కవితా స్రవంతి

నిత్య సూర్యుళ్ళం!

వెన్నెల సత్యం
షాద్ నగర్
94400 32210

ఎప్పట్లాగే ఈ రోజూ
ఈ రోజు కోడి కూత కన్నా
ముందే నిద్ర లేచాను
నా స్వేచ్ఛా ప్రపంచపు
వంటింట్లోకి ఠంచనుగా
అడుగు పెట్టాను!

యుద్ధభూమిని తలపించే
ఆ వంట గదిలో
పాత్రలతో పోరు చేస్తూ
కాయగూరలతో
కత్తియుద్ధం చేస్తూ
చెమటోడుస్తున్నాను!

జిహ్వకో కూర
తీరొక్క అల్పాహారాలతో
తిండికీ నోచుకోని
తీరిక లేని పనులు

మసిబారిన
మగ దురహంకారపు
అంట్లన్నీ తోముతూ
దుష్ట సంప్రదాయాల
మురికి గుడ్డల్ని ఉతుకుతూ
కసవు నిండిన
మది గదులన్నీ
ఊడుస్తూ తుడుస్తూ
బడలిక ఎరుగని బానిసలా
ఏ అర్ధరాత్రో
తీసే కూసింత కునుకు
మా శరీరాలకే గానీ
మనసులకు మాత్రం
విశ్రాంతి ఎండమావే!

మున్నూట అరవై ఐదు రోజులూ
సూర్యుడితో పోటీ పడుతూ
శ్రమశక్తితో ప్రపంచాన్ని
నడిపించే మాకు ఏడాదికోసారి
మీరిచ్చే గౌరవాలు అక్కర్లేదు!

మా విన్నపాన్ని మన్నించండి
మమ్మల్ని దేవతల్ని చేయక్కర్లేదు
సాటి మనిషిగా చూడండి చాలు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked