ఘమైన ఆలోచనలో వున్నట్టు తోస్తున్నది. నేనేమైనా సహాయం చేయగలనా?’ అని అడిగాడుట. మహేశ్వరుడు తన సమస్యని వివరించి, నారదులవారిని ఎలా పరిష్కరించమంటారని అడిగాడు. అప్పుడు నారదుడు ‘ఇది గణాధిపత్యం కనుక, వారిద్దరూ సమస్త లోకాలూ చుట్టి, ఎవరు ముందుగా కైలాసానికి వస్తారో వాళ్ళకే గణాధిపత్యం ఇస్తే పోలా’ అన్నాడు. ఈశ్వరుడికి ఆ సలహా నచ్చింది. విఘ్నేశ్వరుడినీ, కుమారస్వామినీ పిలిచి. ఆయన ఉద్దేశ్యం వివరించి చెప్పాడు. ఈ క్షణమే మీ పందెం మొదలు అన్నాడు. ఇద్దరూ అంగీకారం తెలుపుతూ తలలు వూపి, తండ్రికి నమస్కరించి బయల్దేరారు. కుమార స్వామి సర్వలోకాలూ హోల్ మొత్తం తిరుగుతూ, ప్రతి నదిలోనూ శ్రధ్ధగా స్నానం చేస్తూ, ప్రతి పుణ్యక్షేత్రం భక్తితో దర్శిస్తూ, చాల సిన్సియరుగా, పుల్ జాబ్ సాటిస్ఫాక్షనుతో పని ముగించుకు వచ్చాడుట. కానీ వినాయకుడు మాత్రం ఆ గది దాటి బయటికి వెళ్ళకుండా, శివుడి చుట్టూ తిరుగుతూ భజన చేస్తున్నాడుట. అప్పుడు మహేశ్వరుడు గణాధిపత్యం ఎవరికి ఇచ్చాడో తెలుసా? సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ కుమారస్వామికి కాదు. తన చుట్టూ తిరిగి శాయశక్తులా భజన చేసిన వినాయకుడికి” చెప్పటం ఆపాడు కృష్ణ.
“అదేమిటి” ఆశ్చర్యంతో అడిగాడు అర్జున్. ఆ కథకి అలాటి ముగింపు అతనికి నచ్చినట్టులేదు.
పెద్దగా నవ్వాడు కృష్ణ. “అదేమిటంటే.. ఈశ్వరుడు అంటే ఎవరు. లోకేశ్వరుడు. లోకానికంతటికీ సర్వేశ్వరుడు. లోకమంతటికీ దేవుడు. ఆయనకి ప్రదక్షిణలు చేస్తే, లోకమంతటినీ ప్రదక్షణం చేసినట్టే. దర్శనం చేసినట్టే. అదే వినాయకుడు చేసి చూపించి, గణాధిపత్యం స్వీకరించి గణపతి అయాడు” ఏదో అనబోయిన అర్జున్ ఏమీ అనకుండా, అలా నోరు తెరిచి చూస్తున్నాడు.
“మీ కెవిన్ చేసింది కూడా అక్షరాలా అదే. పోయినసారి కలిసినప్పుడు చెప్పాను కదా, భజనల విశిష్టత. ఎవరైనా నిన్ను మెచ్చుకుని, మాట్లాడుతుంటే నీకు సంతోషంగా వుంటుంది. నాకూ అంతే. అది మానవ సహజం. ముందు చూపుతో పాటు, ఇటూ అటూ, చుట్టుపక్కల కూడా చూస్తూ నడిస్తే రోడ్డు మీదే కాదు, ఉద్యోగరంగంలో, అసలు నీ జీవితంలో కూడా ఎంతో మంచిది. ప్రమాదాలు జరగవు. దానితో పాటు నీకు, ఇందాక మనం అనుకున్న ‘సరుకు’ కూడా వుంటే ఇహ నీకు అడ్డే వుండదు” అన్నాడు కృష్ణ, ఆరోజుకి ఉద్యోగపర్వంలో తన ఉవాచను ముగిస్తూ.

౦౦౦౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked