శీర్షికలు

ఆకాశవాణి

జానపదాల నుండి జ్ఞానపీఠం దాకా
డా.సి. నారాయణ రెడ్డి ప్రస్థానం

డా. జె. చెన్నయ్య
9440049323

విద్యార్థి దశలో అలవోకగా సీసపద్యాలనే అల్లిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు 70 సంవత్సరాల పాటు మహా ప్రవాహంలా నిరంతరం సాగిన కవితాయాత్రను ఆపి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మహాకవి డా.సి.నారాయణ రెడ్డి. సినారె అన్న మూడు అక్షరాలు తెలుగు సాహితీ క్షేత్రంలో భిన్న పక్రియల్లో పేరెన్నిక గన్న రచనల ఆవిర్భావానికి అక్షయపాత్రలై నిలిచాయి. కోట్లాది మంది అభిమానులను ఆయనకు సంపాదించిపెట్టాయి. జానపదవాఙ్మయ ప్రభావంతో సాహితీ సృజనకు శ్రీకారం చుట్టింది మొదలు అత్యున్నతమైన జ్ఞానపీఠ గౌరవాన్ని పొందడమే గాక మరెన్నో కావ్యాలను సృష్టించిన దశ వరకు సాగిన సినారె జీవనయాత్రను, కవితా యాత్రను గురించి సంగ్రహంగా తెలుసుకుందాం.
అక్షరాస్యతే కాదు విద్యాగంధం సైతం అంతంతమాత్రంగా వున్న తెలంగాణ జనపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల ఒడిలో పెరిగి ఇంతింతై విరాణ్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించిన వారు డా.సి.నారాయణ రెడ్డి. ఆయన జీవనగాధ స్ఫూర్తిదాయకమైంది. ఆయన నడిచి వచ్చిన దారి కవితా కర్పూర కళికలమయమైంది.
1931 జులై 29 న కరీంనగర్‍ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజిపేటలో నారాయణ రెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ, సింగిరెడ్డి మల్లారెడ్డి. తన కంటే ముందు ఒక కొడుకు చనిపోతే ఊళ్ళో ఒక ఇంట్లో సత్యనారాయణవ్రతం జరుగుతున్నప్పుడు బుచ్చమ్మ మొక్కుకున్నది, నాకు కొడుకు పుట్టి క్షేమంగా ఉంటే నీ పేరు పెట్టుకొంటానని. అలా జన్మించిన కొడుకుకు సత్యనారాయణ రెడ్డి అని పెట్టుకుంది. పేరులోని సత్యం కవిత్వంలోకి, జీవితంలోకి ప్రవహించింది. నారాయణ రెడ్డి లోక ప్రసిద్ధుడైనాడు.
ఖాన్గీ బడిలో అక్షరాలు దిద్దుకొని, సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్‍ లో ఉన్నత పాఠశాల విద్య, అనంతరం హైదరాబాద్‍ చాదర్‍ఘాట్‍ కళాశాలలో ఇంటర్‍, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎ, ఎం.ఎ పూర్తి చేశారు నారాయణ రెడ్డి. పాఠశాలలో చదువుతున్నప్పుడే నిజాము వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. సత్యాగ్రహం చేశారు. ‘సైనికులం మేం సైనికులం’ అని పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. ‘క్విట్‍స్కూల్‍’ ఉద్యమంలో పాఠశాల కొంతకాలం మానేశారు.
సాహిత్య వాతావరణం లేని కుటుంబ నేపథ్యంలో జన్మించినా, ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసినా తెలుగుమూర్తిగా వికసించిన సినారె ఒక అసాధారణ ప్రతిభాశాలి. చిన్ననాడు పల్లెప్రజల నిసర్గసుందరమైన సంభాషణారీతి, జానపద కళారూపాలు నారాయణ రెడ్డి భాషా సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని మలచాయి. హరికథలను మైమరచి వినేవారు. ఆ సమాహార కళలోని పాటలు, పద్యాలు, చతుర కథారీతి, కథన చాలనం ఆకట్టుకోవటమే కాదు పాటలు, నాటకాలు ఆశువుగా అల్లే అభిరుచిని నూరిపోశాయి. 6,7 తరగతుల్లో వున్నప్పుడే భక్తప్రహ్లాద, సీతాపహరణం, రఘుదేవరాజీయం వంటి నాటికలు రాసి మిత్రులతో కలిసి ప్రదర్శించారు. ‘ఒకనాడు ఒకనక్క ఒక అడవిలోపల’ అంటూ సీసపద్యం రాస్తే ఉపాధ్యాయుడు దూపాటి వెంకటరమణాచార్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొన్ని మెలుకువలు చెప్పారు. ఇంటర్మీడియట్‍లో ఉండగా జువ్వాడి గౌతమరావు ‘జనశక్తి’ పత్రికలో తొలి కవిత ప్రచురితమైంది. బిఎ లో ఉండగా పాములపర్తి సదాశివ రావు సంపాదకత్వంలో వెలువడే కాకతీయ పత్రికలో రచనలు ప్రచురితమయ్యాయి. ఇది 1950 కి ముందే జరిగింది.
