బాలాంత్రపు నివాళులు

కె.ఎన్.మల్లీశ్వరి

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు

(ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!)

శతపత్ర సుందరుడు

(శతపత్ర సుందరునికి వీడ్కోలు, వదిలివెళ్ళిన సంగీత సాహిత్య సంపదలకి జేజేలు.’ధరణీతల చంద్రశిల తరళ మంటపమున నిలచి యుగములుగ పరిభ్రమింతుమిక’ రజనీ, విభావరీ వీడ్కోలు.
హేమచంద్ర గారూ, ప్రసూన గారూ
శిశువు చిత్రనిద్రలోకి జారుకున్నాడు. ఆయన మలి బాల్యానికి మీరు తల్లిదండ్రులయ్యి కాలాన్ని మీ చేతిలోకి తీసుకుని, మృత్యువు అంచుల నుంచి వెనక్కి తెచ్చి,దశాబ్దంపైన ఆ పెన్నిధిని కాపాడారు. మీకు చాలా చాలా

కృతజ్ఞతలు, ఇపుడిక ఈ వెల్తి, ఖాళీ పూడ్చలేనిది. మీతో మేమున్నాము.)

దాదాపు పాతికేళ్ళ కిందట తెలుగు యూనివర్సిటీ లో సంప్రదాయ నవ్యసాహిత్యం పాఠాలు చెప్పిన బాలాంత్రపు రజని కాంతారావు గారు,ఎంతటి వారో కూపస్థ మండూకాల వంటి మాకేమి తెలుసు ! ఓ పెద్ద వయసు ఉపాధ్యాయుడు ఆయన. మేమేమో అన్నీ మాకే తెలుసునని విర్రవీగే కుర్రపిల్లలం . క్లాసు రూములో మా అల్లరికి అంతే ఉండేది కాదు. ఆయనేమో తన్మయంగా పాడుకుంటూ పాటల మధ్య పాఠాలు చెపుతూ ఉండేవారు.

ఆయన నుంచి ఏమి గ్రహించామో ఇపుడు విడదీసి చూసుకుని చెప్పడం చాలా కష్టం. నన్ను చూడగానే ప్రతి రోజూ ( నేను మల్లీశ్వరిని కదా ) మనసున మల్లెల మాలలూగెనే అని పాడుతుంటే చుట్టూ స్నేహితుల మధ్య గర్వంగా ఉండటం బాగా గుర్తుంది. మా క్లాసుకి వచ్చిన మొదటి రోజు సఫారీ సూట్ వేసుకుని, ఫేస్ పౌడర్ నీట్ గా రాసుకుని జేబు వద్ద ఎర్రగులాబీ పెట్టుకుని వచ్చారు.ఆ రోజంతా అదే మాట్లాడుకున్నాం. తర్వాత నాకు వీలైనపుడల్లా మా యూనివర్సిటీ తోటలోని ఎర్ర గులాబీ ఆయన చొక్కా జేబుపైన అలంకరణగా పెడుతుంటే ఏ రోజూ వద్దన్నది లేదు.

ఆ మధ్య మాటల్లో హేమచంద్ర గారు ఓ మాటన్నారు. పెద్దవాళ్ళ విషయంలో ఆలస్యం మంచిది కాదు అని. అవును పాతికేళ్ళ ఆలస్యం అసలు క్షమార్హమే కాదు. ఏడు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మొన్న ఉక్కపోత విజయవాడ చేరి చుట్టుగుంట మీదుగా సీతారాం పురం చేరుతూ గులాబీ పూల కోసం వెతికి ,దొరకక ఉసూరుమని ఒట్టి చేతులతో రజని వద్దకు వెళ్లాను.
పాఠాలు చెప్పిన రజని దొరకలేదు. రెండు మూడేళ్ళ పసి పిల్ల వాడు కనిపించాడు అవును.అప్పట్లాగే అలంకరణ శ్రద్ధ. రంగుల డిజైన్ పొట్టి లాల్చీ మణికట్టుకు పూసల దారం కట్టుకుని బుద్ధిగా కుర్చీలో కూచుని ఉన్నారు. ఉరుక్కుంటూ దగ్గరకి వెళ్ళానా !

నన్ను గుర్తు పట్టలేదు 🙁 మనసున మల్లెల మాలలూగలేదు. చేతిలో గులాబీ పూవూ లేదు. జ్ఞాపకాల వంతెన మీద నా ఒంటరి ప్రయాణం. శతపత్ర సుందరి గురించి చెప్పి పాడమని హేమచంద్ర గారు సరోజ గారు చెపితే చెప్పినపుడుల్లా నీకెందుకు నేను పాడతానుగా అన్నట్లు తలూపుతూనే ఉన్నారు. చివరకి రెండు లైన్లు పాడగానే మింగకుండా పదిలంగా బుగ్గన దాచుకున్న జ్వరం మాత్ర అడ్డు పడి ఆగిపోయారు.

96 ఏళ్ల పసివాడికి ఇపుడు కొడుకు తండ్రిగా మారాడు. కోడలు తల్లిగా మారింది ‘ ఏదీ నాన్నా ఓ సారి నవ్వు అనగానే అచ్చపు పాల నవ్వు. నవ్వుతుంటే ఆ పసితనానికీ, దానికి ఉన్న స్వచ్ఛతకీ మనసు పరవశించి పోయింది. ఆయన మలి బాల్యానికి వాత్సల్యపు ఆజానుబాహువు హేమ చంద్ర గారు, వెన్నెలవెల్లువ ప్రసూన గారు రక్షకులు. నా అలక్ష్యం వల్ల రజని జ్ఞాపకాల్లో నేను మిగలలేదని అనిపించి బిక్కమొహం వేసినపుడు ఈ దంపుతులిద్దరూ మళ్ళీ తల్లిదండ్రులై నన్ను అక్కున చేర్చుకున్నారు. పరంపరకి భరోసానిస్తూ చేతిలో చెయ్యి వేసి హత్తుకున్నారు. (2015 నాటి పోస్ట్ నుంచి)

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked