శీర్షికలు

నరసింహ సుభాషితం

-ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి

జన్మ భూమి

శ్లోకం:
अपि स्वर्णमई लङ्का न मे लक्ष्मण रोचते ।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।।
అపి స్వర్ణమయీ లఙ్కా న మే లక్ష్మణ రోచతే ।
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥

సంధి విగ్రహం
అపి, స్వర్ణమయీ, లఙ్కా, న, మే, లక్ష్మణ, రోచతే,
జననీ, జన్మ భూమి:, చ, స్వర్గాత్ అపి, గరీయసీ.
శబ్దార్థం
లఙ్కా = లంకా నగరము, స్వర్ణమయీ = పూర్తిగా బంగారుమయమైనప్పటికీ, అపి = కూడా, లక్ష్మణ = ఓ! లక్ష్మణ, మే = నాకు, న రోచతే = రుచించదు, ఇష్టం లేదు;
జననీ = జన్మనిచ్చిన తల్లియు, చ = మరియు, జన్మ భూమి: = జన్మించినట్టి భూమియు, స్వర్గాత్ = స్వర్గము కంటెను, అపి = కూడా, గరీయసీ = ఉత్కృష్టం.

Meaning

After the war with Ravana and on seeing the beauty and grandeur of Lanka, when Lakshmana said to his brother Rama to stay put in Lanka itself, then Rama replied to Lakshmana – Oh Lakshmana! Even though the lanka is a golden land filled with full of gold, it does not appeal to me because one’s Mother and Motherland are most important and magnificent in adornment than even Heaven.
భావార్థం
లంకలో రావణాసురునితో యుద్ధం పూర్తి అయి, రావణుడు నిర్జింపబడిన తరువాత స్వర్ణమయమై మనోహరముగా ఉన్న లంకా వైభవాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకి లోనైన లక్ష్మణుడు, లంకా సౌందర్యం మీద, లంకా వైభవం మీద పెరిగిన మక్కువతో అన్నగారైన రాములవారితో మనం ఇక్కడనే స్థిరపడదాము, మరల అయోధ్యకి తిరిగి వెళ్ళుట ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఆ సందర్భం లో రాముల వారు లక్ష్మణునితో మాతృ మూర్తి యొక్క, మాతృ భూమి యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పిన అమోఘమైన వాక్యాలు.
“ఓ లక్ష్మణా! లంక స్వర్ణమయమైననూ నాకు రుచించదు, ఇష్టం లేదు. ఎందుకంటే జనని మరియు జన్మ భూమి స్వర్గము కంటెనూ ఉత్కృష్టమైనవి”
శ్రీ మత్ రామాయణములో వాల్మీకి మహర్షుల వారు శ్రీ రామచంద్రుని ద్వారా శ్లోక రుపంలో అందించిన అమోఘమైన సందేశ వాక్యాలు. కన్న తల్లి గురించి, మాతృ దేశం గురించి ఇంత విశేషంగా, వాల్మీకి మహర్షికంటే ఉన్నతంగా మరి ఏ ఒక్కరూ చెప్పగా వినలేదు.


అవజ్ఞత

శ్లోకం:
अतिपरिचयादवज्ञता सन्ततगमनादनादरो भवति ।
मलये भिल्लपुरन्ध्री चन्दनतरुकाष्टमिन्धनं कुरुते  ।।

అతిపరిచయాదవజ్ఞతా సన్తతగమనాదనాదరో భవతి ।
మలయే భిల్లపురన్ధ్రీ చన్దనతరుకాష్ఠమిన్ధనం కురుతే ।।

సంధి విగ్రహం
అతి, పరిచయాత్, అవజ్ఞతా, సన్తత, గమనాత్, అనాదరః, భవతి,
మలయే, భిల్ల, పురన్ధ్రీ, చన్దన, తరుః, కాష్ఠం, ఇన్ధనం, కురుతే.
శబ్దార్థం
సన్తత = ఎల్లప్పుడూ, గమనాత్ = వెళ్ళుచుండుటచేత, అనగా తరచూ రాకపోకలు ఎక్కువగా ఉండుట చేత, అతి పరిచయాత్ = (ఆ విధముగా కలిగిన) ఎక్కువ పరిచయం వలన, అనాదరః = ఆదరణలో కొరత అనగా, భవతి = ఏర్పడుతుంది, అవజ్ఞతా = ఒకరకమైన గౌరవ భంగానికి గురికాబడతారు – ఏ విధంగానూ అంటే
మలయే = మలయ పర్వత సానువులందు, భిల్ల పురన్ధ్రీ = భిల్ల జాతి ఆటవిక స్త్రీ, చన్దన తరుః = గంధపు చెట్టు, కాష్ఠం = కొమ్మలని, ఇన్ధనం = వంట చెరుకుగా, కురుతే = చేస్తుంది.
Meaning
Excessive familiarity breeds contempt, going repeatedly to someone else’s place causes disrespect. On Malaya Mountain, which is very rich in sandalwood trees, the tribal lady uses very sandalwood even for the daily fuel needs unmindful of its preciousness and value.

భావార్థం
ప్రతీ మనిషినీ వారి యొక్క విద్వత్తుని బట్టీ వారి ఆలోచనా సరళీ, భావ వ్యక్తీకరణలని బట్టీ, పాండితీ ప్రకర్షణలని బట్టీ , వారి నడవడీ ప్రవర్తనలని బట్టీ, వారి సాంఘిక రాజకీయ కార్య సాధనలని బట్టీ, వారు సాధించిన మంచి కార్యాలని బట్టీ, వారు సమాజహితమునకై సాధించిన ఘనకార్యాలని బట్టీ వారిని ఉన్నతమైన లేదా అత్యున్నతమైన స్థానంలో ఉంచి గౌరవించడం పరిపాటి. అట్టి వారిని ఎల్లప్పుడూ విశేష మర్యాదలతోనూ, సత్కారాలతోనూ గౌరవిస్తూ సామాన్య జనబాహుళ్యంకంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. అది సహజం కూడా.
అట్టివారిని సర్వదా సువాసనలని వెదజల్లే మంచి గంధపు వృక్షముతో పోల్చవచ్చును. ఎందుచేతనంటే అట్టి వారి యొక్క ప్రతి మాటా, ఆలోచనా సరళీ అన్నీ కూడా ఎల్లప్పుడు విశ్వమానవ కళ్యాణానికీ, సమాజ శ్రేయస్సుకై ఉపయోగపడేవిగా ఉంటాయి.
అటువంటి వ్యక్తి కొంతమందిని అతి సన్నిహితంగా మసలడానికి అనుమతినీయవచ్చును లేదా అవసరం పడవచ్చును. అప్పుడు ఆ సన్నిహితుల దృష్టిలో అంతటి గొప్ప వ్యక్తీ కూడా కొద్దిపాటి చులకన భావానికి గురయ్యే ఆస్కారం చాలా ఉంటుంది. ఈసడింపులూ అవమానాలని చెప్పలేము కానీ ఆ కోవకి చెందిన ప్రతిస్పందనలని ఆ వ్యక్తి ఎదురుకోవలసి రావచ్చు. దీనినే “అవజ్ఞత” అంటారు.
దీనికి విపరీతం కూడా నిజం. అంటే, అటువంటి ఒక గొప్ప వ్యక్తి తరచుగా ఎవరిదగ్గరికైనా లేదా ఎవరింటికైనా తరుచూ వెళుతూ ఉన్నా ఆ వ్యక్తి చులకనకి గురికాబడతాడు. ఇది అతి పరిచయం వలన వచ్చిన ప్రతిస్పందన. అంతే కానీ ఆ గొప్ప వ్యక్తి యొక్క ఔన్నత్యభంగం కాదు. “అతిపరిచయాత్ అవజ్ఞతా” అనేది సమాజంలో ఒక నానుడిగా మారింది.
“పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదు” అనియూ, “ఇంటి వైద్యుడు ఇంటిలోని వారి వైద్యానికి పనికి రాడు” అనే జీవిత సత్యాలు కూడా ఈ రకమైన అవజ్ఞతా భావం యొక్క ఫలితాలే.
మలయ పర్వత సానువులలో అత్యంత విలువైన మంచి గంధపు చెట్లు విశ్తారంగా మొలుస్తాయి, వృద్ధి చెందుతాయి. ఆటవిక జాతికి చెందిన భిల్ల జాతీయులు ఆ మలయ పర్వత సానువులలోనే సంచరిస్తూ ఉంటారు. ఆ మలయ పర్వత సానువులలో నివశించే భిల్ల జాతి స్త్రీ తన యొక్క నిత్యావసర వంటచెరుకు కోసం అక్కడ విస్తారంగా ఉండే అత్యంత విలువైన మంచి గంధపు చెట్లని కొట్టి తన వంట చెరుకుగా ఉపయోగిస్తూ ఉంటుంది.
ఉన్నతమైన వ్యక్తి ఆతని విలువని అర్థం చేసుకోలేని సామాన్య జనాన్ని అత్యంత సన్నిహితంగా మెలగనీయనిస్తే అత్యంత విలువైన మంచి గంధపు వృక్షం వలె అవజ్ఞతా భావానికి గురికాక తప్పదు.

————– ॐ ॐ ॐ ————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked