కవితా స్రవంతి

కదలి వచ్చెను గంగ

నాగలక్ష్మి N. భోగరాజు

(జూన్ 20 ‘దశ పాప హర గంగ దశమి ‘ సందర్భంగా)

ఈ సంవత్సరం(2021) జూన్ 20 వ తారీఖుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు జ్యేష్ఠ శుద్ధ దశమి. దీనిని ‘దశపాపహర గంగా దశమి’ అని అంటారు. ఆ రోజు ఎంతదూరాన ఉన్నవారైనా గంగను ఒక్కసారి స్మరించడంవల్ల, వారికున్న పదిరకాల పాపాలు తొలగిపోతాయనీ, తద్వారా వారికి పుణ్యం లభిస్తుందనీ ప్రతీతి! అటువంటి ప్రత్యేకత ఉన్న ఆ పర్వదినం సందర్భంగా, కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డుపై కూర్చుని నేను రాసినటువంటి ఈ పాటను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను!

కదలి వచ్చెను గంగ కరుణాంతరంగ
మన పాపములు వడిని కడగంగ
హిమగిరులు దాటుకొని ఉపనదులు కలుపుకొని
సాగరమును చేరుకొను సందడిగ గంగ ||క||

విష్ణు పాదమునెటులవీడిందో
శివుని శిరమున నాట్యమాడిందో
భువిపైన మన పాప భారములు తొలగించి
పాతాళమునకెటుల చేరిందో
త్యాగమే రూపమౌ ఈ గంగ
ముల్లోకములనెవరుసరిలేరనంగ|| క||

అల భగీరథుని కోరికను మన్నించి
ఇలపైన ప్రవహించి ఇహపరాలిచ్చీ
సగరులకు సద్గతులనిచ్చె నీ గంగ
పుణ్యాలుపండగా చేరితిమి ఈ గంగ
భవసాగరము మనకు గోష్పాదమింక ||క||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked