శీర్షికలు

‘చేనేత మొగ్గలు’ – పుస్తకపరిచయం

 చేనేత మొగ్గలు

రచయిత: తాటిపాముల మృత్యుంజయుడు

ఆంగ్లపదం Handloom మనందరికి పరిచయమే. దీనికి సమానార్థమైన తెలుగుపదం ‘చేనేత ‘. గ్రామీణ జీవిత నేపథ్యం గలవారికి ఈ వృత్తి గురించి ఎంతో కొంత సమాచారం తెలిసే వుంటుంది. నాకైతే బాల్యంలో మావూళ్లో తిరిగిన ‘పద్మశాలీ’ వాడ గుర్తుకు వస్తుంది. అక్కడి ఇళ్లలోనుండి వచ్చే మగ్గాల శబ్దాలు, వీధి పొడుగునా ఆరబోసిన జలతారుల్లాంటి నూలు దారాలు, ఆడామగా కలిసి పనిచేసే దృశ్యాలు గుర్తుకు వస్తాయి. అయితే, అప్పుడు చేనేత పనిలో వుండే కష్టాలు, నష్టాల గురించి తెలిసేది కాదు.

‘చేనేత మొగ్గలు ‘ కవితాపుస్తకంలో కవి డా. భీంపల్లి శ్రీకాంత్ చేనేతకారుల జీవితాల్ని 360 డిగ్రీల్లో చూపిస్తూ 60కి పైగా పేజీల్లో నిజాయితీగా స్పృశించారు. చెప్పగా విన్నవి, చదువగా తెలుసుకొన్నవి, చూడగా అర్థమైన విషయాన్ని భావుకత వున్న మనిషి ఏదో ఒక సాహిత్య రూపంలో కొన్ని పేరాగ్రాఫుల్లో రాయగలడు. కాని 60 పేజీల్లో కవితా ప్రక్రియ చేయడమంటే ఆ కవితా వస్తువు తన మనసులో తిష్ఠవేసి ఉండాలి, హృదయానికి దగ్గరిదై వుండాలి, జీవితంలో ఒక భాగమైనా అయి వుండాలి. వీటిల్లో ఎదో ఒకటి కవి అనుభవించాడని పుస్తకంలో ఎక్కడా చెప్పపోయినా పాఠకుడు సులభంగా అర్థం చేసుకోగలడు.

ఇందులో అన్ని మూడు పాదాల కవితలే. నేతన్న జీవితాలు, పట్టుచీర అంచున మెరిసే జాతీయపక్షి నెమలి, బాపూజీ రాట్నం, రెపరెపలాడే త్రివర్ణ పతాకం, ఆ జెండాను ఎగరేసే ఖద్దరు ధరించే నాయకుడు ఇలా అందరిని తన కవితల నూలులో అల్లుకుంటూ పోతాడు.

‘నరాలను పోగులుగా మార్చి అందంగా పట్టుచీర నేసి’ అన్న పాదంలో చేనేత కార్మికులు పడే కష్టాలను అర్థం చేసుకోవచ్చు. అది నుండి తుది వరకు చేసే ప్రతిపనిలో మనసు లగ్నం చేసి శారీరకంగా శ్రమించడమే. అప్పుడే అతివలు గర్వంగా ధరించడానికి ముచ్చటపడే ఇప్పుడు ‘సారీ’ అని గొప్పగా పిలువబడే ‘చీర ‘ తయారయ్యేది.

అప్పుల్లో మునిగిపోతున్న వారి బతుకులు ‘అద్దకాల్లో అందమైన రంగుల బతుకులను’ చూడడం వరకే పరిమితమా అంటూ ప్రశ్నిస్తాడు. గంజి మెతుకులతో బతుకు వెళ్లదీస్తూ, ఆధునిక సాంకేతికతో పోటీ పడలేక, అటు ఎన్నుకొన్న నాయకుల ఆసర దొరకక అల్లాడుతుంటే, ఆ నేతలని ‘ఆదుకునేవారే నేతన్నల పాలిట అపర దుర్యోధనులు’ అంటాడు కవి.

తెలుగు రాష్ట్రాప్రభుత్వాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకి, భద్రాచలం సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ వస్త్రాలను నేసేది పద్మశాలీలే, మరి ‘దేవత దాక్షిణ్యాలేవి నేతన్నలపై కురవవు’ అని వాపోతూ పాలకుల అనుగ్రహమే దిక్కు అంటూ పేర్కొంటాడు.

ఆరుగజాల పట్టుచీరను అగ్గిపెట్టెలో బంధించగల నైపుణ్యమున్న వృత్తి చేనేత వృత్తి. ఖండ ఖండాంతరాల్లో భారతీయ వస్త్రాలకు, ముఖ్యంగా చీరలకు గుర్తింపు లభిస్తున్నది. అలాగే ఇప్పటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా చేనేత పరిశ్రమను అభివృద్ధి పరచటానికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ‘ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలను నేలపైకి దించి’ అని గానం చేస్తూ చేనేత కార్మికుల బ్రతుకుల్లో కవి ఆశిస్తున్న మార్పులు త్వరలో వస్తాయని మనమూ ఆశిద్దాం. ఆ వస్త్రాలను కొంటూ, ధరిస్తూ మనవంతు సాయం చేద్దాం.

పుస్తకం గురించి మరిన్ని వివరాలకు ఈ-మేయిల్ చెయ్యండి – srikanth.bheempally@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked