కవితా స్రవంతి

గురువులంటే జ్ఞానసిరులు

-“జనశ్రీ” జనార్ధన్ కుడికాల(వరంగల్)

పల్లవి: గురువులంటే జ్ఞానసిరులు – గురువులంటే సురవరులు

ప్రతిభాపాటవాలు పరిమళించు విరులు || గురువు ||

చరణం: విశ్వమంత విస్తరించు విజ్ఞాన వీచికలు

విద్యార్థి లోకానికి నవ్య దిక్సూచికలు || విశ్వ ||

అజ్ఞానపు అడివి నుంచి విజ్ఞాపు వీధిలోకి

నవయువతను నడిపించే నరవరుల పాచికలు || గురువు ||

చరణం: నమస్కార బాణాలకు లొంగిపోదురు

సంస్కార శిష్యులగని పొంగిపోదురు || నమ ||

మత్సరాలు పెరిగినపుడు మానవతం తరిగినపుడు

మదిలోపల మధనపడుచు కుంగిపోదురు || గురువు ||

చరణం: గురు శక్తి గొప్పదా? గురుభక్తి గొప్పదా?

గురు శిక్షణ గొప్పదా? గురుదక్షిణ గొప్పదా? || గురు ||

తరతరాల తర్కమైన ఈనాటికి తేలకున్నా

గురుశిష్యుల బంధము అన్నిటికన్న మిన్న || గురువు ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked