సారస్వతం

నరసింహ సుభాషితం

నరసింహ సుభాషితం

ధీరోదాత్తులు-1

 

 

  • ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి

శ్లోకం:

                   वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।
लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥

 

వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి ।

లోకోత్తరాణాం చేతాంసి కో హి విజ్ఞాతుమర్హతి ॥

 

సంధి విగ్రహం

వజ్రాత్, అపి, కఠోరాణి, మృదూని, కుసుమాత్, అపి,

లోకోత్తరాణాం, చేతాంసి, కః, హి, విజ్ఞాతుం, అర్హతి

 శబ్దార్థం

వజ్రాదపి = వజ్రముకంటెను కూడా, కఠోరాణి = కఠినమైనవి, మృదూని = సుకుమారమైనవి, కుసుమాదపి = పుష్పములకంటెను కూడా, లోకోత్తరాణాం = మహానుభావులైన కార్యవాదుల యొక్క, చేతాంసి = చేతల యందు,  కః హి = కోహి = ఎవరికైననూ,  విజ్ఞాతుమర్హతి = తెలిసికొనుట దుర్లభము.

Meaning

It is harder than diamond and impossible to understand the intent in the actions of great minds who strive for the benefit of humanity at large. Sometimes, the actions of such great people are so sensitive and touching the hearts and appear softer than even a flower.

Such is the mind of the great people who act according to the needs. Who can understand them and decipher their actions?

 

భావార్థం

నిస్వార్థ పరులై ఎంతటి కష్టమైననూ లెక్క చేయని వారునూ, లోకహితము కోరేవారూ, ధర్మ సంరక్షణార్థం అనవరతమూ తాపత్రయ పడే వారూ, న్యాయ పాలనని సుస్థిరపరచే ప్రయత్నములో అహర్నిశమూ కృషి చేసే వారూ, ప్రజా శ్రేయస్సుకై నిరంతరమూ పాటుపడే వారునూ అయిన లోకోత్తరులైన మహానుభావులు, వారి చేతలలో ఒక్కొక్కప్పడు అత్యంత కఠినముగానూ, ఒక్కొప్పప్పుడు అతి సున్నితముగానూ వ్యవరిస్తారు. అట్టి లోకోత్తరులైన మహానుభావుల అత్యంత కఠినమైన చర్యలు వజ్రాయుధము కంటెను కఠినముగానూ, ఒక్కొక్కప్పుడు పుష్పముల కంటెను మృదువుగానూ కనబడతాయి. ఇందులో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఎవరికి అటువంటి వారి చేతలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నది? అనగా, ఎవరికీ కూడాలేదు అని తాత్పర్యం.

నంద వంశీకులచేత పరిపాలింపబడుతున్నట్టి, అరాజకాముతో ప్రబలుతూ ఉన్న భారత దేశపు ఒకప్పటి మగధ సామ్రాజ్యాన్ని, ఆ దుర్మార్గుల బారినుండి పరిపాలనా దాస్య శృంఖలాలనుండి విముక్తని చేసి యోగ్యుడైనట్టి ధర్మ పరిపలానా దక్షత కలిగినట్టి చంద్ర గుప్తుని రాజుగా చేసి మౌర్య వంశ సామ్రాజ్యము పేరిట అఖండ భారతాన్ని స్థాపించినట్టి చణకుని పుత్రుడు చాణక్య నామ ధేయుడైన విష్ణుగుప్తుని యొక్క అమోఘమైన రాజనీతి దక్షత, కార్య సాఫల్యతా దక్షత చరిత్రలో మనకి సువిదితమే. ఆ రాజనీతుజ్ఞుడు ఒక సాధారణ వ్యక్తి, విద్యాపీఠములో ఒక గురువు మాత్రమే. అసాధారణ పాండితీ ప్రతిభ కలిగిన వాడు. ఏ రకమైన అంగ బలమూ, అర్థ బలమూ లేనివాడు. కానీ తన యొక్క అపారమైన ఆత్మ విశ్వాసము, అకుంఠిత దీక్ష, ధృఢ నిశ్చయము, ధృఢ సంకల్పములే అతనికి ఆయుధములు. ఒక అనామకుడిగా ఉన్న బాలకుడిని, అతని గుణ గణాలని అంచనా వేయగలిగి అతనినే రాజుగా చేసి లక్ష్య సాధన చేరుకున్నాడు.

అతని రాజనీతి తంత్రము, పరిపాలనా వ్యవహారములు వజ్రము వలె అత్యంత కఠినమైనవి. జీవన గమ్యాన్ని నిర్దేశించే అతని వాక్కులు సుభాషితములై, ప్రజా శ్రేయస్సుకై అతని మంత్రాంగము ద్వారా చేపట్టిన కార్యములు పుష్పముల వలె అతి మృదువైనవి. ఈనాటికీ మానవాళి అచరించుచున్నట్టివి.

ప్రపంచానికి ఆదర్శప్రాయమైన రాజనీతి శాస్త్రాన్ని “కౌటిల్యుని అర్థ శాస్త్రం” పేరిట రచియించి చరిత్రలో చిరస్థాయిగ నిలచిన లోకోత్తరపురుషుడు ఆ మహానుభావుడు.

మూడు వందల సంవత్సరాలకి పైగా పరిపాలిస్తున్న సూర్యుడస్తమించని British సామ్రాజ్యాన్ని దేశమునుండి పారద్రోలుటకై, మాతృభూమిని విదేశీ దాస్య శృంఖలాలనుండి విముక్తురాలిని చేయుటకై, అంగ బలము లేకున్ననూ, ఆర్థ బలము లేకున్ననూ  స్వాతంత్ర్యమునకై అహింస అనే ఒకే ఒక్క ఆయుధంతో పోరాడి, అనేక మంది మేధావులని, ప్రజ్ఞావంతులని తనవైపు ఆకర్షించుకుని తన ఉద్యమములో భాగస్వాములుగా చేసికొని తన లక్ష్య సాధనలో కృతకృత్యుడైనాడు జాతి పిత  మహాత్మా గాంధి. అందరూ అసాధ్యమని తలచినప్పటికినీ ఎవరూ ఊహించని విధముగా విజయాన్ని సాధించాడు ఆ మహాత్ముడు. వజ్రము కంటెను కఠోరమైన ఆత్మ విశ్వాసము, కార్యదీక్ష అతని విజాయానికి దోహదం చేసాయి.

అదే మహాత్ముడు తన నిత్య జీవితములో ఎంతో సాధు స్వభావియై, మృదుభాషణుడై ఉండుట, శాంతికి మారు చిహ్నముగా మానవాళికి మార్గ దర్శకుడుగా నిలచుట మన అందరికీ విదితమే.

————– ————–

ధీరోదాత్తులు-2

శ్లోకం:

प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः ।
प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः ।
विघ्नैः पुनःपुनरपि प्रतिहन्यमानाः ।
प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ।।                              भर्तृहरि नीतिशतकम्  ।

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః,  ప్రారభ్య విఘ్నవిహతా విరమన్తి మధ్యాః ।

విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః,  ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజన్తి ॥

 

సంధి విగ్రహం

ప్రారభ్యతే, న, ఖలు, విఘ్నభయేన, నీచైః, ప్రారభ్య, విఘ్నవిహతా, విరమన్తి, మధ్యాః,

విఘ్నైః, పునః, పునః,  అపి,  ప్రతిహన్యమానాః, ప్రారబ్ధం, ఉత్తమజనాః, న, పరిత్యజన్తి.

 

శబ్దార్థం

న ప్రారభ్యతే =  ప్రారంభింపరు,  ఖలు = కదా!, విఘ్నభయేన = విఘ్న భయము చేత, నీచైః = మనోధైర్యము స్థైర్యము లేని సాధారణ మనుష్యులు,  ప్రారభ్య = ప్రారంభించి,  విఘ్నవిహతా = విఘ్నకారణముగా, విరమన్తి = విరమించుకుంటారు, మధ్యాః = మధ్యములు,  విఘ్నైః = విఘ్నముల చేత,  పునః = మరల,  పునః = మరల,  అపి = కూడా,  ప్రతిహన్యమానాః = ప్రతిఘటింపబడిన వారు అయినప్పటికీ,  ప్రారబ్ధం = ప్రారంభించినట్టి కార్యమును,  ఉత్తమజనాః = ఉత్తములైన వారు, న పరిత్యజన్తి = వదలి పెట్టరు.

 

పై శ్లోకానికి, ఏనుగు లక్ష్మణ కవి యొక్క తెలుగు సేత.

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై,

యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్,

ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై,

ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞా నిథుల్ గావునన్ ।

 

Meaning

The men of very low stature do not even start and take up any endeavor with the fear of obstructions and meeting with failures.

Average men, start and take up the tasks but quickly give up when they are faced with problems.

The men, who are classified to be of higher stature by their strong will and determinations are however, never give up their tasks even though they meet with failures repeatedly.

భావార్థం

కొందరు, ఆత్మ స్థైర్యము, మనో ధైర్యము, ధైర్య సాహసాలు, ధృఢ సంకల్పము ఇవి ఏవియు లేని సాధారణ మానవులు విఘ్న భయముచేత అనగా తలపెట్టిన కార్యమును విజయవంతముగా పూర్తి చేయగలుగుతామో లేదో, నిర్దేశిత గమ్యాన్ని చేరుకోగలుగుతామో లేదో అనే భయము చేత అసలు ప్రారంభించడానికే వెనుకంజ వేస్తారు. అసలు ప్రారంభించరు. వీరిని చేతకాని వారుగానూ నీచులుగానూ పరిగణిచవచ్చు. ఇటువంటి వారిని నిత్య జీవితములో అనేకమందిని మనం చూస్తూ ఉంటాము.

మరికొందరు, కొద్దిపాటి మనో ధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని, సాహసాన్ని కూడ గట్టుకొని తలపెట్టిన కార్యాలని మొదలుపెడతారు. కానీ వీరికి స్థిర చిత్తము, ధృఢ సంకల్పము చాలా తక్కువగా ఉండడం కారణంగా, కార్య సాఫల్యతమీద నమ్మకము తక్కువ కావున  ప్రారంభించిన కార్యాన్ని మధ్యలోనే వదలి వేస్తారు. వీరిని మధ్యములుగా అభివర్ణించవచ్చు. వీరు చేసిన ప్రయత్నము అంతయూ వృధా అవుతుంది. ఇది నిరర్ధకమైన ప్రయత్నము. ఇటువంటి వారు కూడా మనకు సంఘములో తటస్థ పడుతూ ఉంటారు.

అతి తక్కువ మంది మాత్రం, ఎంతో మనో నిబ్బరముతో, నిశ్చలమైన దృఢ సంకల్పముతో, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసముతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంత ప్రతిఘటనలు ఎదురైనా, ఎన్ని విఫలప్రయత్నాలకైనా వెరవక వారు ఏర్పరచుకున్న నిర్దేశిత గమ్యాన్ని చేరుటకు అనవరతమూ కృషి చేసి విజయాన్ని చేపడతారు. చివరకి కార్య సాఫలతని నిశ్చయం చేసుకుంటారు.

ఇటువంటి వారు అరుదుగా కనిపిస్తారు. వీరినే ధీరోదాత్తులు అంటారు.

ఆ కోవకి చెందిన వారు ఉదాహరణకి,చాణక్యుడిగా ప్రసిద్ధికెక్కిన, చణకుని కుమారుడైన విష్ణు గుప్తుడు నంద వంశ నిర్మూలనకై ధీరోదాత్తంగా పోరాడి, పరమ దుర్మార్గుడైనటువంటి, దయా దాక్షిణ్యాలు లేనటువంటి నంద రాజు యొక్క అత్యాచారాలని రూపు మాపి, విజయం సాధించి ఒక కొత్త రాజరిక వ్యవస్థ కే (మౌర్య వంశం) రూపకల్పన చేసి కృతకృత్యుడైనాడు. ఇతడు పరమ ధీరోదాత్తునిగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.

20 వ శతాబ్దిలో British ప్రభుత్వపు పరిపాలనా శృంఖలాలనుండి అహింసా సిద్ధాంతముతో భారత దేశానికి స్వాతంత్ర్యము సంపాదించిపెట్టిన మోహన్ దాస్ కరం చంద్ గాంధి మనమందరమూ ఎరిగిన పరమ ధీరోదాత్తుడు.

చరిత్రలో మనం చదువుకున్నాము Robert Bruce గురించి. శత్రు సేనలచే ఓడింపబడిన ఇతడు, తన బలగాలను కూడ కట్టుకుని ఏడుమార్లు ప్రయత్నము చేసి ఏడవమారు శత్రువు మీద విజయాన్ని సాధించాడు. ఇతడు, ఈ కోవకి చెందిన వ్యక్తే.

————– ————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on నరసింహ సుభాషితం

MJ said : Guest 7 years ago

సంసృత తెలుగుభాషల్లో వివరణ చాలా బాగుంది.

  • California