సారస్వతం

ఎవరీ రాధ?

-శారదా ప్రసాద్

రాధ,రాధిక,రాధారాణి,రాధికారాణి అని పిలువబడే ఈమె శ్రీకృష్ణుని బాల్య స్నేహితురాలు. ఈమె ప్రస్తావన భాగవతం లోనూ, జయదేవుని ‘గీత గోవిందం’లోనూ ఎక్కువగా కనపడుతుంది. రాధ ఒక శక్తి స్వరూపిణి.అందుకే శ్రీ కృష్ణ భక్తులు రాధాకృష్ణులను విడదీసి చూడలేరు. భాగవతంలో ఈమె ఒక గోపికగా చెప్పబడింది.శ్రీ కృష్ణుడు బృందావనాన్ని వదలి వెళ్ళే సమయానికి రాధ వయసు కృషుని వయసుకన్నా పదేళ్ళు తక్కువ.అయితే రాధ శ్రీకృష్ణుని కన్నాపెద్దదని చెప్పటానికి ఒక వింత కథ ప్రచారంలో ​ఉంది. ఆ కథను కూడా పరిశీలిద్దాం. రాధ ఒక ​గుడ్డి పిల్లగా జన్మించినదని ప్రచారంలో ​ఉంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని కొన్ని కారణాల వల్ల తన కన్నా ముందుగా జన్మించమని కోరాడు.  లక్ష్మీదేవి, శ్రీహరి కన్నా ముందుగా జన్మించటానికి సున్నితంగా తిరస్కరించింది. శ్రీహరి పలుమార్లు విన్నవించుకోగా, ఒక షరతుపై, ఆమె అందుకు అంగీకరించింది. శ్రీ కృష్ణుణ్ణి చూసే వరకూ, కనులు తెరవనని చెప్పింది. అదీ ఆ షరతు. శ్రీహరి అందుకు అంగీకరించాడు. ఒక పాప పెద్ద కమలంలో, యమునా నదిలో తేలుతుంది. ఒక రోజున విషభానుడు అనే యాదవుడు కమలంలో ​ఉన్న పాపను చూసి, సంతోషపడి, ఆ చిన్ని పాపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. భార్యాభర్తలు ఆ చిన్నారికి ‘రాధ’ అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ చిన్నారి కన్నులు తెరచి చూడకపోవటం, తల్లితండ్రులు గమనించారు. తల్లి తండ్రులు, ఆ పాపకు దృష్టి రావాలని మొక్కని దేవుడు లేడు. అలా రోజులు గడుస్తున్నాయి. రాధకు అయిదు సంవత్సరముల వయసు వచ్చింది. ఆ సమయంలో శ్రీ నారద మహర్షి ఒకరోజు వారి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ నారద మహర్షిని ప్రార్ధించి, పరిష్కార మార్గాన్ని సూచించమని వేడుకున్నారు. కారణం తెలిసిన నారద మహర్షి, ఆ దంపతులకు—-యశోదా, నందులను, బలరామ, కృష్ణులను, పాపను చూడటానికి, వారి ఇంటికి ఆహ్వానించమని చెప్పాడు.

భార్యాభర్తలు అలానే చేశారు. అతిథులు వచ్చారు. శ్రీ కృష్ణుడు సమీపించగానే, రాధ వెంటనే కళ్ళు తెరచి చూసింది. అలా,భూమి మీదకు వచ్చిన తరువాత రాధ చూసిన మొదటి వ్యక్తి ‘పరమాత్ముడు’ అయిన శ్రీకృష్ణుడు. వైష్ణవ సాంప్రదాయంలో రాధను ఒక శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. శ్రీ చైతన్యుడు తనను రాధగా ఊహించుకుంటాడు. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు, వేదమయుడైన నారాయుణిడి మొదటి వ్యక్త రూపము.తేజోమయులగు వాని నాలుగు ముఖములకు నేపధ్యములు- సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న,అనిరిద్ధులు.ఆ ముఖములందలి తేజస్సులే సనక,సనందన,సనత్కుమార, సనత్సుజాతులు.వీరు బ్రహ్మ గారి తర్వాత, పరమపురుషుని సద్గుణములతో వచ్చిన అవతార మూర్తులు. పైన చెప్పిన వారందరి పేర్లు ఎక్కడో , ఎప్పుడో ఒకసారి వినే ​ఉంటారు, ఒక్క సనత్సుజాతుని పేరు తప్ప. సనత్సుజాతుల వారు ‘శతగోప’ అనే పేరుతొ గోకులంలో సంచరించారు.రాధాదేవిని పెంచిన తండ్రి వీరు. వీరు మానవదేహ రూపమున ‘శతగోప’ నామదేయమున సంచరించుచూ,దివ్యశరీరముచే సనత్సుజాతునిగా హిమాలయ ప్రాంతాలలో తపోదీక్షలో కూడా ​ఉండేవారు. విదురుడు వీరివద్ద బ్రహ్మజ్ఞానం పొందాడు. ఈ గాధ ఎక్కువ ప్రచారంలో ఉంది. ‘ప్రేమ’ అనే స్థితి ఇప్పటి వరకు శ్రీమతి రాధాదేవికి,  చైతన్య మహా ప్రభుకు, శ్రీ రామకృష్ణునకు మాత్రమే అందిన పరమోత్కృష్ట దివ్య స్థితి. ఈ స్థితిని సామాన్య జీవులు ఏనాటికీ అందుకొనలేరు. బృందావనం​ ​దివ్య చైతన్యముతో నిండిన పరమోత్కృష్ట ప్రేమమయ లోకం. మానవ ఊహకు అందని అత్యంత పవిత్ర ప్రేమమయ దివ్యభూమి​ బృందావనం. రాధ, కృష్ణుని ప్రేయసి అని, ఇష్ట సఖి అని రకరకాలుగా కథలు​ ​చెబుతుంటారు​. ​​ ​కొంతమందైతే, రాధ కృష్ణుని కన్నా పెద్దది, వరసకు మేనత్త అవుతుంది​ అని కూడా చెబుతుంటారు.అందరూ శ్రీకృష్ణుని ప్రేయసులే, ప్రియ సఖులే!శ్రీ కృష్ణుడు మాత్రం ఈమెను ఒక పరాశక్తిగా భావిస్తాడు. రాధ, శ్రీ కృష్ణుని ప్రాణాధిస్టానదేవత, అందుచేతనే పరమాత్ముడగు శ్రీకృష్ణుడు ఆమెకు మాత్రమే అధీనుడైనాడు.ఆమె అంశ ఎల్లవేళలయందూ శ్రీ కృష్ణుని వద్దనే ​ఉంటుంది. ఆమె లేకున్నచో శ్రీకృష్ణుడు నిలువజాలడు. యమునా నది ఒడ్డున ​ఉన్న ఒక ధ్యాన మందిరంలో శ్రీ కృష్ణుడు’రాధ’ అను రెండు అక్షరములను ధ్యానించే వాడు. ఇది గౌడీయుల నమ్మకం ‘బ్రహ్మ వైవర్తం’ లోకూడా ​ఉన్నదని కొందరి పండితుల అభిప్రాయం. రాధయొక్క అంశ నుండే త్రిగుణాత్మికమైన దుర్గాది దేవతులు వచ్చారని కూడా బ్రహ్మ వైవర్తంలో ​ఉన్నదని చెబుతారు. ఈ రాధ వృత్తాంతం, తర్వాత మనకు​ ​’జయదేవుని అష్టపదులలో’ లభిస్తుంది. ముందుగా జయదేవుని గురించి క్లుప్తంగా చెబుతాను. జయదేవ ఒక సంస్కృత కవి మరియు రచయిత. క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కళ దేశంలొ, పూరీ జగన్నాధం దగ్గ​ర ఉన్న కిందుబిల్వ గ్రామం నందు జన్మించారు. తండ్రి భోజదేవుడు,తల్లి రాధాదేవి.చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోయారు. ఇతని భార్య పద్మావతి. జయదేవ కవి, లక్షణశేన మహారాజ ఆస్థానంలో కవిగా గొప్ప కీర్తి పొందారు. ఒక రోజు రాత్రి మహరాణి, పద్మావతికి నిజంగా జయదేవ కవిపై ప్రేమ ఎంతవుందో తెలుసుకోగోరి, ఒక అబద్దం ఆడింది. “పద్మావతి! జయదేవ కవి, రాజు వెంట వేటకి వెళ్ళి అక్కడ అరణ్యంలో క్రూరమృగం దాడిలో మరణించాడు.” ఇది విన్న పద్మావతి వెంటనే నేలకూలి మరణించింది.దుఖసాగరంలో మునిగిన జయదేవ కవి, రాజాస్థానం వదిలి కేందులు అనే గ్రామం చేరారు. ప్రస్తుతం జయదేవ కవి సమాధి అక్కడే ఉంది.జయదేవ కవి రచించిన ‘గీతగోవిందం’ మిక్కిలి ప్రశస్తి గాంచినది. ఈ కావ్యాన్ని అష్టపదులు అని కూడా అంటారు. గీతగోవిందంలో మొత్తం ఇరువది నాలుగు అష్టపదులు కలవు. ఇక జయదేవుని అష్టపదులలోకి వద్దాం. అష్ట పదులు వ్రాసే ముందు శ్రీ జయదేవ కవి మంగళ వాచకంగా ​ఇలా వ్రాశారు–

మేఘై ర్మేదుర మంబరం
వనభువ శ్యామాస్తమాల ద్రుమై:,
నక్తంభీరు రయం త్వమేవ తదిమం రాదే:

ఆకాశమంతా కారు మేఘాలతో కమ్ముకుంది.చీకటి కానుగ చెట్లతో యమునా తీరం అంతటా చీకటి అలముకుంది. “చీకటి అంటే కృష్ణుడు భయ పడతాడు, నీవే కృష్ణుని ఇంటికి చేర్చ”మని నందుడు రాధను కోరుతాడు.అలానే,రాధ కృష్ణుని ఇంటికి చేర్చుతుంది. అదీ రాధ స్థాయి.ఆ స్థాయిని మించే పాదం మరొకటి.( 19 వ అష్టపదిలోనిది)

“ప్రియేచారుశీలే–స్మర గరళ ఖండనం మమ
శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం”

తన తలపై రాధ చిగురుటాకుల వంటి మెత్తనైన పాదాలను ​ఉంచమని కృష్ణుడు ప్రాధేయ పడినట్లు శ్రీ జయదేవుడు వ్రాసి, ఇదేమిటి ఇలా వ్రాశాను,అని బాధపడుతూ వ్రాసినదాన్ని తీసి వేశాడు​. ​​ ​పాపపరిహారం కోసం జయదేవుడు అభ్యంగన స్నానం చేసి వచ్చేటప్పటికి,తాను ఇంతకు ముందు వ్రాసిన పదాలే తిరిగి వ్రాసి ​ఉండటం,జయదేవుని రూపంలో శ్రీ కృష్ణుడు వచ్చి ఆ పదాలే వ్రాసి భోజనం కూడా చేసి వెళ్ళటం,భార్య ద్వారా తెలుసుకొని, ఆనంద భరితుడై ,శ్రీకృష్ణుడే స్వయంగా వ్రాసిన పాదాలు కనుక వాటిని అలాగే ​ఉంచాడు. శ్రీకృష్ణుడు వశం అయ్యేది భక్తికే! ఈ విషయం శ్రీ నారద మహర్షి తన భక్తి సూత్రాలలో చాలా విపులంగా చెప్పాడు.గోపికలకు కృష్ణుడు ‘చిక్కింది’ ఈ భక్తి వలలోనే!భక్తుల పాద ధూళి కూడా శిరసున ​ఉంచుకొని ఆనందించే ప్రేమ స్వరూపుడు శ్రీ కృష్ణుడు.ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెబుతాను.ఒక సారి శ్రీ కృష్ణుడు తీవ్రమైన శిరోభారంతో బాధ పడుతున్నాడు. ఆ సమయానికే నారద మహర్షి వచ్చాడు.మహానుభావులు సమయానికే వస్తారు.శ్రీ కృష్ణుని శిరోభారం గురించి తెలుసుకొని,వైద్యులను పిలిపించుకొని శిరోభారం తగ్గించుకోవచ్చు కదా,అని శ్రీ కృష్ణుని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో,​ఇలా అంటాడు—ఈ శిరోభారం వైద్యం వల్ల తగ్గదు. భక్తుల పాదధూళి తలకు రాస్తే కానీ తగ్గదు,అని చెప్పాడు.నారదుడు వెంటనే రుక్మిణీ మందిరానికి వెళ్లి ,విషయం చెప్పి కొద్దిగా పాదధూళి ఇవ్వమని అడుగుతాడు.అందుకు రుక్మిణి,”వారి పాద ధూళి, శిరమున దాల్చవలసిన మేము, మా పాదధూళిని ఆయనకు ఇవ్వటం కన్నా పెద్ద అపరాధం ఏమైనా ఉంటుందా?” అని నారదుని కోరికను తిరస్కరిస్తుంది.సత్యభామ దగ్గరికి వెళ్లి,విషయం చెబుతాడు మహర్షి.అందుకు సత్యభామ,”కాలితో తన్నానని ఒక సారి అప్రతిష్ట పాలైనాను. మళ్ళీ రెండవ సారి అటువంటి పాపం చేయలేను.” అని అన్నది.మిగిలిన భార్యలందరూ కూడా నారదుని కోరికను తిరస్కరిస్తారు. నారదుడు ఈ విషయం శ్రీ కృష్ణునికి చెబుతాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు, ఉద్ధవుని పిలిచి బృందావనానికి వెళ్లి గోపికలను అడిగి వారి పాదధూళి తీసుకొని రమ్మని పంపుతాడు. ఉద్ధవుని రూపురేఖలన్నీ శ్రీకృష్ణుని వలే ​ఉంటాయి. శ్రీ కృష్ణుడు బృందావనాన్ని వదలి వెళ్ళిన తరువాత, మళ్ళీ రాలేదు.దూరం నుంచి ఉద్ధవుని చూసి పరుగుపరుగున గోపికలు వస్తారు. ఆత్రుతతో,​ ​ఆనందంతో శ్రీకృష్ణుని గురించిన విశేషాలు అడిగి తెలుసుకుంటారు. అప్పుడు ఉద్ధవుడు, వారికి శ్రీ కృష్ణుని శిరోభారం, పాదధూళిని గురించి చెబుతాడు. చెప్పటమే తరువాయి, ప్రతి గోపిక తన పాద ధూళిని ఉద్దవునికి ఇస్తుంది. ఆ పాదధూళి నంతా ఉద్ధవుడు కండువాలో పెద్ద మూటగా చుట్టుకొని శ్రీ కృష్ణుని వద్దకు వెళ్ళుతాడు.నారదుడూ, శ్రీ కృష్ణుని భార్యలూ అది చూసి ఆశ్చర్య పోతారు. కొద్దిగా పాదధూళిని తీసుకొని శిరసుకు రాసుకుంటాడు శ్రీ కృష్ణుడు. వెంటనే మటుమాయమయ్యింది శిరోభారం. ఈ భక్తినే ‘పరమ ప్రేమ'(Pure Love) అని నారదుడు తన భక్తి సూత్రాలలో వెల్లడిస్తాడు. అందుచేతనే శ్రీ జయదేవుడు వ్రాసిన పాదాలను శ్రీకృష్ణుడు తొలగించలేదు.

యస్యా రేణుం పాదమోర్విశ్వ భర్తా,
ధరతిమూర్ధ్ని సరసిప్రేమ యుక్త:…….

‘రాసక్రీడ’ సమయంలో శ్రీకృష్ణుడు రాధాదేవి పాదధూళిని శిరసున ధరించి తనను తానూ మరచి ఆనందంగా ఉండేవాడు. శ్రీ కృష్ణుడు ధ్యానించేది రాధనే!

శ్రీకృష్ణుని అవతల రాధ ఉన్నది,
రాధకు అవతల మరెవ్వరూలేరు.
అదీ రాధ గాధ!

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

4 Comments on ఎవరీ రాధ?

భాస్కర్ said : Guest 6 years ago

ఎవరీ రాధ?--ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేసిన రచయితకు ధన్యవాదాలు!

  • హైదరాబాద్
వ్యాసమూర్తి said : Guest 6 years ago

Excellent Narration about Radha

  • హైదరాబాద్
ధనలక్ష్మి said : Guest 6 years ago

ప్రేమ స్వరూపిణి,శక్తి స్వరూపిణి అయినా రాధను గురించి ఎన్నో విషయాలను తెలియచేసారు!

  • పొన్నూరు
విజయలక్ష్మి ఫ్రసాద్ said : Guest 6 years ago

ఎవరీ రాధ ?--రాధను గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన రచయితకు ధన్యవాదాలు

  • GUNTUR