21 ఏళ్ళ వయసులో నారాయణ రెడ్డి కి రేడియోతో అనుబంధం ఏర్పడింది. 1952 లో బి ఎ విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాలయములో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు హైదరాబాద్‍లో ఖైరతాబాద్‍ లో వున్న దక్కన్‍ రేడియోలో ప్రసారమైన ‘సాగుమా ఓ నీలమేఘమా గగనవీణా మృదుల రావమా’ అన్న గీతం నారాయణ రెడ్డి పరిణత కవి గా ఎదిగే దశలో తొలిమెట్టుగా నిలిచింది. ‘పూల పాటలు’, ‘చిరుగజ్జెలు’ ఉపద్రష్ట కృష్ణమూర్తి సంగీత దర్శకత్వంలో రూపొందించిన ‘అజంతాసుందరి’, ఆ తర్వాత ‘రామప్ప’ సంగీత రూపకాలు ఆకాశవాణి జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చిపెట్టింది. 12 భాషల్లోకి అనువాదమైంది.
ఇంటర్‍ రెండో సంవత్సరంలో ఉండగా రెడ్డిహాస్టల్‍లో జరిగిన అఖిలాంధ్ర కవిసమ్మేళనంలో విద్యార్థి కవిగా వానమామలై, దాశరథి, తల్లావరూఝ్జల, కృష్ణశాస్త్రి, జాషువా తదితర అగశ్రేణి కవుల సరసన పాల్గొన్నారు సినారె. దాశరథితో పరిచయం అదే తొలిసారి. అది మొదలు దాశరథి ప్రోత్సాహం తనను మునుముందుకు నడిపించిందని చెప్పుకున్నారు సినారె. ఆ సోదర ప్రేమకు గుర్తుగా ‘జలపాతం’ కవితా సంపుటిని దాశరథి కి అంకితం చేశారు.
1952 లో బి ఎ ఫైనల్‍ విద్యార్తిగా వున్నప్పుడే తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శి గా వున్నారు. సంఘానికి తర్వాత అధ్యక్షుడయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అంతటా పర్యటించి కవితా పఠనాలు, కవితాత్మక ప్రసంగాలు చేసి ఆనాడే ఈ ప్రాంతంలో కవితా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు సినారె.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నారాయణరెడ్డి కవితామూర్తిని అంచెలంచెలుగా సమున్నతస్థాయికి తీసుకువెళ్ళింది. 1954 లో బిఎ, ఎం.ఎ పూర్తి చేసి సికింద్రాబాద్‍ ఆర్టస్ అండ్‍ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ప్రవేశించారు. తర్వాత నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఆర్టస్ కళాశాలలో ఆచార్యత్వం. తనకు సాహితీ విద్యనేర్పిన గురువులు కె.గోపాలకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి ఆచార్యులుగా పని చేసిన అరుదైన ఖ్యాతి సినారె కు ఆనాడే దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ తరగతులకు కూడా తెలుగు పాఠాలు చెప్పారు. ఆ రోజుల్లో డిగ్రీలో ఇతర అధ్యయనాంశాలు చదువుతున్న విద్యార్థులు సైతం సినారె పాఠాలు వినేందుకు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో ఏ పాఠం చెప్పినా అది విద్యార్థుల పాలిటి కళా ప్రదర్శనగా ఉండేది. పాఠం చెప్పడానికి అన్ని విధాలా సిద్ధమైపోవడం, సమయానికి తరగతి గదిలో ప్రవేశించడం, అనర్గళంగా గంటన్నర సేపు పాఠం చెప్పడం, తనకిచ్చిన వ్యవధి పూర్తవుతుండగానే గది నుంచి నిష్క్రమించడం అదంతా ఒక మరువలేని అనుభవం. ఆయన పాఠాలు విన్న మధురానుభవాన్ని ఈ నాటికీ గుర్తు చేసుకునే విద్యార్థులెందరో ! ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు’ అన్న అంశం పై పిహెచ్‍డి చేశారు. పరిశోధనాంశాన్ని సూచించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.
1961 లో సినీ గీతరచన ప్రారంభమైంది. హైదరాబాద్‍ సారథి స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలో వున్న నందమూరి తారక రామారావు సినారె తో ప్రస్తావన చేశారు. అప్పటికే తాను రాసిన పాటల్ని ఎన్టీఆర్‍ కు వినిపించారు సి.నా.రె. తొలి చిత్రంలో అన్ని పాటలు తనవే ఉండాలన్న కోరికను వ్యక్తపరిచారు. గులేబకావళి కథ సినిమాకు అప్పటికే ఒకరి చేత ఒక పాట రాయించి వున్నారు ఎన్టీఆర్‍. అయినా సినారె అభిమతాన్ని అనుసరించి ఆ కవికి నచ్చజెప్పి అన్ని పాటలు రాయించారు. పాటలు రాసేందుకు మద్రాసు రైల్లో వెళ్లిన సినారె ను ఎన్టీఆర్‍ స్వయంగా స్టేషన్‍లో స్వాగతించారు. ఆనాడే పెద్ద వాహనశ్రేణి అంటే కాన్వాయ్‍ తో సినారె కు ఘనంగా గౌరవించారు. తొలుత రాసిన పాట ‘కలల అలలపై తేలెను’ కాని తొలుత రికార్డయ్యింది ‘నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని’. ఎన్టీఆర్‍ జమున లపై ఆ పాట చిత్రీకరించిన నాటినుంచి ఎన్టీఆర్‍ తో గీతానుబంధం, గాఢమైన స్నేహనుబంధం ఎన్టీఆర్‍ చివరి దశ వరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగింది. 1961 నుంచి 1990 వరకు డా.సి.నారాయణ రెడ్డి సినీగీత రచన ఒక స్వర్ణయుగం. ప్రాచీనాధునిక కవిత్వాధ్యయనానుభవం వల్ల సినారె ప్రతి పాటలో తన కవిత్వ ముద్రను నిలిపారు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నో. మొత్తం సుమారు 3 వేల పాటలు రాశారు.
నిజానికి సినీగీత రచన సినారె బహుముఖ ప్రజ్ఞల్లో ఒక పార్శ్వం మాత్రమే తాను ఎదుగుతున్న నాటికే తెలుగు కవితా రంగంలో ఎందరో గొప్పకవులున్నారు. అప్పటికే అగ్ర కవులతో పోటీ పడుతూ పద్యకృతులు, గేయ కృతులు వెలువరిస్తున్నా ఏదో మథనం జరిగింది ఆయనలో. ఏదో ప్రత్యేకత సాధించాలి అనుకున్నారు. అంతే ప్రౌఢతరమైన పద్యకృతికి తుల్యంగా కథాత్మక గేయ కావ్యం ‘నాగార్జున సాగరం’ రాశారు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటి విద్వన్మణుల ప్రశంసలు లభించాయి.తర్వాత ‘కర్పూర వసంతరాయలు’ రాశారు. దేశ విదేశాల్లో కావ్యగానం చేశారు. నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేకంగా హైదరాబాద్‍ షామంజిల్‍ లో ‘నాగార్జున సాగరం’ కావ్యగానం ఏర్పాటు చేసి సత్కరించారు. మద్రాసులో అక్కినేని అధ్యక్షతన జరిగిన ‘కర్పూర వసంతరాయలు’ కావ్యగానం అద్భుత స్పందన కలిగించింది.
గేయ కావ్యాలతోనే మహాకవి అనిపించుకున్న సినారె అంతటితో ఆగలేదు. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యం సాగుతున్న కాలంతో పోటీ పడాలని నిర్ణయించుకున్నారు. సృజన పౌరుషంతో వచన కవిత రచనను ఉద్దృతం చేశారు. ‘మంటలూ మానవుడూ’, తేజస్సు నా తపస్సు’, అక్షరాల గవాక్షాలు’, ‘మధ్య తరగతి మందహాసం’, ‘విశ్వంభర…. ఇలా కవితాయాత్ర కొనసాగింది…. ‘విశ్వంభర’ కు భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వచన కవిత్వంలోనూ మహాకావ్య లక్షణాలు పొదువుకున్న ‘విశ్వంభర’ దీర్ఘ కవిత. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం దాకా సాగిన మానవ విజయ మహేతిహాసమే విశ్వంభర.
పద్యం, గేయం, వచనకావ్యాలు, నాటికలు, గజళ్ళు, ముక్తకాలు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, బుర్రకథ, యాత్రా సాహిత్యం ఇలా అనేక పక్రియల్లో 20 వ శతాబ్దం నుంచి 21 వ శతాబ్దం ప్రథమార్ధం దాకా విస్తరించి కాలంతో పాటే సాగుతూ వర్తమాన తరపు కవులతోనూ పోటీ పడుతూ సాహితీ సృజన చేస్తూ వచ్చారు సినారె. 86 ఏళ్ళ వయసు. 86 రచనల సొగసు ఆయనది.
కవితా రచన ఒకవైపు, విశ్వవిద్యాలయ ఆచార్యతవం ఒకవైపు, సినీగీత రచన ఇంకోవైపు సాహితీ సాంస్కృతిక సదస్సుల్లో అద్భుత ప్రసంగ పరంపర మరోవైపు అన్నట్లుగా సాగుతున్న దశలో – 50 వ పుట్టినరోజు అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య సినారె ను అధికార భాషా సంఘానికి అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్యత్వాన్ని అయిష్టంగానే వదలవలసి వచ్చింది. పరిపాలనా పదవుల్లో సినారె దక్షతముద్ర ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్‍ ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధప్రదేశ్‍ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షునిగా సినారె ను నియమించారు. పదవీకాలం పూర్తి కాగానే తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా నియమించారు. తర్వాత సాంస్కృతిక మండలి అధ్యక్షులయ్యారు. భాషా సాంస్కృతిక సలహాదారులయ్యారు. కవులు, కళాకారుల తరపున రాష్ట్రపతి చేత రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. కవితా రచన కొనసాగిస్తూనే విద్యా, సాంస్కృతిక సంస్థల పరిపాలనా పదవులనూ వెలిగించారు సినారె.
ఏడు దశాబ్దాల కవితా సృజనానుభవాన్ని పండించుకున్న మహాకవి డా.సి.నారాయణ రెడ్డి తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం. ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. మేరట్‍ విశ్వవిద్యాలయం, నాగార్జున, కాకతీయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. సోవియెట్‍ ల్యాండ్‍ నెహ్రూ అవార్డు, రాజ్యలక్ష్మీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం.. వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు, లెక్కలేనన్ని సత్కారాలు సినారెను వరించాయి.
కడదాకా కవిత్వం రాస్తూనే వచ్చారు. ఔత్సాహిక, ప్రముఖ కవుల రచనలకు ఆశీస్సులందిస్తూనే వచ్చారు. తమకు ఎవరైనా లేఖరాస్తే దానికి ప్రత్యుత్తరం రాయకపోవడం ఏనాడూ లేదు. విద్యారంగంలో, పాలనా రంగంలో, జనవ్యవహారంలో తెలుగు పరిఢవిల్లాలని వేదికల పైన గట్టిగా చెబుతూనే వచ్చారు. మునుపటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు కు అధ్యక్షులుగా వుంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాస కృషిని అవిరళంగా అనవరతంగా కొనసాగిస్తూనే వచ్చారు.
ఒక కవితలో ఆయన అన్న పంక్తులు.
‘‘అది తెలుగుకీర్తి… కదిలే కిరణమూర్తి … సాగరాల్‍ దాటిపోయింది రా…
నయాగరాల్‍ మీటి వచ్చిందిరా…’’
ఈ మాటలు తెలుగు కవిత్వ కీర్తికి, తెలుగు వ్యక్తి కీర్తికి… డా.సి.నా.నె సాహితీమూర్తికి, ఆయన వ్యక్తిత్వకీర్తికి వర్తిస్తాయి.
ఇంతటి మహోన్నత కవితామూర్తి తెలంగాణ లో జన్మించడం గర్వకారణం.
మహాకవి సినారె కు మరణం లేదు. ఆయన కావ్యాలు అజరామరంగా నిలిచి ఉంటాయి. సినిమా పాట వినిపించినంత కాలం అద్భుతమైన ఆయన గీతాలు శ్రోతలను అలరిస్తూనే వుంటాయి. తెలుగు సాంస్కృతిక వేదికల పై రచనలు ఆవిష్క్రతమవుతున్నంత కాలం ఆయన స్మృతి చెరగని విధంగా ఉంటుంది. తరాలకు తరగని కీర్తి సినారెది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked