కథా భారతి

పదవీ విరమణ

రచన: సోమ

సుధేష్ణ

నీరజ నవ్వుతూ వెనక్కి తిరిగి “బాగుంది మీ వరస. పిల్లలు లేని ఇంట్లో ముసిలాడు
పాకినట్టుంది. మరీ కొంగుకు వేళ్ళాడుతున్నారేమిటి! ”

“కొంగు లేదుగా అందుకే నీ షర్ట్ చివర పట్టుకుని వేళ్ళాడుతున్నాను.” నవ్వుతూ ఆ
పక్కనే ఉన్న  కుర్చీని బట్టలు ఐరన్ చేస్తున్న నీరజ పక్కకు లాక్కుని
కూర్చున్నాడు వివేక్.

‘పదవీ విరమణ తర్వాత మాఆయన మరీ కొంగుకే వెళ్ళాడుతున్నాడు, చిరాగ్గా ఉంది.’
అలవాటైన  లేడీస్ లంచులకు, షాపింగులకు ఫ్రీగా వెళ్ళలేక పోతున్నానని
స్నేహితురాలు శోభ గొణగడం గుర్తుకు వచ్చి ‘అలా వెంట తిరుగుతూ ఉంటె నాకిష్టమే’
నవ్వుకుంది నీరజ.

ఎలాగు ఉద్యోగ పర్వం అయిపొయింది ఇక వాన ప్రస్త పర్వం మొదలు పెడితే మంచిది అని
చెప్పిన  రావుగారి మాట కాదన లేక వివేక్ ఒక రోజు సత్ సంఘుకు వెళ్ళాడు.

“మొక్కుబడిగా రెండు శ్లోకాలు చదివామనిపించి, ఆవురావురు మంటూ భోజనం మీద దాడి ఆ
తర్వాత ఒహటే  ముచ్చట్లు. ఊళ్ళోని వాళ్ళని, దేశంలోని వాళ్ళని అందరిని ఒక్క ఊపు
ఊపేసారు. ఏ శ్లోకాలు చదివామో కూడా గుర్తు లేదు. నాకే కాదు ఎవరికీ గుర్తు ఉండి
ఉండదు. నాకు ముక్తి దొరకదక్కడ. జోక్సు గూడా చప్పగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న
కంప్యూటర్ చాలు నాకు.”

అంటూ నస పెట్టి మళ్ళీ  సత్సంగు వైపుకు వెళ్ళలేదు.

భర్త తనతో పాటు షాపింగుకు వస్తే ఎంత బావుంటుంది. ఏ పని చేసినా ఇద్దరం కలిసి
చేసుకోవచ్చు. లలిత భర్త రిటైరయ్యాక కంప్యూటర్ కు అతుక్కు పోయాడట. వివేక్కుడా
కంప్యూటర్ ముందు కూర్చోవడం అంటే ప్రాణం. ‘దానికి అతుక్కొక ముందే ఇలా సరదాగా
అన్ని చోట్లకు వెళ్లి తిరిగితే కంప్యూటర్ మీద అంతగా ప్రాణం కొట్టుకోదు’ అని తన
ఆలోచనలకు తానె మురిసి పోయి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్నీ  మనసులోనే ప్లాను
వేసేసుకుంది. ‘షాపింగు చేయడం ఒక కళ, అది మీరు కూడా నేర్చుకోండి’ అంటూ ఒకరోజు
వివేక్ ను తీసుకుని శ్రీకృష్ణ గ్రాసరీ దుకాణానికి వెళ్ళింది. వివేక్ కు
షాపింగ్ అంటేనే తలనొప్పి. అలా వెళ్లి ఇలా వచ్చేయాలనే తత్త్వం. చాల మంది లిస్టు
రాసుకున్నా ఈ ఆడవాళ్ళు గంటలు గంటల తరబడి దుకాణంలో ఏం కొంటారో అనుకుంటాడు.
నీరజకు మాత్రం చాల మంది ఆడవాళ్లలాగే దుకాణం

అంతా తిరిగి ధరలు చూసి, వస్తువలు చూసి ఇంకా కొత్త వేమైనా ఉన్నాయేమో చూడటం
ఇష్టం. షాపులోకి వెళ్ళగానే వివేక్ సామాను పెట్టడానికి ఒక బండి తీసుకుని దాన్ని
తోస్తూ నీరజ పక్కనే నడిచాడు. నీరజ కావలసినవి కొన్నిషెల్ఫ్ మీదినుండి అందుకుని
బండీలో వేస్తోంది. ఇద్దరూ ముందుకు నడిచారు.

“నీక్కావలసినవి తీసుకొని రా, నేను లైనులో ఉంటాను. వెయిట్ చేయాల్సిన పని ఉండదు.
త్వరగా అయి పోతుంది.”

“ఇప్పుడేగా దుకాణంలోకి వచ్చాం. ఈ దుకాణంలో అంత పెద్ద లైను ఉండదులే. కావాలంటే
మీరు నెమ్మదిగా రండి. నేను అటు ఫ్రోజెన్ ఫుడ్  సెక్షనులో ఏమున్నాయో చూస్తాను.”
నీరజ మాట పూర్తవక ముందే వివేక్ పక్క లేనులోకి వెళ్లి పోయాడు. మగవాళ్ళకు ఇలాంటి
కొట్టులోకి రావాలంటే కొత్తలో కాస్త చిరాకుగానే ఉంటుంది, ‘మొదటిసారే ఇక్కడికి
తీసుకు వచ్చాను. నేను కాస్త ఓపికగా ఉండాలి’ అనుకుని తాజాగా కూరగాయలు
వచ్చినట్టున్నాయి అంటూ అటువేపు వెళ్ళింది.

“సర్! మీరు బండితో లైనులో నిలబడి అందిరిని బ్లాకు చేస్తున్నారు. మీరు పే
చేస్తారా లేక పక్కకు జరుగుతారా? మీ వెనకాల లైను పెరిగి పోతోంది.” మాటలు కాస్త
పెద్దగా వినిపించగానే ఎదో గొడవగా ఉన్నట్టుంది అనుకుంది.

“రెండు నిమిషాల్లో నా భార్య వచ్చేస్తుంది.” వివేక్ గొంతు ..

నీరజ గబా గబా ముందుకు వచ్చి చూసింది. వివేక్ వెనకాల ఆరుగురు లైనులో ఉన్నారు.
ఇండియను షాపులో ఆరుగురు లైనులో ఉన్నారంటే పెద్ద లైను అన్నట్టే. గబగబా వెళ్ళి
వివేక్ చేతిలోని బండిని పక్కకు జరిపి, “మీరిలా పక్కకు రండి. మీరు స్నాక్ కావాలన్నరుగా, స్నాక్ పాక్స్ అన్నీ అటు స్టోరు వెనక షెల్ప్ లో ఉన్నాయి. మరో బండి  తీసుకుని మీరు వెళ్లి మీకు కావలసిన
స్నాక్ తీసుకోండి. నేను కూర గాయలు తీసుకుంటాను.” నీరజ మాటలకు తలాడించాడు. నీరజ
సామాను ఉన్న బండి తోస్తూ కూరగాయల వేపు వెళ్ళింది.

నీరజ కొనడం అంతా ముగించుకుని డోరు బయటకు రాబోతూంటే షాపతను గబగబా వచ్చి,

“మేడం అతను ఒక బండీ నిండా స్నాక్ పెకేట్స్ నింపి స్టోర్ మధ్యలో వదిలేసి
వచ్చాడు. మీరు కొనడం మరిచి పోయారా?” చిరాకు మొహంతో అన్నాడు. నోరు పెద్దగా
తెరిచి, మూసి కారులో కూచుంటున్న వివేక్ ను చూసి స్టోర్ ఓనరుకు సారీ చెప్పి బయట
పడింది.

గ్రాసరి షాపింగు అంటే అంత సరదాగా ఉండదు. వివేక్ ను తీసుకెళ్లడం పొరపాటే. ఇక
ముందు ఏదైనా మాలుకో, పెద్ద స్టోర్ కో వెళితే వివేక్ కు ఇంటరెస్టు ఉన్నవి
కనిపిస్తాయి అనుకుంది. రిటైర్ అయ్యాక ఇద్దరూ కలిసి షాపింగుకు వెళ్లి, సరదాగా
ఎక్కడైనా లంచ్ కూడా తినేసి, వీలయితే మూవీ కూడా చూసి  రావచ్చు అని వివేక్ ను
కాస్త బ్రెయిన్ వాష్ చేసింది. ఒక రోజూ ఇద్దరూ వాల్మార్ట్ కు వెళ్ళారు. నీరజ
తను కొనాల్సిన వస్తువలు చూస్తూ ముందుకు వెళ్తోంది. పిల్లలకు ఈ నాలుగు రోజులు
స్కూలుకు ఈస్టరు సెలవులు. దుకాణం నిండా పిల్లలతో గజిబిజిగా ఉంది. వివేక్ ‘నేను
స్పోర్ట్స్ సెక్షనువైపు వెళ్తాను. నీ గార్మెంట్ షాపింగు అవగానే నాకు ఫోను
చెయ్యి.’ అంటూ వెళ్లి పోయాడు. లేడీస్ టాప్స్ చూడటంలో మునిగి ఉన్న నీరజ పెద్దగా
అనౌన్స్ మెంటు విని ఈ లోకంలోకి వచ్చింది.

“అటేన్షన్! కాండీస్ సెక్షనులో చాలా అలజడిగా ఉంది. చాల మంది పిల్లలు అక్కడ
చేరారు. ఇద్దరు సేల్స్ పర్సన్స్ మీ పని ఆపేసి వెంటనే అక్కడికి వెళ్ళండి.”
అనౌన్స్ చేసారు.

పిల్లలకు ఏదైనా షో పెట్టారేమో అనుకుంటూ నీరజ అటు వేపు నడిచింది. ఇంచు మించు
ఇరవై మంది పిల్లలు గుంపుగా ఒకచోట ఉన్నారు. ‘ఆరేళ్ళ కంటే చిన్నపిల్లలకు – మీ
ఒక్క చేతిలో ఎన్ని కేండీ బేగులు పట్టుకోగలిగితే అన్ని ఫ్రీగా ఇంటికి
తీసికెళ్ళవచ్చు. ఒక గంట టైము ఉంది.’ – అని ఎవరో చెప్పారట. పిల్లలు ఉరుకులు
పరుగులతో నానా అవస్థా పడుతూ బేగులు తీసికెళ్ళి వాళ్ళ బండీల్లో పెడ్తున్నారు.
పెద్దవాళ్ళు మురిపెంగా చూస్తున్నారు. సేల్స్ పర్సన్ వచ్చి అవి ఫ్రీ కావని
వాటికీ డబ్బు ఇచ్చి కొనుక్కోవాలని చెప్తోంది. ఒక పక్కన  కాస్త వెనక్కి నిలబడి
ఉన్న వివేక్ నవ్వుతూ మరో వైపు వెళ్లి పోవడం నీరజ చూసింది. ‘నిజంగా నవ్వు
వస్తోంది’ నవ్వుకుంది నీరజ.

నీరజ మళ్ళి తను కొనాల్సిన లిస్టు చూస్తూ ముందుకు కదిలింది.  ఓ అరగంట తర్వాత
స్పీకర్ లో –

“నిడా..జ దయచేసి ఆఫీసుకు వెంటనే రావాలి.” వంకర టింకరగా పేరు పిలిచినా అర్థమయి
‘ఎందుకు

పిలిచారా!’ అని కంగారు పడింది. తననే పిలిచారా! మరెవరిదైనా పేరేమో! అనే అనుమానం
కూడా

వచ్చింది. గాబరా పడ్తూ అఫీసు రూముకు వెళ్ళింది. మేనేజరు, మరో నలుగురైదుగురు
కంప్యూటరు ముందు నిలబడి ఏదో చూస్తున్నట్టున్నారు. నీరజను  చూసి,

“కమిన్ .. కమిన్ ! మేడం.” అంటూ నీరజను కంప్యూటరు ముందుకు రమ్మని చేతితో సైగ
చేసాడు. అంత గుంపుగా నిలబడి ఎం చూస్తున్నారా! ఆ వీడియోలో ఏముందా! అనుకుంటూ
నీరజ కుతూహలంగా చూసింది. అందులో  కనిపిస్తోంది- లేడీస్ బాత్రూం దగ్గర చాంతాడంత
లైనుంది. అక్కడ లైనులో నిలబడ్డ ఆడవాళ్ళ మొహాల్లో విసుగు, చిరాకు, అసహనం, కోపం
అన్ని కనిపిస్తున్నాయి. బాత్రూం తలుపు ముందు ఒక క్లీనింగ్ బకెట్, తలుపు పైన
‘క్లీనింగ్ అవుతోంది పది నిముషాలు ఆగండి’ అని రాసి ఉన్న ఆరెంజ్ రిబ్బను
అతికించి ఉంది.

“ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు? నన్ను ఎవరనుకుంటున్నారో! నా పేరు నీరజ.”
అంది. మేనేజరు తలతిప్పి నీరజ వైపు చూసి,

”ఐ నో హు యూ ఆర్, బి పేషెంట్ మేడం.”

అంటూ వీడియోను కాస్త రీవైండ్ చేసాడు. నీరజ అయోమయంగా చూసింది – వీడియోలో వివేక్
ఒక ఎర్రని బకెట్ తెచ్చి తలుపు ముందు పెట్టి, గబగబా ఒక పేపరును లేడీస్ బాత్రూం
తలుపుకు అంటించాడు. ‘ఓరి దేవుడా! నమ్మలేక పోతున్నాను’ తల పక్కకు తిప్పింది.
మేనేజరు ఇంకో విడియో భాగం చూపించాడు. అప్పటికే ఒక అరడజను మంది ఆఫీసులో ఆ పక్క
ఈ పక్క నిలబడి అటునుండి, ఇటునుండి ఎగిరెగిరి కొందరు, అవతలి నుండి కొందరు తొంగి
వీడియో చూస్తున్నారు. చిన్నగా నవ్వులు  వినిపిస్తున్నాయి. నీరజ చేసేది లేక
హతోస్మి అనుకుని కళ్ళు అప్పగింఛి చూస్తోంది.

ఆ వీడియో తీసి మరో వీడియో పెట్టాడు. ‘ఇప్పుడేమి చూపిస్తాడా!’ అని నీరజ మనసు
గుబ గుబ లాడింది. పిల్లల గేమ్స్ విభాగంలో సైకిళ్ళను ఎక్కించి వాళ్ళను షాపులో
చుట్టూ ఎవరికి తగలకుండా, బట్టల రాకులకు తగలకుండా తిరిగితే ఒక్కొక్క చుట్టుకు
ఒక బోర్ద్ గేం ఫ్రీగా ఇస్తానని మేనేజరు చెప్పమన్నాడని వివేక్ అందరికి
చెప్తున్నాడు.

“ఓరి దేవుడా!!” నీరజ మొహం పాలిపోయింది.

పిల్లల వెంట వచ్చిన పేరెంట్సు అక్కడే నిలబడి తమ పిల్లలు ఏ బైసికిల్ ఎక్కాలో
సెలెక్టు చేస్తున్నారు. హడావుడిగా బైసికిల్ ఎక్కి పిల్లలు-వాళ్ళ వెనకాల తల్లి,
తండ్రి పరుగులాంటి నడకలతో వెళ్తున్నారు. అందరూ స్పోర్ట్స్ సెక్షన్ దగ్గరకి
రావడంతో అక్కడ సందడిగా ఉంది. కస్టమర్స్ కూడా కొనడం మానేసి వింతగా ఓ పక్కకు
జరిగి కొనడం మరిచి పోయి షో చూస్తూ నిలబడ్డారు. ఒక ఊబకాయపు లేడీ పరుగెత్త లేక
సేల్స్ లేడీస్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తోంది. సేల్స్ లేడీ ఒక అబ్బాయిని
ఆపడానికి ప్రయత్నించి విఫలు రాలైంది. షాపింగు చేసే వాళ్ళు చేతుల్లో పట్టుకున్న
వస్తువులను అలా పట్టుకుని బొమ్మల్లా నిలబడి జరిగే తమాషా చూస్తున్నారు.

మేనేజర్ విడియోను ఫార్వర్డు చేసి ఫోకస్ చేసాడు.

చూస్తుండగానే ఓ పది మంది ఆడ, మగ సేల్స్ మనుషులు కలిసి బైకులను ఆపారు. వివేక్
ను మేనేజరు  మరో రూములోకి తీసికెల్తూంటే “నా మానాన నన్ను వదిలెయ్యండి. నా
మిసేస్ లేడీస్ సెక్షనులో షాపింగ్ చేస్తోంటే నేను ఇక్కడ అన్ని చూస్తున్నాను.
మీరేమిటి నన్నుషాపింగు చేసుకోనివ్వడం లేదు. అడ్డు పడ్తున్నారు. నన్ను ఇబ్బంది
పెడ్తున్నారు.” వివేక్.

మేనేజరు మరో వీడియో పెట్టి, ఫర్నిచర్ వైపు కేంద్రీకరించి చూపించాడు.

ఒక టేబులు దగ్గర వివేక్ కూర్చొని ఒక నాలుగేళ్ళ బాబుతో నవ్వుతూ ఏదో
చెప్తున్నాడు. సరిగ్గా వినిపించడం లేదు. బండి నిండా చార్మిన్ టాయిలెట్ టిష్యు
రోల్సు , కేండి పేకెట్టులు ఉన్నాయి. ఆ బాబు ఒక చార్మిని రోలు తీసుకుని గట్టిగా
నొక్కుతున్నాడు. కిలకిలా నవ్వుతూ మళ్ళి నొక్కుతున్నాడు. అంతలోనే మరో కొంత మంది
పిల్లలు వచ్చి టీవి ప్రకటనలో లాగా గెంతుతూ కేరింతాలు కొడుతూ చార్మిన్ రోలుతో
ఆడుకుంటున్నారు. ఉత్సాహంగా కేండీ పాకెట్ తీసుకుని వెళ్లి పోతున్నారు. అక్కడ
హడావుడి ఎక్కువై పిల్లల గుంపు పెరుగుతోంది. కొంతమంది పిల్లలు కేండిపేకెట్టు
విప్పి కేండీస్ తింటున్నారు. కాసేపట్లో మేనేజరు అక్కడికి వెళ్ళడం కనిపించింది.
నీరజ నీరసంగా లేచి నిలబడి,

“మావారేక్కడ?”

“ఇప్పుడే బత్రూమ్కేల్లాడు. అతని తుంటరి పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి.
(వద్దన్నట్టు అడ్డంగా తలూపింది) అతన్ని ఇంకెప్పుడూ షాపింగుకు తీసుకు రాకండి.
మీకు, మాక్కూడా ఇబ్బందిగా ఉంటుంది. రెండు గంటల్లో ఇంత హంగామా చేసాడు. స్టోరులో
అంతా అలజడి, పరుగులు, పరేశానులు ఇక చాలు.” అంటూ మొహం అటు తిప్పుకున్నాడు.
మేనేజరు నవ్వుతున్నాడని తెలిసి పోయిన నీరజ మొహం అవమానంతో ఎర్రనైంది.
తప్పదన్నట్టు మొక్కుబడిగా ఒక ‘సారీ’ అతని మొహాన పడేసి నీరసంగా ముందుకు
నడిచింది.

మరునాడు వివేక్ తయారయి

“ఈ రోజు ఏ షాపింగుకు వెళ్తున్నాము. నేను కారు గరాజులోంచి బయటికి తీస్తాను.”

“ఈ రోజు నేను వెళ్ళడం లేదు. నో…వే.. మీరు నాతో ఇక ఎప్పుడూ షాపింగుకు
రావొద్దు మీ కంప్యూటరు తో  ఇంట్లోనే ఉండండి.”

వివేక్ నీరజ పక్కన కూర్చుంటూ హస్కింగ్ మొదలు పెట్టాడు. “నా చిన్నప్పుడు ఆడుతూ
పాడుతూ చదువు కున్నాను.”

“ఆడుతూ పాడుతూ చదువెలా వచ్చింది! నాకెప్పుడూ చెప్పలేదే!”

“కాస్త అల్లరి కూడా చేసేవాణ్ణి. పెళ్ళయిన కొత్తలో చెప్పాను, మరిచి పోయుంటావు.”

“అలాంటివి నేనెప్పుడూ మరిచి పోను.”

“పోనీలే, చెప్పలేదేమో. కొంచెం అహం ఉంటుందిగా. ఇప్పుడు చేప్తున్నాను. మన ఇద్దరి
అహాలు ఒహటై పోయాయిగా.”

“అదెప్పటినుండి!”

“పదవీ విరమణ అయినప్పటినుండి.”

“నేను పెరుగుతున్న రోజుల్లో లైఫ్ చాల జాలిగుడ్ గా ఉండేది. ఇప్పటి పిల్లల్లా
స్ట్రెస్ అసలు ఉండేది కాదు. రిటైర్ అయ్యాక మళ్ళి అలాగే ఆడుతూ పాడుతూ
గడపాలనుంది.”

“సరే అలాగే గడపండి. ఆట, పాటలకు శ్రోతల కోసం చూడకండి.”

“పాడనా!”

“అమ్మో! వద్దు. మీరు కంప్యూటరు దగ్గర కెళ్ళి మీ పని చూసుకోండి. మిమ్మల్ని
కంప్యూటరు నుండి దూరం చేయడం నావల్ల కాదు.”

వివేక్ హాయిగా విజిల్ వేస్తూ ఓరగా నీరజ వైపు చూస్తూ కంప్యూటర్ గదిలోకి
వెళ్ళాడు. వివేక్ ముస్కురాహట్ చూసి నీరజ రక్తం మసిలి పోయింది. అమెరికాలో నేను
హాయిగా ఉన్నానని అందరూ అనుకుంటారు. ఈ కంప్యూటర్ నాకు సవతిలా ఉంది. ఈ వయస్సులో
సవతి పోరు నా నుదుట రాసి ఉంది గాబోలు!! లోలోనే ఉడుక్కుని మెటికలు విరిచింది
నీరజ.

—- సమాప్తం —

Leave a Reply

Your email address will not be published. Required fields are marked